వేదాంతిగా మారిన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త - ఇర్విన్ ష్రోడింగర్ - Vedic influence on Erwin Schrödinger

వేదాంతిగా మారిన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త - ఇర్విన్ ష్రోడింగర్ - Vedic influence on Erwin Schrödinger
 వేదాంతిగా మారిన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త - ష్రోడింగర్
ఎర్విన్ ష్రోడింగర్ ఆస్ట్రియాకు చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త. ఇతడు క్వాంటం తరంగ సిద్ధాంతాన్ని వివరించే క్వాంటం తరంగ సమీకరణాన్ని కనుగొన్నాడు. దీనినే “ష్రోడింగర్ సమీకరణం” అంటారు. ప్రతీ క్వాంటం వ్యవస్థ ఈ సమీకరణాన్ని పాటించాల్సిందే. క్వాంటం ఫిజిక్స్ లోని వేవ్ మెకానిక్స్ పై పరిశోధనలకు గాను ష్రోడింగర్ కు 1933 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఇతడు “క్వాంటం భౌతిక శాస్త్ర పిత” గా పేరుపొందాడు.
  • ۞ క్వాంటం సిద్ధాంతం అనేది భౌతిక శాస్త్రంలో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ. ఈ సిద్ధాంతంలోని అంశాల ఆధారం లేకుంటే నేడు సైన్స్ ఇంతగా పురోగమించేది కాదు.
  • ۞ సత్యాన్వేషణలో భాగంగా తాను చేసిన పరిశోధనల పర్యవసానంగా ష్రోడింగర్ ఒక హిందూ వేదాంతిగా మారాడు. అతడు తను పడుకొనే మంచం ప్రక్కనే హిందూ మత గ్రంథాలను ఉంచుకునేవాడు. అతనికి ఎంతో ఇష్టమైన గ్రంథాలు ఉపనిషత్తులు మరియు భగవద్గీత.
  • ۞ ష్రోడింగెర్ చాలా చిత్రమైన మనిషి. అతడు తన పెంపుడు కుక్క కు ‘ఆత్మ’ అని పేరు పెట్టాడు. బహుశా సర్వజీవుల్లోనూ ఉన్న ఆత్మ యొక్క ఏకత్వానికి గుర్తుగా అతడు అలా పేరు పెట్టి ఉండవచ్చు.
ష్రోడింగర్ తన క్వాంటం సిద్ధాంతాన్ని కనుగొనక ముందే 1925 లో ఇలా వ్రాసాడు :
“ మీరు జీవిస్తున్న ఈ జీవితం ఈ మొత్తం అస్థిత్వంలో కేవలం ఒక భాగం మాత్రమే కాదు. ఒక విధంగా చెప్పాలంటే అస్థిత్వమంతా అదే. ఇది ఎలా కూర్చబడి ఉందంటే అది ఒక్కసారి చూడగానే అర్థమయ్యేలా  ఉండదు. ఇదే విషయం బ్రాహ్మణులు చెప్పే పవిత్రమైన, భావగర్భితమైన మంత్రాలలో ఉంది. అదే “తత్వమసి” - అదే నువ్వు అయి వున్నావు. దీనినే వేరే మాటల్లో చెప్పాలంటే నేను తూర్పున, పడమరన ఉన్నాను. నేను పైనా, క్రిందా ఉన్నాను. నేను ఈ అనంత విశ్వాన్ని.”

ఈ భావనను ష్రోడింగర్ ముండకోపనిషత్తు 2.2.11 నుండి గ్రహించాడు.
“ బ్రహ్మైవేదమమృతం పురస్తాద్బ్రహ్మ పశ్చద్బ్రహ్మ దక్షిణతశ్ఛోతరేణ
అధశ్చోర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠం.”

ష్రోడింగర్ కు గల ఈ వేదాంత భావన తన క్వాంటం సిద్ధాంత పరిశోధనలపై ప్రభావం చూపింది.

ష్రోడింగర్ 1944 లొ వ్రాసిన “ వాట్ ఈజ్ లైఫ్? “ అనే గ్రంథంలో వేదాంత భావాలను పొందుపరిచాడు.  జేమ్స్ వాట్సన్ తో కలిసి డి.ఎన్.ఏ. నిర్మాణాన్ని కనుగొన్న ఫ్రాన్సిస్ క్రిక్ తన ఆవిష్కరణకు ఈ గ్రంథంలోని భావాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పాడు.
ష్రోడింగర్ జీవిత చరిత్రను వ్రాసిన వాల్టర్ మూర్ అందులో ఇలా అంటారు :
“ వేదాంతంలో ఉండే ఏకత్వం, అఖండత లాంటివే తరంగ భౌతిక శాస్త్రంలోనూ ఉన్నాయి. 1925 నాటికి ఉన్న భౌతిక శాస్త్ర భావన ప్రకారం విశ్వం అంటే విడివిడిగా ఉండే, అన్యోన్య క్రియలు జరిపే పదార్థ కణాలు గల ఒక పెద్ద యంత్రం లాంటిది. కానీ తర్వాత కొద్ది సంవత్సరాలలోనే ష్రోడింగర్, హైసెన్ బర్గ్ వంటి శాస్త్రవేత్తలు అధ్యారోహితమైన, అభిన్నములైన, కంపన పరిమితి గల సంభావ్యతా తరంగాల ఆధారంగా గల విశ్వం యొక్క భావనను పొందుపరిచారు.  ఈ భావన అన్నిటిలోనూ ఉన్నది ఒక్కటే అనే వేదాంత భావనతో సరిపోలుతోంది.”
ష్రోడింగర్ చైతన్యాన్ని ఏకత్వం కలది గా భావించాడు. అనేకమైన ఆత్మలున్నాయని చెప్పే చైతన్యం యొక్క బహుత్వవాదాన్ని ష్రోడింగర్ ఒప్పుకోలేదు.ఈ ప్రపంచం నానాత్వంతో కనబడడానికి కారణం మాయ మాత్రమేనని భావించాడు. బ్రహ్మము యొక్క మాయ చేత ఈ ప్రపంచం ఇలా కనిపిస్తోందని ఆది శంకరులు చెప్పిన అద్వైత భావాన్ని ష్రోడింగర్ సమర్ధించాడు.

తాత్విక వాదనల ద్వారా చైతన్యం యొక్క ఏకత్వాన్ని నిర్ధారించలేమని, సాదృశ్యాన్ని బోధిస్తున్న ప్రకృతితో ఏకత్వాన్ని పొందడం ద్వారా అనుభవ జ్ఞానాన్ని పొందాల్సిందేనని ష్రోడింగర్ అభిప్రాయ పడ్డాడు.

తను వ్రాసిన ఒక వ్యాసంలో ఆయన ఇలా అన్నాడు :
“అంతర్దృష్టి లేక లోచూపు అన్నది కొత్తదేమీ కాదు. భారతీయ తత్వచింతనలో ఎంతో గొప్పవైన ఉపనిషత్తుల కాలం నుండే ఆత్మ, పరమాత్మల ఏకత్వభావన ఉంది. ప్రాపంచిక విషయాలపై లోతైన అంతర్దృష్టిని ఇది సూచిస్తోంది.”

“చైతన్యం ఒక్కటేనని భారతీయ వేదాంతం చెబుతుంది. అన్ని సంఘటనలు, జనన మరణాలు ఒకే విశ్వ చైతన్యంలో సంభవిస్తాయి. చైతన్యం బహువిధమని భావించిన  పాశ్చాత్య భావాల సంఘర్షణకు స్వస్తి పలకడానికి అందుబాటులో ఉన్న ఏకైక ప్రాచీన జ్ఞాననిధి ఉపనిషత్తులు.”

   పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రానికి ఉన్న ఆధ్యాత్మిక రక్తహీనత నుండి కాపాడదానికి తూర్పు నుండి పడమర దేశాలకు రక్త మార్పిడి జరగాలని ష్రోడింగర్ అభిప్రాయపడ్డాడు.
క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్, ప్రోటాన్ లాంటి ఉపపరమాణు కణాలు ఒక కొలత ప్రకారం కణం గానూ, మరొక కొలత ప్రకారం తరంగం గానూ ప్రవర్తిస్తాయి.
మానవ తర్కం ప్రకారం ఒక అంశం అటు తరంగం గానూ, ఇటు కణం గానూ ప్రవర్తించడానికి వీలు లేదు. తరంగానికి వ్యాప్తి ఉంటుంది. కానీ కణానికి వుండదు. కణానికి పరిమితము, నిర్ణీతము అయిన స్థానం ఉంటుంది. ఒకే అంశం అటు తరంగం గానూ, ఇటు కణం గానూ ప్రవర్తించడం అనేది ఒక వైరుధ్యం (పారడాక్స్).

ఈ వైరుధ్యానికి సరైన వివరణ ఇవ్వడానికి కొందరు శాస్త్రవేత్తలు కోపెన్ హాగెన్ లో సమావేశమయ్యారు. వీరి వివరణ ప్రకారం మనం కొలతలు వేసే పరికరాలు, ప్రయోగాలు భిన్నంగా ఉండడం వల్లే ఉపపరమాణు అంశాలు అటు కణాలు గాను, ఇటు తరంగం గానూ కనిపిస్తున్నాయి. అంటే ఒక పరిశీలకుడు పరిశీలన చేసే వరకు ఒక రేణువు ఒకే సమయంలో అనేక స్థితులలో ఉంటుంది.  అంటే పరమాణు స్థాయిలోని అంశాల ధర్మాలన్నీ వాటికి పరిశీలకునిపై గల  ప్రభావాలే.

క్వాంటం ఫిజిక్స్ పై కోపెన్ హాగెన్ వివరణ ప్రకారం గణితాత్మకంగా ఒక రేణువు ఒకే సమయంలో రెండు స్థితులలో (కణంగాను, తరంగం గాను) ఉంటుంది. ష్రోడింగర్ దీనిని నిజం కాదని నిరూపించాలనుకున్నాడు. దీని కోసం ఒక ఊహాత్మకమైన ప్రయోగం చేసాడు. దీనినే “ ష్రోడింగర్స్ క్యాట్ ప్రయోగం ” అంటారు.
     ఈ ప్రయోగంలో ష్రోడింగర్ ఒక పిల్లిని ఒక సీల్ చేసిన స్టీల్ బాక్స్ లో పెట్టి అందులో రేడియో ధార్మిక పదార్ధాన్ని, ఒక విషం బాటిల్ ని పెట్టాడు.  ఈ రేడియో ధార్మిక పదార్థం లో కనీసం ఒక్క అణువు క్షయం అయినా విషం బాటిల్ పగిలి విషం బయటకు వచ్చేలా ఒక సుత్తిని ఏర్పాటు చేశాడు.

పెట్టెను సీల్ చేసిన తర్వాత పెట్టేలోని రేడియోధార్మిక పదార్థం క్షయం కావడం మొదలు పెట్టగానే ‘గ్రెగర్ కౌంటర్’ అనే పరికరం దాన్ని గుర్తించి సుత్తిని విడుదల చేయడంతో అది ఆ విషం బాటిల్ ను పగలగొడుతుంది. దాంతో ఆ బాటిల్ నుండి విషం బయటకు వచ్చి పిల్లిని చంపుతుంది. అయితే ఆ బాక్స్ ని తెరిచి చూసేదాకా లోపల ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఒక గంట తర్వాత ఆ పెట్టె ను తెరిస్తే ఆ పిల్లి బ్రతికి వుండే అవకాశం 50%, చనిపోయి వుండే అవకాశం 50% వుంటుంది.
క్వాంటం ఫిజిక్స్ మీద కోపెన్ హేగన్ లో సమావేశమైన శాస్త్రవేత్తల వివరణ ప్రకారం ఒక పరిశీలకుడు పరిశీలన చేసే వరకు ఒక రేణువు ఒకే సమయంలో అనేక స్థితులలో ఉంటుంది. అంటే ఆ బాక్స్ తెరిచి చూసేలోపల ఆ పిల్లి ఒకే సమయంలో చనిపోయి ఉండాలి మరియు బ్రతికి ఉండాలి. కానీ అది అసాధ్యం. ఏ ప్రాణీ ఒకే సమయంలో చనిపోయి మరియు బ్రతికి ఉండదు. బాక్స్ తెరిచాక పిల్లి బ్రతికే వుంది. ఈ విధంగా కోపెన్ హేగెన్ వివరణ లోని లోపాన్ని ష్రోడింగర్ ఎత్తి చూపాడు.

అంటే పిల్లి రెండు స్థితులలో ఉండడం అసాధ్యం. కాబట్టి కోపెన్ హాగెన్ వివరణ నిజం కాదని నిరూపితమైంది. మరి పరమాణు స్థాయిలో ఈ వైరుధ్యానికి కారణమేంటి? దీనికి సరైన సమాధానం ఏమిటో శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు.

సూక్ష్మ స్థాయిలో యదార్థ స్థితి ఎలా ఉంటుందో క్వాంటం సిద్ధాంతం వివరించిన దానికీ, మన పరిశీలనలో మనం కనుగొన్న యదార్థానికి మధ్య వైరుధ్యం ఉంటోంది. ఇలాంటి వైరుధ్యాల వల్ల  పదార్ధం యొక్క క్వాంటం స్థితిలో దాగి ఉన్న రహస్యాలు ఇప్పటికీ సైన్స్ కి అర్థం కాలేదు.

క్వాంటం సిద్ధాంతం మానవ తర్కానికి అందేలా ఉండదు. ఈ సిద్ధాంతం ప్రకారం వాస్తవికత లేదా యదార్థ తత్వం అనేది అన్ని రకాల సంభావ్యతల అధిస్థాపనం లేదా కూర్పు. వేదాంత భావన కూడా ఇదే. పదార్థం యొక్క యదార్థ స్థితిని మనం రోజువారీ మాట్లాడుకునే భాషలో చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన ప్రాచీన ఋషులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

క్వాంటం స్థాయిలోనే “చైతన్యం” లేక “ఎరుక” అనేదానికి ఆధారం ఉండొచ్చని ఇటీవల కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇదే గనుక పూర్తిగా నిర్ధారణ అయితే అదే ‘దేవుడు’ లేక ‘బ్రహ్మము’ అని చెప్పాల్సి వుంటుంది. అందుకేనేమో పదార్థ రహస్యం సైన్స్ కి అంతు పట్టకుండా ఉంది.

అందుకే "మనం చూసేదంతా మాయ" అనే అద్వైత సిద్ధాంతాన్ని ష్రోడింగర్ ఈ ప్రయోగం ద్వారా తెలియజేసినట్లయింది.. ఈ విషయంలో ష్రోడింగర్ ఆలోచనలు, ఆ రూపంలో భారతీయ వేదాంత భావనలు సైన్స్ ను ఎప్పటికీ ప్రబావితం చేస్తూనే ఉంటాయి.

కానీ ష్రోడింగర్ వంటి శాస్త్రవేత్తల పరిశోధనలపై భారతీయ వేదాంతం ప్రభావం చూపించిన విషయం భారతీయ పాఠ్య పుస్తకాలలో ఎక్కడా కనబడదు. ఇది భారతీయ విద్యా విధానం లోని లోపమని చెప్పక తప్పదు.

రచన: మణి కుమార్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top