యోగ సాధనలో ఎదురయ్యే సమస్యలు - Yoga Sadhana

యోగ సాధనలో ఎదురయ్యే సమస్యలు - Yoga Sadhana
తంజలి ఒక శాస్త్రవేత్త. అతి తక్కువ పదాలలో ఎన్నో అద్భుత విషయాలను చెప్పారు. యోగ సాధనలో ఎదురయ్యే తొమ్మిది అడ్డంకులు, వాటి వలన కలిగే పరిణామాలను వివరించారు. మరి వాటిని తొలగించుకోవడానికి ఏం చేయాలి..?

ఏకతత్వ అభ్యాసః తత్ప్రతిషేధార్థమ్‌ ఏకతత్వ అభ్యాసః 
పతంజలి యోగసూత్ర 32..

ఒక పనిని ఎంచుకుని దానినే సాధన చేస్తూ పోవాలి. అదొక్కటే మార్గం. మన మనసు ద్వైతంపై ఆధారపడటం (ఒకటిగా ఉన్న సత్యాన్ని అనేకంగా చూడటం) వలన కష్టాలు పడుతుంది. ఎక్కడైతే అనేక అవకాశాలు ఉంటాయో.. అక్కడ గందరగోళం కూడా ఉంటుంది. అందుకే ఒకే సూత్రానికి కట్టుబడి సాధన చేయాలి. ఆ సూత్రం దైవం కావొచ్చు, ఏదైనా పదార్థం కావొచ్చు, గురువు కావొచ్చు లేదా నీకు నీవే కావొచ్చు. ఏదైనాసరే ఒకే విషయంపై సాధన చేసినపుడు తొమ్మిది అడ్డంకులూ తొలిగిపోతాయి. అయితే ఈ విధంగా సాధన చేయడం అనేది నీలో కొంత ప్రశాంతత, సూక్ష్మబుద్ధి ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.

ఏకతత్వ అభ్యాసం చేస్తున్నప్పుడు బుద్ధిలో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరిలోనూ ఏకత్వాన్ని గమనిస్తావు. నీవు లేదా నీ గురువు అంతటా (అందరిలోనూ) ఉన్నట్టు భావిస్తావు. నిజానికి అంతటా ఉన్నది నీవే. నీవు తప్ప వేరే ఎవరూ లేరు. ఏకతత్వ అభ్యాసం అంటే అదే. ఒకే విషయాన్ని స్థిరంగా పట్టుకోవడం, ఆ విషయాన్నే సమస్త విశ్వంలోనూ చూడటం. అయితే ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకటిగా కనబడరు. కాని మనం ఒకే స్థితిని అందరిలోనూ చూడటం ఎలా సాధ్యం..?

మైత్రి కరుణా ముదితో ఉపేక్షాణం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయానాం భావనాతః చిత్త ప్రసాదనమ్‌ పతంజలి.. 
యోగసూత్ర 33.

ఈ ప్రపంచంలో నాలుగు రకాలైన వ్యక్తులు ఉంటారు. ఆనందంగా ఉండేవారు, దుఃఖంలో ఉండేవారు, మంచిపనులు చేసేవారు, చెడుపనులు చేసేవారు. అందరినీ ఒకేలా చూడటం ఎలా..? పతంజలి ఇలా వివరిస్తారు.
  • మైత్రి: ఆనందంగా ఉండేవారితో స్నేహం చేయండి. వారితో స్నేహం చేయనపుడు వారు నీకంటే ఆనందంగా ఉన్నారని అసూయ కలుగుతుంది. వారితో స్నేహం చేస్తే వారు నీవారే అన్న భావన కలిగి వారు ఆనందంగా ఉన్నా నీకు అసూయ కలగదు.
  • కరుణ: బాధపడుతున్న వారిపట్ల కరుణ చూపాలి. అయితే వారితో స్నేహం కూడదు. స్నేహం చేస్తే అది నిన్ను కూడా విషాదంలోకి లాగుతుంది. వారికి దయతో సాయం చేయాలి. అంతేకాని సానుభూతి ప్రదర్శించకూడదు. సానుభూతి వల్ల వారు తమ బాధ సరైనదే అన్న భావనలో పడిపోతారు. తమకేదో అన్యాయం జరిగి జరిగిందనుకుని, ఆత్మనూన్యతో బాధపడుతున్నవారికి సానుభూతి సహాయం చేయదు. అలాంటి వారికి చేతనైన సాయం చేయాలే తప్ప స్నేహ హస్తం అందించడం సరికాదు.
  • ఆనందం (ముదితః): ఎవరైతే మంచిపనులు చేస్తున్నారో, ఎవరైతే యోగ్యత కలవారో, ఎవరికి భగవదనుగ్రహం ఉంటుందో అటువంటి వారి స్థితిని చూసి ఆనందించండి. వారితో కలిసి ముందుకు సాగండి. వారి మంచిపనులలో మీరు భాగస్వాములైనందుకు సంతోషించండి. అప్పుడు పోటీతత్వం పోయి అసూయ తగ్గిపోతుంది. మంచిపనులు చేస్తున్నవారిని విమర్శించడం మాని వారితో కలిసి మంచి చేయండి. ముదిత అంటే అర్థం అది. ఆనందాన్ని పంచుకోండి, ఆనందంగా ఉండండి.
  • ఉపేక్ష: చెడ్డపనులు (పాపాలు) చేసేవారిపట్ల ఉదాసీనంగా ఉండండి. ఎవరైనా మీతో అసత్యం చెబితే దాన్ని మనసులోనే తుంచేయండి. దాని గురించి ఆలోచించడం వ్యర్థం. సాధారణంగా మనం దీనికి వ్యతిరేకంగా చేస్తుంటాం. చెడ్డపనులు తారసపడితే మీకు తోచిన నాలుగు మంచి మాటలు చెప్పి వదిలేయండి. అంతేకాని అదేపనిగా ఆ వ్యక్తుల గురించి, వారు చేస్తున్న పనుల గురించి ఆలోచిస్తే.. అవి మిమ్మల్ని చుట్టుకుని ఉండిపోతాయి. కొన్నాళ్లకు మీరూ వారిలాగానే లేదా ఇంకా ఘోరంగా తయారవుతారు.
మనుషుల మనసు కోతివంటిదని పతంజలి మహర్షికి బాగా తెలుసు. ఒకే విధమైన భావం ఎల్లవేళలా ఉండదని, మారిపోతూ ఉంటుందని గ్రహించి, మనకు స్నేహం, కరుణ, ఆనందం మొదలైన భావాలను కలిగి ఉండమని, చెడ్డవారిపట్ల ఉపేక్షాభావం వహించమని చెప్పారు. అలా ఉన్నప్పుడు మన బుద్ధి ప్రశాంతంగా మారుతుంది (చిత్త ప్రసాదనమ్‌). అప్పుడు ఏకతత్వ సాధన సులభంగా సాగుతుంది. ఇది కూడా కష్టమనిపించినపుడు పతంజలి మరో మార్గాన్ని సూచించారు.. అదేమిటో వచ్చేవారం తెలుసుకుందాం.

రచన/సంకలనం:   శ్రీశ్రీశ్రీ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top