నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

27, మార్చి 2020, శుక్రవారం

తుంగనాథ్ మహదేవ్ - Thungnath mahadev

తుంగనాథ్ మహదేవ్
ఉత్తరాఖంఢ్ రాష్ట్రం లో వున్న పుణ్య క్షేత్రాలలో యీ తుంగనాథ్ వొకటి . ముఖ్యంగా ఉత్తరాఖంఢ్ లో వున్న బదరీనాథ్ , కేదారనాథ్ , గంగోత్రి , యమునోత్రి యాత్రలు టూర్ ఆపరేటర్ల పుణ్యమా అని యీ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందేయి. ఉత్తరాఖంఢ్ ని దేవభూమి అని అంటారు కారణం యేమిటంటే యిక్కడ అడుగడుగునా పురాతనమైన మందిరాలు , అడవులు , పచ్చని మైదానాలు , వుష్ణ కుండాలు , మంచుతో కప్పబడ్డ యత్తై న పర్వతాలు చల్లని వాతావరణం మనస్సుని ఆహ్లాద పరుస్తూ దేవలోకం యిలా వుంటుందేమో అన్నట్టుగా వుంటుంది . యమునోత్రి , గంగోత్రి , కేదారనాథ్ , బదరీనాథ్ లను చార్ధామ్ యాత్ర అని కూడా అంటారు.
ఉత్తరాంచల్ లో చార్ధామ్ యాత్ర కాక పంచ కేదారాలు , పంచ బదరీలు , పంచధారలు , పంచ ప్రయాగాలు , పంచ శిలలు చూడవలసినవి . మహాభారతంలో పంచ కేదారాల గురించి చెప్పబడింది
ఆలయ ద్వారము
పురాణ గాధ:
మహా భారతం ప్రకారం వ్యాసమహర్షి మహాభారత యుద్ధానంతరము పాండవులకు జ్ఞాతులను చంపిన పాపము పోగొట్టు కొనడానికి పరమశివుని ఆరాధించమని సలహా యిస్తాడు . పాండవులు కుంతీదేవి , ద్రౌపతి లతో బదరీనాథ్ లోని సరస్వతి నదిని దాటుకొని (సరస్వతి నది పైన పడవేసివున్న పెద్దరాయిని ' భీమ పూల్ ' అని అంటారు ) నడక దారిన బయలు దేరుతారు . యిక్కడ నుండి పంచధారలలో వొకటైన ' వసుధార ' కనిపిస్తూ వుంటుంది . సరస్వతి నదికి మూడు కిలొమీటర్ల దూరంలో ద్రౌపతి తనువు చాలిస్తుంది . తరవాత మరో నాలుగు కిలొమీటర్లు ప్రయాణించిన తరువాత కుంతీదేవి తనువు చాలిస్తుంది . యీ ప్రదేశాలలో వున్న ద్రౌపతి , కుంతీదేవిల సమాధులను చూడొచ్చు . పాండవులు హిమాలయాలలో శివుని వెతుకుతూ తిరుగుతూ వుంటారు . పరమశివుడు ఎద్దు రూపంలో వారి నుంచి తప్పించుకొని తిరుగుతూ వుంటాడు.

భీముడు ఎద్దు రూపంలో వున్న శివుని గుర్తించి దానిని బంధించాలని ఎద్దుని వెంటాడు తాడు . ఎద్దు రూపంలో వున్న శివుడు భీమునికి చిక్కక గుప్త కాశిలో మందాకినీ నదీ తీరాన పాతాళ లోకంలో దాగుంటాడు , భీముడు కూడా శివుని వెనుకే పాతాళానికి వచ్చి పారిపోతున్న ఎద్దు వెనుక కాళ్లని పట్టుకొని భూమి పైకి లాగుతాడు . భీముడు బలంగా లాగుట వలన ఆ ఎద్దు అయిదు భాగాలుగా తెగి , ఆ అయిదు భాగాలు అయిదు ప్రదేశాలలో పడ్డాయని , ఆ భాగాలు పడ్డ ప్రదేశాలలో శివుడు స్వయంభూగా వుద్భవించెనని ఆది శంకరులు గుర్తించి ఆ ప్రదేశాలలో మందిర నిర్మాణం చేసి శివుని అరాధించేరనేది పురాణ కధ.

1) రుద్రనాథ్ --ముఖం , 2) తుంగనాధ్ -- ముందుకాళ్ళు , 3) కేదార్నాథ్ --మూపురం , 4) మథ్యమహేశ్వర్ -- నాభి , వెనుకభాగం 5) కపాలేశ్వర్ -- జట.

ఈ పంచకేదారాలలో ఈశ్వరుడు స్వయంగా పాండవుల పూజలందుకొని వారిని పాపవిముక్తుల్ని గావించి కాలాంతరమున తనలో ఐఖ్యం చేసుకున్నాడని వ్యాసమహర్షి మహాభారతంలో చెప్పేరు . ఇప్పటికి కుడా ప్రొద్దున్న సాయంత్రం జరిగే హారతికి స్వయంగా పరమశివుడు వచ్చి పూజలందుకొని భక్తులను అనుగ్రహిస్తాడని స్థానికుల నమ్మిక.
నడకదారి
ఎలా చేరుకోవాలి:
పంచ కేదారాలలో వొకటిగా చెప్పబడే తుంగనాథ్ గురించి చెప్పుకుందాం . వీలుని బట్టి మిగిలిన నాలుగు కేదారాలగురించి చెప్పుకుందాం . ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్ జిల్లా లో సుమారు ముప్పై ముప్పైయైదు కిమీ ల దూరంలో రుద్రప్రయాగ నుంచి అగస్త్యముని వెళ్ళేదారిలో ఓఖిమఠ్ కి సుమారు అయిదు కిమీ దూరంలో చోప్త అనే వూరు నుంచి కొండ యెక్క వలసి వుంటుంది . అతి యత్తైన పర్వతం పైన వున్న శివకోవెలగా ప్రపంచ ప్రఖ్యాతి పొందినది యీ తుంగనాధ్ . సముద్ర మట్టానికి సుమారు 3,680 మీటర్ల ఎత్తులో వున్న చంద్రశిల అనే పర్వతం మీద వున్న కోవెల యిది . ఈకోవెల గోపురం కనీసం వెయ్యి సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిందని పురావస్తు పరిశోధకులు నిర్దారించేరు.

చోప్త దగ్గర నుంచి కాలి నడక మొదలౌతుంది . ఉత్తరాఖంఢ్లో వున్న అనేక యాత్రా స్థలాలు కాలినడకనే వెళ్ళవలసి వుంటుంది . శారిరిక అలసట తెలియకుండా ఉండేందుకా అన్నట్లు అక్కడి వాతావరణం ఆహ్లాద కరంగా వుంటుంది . ఇక్కడ సంవత్సరానికి రెండే కాలాలు . ఒకటి శీతాకాలం , రెండు మంచు కురిసే శీతాకాలంగా చెప్పుకోవచ్చు . బదరీనాథ్ , కేదార్ నాధ్ మందిరాలు ప్రతి సంవత్సరం వైశాఖ శద్ద తృతీయ నాడు తెరువబడతాయి , కాని మిగతా మందిరాలు అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి మందిర ట్రస్టు యెప్పుడు తెరవాలి అనేది నిర్ణయిస్తుంది .

సుమారుగా అయిదు కిమీ నడకన వెళ్ళవలసి వస్తుంది . నడవలేని వారికోసం గుఱ్ఱాలు , డోలీలు దొరుకుతాయి . 3,680 మీటర్లు ఎత్తు అయిదు కిమీ లలో ఎక్కవలసి రావడంతో చాలా చోట్ల చాలా ఎత్తు (స్టీప్) ఎక్కవలసి రావడం తో కాస్త ఆయాసం ఎక్కువగా అనిపిస్తుంది . ఈ ప్రదేశానికి పర్వతారోకకులు తప్ప మామూలు యాత్రికులు చాలా తక్కువ సంఖ్యలో వస్తూవుంటారు . అందు కనేనేమో యీదారి కాస్త నిర్మానుష్యంగా వుంటుంది . కాలి నడక మొదలయ్యే ప్రాంతంలో మాత్రమే చల్ల , వేడి పానీయాలు తినుబండారాలు దొరకుతాయి . మళ్లా కోవెల ప్రాంతంలో అన్నీ దొరుకుతాయి . తుంగనాథ్ నుంచి చంద్రశిల శిఖరం రెండు కిమీ ల పైన వుంది . త్రేతాయుగం లో శ్రీరాముడు యీ చంద్రశిల శిఖరం పైన తపస్సు చేసినట్లుగా రామాయణంలో చెప్పబడింది . ఈ ప్రదేశం మూడు ప్రాకృతిక పుణ్యజలలతో యేర్పడ్డ 'ఆకాశకామిని ' నదీ తీరాన వుంది వొకటి రెండు రోజులు వుండడానికి వీలుగా చిన్న చిన్న రూములు కామన్ టాయిలెట్ లతో వున్న సామాన్య గదులు తక్కువ వెలలో లభిస్తాయి . ప్రొద్దున్న పది గంటలకు నడక ప్రారంభిస్తే తుంగనాధుని దర్శించుకొని భోజనం చేసుకొని సాయంత్రం నాలుగు అయిదు గంటలకి చోప్తా చేరుకోవచ్చు.
తుంగనాథ్ మహదేవ్ ఆలయ ప్రాంగణం
యాత్రికులకు వో చిన్న సూచన: 
హిమాలయాలలో ప్రొద్దున్నే వీలైతే సూర్యోదయానికి పూర్వం యాత్ర మొదలుపెట్టి సూర్యాస్తమయానికి ముందు లేక వెంటనే ప్రయాణం నిలిపివేస్తే మనం చాలా ఆపదల నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం నమ్మలేని విధంగా మారుతూ వుంటుంది . అంతలోనే వాన అంతలోనే యెండ . నడక దారి రెండువైపులా కనుచూపు మేర రంగురంగుల పేరు తెలియని అడవి పువ్వులు చిరు చలిగాలికి వణుకుతున్నాయా అన్నట్లుగా కదులుతూ యాత్రికులను స్వాగతిస్తూ వుంటాయి . అంత యెత్తున వున్న పచ్చిక మైదానాలు మనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి . తుంగనాధ్ మందిరం కేదార్నాద్ మందిరాన్ని పోలివుంటుంది . లోపల శివ లింగం , శివ కుటుంబంతో పాటు పాండవుల విగ్రహాలను కుడా చూడొచ్చు . కాశి నగరానికి చెందిన బ్రాహ్మణులు యిక్కడ నిత్య పుజాదులు నిర్వహిస్తున్నారు . ఆరునెలలనుంచి ఎనిమిది నెలలవరకు యీ కోవెల మూసివేస్తారు . ఆ సమయంలో మోకుమఠ్ లో తుంగనాథునికి నిత్య పూజానైవేద్యాలు జరుపుతారు.

దేశరాజధాని ఢిల్లి నుంచి ఋషికేశ్ వరకు రైల్ ద్వారా ప్రయాణం చెయ్యవచ్చు .అక్కడనుంచి ఓఖిమఠ్ సుమారు 200 కిమీ . ప్రొద్దున్న ఋషికేశ్ లో బయలు దేరితే వాతావరణం అనుకూలంగా వుంటే సాయంత్రానికి ఓఖిమఠ్ చేరుకోవచ్చు . ఓఖిమఠ్ లో కనీసఅవసరాలు కలిగిన సామాన్యమైన గదులు అద్దెకు దొరకుతాయి . కేదార్ నాథ్ కోవెలకి హెలికాఫ్టర్ లో వెళ్ళేవాళ్ళకి అగస్త్యముని మీదుగానే వెళ్ళవలసి వుంటుంది వీలున్న వారు తుంగనాథుని దర్శించుకొని పరమశివుని కృపను పొందండి .

రచన: కర్రా నాగలక్ష్మి

« PREV
NEXT »