కరోనా వైరస్ సోకితే ఏం జరుగుతుంది - Coronavirus, COVID-19 Sokite Yemi Jarugutundi

కరోనా వైరస్ సోకితే ఏం జరుగుతుంది - Coronavirus, COVID-19 Sokite Yemi Jarugutundi


= కరోనా వైరస్ సోకితే ఏం జరుగుతుంది =
కరోనా వైరస్‌ శరీరంలో చేరిన తర్వాత శరీరంలో యెటువంటి మార్పులు సంభవిస్తాయి అనే దానిపై ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ ‘లాన్సెట్‌’ కీలక సమాచారాన్ని ప్రచురించింది. ఆ సమాచారం ప్రకారం.. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 14 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది. అయితే వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి పట్టే సమయం సగటున 5 రోజులని చైనాలో పరిశోధనలో తేలింది.

1-3 రోజులు లక్షణాలు ఆరంభం
 • * మొదట్లో ముక్కు, గొంతు ద్వారా శ్వాసకోశ సమస్యల లక్షణాలు కనిపిస్తాయి.
 • * మొదటి రోజే కొద్దిగా జ్వరం వస్తుంది.
 • * మూడో రోజు నుంచి దగ్గు, గొంతు నొప్పి ప్రారంభంఅవుతాయి.
 • * బాధితుల్లో ఇలాంటి లక్షణాలు 80% మందిలో కనిపిస్తాయి.
4-9 రోజులు ఊపిరితిత్తుల్లోకి
 • * వ్యాధికారక వైరస్‌ 3-4 రోజుల్లో ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది.
 • * 4-9 రోజులకు శ్వాస తీసుకోవడానికి కష్టమవుతుంది.
 • * 8-15 రోజుల వ్యవధిలో ఊపిరితిత్తులు వాచి తీవ్ర శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశముంది.
 • * వైరస్‌ బాధితుల్లో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్లు 14%.
8-15 రోజులు రక్తంలోకి చేరిక
 • * ఇన్‌ఫెక్షన్‌ ఊపిరితిత్తుల నుంచి రక్తంలోకి చేరుతుంది.
 • * వారం ముగిసేసరికి విషతుల్యమై ప్రాణహాని స్థాయికి చేరుతుంది.
 • * ఇలాంటి సందర్భంలో ఐసీయూలో చేర్చాల్సిన అవసరం వస్తున్న వారు 5%
మూడో వారం అత్యంత కీలక దశ
 • * 21 రోజుల తర్వాత బాధితుడు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి కావడమో, అరుదుగా చనిపోవడమో జరుగుతుంది.
 • * డిశ్ఛార్జి: సహజంగా 18-25 రోజుల మధ్య వ్యాధి లక్షణాలు తగ్గి బాధితులు ఇంటికి వెళ్లిపోతున్నారు. ఇలా సురక్షితంగా బయటపడుతున్న బాధితుల సంఖ్య 95% కంటే అధికమే.
 • * సాధారణంగా 15-22 రోజుల మధ్య వ్యాధి లక్షణాలు ముదిరి బాధితులు చనిపోతున్నారు. ఇది వయసు 60 పైబడి ఉండి, అప్పటికే గుండె జబ్బులు, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి ఇతరత్రా జబ్బులున్న వారిలోనే ఎక్కువ.. ఇప్పటివరకు ఇలాంటి వారిలోనే మరణాల రేటు అధికంగా నమోదవుతోంది.
వైరస్ వ్యాప్తి దశలు..
కరోనా వైరస్ (కొవిడ్‌-19) వంటి మహమ్మారులు ఏదో ఒక దేశంలో మొదట బయటపడి క్రమేపీ నాలుగు దశల్లో ప్రపంచాన్ని కమ్మేస్తుంటాయి.

కరోనా వైరస్‌ వ్యాప్తి దశలు ఇలా ఉన్నాయి.
 • 1వ దశ :- కరోనా ప్రబలిన దేశాల నుంచి ఈ వ్యాధి సంక్రమించడం. అత్యధిక కేసులు ఇలాంటివే ఉంటాయి.
 • 2వ దశ:- స్థానికంగానే కరోనా సోకిన (పాజిటివ్‌గా తేలిన) వ్యక్తుల నుంచి ఇతరులకు సంక్రమించడం.
 • 3వ దశ:- జన సమూహాలకు వైరస్‌ వ్యాప్తిచెంది.. అనేక ప్రాంతాలకు విస్తరించడం.
 • 4వ దశ:- అంటువ్యాధిగా మారి ప్రబలడం. ముగింపు ఎక్కడో తెలియని పరిస్థితి నెలకొనడం. ప్రస్తుతం చైనా, ఇరాన్, ఇటలీల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
మరి మనదేశంలో కరోనా ఏ దశలో ఉంది..?
భారత్‌లో ప్రస్తుతం ఈ వ్యాధి రెండో దశలో ఉంది. అంటే స్థానికంగానే.. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు సంక్రమిస్తోంది. కరోనా ప్రబలిన దేశాలకు వెళ్లివచ్చినవారు లేదా ఆయా దేశాలకు చెందిన వారివల్ల భారత్‌లోకి ప్రవేశించిన ఈ వ్యాధి ఒక అడుగు ముందుకేసింది. ఈ వ్యాధిని ఇక్కడే అడ్డుకోవడం లేదా కనీసం మూడో దశకు చేరుకోవడాన్ని ఆలస్యం చేయడానికి భారత ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ తెలిపారు. జన సమూహాలకు వ్యాపించే దశకు చేరకుండా అడ్డుకోవడానికి 30 రోజుల సమయమే ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి ఈ వ్యాధి వ్యాప్తి పరిమితంగానే ఉన్నట్లు ఐసీఎంఆర్‌ చీఫ్‌ ఎపిడమాలజిస్ట్‌ డాక్టర్‌ ఆర్‌.ఆర్‌.గంగాఖేడ్కర్‌ తెలిపారు.

రెండో దశలోనే ఉంచాలంటే?
 • * కరోనా ప్రబలిన దేశాల నుంచి వచ్చేవారిని 14 రోజుల పాటు వేరుగా ఉంచడం.
 • * ‘పాజిటివ్‌’గా తేలిన వ్యక్తులు కొద్ది రోజులుగా ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో వారందరినీ పరిశీలనలో ఉంచడం. లక్షణాలు కనిపిస్తే వారినీ వేరుగా ఉంచడం.
 • * జనాలు గుమిగూడకుండా చూడటం. విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు వంటివాటిని మూసివేయడం.
 • * చేతులు శుభ్రం చేసుకునేలా.. పరిశుభ్రత పాటించేలా.. శ్వాస సంబంధిత అంశాలపై అవగాహన పెంచుకునేలా ప్రజలను చైతన్యపరచడం.
 • * కరోనా పరీక్షల నిర్వహణకు, రోగులను వేరుగా ఉంచేందుకు అవసరమైన పడకలు, గదులు, ఇతర మౌలిక వసతులు భారీగా పెంచడం అవసరం.
అనవసర భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండండి.. వాట్సప్ గ్రూపులో వచ్చే అసత్యాలను గుడ్డిగా నమ్మకండి.. కరోనా వైరస్ గురించి నేను గతంలో రాసిన ఆర్టికల్ కోసం ఈ కింది లింక్ ఓపెన్ చేయండి.

రచన: నాగార్జున మన్నూరు

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top