నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Saturday, February 1, 2020

రథ సప్తమి - Ratha Saptamiహైందవులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. దక్షిణ భారతములో ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకొందురు. ఇతర మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది.
  • సూర్య భగవానుడు వేరు ... 
  • సూర్య గ్రహము వేరు .. 
ఈ రెండింటినీ అన్వయించి పూజించడం మన పూర్వీకులు అనాగరికతను తెలియజేస్తుంది . సూర్య గోళము మండుతున్న అగ్ని గోళము . . . సూర్య భవవానుడు కస్యపుమహాముని కుమారుడు . తేజొవంతుడు . భార్యా బిడ్డలు ఉన్న దేవతామూర్తి .
ఈ రెండింటినీ అన్వయించి పూజించడం మన పూర్వీకులు అనాగరికతను తెలియజేస్తుంది . సూర్య గోళము మండుతున్న అగ్ని గోళము . . . సూర్య భవవానుడు కస్యపుమహాముని కుమారుడు . తేజొవంతుడు . భార్యా బిడ్డలు ఉన్న దేవతామూర్తి .

లోకసాక్షి ఐన ఆసూర్యభగవానుని అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందే సుదినమే మాఘ సుద్ధ సప్తమి .అదే ఆయన జన్మతిది ..రధసప్తమి .

సూర్యుడు జన్మించిన ఈ మాఘమాసం లో రథసప్తమినాడు సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఏదో ఓ ఆదివారం నాడు పూజించినా సత్ఫలితం ఉంటుందని పెద్దలంటారు .

రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు చేసి , సూర్యోదయానంతరం దానాలు చేయాలి . ఈరోజు సూర్య భగవానుని యెదుట ముగ్గు వేసి, ఆవుపిడలపై ఆవుపాలతో పొంగలి చేసి ,చిక్కుడు ఆకులపై ఆ పోంగలిని ఉంచి ఆయనకు నివేదన ఇవ్వాలి .

ఇతర మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది. సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకము రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారును బారతీయులే.

మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆరోజు అరుణోదయవేళ స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలనిచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడయున్నచో షష్టీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈయోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.


రథసప్తమినాడు బంగారముగాని, వెండిగాని, రాగిగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయవలెనని, ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుత భారతీయతకు చిహ్నము.

అరసవిల్లి - సూర్యనారాయణ స్వామి పుట్టినరోజు : రధసప్తమి 

సూర్య జయంతి:
ఆదిత్యార్చన.. అద్భుత శక్తి . పవిత్ర మాఘమాసం మహిమాన్వితం. ఈ మాసంలో అన్ని శుభ దినాలే. మాఘమాసంలో చేసే స్నానం, దేవతార్చన అనంత పుణ్యఫలాలు ఇస్తుందని భక్తుల విశ్వాసం. ఏటా మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమిగా, సూర్యజయంతిగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. రథసప్తమి రోజున సూర్యనారాయణస్వామి నిజరూపాన్ని దర్శించుకోవడం భక్తులు మరపురాని మధురానిభూతిగా భావిస్తారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే అరసవల్లిలో భక్తుల సందడితో ఆదిత్యుని జయంత్యుత్సవాల సందడి కనిపించిది.

ఆరోగ్య ప్రదాత..
మాఘశుద్ధ సప్తమి రోజున అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించి, సేవించడం ద్వారా రోగ, శోక, దారిద్య్రాలు పోతాయని భక్తుల నమ్మకం. అందుకే రథసప్తమి రోజున భక్తులు స్వామివారి నిజరూప దర్శనం, మహాక్షీరాభిషేకం సేవలో పాల్గొని తరిస్తారు. మాఘశుద్ధ సప్తమి వేకువజామున ఆకాశంలో నక్షత్రాలు రథం ఆకారంలో ఏర్పడుతుంటాయని, ఉత్తరాయణంలో వచ్చే చర్మ, కుష్ఠి, బొల్లి వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే సూర్యారాధన చేయాలని ఆదిత్యుని ఆలయ అర్చకులు నగేష్‌శర్మ వివరించారు.

అరుణశిల.. అత్యద్భుతం
ఆదిత్యాలయంలో రథసప్తమి రోజున శ్రీసూర్యనారాయణస్వామి నిజరూప దర్శనం భక్తులకు మరపురాని మధురానిభూతి కలిగిస్తుంది. అరుణశిల దర్శించినంత మాత్రానే అద్భుతశక్తి శరీరంలోకి ప్రవేశించిన భావన కలుగుతుంది. ఆదిత్యాలయంలోని అయిదున్నర అడుగుల అరుణశిలతో దేవశిల్పి విశ్వకర్మ స్వామి మూలవిరాట్‌ను చెక్కినట్లు పురాణాలు చెబుతున్నాయి. మూలవిరాట్‌ కిందన వైజయంతి సప్త అశ్వరథం ఉంటుంది. రథంపై గుర్రాలు తాళ్లు పట్టుకుని సూర్య రథసారథి అనూరుడు ఉంటారు. స్వామి పాదాల ముందర ఛాయాదేవి, స్వామి ఎడమవైపు, కుడివైపు ఉషా, పద్మినిదేవి ఉంటారు. ముగ్గురు దేవేరుల్లో ఉషా, పద్మిని ధనుస్సులు ధరించి ఉంటారు. స్వామికి ఎడమవైపున ద్వారపాలకుడైన మాఠరుడు కత్తి, డాలు ధరించి ఉంటాడు. స్వామికి కుడివైపున చిన్న గడ్డంతో కూడిన పింగళుడు ఎడమవైపు సిరాబుడ్డీ, కుడిచేతిలో కలం పట్టుకుని ఉంటాడు. ఈయనే భక్తులు చేసే విజ్ఞాపనలు, కోరికలు స్వీకరించి స్వామికి నివేదిస్తారు. స్వామికి శిరస్సుకు ఎడమవైపు సనకుడు ఛత్రంలోను, కుడివైపున సనందుడు అనే మహర్షి ఛామరం పట్టుకుని సేవలు అందిస్తారు. స్వామికి రెండు చేతులు అభయ ముద్రలలో ఉంటాయి. స్వామి భుజాలకు ఇరువైపుల తామరపూలు, మొగ్గులను ధరించి ఉంటారు. స్వామి నిజరూప దర్శనంలో వస్త్రాల కిందన బెల్టును ధరించి ఉంటారు. సూర్యనారాయణస్వామి మెడలో హారాలు, మకర కుండలాలు, కేయూరాలు, రత్నఖచిత సూర్యమణి కిరీటంతో చిరునవ్వుతో స్థానక భంగిమలో భక్తులకు స్వామి దర్శనం ఇస్తుంటారు. స్వామి శిరస్సు మీద శరభ సాల్వం అనే పతాక చిహ్నం ఉంటుంది.

పాయసాన్నం.. పరమౌషధం
రథసప్తమి రోజున ఉదయం 8 గంటల లోపు వాకిట్లో పొయ్యిను పెట్టి కొత్తబెల్లం, కొత్తబియ్యం, చెరకు, ఆవుపాలతో పాయాసన్నం చేసి స్వామికి నివేదించి భక్తులు తింటే నరాలు, కీళ్ల నొప్పులు, హృద్రోగ సంబంధ వ్యాధులు నశిస్తాయని నగేష్‌ శర్మ తెలిపారు. స్వామికి సమర్పించిన తీపి పదార్థంపై లేలేత సూర్యకిరణాలు పడడం వల్ల శరీరంలో రోగ నిరోధకశక్తి పెరిగి, మధుమేహవ్యాధిని తగ్గిస్తుంది. పాయాసన్నంలో వాడే చెరకు వల్ల పళ్లు, దవడలు, నరాలకు శక్తి వస్తుంది. రథసప్తమి రోజు నదులు, చెరువుల్లో తలపై దీపం పెట్టి వదిలివేస్తే మరుజన్మ ఉండదని భక్తుల విశ్వాసం. జిల్లేడు ఆకులు శిరస్సున, రెండు భుజాలపైన రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేస్తే ఏడు జన్మల రోగాల పోయి, మనస్సు, నవరంధ్రాలు, పంచేంద్రియాలు సుషుప్తావస్థ నుంచి జాగృతావస్థలోకి వస్తాయని చెబుతారు. రథసప్తమి రోజున స్వామి నిజరూప దర్శనం వల్ల అభిషేకం చేసిన అరుణశిల కిరణాల స్పర్శతో భక్తులకు రోగనివారణ కలుగుతుందని నమ్ముతారు.

రచన: శేషగిరి రావు 
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com