శ్రీ పంచముఖ ఆంజనేయ స్వరూపము - Panchamukha Hanuman Swaroopam

శ్రీ పంచముఖ ఆంజనేయ స్వరూపము - Panchamukha Hanuman Swaroopam
నుమంతుని ప్రసిద్ధ అవతారములలో ‘శ్రీ పంచముఖ ఆంజనేయ స్వరూపము’ చాల ప్రసిద్ధమైనది.

ఇందు:
 • ⧫ పూర్వవదనము - వానరవదనము (శత్రునాశనము)
 • ⧫ దక్షిణవదనము - నారసింహవదనము (భయనాశనము)
 • ⧫ పశ్చిమవదనము - గరుడ వదనము (సర్వరోగనాశనము)
 • ⧫ ఉత్తరవదనము - వరాహవదనము (అన్న, సంపద ప్రదాయకము)
 • ⧫ ఊర్థ్వవదనము - హయగ్రీవవదనము (సర్వ విద్యాదాయకము)
ఈ పంచవదనములను పూర్వవదనము నుండి ఉత్తరవదనము వరకు ‘సవ్యదిశ’లో ఇరవైమూడవ చౌపాయి నుండి ఇరవైయారవ చౌపాయికి సంధానించి, ఇరవైయేడవ చౌపాయిని ‘హయగ్రీవవదనము’నకు సంధానించితే, ఈ ఐదు చౌపాయిలలో, స్వామివారి ‘పంచముఖతత్త్వము’ను దర్శింపవచ్చును.

పూర్వవానరరూపము
ఆపన తేజ సమ్హారో ఆపై!
తీనోఁ లోక హాంకఁతే కాంపై!!
స్వామి యొక్క అద్భుతమైన తేజోరూపము మూడు రకములుగా భాసించుచున్నది.
 • మొదటిది సూక్ష్మరూపము:
 • హనుమంతుడు ఏ సూక్ష్మ వానరరూపముతో సీతాదేవికి ప్రథమ దర్శనము ఇచ్చినాడో, అది ఆయన యొక్క ‘సూక్ష్మరూపము’.
 • రెండవది మధ్యమరూపము:
 • ఒక పాదము ఉదయాద్రిపై, ఇంకొక పాదము పశ్చిమాద్రిపై నుంచి, స్వామి సూర్యుని వద్ద ఏ వేదవేదాంగములు అభ్యసించినాడో, అది ఆయన యొక్క ‘మధ్యమరూపము’.
 • మూడవది భీమరూపము:
 • సాగరోల్లంఘన సమయములో, పది యోజనముల వెడల్పు, ముప్పది యోజనముల ఎత్తు ఉన్న స్వామి రూపము ఆయన యొక్క ‘భీమరూపము‘
ఇట్టి స్వామి యొక్క మూడు రూపములతో శోభిల్లు దివ్య వానరరూపమును చూచి ముల్లోకములు కంపించిపోయినాయని అర్థము. అట్టి స్వామి సుందర ‘పూర్వవానరవదనము’నకు నమస్సులు.

దక్షిణనారసింహరూపము
భూత పిశాచ నికట నహిఁ ఆవై!
మహాబీర జబనామ సునావై!!
పాదములలో చక్ర ,శంఖ, నాగలి, వజ్రాయుధము, మీనము వంటి దేవతా చిహ్నములతో, ఐరావత తొండముల వంటి ఊరువులతో, విశాల వక్షస్థలముతో, శంఖ, చక్ర, గద, ఖడ్గముల వంటి ఆయుధములు దాల్చిన అనేక బాహువులతో, వజ్రదేహ, వజ్రకవచ, వజ్రతుండ, వజ్రనఖ, వజ్రముఖ, వజ్రవాల, వజ్రరోమ, వజ్రనేత్ర, వజ్రశిర, వజ్రపాదములతో, ఎర్రని నాలుకతో, నాసిక నుండి వచ్చు వేడి నిట్టూర్పులతో ఉన్న స్వామి

ఘోర దక్షిణనారసింహవదనము సమస్త భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మరాక్షస, భేతాళ, మహామారీత్యాదుల నుండి మమ్ము రక్షించుగాక!!!

పశ్చిమగరుడవదనము
నాసై రోగ హరై సబపీరా!
జపత నిరంతర హనుమతబీరా!!
కాంచనవర్ణముతో, సుపర్ణములతో శోభిల్లుతున్నవాడు, సమస్తఛందోమయుడు, హరివాహనుడు, మహాబలుడు, అరుణానుజుడు, నాగకులాంతకుడు, మహాతేజోవంతుడు, అమృతకుంభమును హస్తములందు దాల్చిన వాడు, వినతానందనుడు, మాతృదాస్యవిమోచకుడు, వాయువేగముతో సంచరించగలవాడు, వైనతేయుడు, ఖగపతి అయిన ‘పశ్చిమగరుడవదనము’ మమ్ములను వాతజ్వర, పిత్తజ్వర, కఫజ్వర, గ్రహజ్వర, విషజ్వర, శీతజ్వరముల నుండి రక్షించు గాక!!!

ఉత్తర వరాహవదనము
సంకటతేఁ హనుమాన ఛుడావై!
మనక్రమ బచన ధ్యాన జోలావై!!
వరాహవదనముతో విరాజిల్లు ఓ ఆంజనేయా!
 • నీవు యజ్ఞస్వరూపుడవు, యజ్ఞకర్తవు, యజ్ఞభోక్తవు, యజ్ఞ ఫలప్రదాతవు, యజ్ఞరక్షకుడవు, యజ్ఞాధిపతివి, వేదమూర్తివి.
 • నీ చర్మము నుండి సమస్త వేదములు జనియించాయి,
 • నీ రోమకూపముల నుండి యజ్ఞాజ్ఞులు ఉద్భవించినాయి,
 • నీ కన్నుల నుండి యజ్ఞద్రవ్యముగా నెయ్యి, ముట్టె నుండి ‘స్రుక్కు’, ముక్కు నుండి ‘సృవము’, ఉదరము నుండి ‘ఇడాపాత్రము’, చెవుల నుండి, ముఖము నుండి ‘చమసము’, ‘ప్రాశ్రితము’ అను యజ్ఞపాత్రలు పుట్టాయి. నీవు యజ్ఞాదినాధుడవు!, యజ్ఞవరాహమూర్తివి!, ఓ వేదమయా! విదియ నాటి చంద్రరేఖవలె నీ తెల్లని దంష్ట్రలపై భూమండలమును ధరించి, ఉద్ధరించిన ఓ భూరమణా! మమ్ము  సమస్త సంకటముల నుండి రక్షించి ఉద్ధరించుము!

ఊర్థ్వహయగ్రీవవదనము
సబ పర రామతపస్వీ రాజా!
తినకే కాజ సకలతుమ సాజా!!
ఓ ఆంజనేయా! నీవు జ్ఞానానందమయుడవు, సర్వవిద్యలకు ఆధారమైన విద్యా స్వరూపుడవు, హయవదనుడవు, విశుద్ధ విజ్ఞానమునకు ఘనస్వరూపుడవు, వాగీశ్వరుడవు, పుస్తకధరుడవు, తపస్వులకు ప్రభువైన శ్రీరాముడు అను ‘రామపరబ్రహ్మము’లో మా బాహ్య, అంతః ప్రవృత్తులు లీనమగు ‘బ్రహ్మజ్ఞానము’ నీ వలన మాకు కలుగు గాక!!!

ఈ విధముగా స్వామివారి విరాడ్విశ్వరూపమును దర్శించిన పిదప, ఈ ఐదు అవతారముల గురించి వాల్మీకి రామాయణములో కవి వాల్మీకి సూటిగా ఎక్కడా ఉటంకించకుండా, స్వామివారి అవతార లీలల్లో నర్మగర్భంగా ప్రస్తావించటము గమనార్హము...
 • 🟔 పుట్టినది వానరరూపము
 • 🟔 రాక్షసుల సంహారములో నరసింహుడు
 • 🟔 వేగములో గరుత్మంతుడు
శోకసముద్రములో మునిగిన భూపుత్రిక అయిన సీతమ్మను ఉద్ధరించిన వరాహమూర్తి వేద, జ్యోతిష, సాముద్రిక, సాహితీ శాస్త్రవిద్యలలో హయగ్రీవుడు తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులకు చూసే స్వామి వానర, నారసింహ, గరుడ, వరాహ వదనములు త్రిగుణములతో సర్వవ్యాపిత మయము అయిన ‘సగుణతత్త్వము’నకు సంకేతమైతే, శూన్యముగా ఆకాశ దిక్కు వైపు చూసే ఊర్థ్వ హయగ్రీవవదనము ‘నిర్గుణతత్త్వము’నకు సంకేతము...

పంచభూతములతో, పంచవదనములతో, పంచతత్వాలతో, పంచతన్మాత్రలతో సృష్టి నడుపు పరమేశ్వరుడి పంచవదనములు, రుద్రాంశ సంభూతుడైన హనుమంతుని వదనములతో క్రింది విధముగా శాస్త్రములు సంధానించినాయి:
 • 1. వానరవదనము - సద్యోజాత
 • 2. నరసింహవదనము - వామదేవ
 • 3. గరుడవదనము - అఘోర
 • 4. వరాహవదనము - తత్పురుష
 • 5. హయగ్రీవవదనము - ఈశాన
కపివదనాయ, నరసింహాయ, వీరగరుడాయ, ఆదివరాహాయ, హయగ్రీవాయ... ఆంజనేయాయ నమో నమః!!! జై హనుమాన్!!!

శ్రీ రామ దూతం శిరసా నమామి.!

సంకలనం: భానుమతి అక్కిశెట్టి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top