నాడీ చక్రము - Naadii Chakramuనాడీ చక్రము - Naadii Chakramu

నాడీ చక్రము :
నాడీ చక్రము నెరింగినవారు ప్రాణస్వరూపమును, తద్ద్వారా హృదయాంతర్గతుడైన్ పరమాత్మ స్వరూపమును గ్రహింపగలరు. నాభికి క్రిందుగా నాడుల మాలకందము ఉండును. అక్కడినుండియే నాడుల ప్రారంభము. 

నాభి మధ్యమున 72౦౦౦ నాడులుండును. ఈ శరీరమంతయు, నిలువుగాను ,అడ్డముగాను, ఊర్ధ్వముగాను వ్యాపించిన నాడులలో నిండియుండును. వీనిమధ్య ప్రధాన నాడులు పడి యున్నవి. 
 • అవి:
 • ۞ ఇడ, 
 • ۞ పింగల, 
 • ۞ సుషుమ్ను, 
 • ۞ గాంధారి, 
 • ۞ హస్తిజిహ్వ, 
 • ۞ ప్రధ, 
 • ۞ యశ, 
 • ۞ ఆలంబున, 
 • ۞ హుహు, 
 • ۞ శంఖిని అని వాని పేరులు. 
వాయువులు గూడ పది. 
 • ۞ ప్రాణము, 
 • ۞ అపానము, 
 • ۞ వ్యానము, 
 • ۞ ఉదానము, 
 • ۞ సమానము, 
 • ۞ నాగము, 
 • ۞ కూర్మము, 
 • ۞ క్రుకరము, 
 • ۞ దేవదత్తము 
 • ۞ ధనంజయము అని వాని నామములు. 
ఈ పదివాయువులలో ప్రాణము మొదటిదియు ప్రదానమైనదియు అయి యున్నది. ప్రాణవాయువు ప్రాణమును నిలబెట్టుచున్నది.
 • 🖝 హృదయ స్థానమున నుండి, ఉచ్ఛ్వాస నిశ్వాసములతో జీవనాధారమై యుండును. జీవిని ఇట్లు లోకములో ప్రయాణము చేయించుచున్నది కనుకనే ప్రాణమనబడును. తిన్న ఆహారమును జీర్ణము చేసి మలముత్ర శుక్ర రూపములో క్రిందికి త్రోయునది అపానవాయువు. 
 • 🖝 త్రాగిన వానిని, తిన్నవానిని రక్తముగా, పిత్తముగా, శ్లేషముగా, వాయువుగా (వాతముగా) మార్చి, శరీరమునకు సమానముగా అందజేయునది సమానవాయువు. 
 • 🖝 కంఠ ప్రదేశమున నుండి ముఖమునకు, పెదవులకు, కన్నులకు అదురునట్లు చేయుచు కామక్రోధములను ఉత్తేజ పరచునది ఉదానవాయువు. 
 • 🖝 శరీరమును ఎటూ కావలసిన అటు వంగునట్లు (కదలునట్లు) చేయుచు, కంఠముదాక వ్యాపించియుండి, ఆహార విహారాదులలో ఏమాత్రము తేడా వచ్చినను వ్యాధులు గలిగించునది వ్యానవాయువు. 
 • 🖝 వామనము కలిగించునది నాగావాయువు. కన్నులు తెరచునట్లు చేయునది కూర్మవాయువు.
 • 🖝 మ్రింగుటలో సహాయపడునది క్రుకరవాయువు. 
 • 🖝 ఇంద్రియములను విజ్రుమ్భించునట్లు చేయునది దేవదత్తవాయువు. 
 • 🖝 ప్రాణఘోషయందు నిలుచుచు, ప్రాణము పొయినను శరీరమును దహనమగు వరకును అంటిపెట్టుకొని యుండునది ధనంజయవాయువు. 
(చెవులలో వ్రేళ్ళు పెట్టుకున్నచో గుంయి మను శబ్దము వినబడును. అదే ప్రాణఘోషము). 
 • 🖝 సుషుమ్ను నాది శరీరమధ్యమున (వెన్నెముకలో) ఉండును. 
 • 🖝 ఇడానాడి యెడమ భాగములోను, పింగళనాడి కూడి భాగములోను ఉండును. 
గాలిని పీల్చి పొట్టనుబ్బించుటనే ప్రాణాయామ మందరు. 
 • 🖝 ఇడానాడి ద్వారా గాలిని లోనికి పీల్చుట పూరక మనబడును. 
 • 🖝 ఆ గాలిని శక్తిమేరకు లోపల బందించుట కుంభక మనబడును. 
 • 🖝 పింగళనాడి ద్వారా గాలిని విడుచుట రేచక మనబడును. 
నాడీ చక్రము - Naadii Chakramu
ఇది ఒక ప్రాణాయామ విధానము. 
ప్రాణాయామము చెయపొయినను మనము నిత్యము గాలిని పీల్చి వదలుచునే యుందుము.
 • 🖝 గాలిని పీల్చునప్పుడు ‘సో’ అను శబ్దము వచ్చును. 
 • 🖝 విడుచుచున్నప్పుడు ‘హం’ అను శబ్దము వచ్చును. 
 • 🖝 “సోహం” అనుదానికి “ఆ పరమాత్ముడను నేను” అని యర్ధము. 
అనగా మనము తెలిసియో తెలియకయో పరమాత్మను నిత్యము స్మరించుచున్నా మన్నమాట. “సోహం” అన్నదానిని తిరుగావేసిన “హంసః” అగును.

హంస యనగా పరమాత్మ లేదా పరమాత్మ స్వరూపమైన ప్రాణము. దీనినే హంసగాయత్రి అందురు. గాయత్రి యనగా ప్రాణములను రక్షించునది అని యర్ధము. ఈ పరమార్ధము గ్రహించి (తెలిసికొని) ఎవ్వరీ హంస గాయత్రిని జపింతురో వారికి పునర్జన్మ ఉండదు. “హంస హంసేతి యోబ్రుయా ద్దంసో దేవ స్సదాశివః”.
ప్రణవము (ఓంకారము):     
వేదములు ప్రణవముతో మొదలై ప్రణవముతో ముగియును. ప్రణవము సర్వ వాజ్మయ రూపము. కావున ప్రణవము నభ్యసించవలెను.

అకారము ఉకారము మకారములోని అర్ధమాత్రయు గలసి “ఓమ్” అను ప్రణవ స్వరూప మేర్పడినది. అకార, ఉకార, మాకారములు మూడును, మూడు వేదములు, మూడు లోకములు (భూః – భువః – సువః) ‘బ్రహ్మవిష్ణు శంకరులు, సత్వరజస్తమో గుణములు, జాగ్రత్ స్వప్న సుషుప్తులు, ప్రద్యుమ్న – శ్రీ (లక్ష్మి)  - వాసుదేవ లనెడి అర్చామూర్తులు అని భావింపబడుచున్నవి. ఇట్టి ఓంకార స్వరూపమును దేలిసికొన్నవాడే ముని, తురీయ (4వ) మాత్ర గాంధారి యనబడును.

శిరస్స్థానమున నుండును.అది ఘటము నందలి దీపమువలె దేహమధ్యమున హృదయ పద్మములో పరబ్రహ్మ జ్యోతి రూపమున ప్రకాశించుచుండును. దానిని నిత్యము జపించుచు ధ్యానించవలెను.

ప్రణవము ధనుస్సు. ఆత్మయే బాణము. లక్ష్యము పరబ్రహ్మము. ఉపాసకుడు జాగ్రత్త గలిగిన వాడై లక్ష్యమును కొట్టవలెను. కొట్టినచో జీవాత్మ పరమాత్మ దగ్గరకు చేరుటే కాదు. పరమాత్మలో లయమగును. మొదటనే, నామరూప రహితమైన పరబ్రహ్మమును ధ్యానించుట సాధ్యము కాదు. అందుకే విగ్రహారాధన. ఆరూపము మనసులో హత్తుకొన్న తరువాత క్రమముగా జ్ఞాన సిద్దికలుగును. ఆ పైన నిర్గుణ బ్రహ్మో పాసనము సాధ్య మగును.

ప్రణవ స్వరూపమైన ఈ ఒక్క అక్షరమే బ్రహ్మము. అదే సర్వశ్రేష్టము అదే అందరకును గమ్యస్థానము. “ఓమిత్యేకాక్షరం బ్రహ్మ”.

అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి 
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top