తిరుమలలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విశేషాలు - Tirumala Mukhya Vishsaluతిరుమలలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విశేషాలు - Tirumala Mukhya Vishsalu
తిరుమలలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విశేషాలు
1. గుడి యొక్క మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గునపం ఉంటుంది. అనంతాళ్వారు స్వామి వారిసేవకై పూల తోట కు వాడే నీళ్ళ కోసం బావి త్రవ్వు తుంటే ఆయన గర్భిణి భార్య మట్టి ఎత్తి పోస్తూ ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో వేంకటేశుడు ఆమెకు సహాయం చేస్తుంటాడు. తన స్వామీ పనులు తామే చెయ్యాలని ఈ బాలున్ని కోపంతో చేతిలో ఉన్న గునపంతో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం కారుతుంటుంది. అప్పటి భక్తులు అనంతాళ్వారు మిగతా అందరు, స్వామీ వారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం రావడం చూసి ఆపడానికి పచ్చకర్పూరం అద్దుతారు... అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి పచ్చకర్పూరం అద్దడం అనే సాంప్రదాయం మొదలైంది.

2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి మనుషుల జుట్టు లాగా ఉన్నట్టు అనిపిస్తుంది కాని స్వామీ వారు స్వయంభు వెలిసిన విగ్రహం చెక్కిన విగ్రహం కాదు కాబట్టి జుట్టు అలాగ జాలువారు తున్నట్టుగా ఉంటుంది. ఐతే విగ్రహానికి ఉన్న జుట్టు నల్ల రాతి తో ఏర్పడింది కాబట్టి చిక్కుపడే అవకాశమే లేదు.

3. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం పూలతో అలంకరిస్తూ ఉంటారు. పూలన్నీ దేవస్థానం వారు పెంచే ఉద్యానవనాలనుంచి, ఇతర ప్రాంతాల నుంచి వస్తాయి. ఋతువులను బట్టి పూలు మారతాయే కానీ అలంకరణలో మార్పు ఉండదు. ఇక పాలు, పెరుగు, వెన్న వగైరా తిరుమల తిరుపతి వారి ఆస్థాన గోశాల నుంచి వస్తాయి. తిరుమల నుండి 10 కోసుల దూరం లో స్వామీ భక్తుల గ్రామం ఉంది అక్కడి వారందరూ ఒకప్పుడు నిష్టాపరులు. వారికి ఆలయంలోనికి ఎల్లవేళలా ప్రవేశం ఉండేది కాని ఇప్పుడు ఆ నిష్టలు లేవు, ఆ ప్రవేశాలు లేవు...

4. స్వామివారు గర్భగుడి లో కొంచం కుడివైపుకు ఉంటారు, అందుకు అనేక కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది ఏమిటంటే.. స్వామి వారి తిరునామం తొలగించినపుడు వారి కనుల నుండి వెలువడే దివ్య శక్తి ఎదురుగా పడ కూడదని. అసలు అనేకమైన మందిరాలలో గర్భగుడిలో విగ్రహాలు కొంచం కుడి వైపో ఎడమవైపో ఉంటాయి. ఉత్సవ విగ్రహాలను, పూజ సామాగ్రిని మరో వైపు ఉంచే ఆనవాయితీ కూడా ఉంది.

5. స్వామివారికి ప్రతి శుక్రవారం అభిషేకం జరిగిన తరవాత అలంకరణకు 24 మూరల పొడవుగల సరిగ పట్టు పీతాంబరం (ధోవతి), పై వస్త్రానికి (ఉత్తరియం) 12 మూరల పట్టు చీర వాడతారు. ఈ వస్త్రాలను స్వామీ వారికి సమర్పించ దలచుకునే వారు వస్త్రాలంకరణ సేవ కి టికెట్టు కొనుక్కోవచ్చు. ఒకసారి వాడిన వస్త్రాలను ఇతర మందిరాలలో విగ్రహాలకు వాడడానికి పంపిస్తారు.

6. శ్రీవారి మూల విరాట్టుకు అలంకరింపచేసే పుష్పాలని తొలగించిన తర్వాత వాటిని భూదేవికి అర్పించాలని ఆలయం వెనక ఉన్న పూల బావి లో వేసేవారు. . అయితే నేటి రోజుల్లో స్వామివారి సేవల సంభారాలు పెరిగిపోవడం తో పూలను మరో విధంగా భూదేవి లో చేరుస్తారు.

7. ఆలయం క్రిందగా అంతర్వాహినిగా విరజ నది ప్రవహిస్తూ ఉంటుంది అని వినికిడి. నిశబ్ధం గా ఉన్న సమయం లో స్వామివారి విగ్రహానికి చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుందని కూడా వినికిడి. అంతర్వాహినిగా ప్రవహించే విరజ నది ప్రవాహ ఘోష ఇలా వినబడుతుందని ఒక అభిప్రాయం. స్వామీ వారు పాల సముద్రం వదిలి భూమి మీదకు వచ్చినా పాల సముద్రం ఘోష ఇంకా ఆయన వెన్నంటే ఉన్నదని ఇంకొక్క అభిప్రాయం.

8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం వేళలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు స్వామివారి ఆభరణాలు మిగతా అవయవాలు తో బాటుగా లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. ఈ లక్ష్మీ దేవి అచ్చు కొనదలచుకొన్న భక్తులకు అనువుగా లభిస్తుంది. మిగతా అవయవాల అచ్చులు ముక్కలుగా చేసి ఆ సమయం లో దర్శనానికి వచ్చిన భక్తులకు పంచుతారు. ఒక సారి స్వామి దర్శనానికి వరుసలో నుంచుని ఉండగా మాకు కూడా లభించింది. ఇది నిజమే !!

9. స్వామీ వారి కైంకర్యానికి వాడి తీసి వేసిన పూలు అన్నీ కొండ పైన గల పూల బావి లో వేసేవారు. ఈ బావి లో జలం అంతర్వాహిని అయిన విరజ నది జలం తో కలసి కొండ క్రిందుగా ప్రవహించి మరో నదిలో కలసి పోతాయి. అలా జలాలతో బాటుగా కొన్ని పువ్వుల రేకలు తిరుపతికి దూరంగా తేలేవి. కాని ఇప్పుడు కాదు. పూల బావిలో ఇప్పుడు పువ్వులు వేయడం లేదు.

10. స్వామివారి గర్భ గుడిలో వెలిగే దీపాలు కొండెక్క కుండా అర్చకులు చూసుకుంటారు.... అవి ఎన్నో సంవత్సరాల నుండి వెలుగుతున్నాయన్నిది నిజమే.

11. తిరుమల ఆలయం లోని మొదటి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. స్వామివారి ఆభరణాలను ధరించిన 9 మంది అర్చకులను, విజయనగర రాజు, విచక్షణారహితంగా దేవాలయంలోనే నరికివేయగా ఆ దోష నివృత్తి కి వ్యాసరాయలువారు పన్నెండు సంవత్సరాలు ఎవ్వరినీ గర్భగుడిలోనికి అనుమతించకుండా లోపలనే వుండి పూజలు చేసారు . ఆ పన్నెండేళ్ళ కాలంలో భక్తులకు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును దర్శించుకునే భాగ్యం కలగబోదు కావున మూలవిరాట్టు కు ప్రతిరూపం గా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో ఉత్తర వాయువ్య దిశలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ సమయం నుండి స్వామి దర్శనం అనంతరం విమానవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఒక ఆచారం గా మారింది.

"వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి" ........ "బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు,

..... శ్రీ వేంకటేశ్వరునికి సమమైన దైవం భూత భవిష్యత్కాలాలలోనూ లేరు"....

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top