లోకానికి నిజమైన బంధువు - Lokaniki Nijamaina Bhanduvu


లోకానికి నిజమైన బంధువు ఎవరు?’ అంటే ‘సూర్యుడు’ అని నిష్కర్షగా చెప్పాలి. ఆయనకు ‘లోక బాంధవుడు’ అని పేరు. బంధువు ఎలా ఉండాలో లోకానికి తెలియజేసే ఉజ్జ్వల గుణధాముడు దినకరుడు. ఆయన అనుగ్రహం లేనిదే ఈ భూమండలంపై మానవుడే గాక, ఏ ప్రాణీ బతికి బట్టకట్టలేదు. సూర్యుడు జగత్తుకే ఆత్మ అని వేదం వర్ణించింది.

సూర్యుడు ఉదయిస్తేనే దినచర్య ప్రారంభమవుతుంది. అస్తమిస్తే, ప్రాణికోటి విశ్రాంతిలోకి జారుకొంటుంది. సూర్యుడి సాక్షిగా ధార్మిక క్రియలు చేయాలని ధర్మశాస్త్రాలు ప్రబోధిస్తున్నాయి. అందుకే అందరూ పగటివేళలోనే అభ్యుదయ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

కవులు సూర్యుణ్ని అనేక విధాలుగా కీర్తించారు. చీకటిలో వెలిగించిన చిరుదీపమైనా ఎంతో కాంతిమంతంగా కనిపిస్తుంది. ఆ దీపం వెలుగుతున్నప్పుడు చంద్రుడు ఉదయిస్తే, దీపం చిన్నబోయి చంద్రుడి వెలుగే గొప్పదవుతుంది. సూర్యుడు ఉదయిస్తే- చంద్రుడు, దీపమూ వెలవెలపోతాయి. అదీ సూర్యుడి గొప్పదనం!
సూర్య భగవానుడు
సూర్య భగవానుడు 
చీకట్లు రాక్షసుల వంటివి. వాటికి సూర్యుడు శత్రువు. ధర్మానికి ప్రతీక సూర్యుడైతే, పాపాలకు ప్రతీకలు చీకట్లు. ఆ పాపాలను తరిమికొట్టే ధర్మదీపమే సూర్యుడు! ఆయన గమనం అప్రతిహతం. అంటే, తిరుగులేనిది. సూర్యరథానికి పురోగమనమే తప్ప తిరోగమనం లేదు. పొద్దంతా ప్రయాణించినా అలుపులేని పురోగామి సూర్యుడు. ఆ రథానికి ఒకటే చక్రం. సారథి అనూరుడు. అంటే, వూరువులు (తొడలు) లేనివాడు. ఒకే చక్రంతో రథగమనం సాధ్యమా, తొడలే లేనివాడు సారథిగా ఉండి రథాన్ని నడపగలడా... ఇవన్నీ సందేహాలే. అయినా సూర్యుడు దృఢ సంకల్పుడు. ఆయన నిర్విరామంగా ప్రయాణించడాన్ని ఇష్టపడతాడు. తాను ఎంతదూరం ప్రయాణిస్తాడో, అంత దూరమూ చీకట్లను తరిమికొట్టడమే ఆయన లక్ష్యం!

ప్రతి నిత్యం సూర్యుడు తమను తరిమికొడుతుంటే, చీకట్లకు ఆశ్రయం లేకుండా పోయింది. ఎక్కడ తలదాచుకోవాలా అని సంశయించి, అవి చివరికి హిమాలయ పర్వత గుహల్లో తలదాచుకొన్నాయని కాళిదాస మహాకవి ‘కుమార సంభవం’ కావ్యంలో వర్ణించాడు. ఆ హిమాలయ పర్వత గుహలు ఎంత దట్టమైనవంటే, ఎన్ని ఏళ్లు గడచినా ఆ గుహల్లోకి సూర్యకాంతి చొరబడలేదట! అలాంటి గుహల్లో తప్ప చీకటి రక్కసులకు మరెక్కడా ఆశ్రయం దొరకలేదని కవి వర్ణించిన తీరు సూర్య ప్రతాపానికి అద్దం పడుతుంది.

సూర్యుడు లేనిదే భూమి లేదు. నీరు రాదు. గాలి ఉండదు. పంటలు పండవు. ధాన్యాలుండవు. పచ్చదనాలు నిలవవు. వెచ్చదనాలు కలగవు. అంతా శీతలాంధకారమయమవుతుంది. నిశ్శబ్ద ప్రపంచం రాజ్యమేలుతుంది. అలాంటి దుస్థితిని తలచుకుంటేనే భయం కలుగుతుంది.

లోకానికి సూర్యుడు చేస్తున్న మేలు ఎంతటిదో వూహించవచ్చు. ఆయన సృష్టించే సంధ్యాకాలాల రమణీయతను ఎన్ని విధాల వర్ణించినా తనివి తీరదు. లేత బంగారు కిరణాలు తొంగిచూసే తొలి సంజలోని సొగసుకు, మన హృదయం దాసోహమంటుంది. ప్రాతఃకాలంలోని సూర్యకిరణాలు లోకాన్ని రక్షిస్తాయని, మధ్యాహ్న కాలంలోని కిరణాలు నవ్యతను సృష్టిస్తాయని, సాయంకాల సూర్యకిరణాలు అమృతాన్ని ప్రవహింపజేస్తాయని వేద వాంగ్మయం చెబుతోంది. అందుకే ఈ త్రిసంధ్యల్లోని సూర్యతేజోరాశికి గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే పేర్లు సార్థకాలై ప్రపంచానికి ఆరాధ్యాలుగా మారాయి.

సూర్యోపాసన ఆరోగ్యదాయకమని సకల శాస్త్రాలూ ఘోషిస్తున్నాయి. ‘ఆరోగ్యం కావాలంటే సూర్యుడి నుంచి పొందాలి’ అనేది బహుళ ప్రచారంలో ఉంది. సూర్య నమస్కారాల వల్ల శారీరక, మానసిక స్వస్థత చేకూరుతుందని అందరికీ తెలిసిందే. వాల్మీకి రామాయణంలో రాముడు ఉపాసించిన ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే- ఆయురారోగ్య భాగ్యాలు కలగడమే గాక, శత్రుగణాలపై విజయం లభిస్తుందనీ ఆస్తికులు విశ్వసిస్తారు.

రచన: డా.‌ అయాచితం నటేశ్వరశర్మ గారి వ్యాసం

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top