బహురూప వినాయకుడి విశిష్టత - Bahurūpa vināyakuḍi viśiṣṭata

శ్రీ విఘ్నేశ్వరీ

సుయక్ష అనే రాక్షసిని సంహరించేందుకై వినాయకుడు స్త్రీరూపాన్ని ధరించినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ వినాయక రూపాన్ని విఘ్నేశ్వరీ, గణేశిని, గణేశ్వరి, గజానని, వినాయకి అనే పేర్లతో కోలుచుకుంటారు. ఈ మూర్తినే వ్యాఘ్ర (పులి) పాద గణపతి అని కూడా అంటారు. కారణం, ఈ వినాయకుని తల భాగం ఏనుగుతల వలె మెడ నుండి నడుము వరకు స్త్రీమూర్తివలె, నడుము నుంచి పాదాల వరకు వ్యాఘ్ర (పులి) పాదాల వలె గోచరిస్తుంది.

ఇటువంటి విగ్రహాలను ఉత్తరాభారదేశంలో ఎక్కువగా చూడగలము. ఉత్తరప్రదేశ్ లోని రిగ్యాన్ అనే ప్రాంతంలో వినాయకి విగ్రహాన్ని చూడగలము. రాజస్థాన్ లోని జైపూర్, షార్టీనగర్ లలో అత్యంత సుందరమైన వినాయకి విగ్రహాలున్నాయి. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ వస్తు సంగ్రహాలయంలో, ఒరిస్సాలోని షీరాపూర్ లో వినాయకి దర్శనం లభిస్తుంది. దక్షిణాదిన సుచీంద్రం, నాగర్ కోవిల్ క్షేత్రాల్లో వినాయకి కొలువై ఉంది.

వరప్రదాత

మనం వినాయక పూజ చేస్తున్నప్పుడు, వినాయక ప్రతిమను ఏయే పదార్థంతో చేసి పూజిస్తే, ఎలాంటి ఫలితం ఉంటుందన్న విషయం పురాతన గ్రంథాలలో చెప్పబడింది.
 •  1. మట్టితో చేసిన గణపతి: ఉద్యోగంలో ఉన్నతిని, వ్యాపారంలో అభివృద్ధిని అనుగ్రహిస్తాడు.
 •  2. పసుపుతో చేసిన గణపతి: వివాహ ప్రయత్నాలకు ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి.
 •  3. పుట్టమట్టితో చేసిన గణపతి: అన్నింటా లాభం.
 •  4. బెల్లముతో చేసిన గణపతి: సౌభాగ్యాలు కలుగుతాయి.
 •  5. ఉప్పుతో చేసిన గణపతి: శత్రువులపై జయం.
 •  6. వేపచెట్టు కలపతో చేసిన గణపతి: శత్రు నాశనం.
 •  7. తెల్లజిల్లేడు మొదలుతో చేసిన గణపతి: తెలివితేటలు పెరుగుతాయి.
 •  8. వెన్నతో చేసిన గణపతి: అన్ని విధాలైనా వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది.
 •  9. పాలరాతితో చేసిన గణపతి: మానసిక ప్రశాంతత కలుగుతుంది.
 • 10. గంధపు చెక్కతో చేసిన గణపతి: గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంతో ఉన్నతి.
 • 11. స్ఫటిక గణపతి: కుటుంబములో సంతోషం.
 • 12. నల్లరాయితో చేసిన గణపతి: చేసేపనిలో అనవసరపు శ్రమ తొలిగిపోతుంది.
ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి
తన్నోదంతిః ప్రచోదయాత్

పంచముఖ గణపతి
ఐదు ముఖాలతో దర్శనమిచ్చే గణపతిని హేరంబ గణపతి అని కూడ పిలుస్తుంటారు. సింహవాహనుడైన ఈ స్వామి పది చేతులతో దర్శనమిస్తుంటాడు. ముందు రెండు చేతులలో అభయ, వరద ముద్రలతో, వెనుక నున్న మిగతా ఎనిమిది చేతులలో అంకుశం, గదాయుధం, చెరకువిల్లు, శంఖు, చక్రం, పాశం, తామర పువ్వు, ధాన్యపుకంకిని పట్టుకుని నాయన మనోహరంగా గోచరిస్తుంటాడు. కొన్ని విగ్రహాలలో దాన్యాపు కంకి, తామరపువ్వులకు బదులుగా దంతం. రత్నకలశాన్ని పట్టుకుని ఉన్నట్లుగా కనిపిస్తుంటుంది. స్వామివారు తెల్లని శరీరకాంతితో మెరిసిపోతుంటారు.

నృత్యగణపతి

నేపాల్ దేశంలో గణేశ భక్తులు నృత్య గణపతినే ఎక్కువగా పూజిస్తుంటారు. ఎరుపు రంగుతో మెరిసిపోతుంటే నేపాల్ నృత్య గణపతి త్రినేత్రుడు. తన వాహనమైన ఎలుకపై కుడికాలును కొద్దిగా మడిచి పెట్టి నృత్యం చేస్తున్న గణపతి, ఎడమ కాలును పూర్తిగా పైకెత్తగా, ఆ కాలు బొజ్జను చుట్టుకుని ఉన్న నాగబంధాన్ని తాకుతున్నట్లు ఉంటుంది. పన్నెండు చేతులులో దర్శనమిచ్చే ఈ స్వామివారు విఘ్నాలను తొలగించి, కోరుకున్న కోరికలను వెంటనే తీరుస్తాడన్నది నేపాల్ భక్త జన విశ్వాసం.

అటువంటి నృత్య గణపతులను మనదేశం లోని హళబేడు హోయసలెశ్వరాలయం, మదురై మీనాక్షీ ఆలయం, బీదర్ జిల్లా జలసంగవి వంటి క్షేత్రాలలో దర్శించుకోగాలము. హళబేడు హోయసలేశ్వరాలయ గోడపైనున్న నృత్యగణపతి మూర్తి అత్యంత సుందరరూపంతో దర్శనమిస్తుంటారు. ఎనిమిది చేతులలో కనిపించే ఈ స్వామి ముందు రెండు చేతులు దండముద్ర, విస్మయముద్రతో కనిపిస్తుండగా, వెనుకనున్న ఆరు చేతుల్లో పరశు, పాశ, మోదకపాత్ర, దంత, సర్ప, కమల పుష్పాలు ఉన్నాయి. కరండమకుటంతో నృత్యం చేస్తున్న ఈ గణపతి నిలబడిన పీఠభాగంలో మరుగుజ్జులు వాయిద్యాలు వాయిస్తున్నట్లుగా చూడగలము.

ఇక, మడురమీనాక్షి దేవాలయ స్తంభం పైనున్న నృత్య గణపతి, ఎలుకపై నృత్యం చేస్తున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఎడమకాలితో ఎలుకపై నించున్న ఈ గణపతి, కుడికాలును పైకెత్తి నృత్యం చేస్తున్నట్లుగా దర్శనమిస్తుంటాడు. ఎనిమిది చేతులతో దర్శనమిచ్చే ఈ నృత్యగణపతి కుడివైపునున్న నాలుగు చేతులలో పరశు, వలయ, పుష్పం, దంతాలతో, ఎడమవైపు నాలుగు చేతుల్లో అంకుశం, పాశం, మోదకం, ఫలాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మన దక్షిణభారత దేశంలో నృత్య గణపతి పూజకు విశేష ఆదరణ లభిస్తోంది.

కవల సోదర వినాయకులు

తమిళనాడులోని అరుణాచల క్షేత్ర గిరిప్రదక్షిణ అత్యంత పుణ్యప్రదమని భక్తజన విశ్వాసం. అరుణాచల గిరిప్రదక్షిణ చేసే భక్తులు ప్రదక్షిణ మార్గంలో…ముందుగా కనిపించే విఘ్నేశ్వరుని ఆలయంలో పూజలు చేసి, ప్రదక్షణను మొదలు పెడతారు.

అప్పుడు భక్తితో విఘ్నేశ్వర గర్భాలయంవైపు చూసిన భక్తులు ఆశ్చర్యంతో అప్ర్తిభులవుతుంటారు. కారణం, గర్భాలయంలో కవల సోదర వినాయకులు దర్శనమిస్తుంటారు. ఈ ఆలయంలో వినాయకుడు కవలలుగా అవతరించడానికి వెనుక ఓ ఆసక్తికరమైన ఉదంతం ఉంది.

సుమారు 452 సంవత్సరాల క్రితం, వీర బాహు దేశికుడు అనే శివ భక్తునికి స్వయంభువైన ఓ వినాయక ప్రతిమ దొరకడంతో, ఆ వినాయకునికి ఆలయాన్ని నిర్మించే పనిలో నిమగ్నమయ్యాడు. అరుణాచల క్షేత్రానికి ఉత్తర దిశలో ఆలయ నిర్మాణాన్ని చేసేందుకై భూమిని తవ్విస్తున్న అతను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత అతనికి సంతోషానికి అవధుల్లేవు. అందుకూ ఓ కారణం ఉంది.

స్వయంభువుగా లభించిన వినాయకుని కోసం ఆలయాన్ని నిర్మించే పనిలో ముమ్మరమై వున్న తనకు, ఆలయ నిర్మాణానికై పునాదులను త్రవ్వుతున్నప్పుడు, ఆ స్వయంభువు విగ్రహాన్ని పోలిన విగ్రహమే లభించింది. అదంతా దైవ నిర్ణయంగా భావించిన వీరబాహుదేశికుడు ఆ కవల గణపతులను శాస్త్రోక్తంగా ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించాడు. అరుణాచల గిరిప్రదిక్షణం చేసె భక్తులు ఈ కవల గణపతులను దర్శించుకుని పూజిస్తే, కోరుకున్న కోరికలన్నీ ఫలిస్తాయని భక్తజన విశ్వాసం.

సంకలనం: నాగవరపు రవీంద్ర

{full_page}

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top