మహా ఋషి "శుకుడు" - Rishi Shakunudu

మహా ఋషి "శుకుడు" - Rishi Shakunudu
రమ పావనమైన బ్రహ్మర్షులలో శుకుడు అగ్రగణ్యుడు వేదవ్యాసమునీంద్రుని తపఫలమైన శుకుడు యోగీశ్వరుడు, తత్త్వజ్ఞుడు అవధూతమూర్తి, శుకుని పోలిన వారు ముల్లోకాలలోనూ మరి ఒకరు లేరు.

పూర్వం వేదవ్యాసుడు మేరుపర్వతం యొక్క అగ్రభాగాన గల కర్ణికారం' అనే వనంలో శివుని గురించి ఘోరతపస్సు చేయగా శివుడు సతీ సమేతుడై ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వ్యాసుడు ఆయనను పంచభూతాలతో సమానమైన శక్తి కలవాడు పుత్రునిగా కావాలని వరాన్ని పొందాడు. ఆయన కోరుకున్నట్లుగానే, 'ఘృతాచి' అనే చిలుక రూపంలో ఉన్న అప్పరస కారణంగా వ్యాసుడు కోరుకున్న విధంగానే శుకుడు జన్మించాడు.

శుకుడు జన్మించగానే, ఆకాశగంగ సాకార రూపంలో వచ్చి మంగళస్నానం చేయించింది. దివ్యదుందుభులు మ్రోగాయి. దేవతలు గానం చేస్తుండగా, పుష్ప వర్షం కురవసాగింది ఆకాశం నుండి కృష్ణాజినం, దండం వచ్చాయి. జంతువులు, పక్షులు. సకలం అక్కడికి చేరి శుకునికి జన్మదినోత్సవం చేసినట్లుగా భారతంలోని శాంతి పర్వంలోనూ, దేవీ భాగవతంలోను తెలుపబడింది.

శుకుడు జననం గురించి ఇంకొక కథనం ఉంది. జన్మతః శుకుడు పరమహంస కోవకు చెందినాడు. తాను భూమ్మీద జన్మించడానికి ఇష్టంలేక పదిహేను సంవత్సరాలు నిరీక్షించాడు. శుకుడి తండ్రి వ్యాసుడు మహామాయ జగజ్జనని పుత్రునికై ప్రార్థించాడు. మహామాయ శుకుడిని మాయచే ఒక నిమిషంపాటు కప్పి ఉంచిన కారణాన శుకుడు జన్మించాడు. పుట్టుకతోనే పదహారు సంవత్సరాలు బాలుడిగా జన్మించాడు.

దిగంబరునిగా జ్ఞానంలో వెలుగుతూ ప్రారంభించాడు. శుకుడు వెంట తండ్రి వ్యాసుడు 'కుమారా! కుమారా!' అంటూ పరుగెత్తనారంభించాడు. తండ్రి ఏడుపుకు సమాధానంగా బ్రహ్మైక్యస్థితిలో ఉన్న శుకుడు ఓంకారనాదం వినిపించాడని చెబుతారు.

తండ్రి వలె శుకునకు జన్మించగానే వేదాలు వచ్చేశాయి. అయితే తండ్రి అనుమతితో బృహస్పతి వద్ద ధర్మశాస్త్రాది సకల విద్యలను అభ్యసించాడు. ఆపై తండ్రి వద్దకు వచ్చి సాంఖ్య, యోగ శాస్త్రాలు అభ్యసించాడు. అటు పిమ్మట మోక్ష మార్గం తెలుసుకోమని జనక మహారాజు వద్దకు పంపాడు వ్యాసుడు, అయితే నడిచి వెళ్ళమని ఆదేశించాడు. తండ్రి ఆజ్ఞ మేరకు పాదగమనుడై మేరువు మున్నగు పర్వతాలు, అనేక నదులు, తీర్థాలు దాటుతూ మిథిలానగరానికి వచ్చి జనకుని మోక్ష మార్గాన్ని తెలుపమని కోరాడు. అంతట జనకుడు జ్ఞాన విజ్ఞానాలు నీ గుణాలు నీవు మోక్ష బోధుడవే. అయితే మనస్సులో సంశయం, భయం, చపలత అను మూడు ఆశ్రయములుగా ఉండటంచే నీ నిజతత్త్వం ఎరుగకున్నావు, నీవు ముక్త పురుషుడివే బోధించాడు.

శుకుడు సంశయరాహిత్యాన్ని పొంది ఆత్మావలోకనం కలిగి, వాయువేగంతో తండ్రి వద్దకు ఆనందంగా తిరిగి వచ్చాడు. ఆ తరువాత కాలావయవ నిరూపణం, చతుర్భుగి సంవత్సర పరిమితి, చతుర్యుగ ధర్మాలు, దాన గుణ ప్రాశస్త్యం మొదలైనవి తండ్రి వద్ద నేర్చుకున్నాడు.

    శుకునికి దేహధ్యాస ఉండేది కాదు. అన్ని ఆశ్రమాలకు అతీతంగా అవధూత వలె ఉండే ఆయన ఎక్కడా ఆవు పాలు పితికేంత సమయం కూడా నిలవక, బ్రహ్మలీనుడై నిరంతరం సాగిపోతూ ఉండేవాడు.  అర్జునుని మనవడైన పరిక్షిత్తు, తక్షక విషాగ్నిచే ఏడురోజులలో మరణం రానున్నదని తెలుసుకున్నాడు. అన్నిటిని పరిత్యజించి, తీవ్ర మోక్షేచ్ఛతో ఉండగా, అతని భాగ్యవశాన శుకుడు అక్కడకు వచ్చి, భక్తి మూలంగా మోక్షం పొందే మార్గాన్ని తను తండ్రిద్వారా తెలుసుకున్న భాగవతాన్ని బోధించాడు. దానిచే పరిక్షిత్తుకు బ్రహ్మపదాన్ని పొందే భాగ్యాన్ని కలిగించాడు. ఆ పరిక్షిత్తు రూపేణా, మనకు అపురూప భాగవత గ్రంథం లభ్యమయింది.

నారద మహర్షి, సనక సనందాదుల వద్ద తాను అభ్యసించిన భక్తి, ధ్యాన, వైరాగ్యాలను శుకునికి తెలిపాడు. భక్తి యోగ మార్గంలో తీవ్ర తపస్సులో మునిగి, తన సాధనా ఫలితంగా పంచభూతాలతో ఐక్యతనొంది, ప్రకృతి లీనుడై సూర్యమండలాంతవర్తి అగుటకు యోగమార్గాన శుకుడు వెళుతుంటే, పుత్రుని మీద మమకారంతో వ్యాసుడు వెంబడించ సాగాడు. ఆ సమయాన ఆకాశగంగలో జలక్రీడలలో మునిగి ఉన్న అప్పరస స్త్రీలు, శుకుని గమనించినా చలించలేదు కాని, వెనుక వస్తున్న వ్యాసుని చూసి తత్తరపాటు చెందారు.  ఆశ్చర్యపడిన వ్యాసుడు కారణం తెలుసుకోగా, 'నీ కుమారుడు స్త్రీ పురుష, బేధాలకు అతీతంగా ఉన్న స్థితిలో ఉన్నాడు. అందువలన దేహభావన లేని అతనిని చూసినా మాలో తేడా రాలేదు. కానీ మీకు దేహభ్రాంతి ఉన్న కారణంచే మిమ్ముచూడగానే మాలో కలవరం కలిగింది' అని వారు తెలిపారు. అంతట వ్యాసుడు లజ్ఞావదనుడై నిలిచాడు.

పుత్రవ్యామోహం వదలని వ్యాసుని చూసి గంగాధరుడు అక్కడ ప్రత్యక్షమై, పంచభూతాత్మక సమశక్తి కలిగిన కుమారుడు కావాలని నీవు అడిగావు; అతడు నీ తపోవిశేషంచే, నా ప్రభావంచే బ్రహ్మతేజోమయుడై దేవతలకు కూడా సాధ్యపడని పరమగతిని ప్రాప్తం చేసుకున్నాడు, కనుక మమకారాన్ని వదిలి పెట్టవలసినదని' బోధించగా, అంతట పుత్రభ్రాంతిని సంపూర్తిగా విడనాడి పుత్రుని మహోన్నతికి ఆనందిస్తూ తన ఆశ్రమానికి వెళ్ళాడు వ్యాసుడు.

.   ఈ విధంగా శుకమహర్షి యోగమార్గావలంబియై, పరబ్రహ్మ స్వరూపుడై, భవ్య విఖ్యాతిని పొందాడు. ఆ మహనీయుని పవిత్ర స్మరణ మాత్రంచే ఇహపర సాధకాలు సమకూరి, బ్రహ్మానందం చేకూరుతాయనడంలో సందేహం లేదు

సంకలనం, రచన: అపర్ణా శ్రీనివాస్
సమర్పణ: రామకృష్ణ మఠం
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top