"మంచి మనసు" - పిల్లల నీతి కథ - ఆదూరి.హైమావతి గారి రచన -

మంచి మనసు

అనగనగా పూర్వం ఒక అడవిలో ఒకపెద్ద మఱ్ఱి చెట్టు ఉండేడి. మొదట్లో ఆమఱ్ఱి చెట్టుపై ఒక కాకి గూడు కట్టుకుని వంటరిగా నివసించేది. దానికి వంటరిగా అలా ' ఒంటికయ సొంఠికొమ్ములా ' జీవించడం చాలా  విసుగ్గా అనిపించింది.ఎలాగైనా చాలామంది స్నేహితుల్ని సంపదించాలని అనుకుంది. ఆవంటరి తనం భరించలేక కాకి తన అవ్వవద్ద కెళ్ళి అడిగింది కదా, "అవ్వా! అవ్వా! నాకు చాలామంది స్నేహితులు కావాలంటే ,ఏంచేయాలీ ! దయచేసి చెప్పవూ?“ అని. అవ్వనవ్వి, ఇలా చెప్పింది " పిచ్చి దానా! అదేమంత కష్టమైన పనేం కాదు. నీవు అందరినీ ప్రేమించి,అందరికీ సాయంచెయ్యి , ఎవ్వరినీ బాధించకు, ద్వేషించకు అప్పుడం తా నీస్నేహితులే అవుతారు."అంది.

వెంటనే కాకి అడవిలోకి వేగంగా వెళ్ళింది.అక్కడ కనిపించిన  పిట్టలన్నింటినీ ప్రతిరోజూ పలక రించి, ఎవరికి సాయం అవసరమై నా అవి అడక్కండానే చేయసాగింది.అడవిలో పిట్టలన్నీ కాకి సాయానికీ , దాని స్నేహ భావానికీ ఎంతో సంతోషించి , కాకితో స్నేహం చేయాలనుకున్నాయి. అంతే  అన్నీ ఆపెద్ద మఱ్ఱిచెట్టు కొమ్మలపై గూళ్ళుకట్టుకుని నివసించ సాగాయి. కాకి వాటికి గూళ్ళు కట్టుకోను తన వంతుసాయం అందించింది.అన్నీ తమ కొత్త నివాసాల్లోకి వచ్చి చేరాయి. సమీపపు చెఱువు వాటి దాహం తీర్చుకోను సదుపాయంగా ఉంది. ఇప్పుడు కాకికి చాలామంది స్నేహితులు ఏర్పడ్దారు. రామచిలుకలు, కోయిలలూ, పావు రాలూ,పిచ్చుకలూ,వడ్రంగిపిట్టలూ , పాలపిట్టలూ, ఇంకా ఎన్నో కాకిని అభిమానించే స్నేహితులు.

ఆపక్షులన్నీ తమగూళ్ళలో ఆపెద్ద మఱ్ఱిచెట్టుపై ఎంతో స్నేహంగా, కలసి మెలసీ నివసించేవి. ఆ మఱ్ఱిచెట్టు సమీపంలో ఉన్న చెఱువులో చాలా నీటిపక్షులూ ఉండేవి. కాకిది చాలా దయగల మనస్సు, ఎవరికేం అవసరం వచ్చినా కాకి వెళ్ళి సాయపడేది. అందుకే ఆనీటిపక్షులన్నీ కూడా కాకిని ప్రేమించేవి. తల్లిపక్షులు ఆహారంకోసం వెళ్ళినపుడు కాకి వాటి పిల్లలను జ్రాగ్రత్తగా  చూసేది. అందువల్ల నీటిపక్షులు సైతం కాకి అంటే ప్రాణం ఇచ్చేవి.

ఒకరోజున ఒక వేటగాడు తరుముకురాగా ఒక నెమలి ఎంతోదూరం నుండీ పరుగెత్తుకువచ్చి ఆమఱ్ఱిచెట్టు నీడకు చేరింది, అది బాగా అలసి పోయి, ఆకలితోనూ దాహంతోనూ ఉంది.
 • 🐦 కాకి ఆ నెమలిని చూసి, " ఓ నెమలమ్మా!  బాగా అలసినట్లున్నావ్ !నీకు దాహానికి నీళ్ళు తేనా?" అని అడిగింది.  
 • 🐦 నెమలి అందికదా " ఔను   దాహం కావాలి " అని. కాకి "మిత్రమా! నాగూటికిరా! నీకు నీరు, కొంత ఆహారం కూడా ఇస్తాను, నీవుమా అతిధివి." అని ఆహ్వానించింది.నెమలి కాకిని ఏహ్యంగా చూసి,
 • 🐦 " నేను ఎంతో అందంగా ఉన్నాను, నీవేమో నల్లగా అసహ్యంగా ఉన్నావు , నేను నీ ఇంటికి ఎలారానూ? " అంది గర్వంగా.  ఈమాటలు విన్నరామచిలుక వచ్చి " నెమలమ్మా!నీవునాకంటే అందగాఉన్నావా?” అంది. 
 • 🐦 " ఔను కావాలంటే నా పింఛం చూడు, రంగులతో ఎంత అందంగా ఉందో!" అంటూ తన పింఛం విప్పింది. రామచిలుక " అబ్బా! ఎంత అందంగా ఉన్నావు!" అంది ఆశ్చర్యంగా.
కోయిల దిగివచ్చి అడిగింది " ఇక్కడ ఏం జరుగుతోంది?" అని. చిలకమ్మ చెప్పింది " మన నివాసానికి ఒక అతిధి వచ్చింది, చూడూ ఆ పింఛం ఎంత అందంగా ఉందో!" వడ్రంగిపిట్ట దిగి వచ్చి అడిగింది ". ఇక్కడ ఏం జరుగుతోంది?" కోయిలచెప్పింది ." అందమైన నెమలి మన నివాసానికి అతిధిగా వచ్చింది.
నెమలి
ఆ రంగుల ఈకలు చూడూ!" ఒక్కోపిట్టా చెట్టుదిగి వచ్చి అడిగాయి ' విషయమేంటని ?' అవన్నీ నెమలిపింఛం అందం చూశాయి . చెట్టు మీది పిట్టలేకాక, నీటిపిట్తలూ వచ్చాయి అక్కడికి. నెమలి పింఛం రంగుల అందంచూసి, ముచ్చట పడ్డాయి. మెచ్చుకున్నాయి కూడా! నెమలి వాటిని అడిగింది" మీరంతా నన్ను చూశారుకదా! నేనెంత అందంగాఉన్నానో! ఇప్పుడు చెప్పండి ఈ వికారపు కాకి నన్ను తన ఇంటికి విందుకు రమ్మంటే ఎలావెళ్ళను?" పిట్టలన్నీ ఎంతో బాధపడ్డాయి.
 • 🦜 చిలకమ్మ " ఓమా నూతన స్నేహితుడా!నీవు కోయిలమ్మలా కమ్మగా పాడగలవా?" అంది. కోయిలమ్మ అడిగింది " నీవు చిలకమ్మలా మృధువుగా మాట్లాడ గలవా? విన్నమాటాలను తిరిగి చెప్పగలవా? ". 
 • 🦜 " నీవు వడ్రంగి పిట్టలా  చెట్లపై చిత్రాలు చిత్రించ వేయగలవా?"    
 • 🦜 " పిచ్చుకమ్మలా మంచి గూళ్ళుకళాత్మకంగా కట్టగలవా?" 
 • 🦜 " నైటింగేల్ పిట్టలా కమ్మని రాగాలు తీయగలవా?“ 
 • 🦜 " హంసలా అందంగా నడవగలవా?" 
 • 🦜 "పావురం తంబిలా శాంతి సందేశాలు తీసుకెళ్ళగలవా?”
 • 🦜 "కొంగమ్మలా నీటిలో ఒంటికాలిపై  ఎంతో సమయం నిలువగలవా?" 
 • 🦜 “బాతక్కలానీటిలోవేగంగాఈదగలవా?",
 • 🦜 “ఆస్ట్రిచ్అంకుల్ లా వేగంగా నేలపై నడవగలవా?“
 • 🦜 “ డేగన్నలా ఆకాశంనుండీ దూరపుచూపు చూడగలవా?"
 • 🦜 " పాలపిట్టలా చీకటిలో చూడగలవా?"  పిట్టలన్నీ నెమలిని తలోప్రశ్నవేశాయి.
“కనీసం నీవు కాకమ్మలా అందరినీ ప్రేమించగలవా? కాకి ఎప్పుడూ వంటరిగా తినదు. నీవు అందంగా ఉండవచ్చుకానీ నీ హృదయంలో దయ, కరుణ, ప్రేమ ,స్నేహభావన లేనేనేవు. దయగల హృదయమే దైవమందిరం. శరీరాకృతి అందంగా ఉంటే ఏం లాభంచెప్పు! వేటగాడు నీపింఛం చూసి నిన్ను చంపాలని వెంటాడితే నీవు ప్రాణ రక్షణకోసం పరుగెట్టి ఇక్కడికి చేరావు!  దయ, కరుణ లేని అందం ఏంచేసుకోను?నీ అలసట చూఇస్ దాహం కావాలా? అని అడిగిన కాకమ్మను నిధ్యాక్షిణ్యంగా అవమానిం చావు." అని అడిగింది పక్షులరాజుగ్రద్ద.

నెమలి ఈ మాటలన్నీవిని సిగ్గుతో తన గర్వానికి విచారించింది. వెక్కి వెక్కి ఏడ్చింది." ఓ మిత్రులారా! నన్ను మన్నించండి. పొగరుగా మాట్లాడి ఆదరించ వచ్చిన కాకమ్మను బాధించాను.దయతో నన్నూమీతో ఉండనివ్వండి, మీరన్నట్లు నాపింఛం అందగా ఉందని గర్వించాను, నాస్వరం అసహ్యంగాఉంటుందని మరచాను.మన్నించండి"అని అందర్నీ తలవంచి అడిగింది. కాకమ్మ ముందుకు వచ్చి " స్నేహితులారా! మన కొత్త నేస్తం ఆకలితో ఉంది.దాహంగా ఉంది, అలసి ఉంది.మాటలు ఆపి రండి విందుచేద్దాం. " అనిపిలిచింది.

పిట్టలన్నీ నెమలిని ఆహ్వానించాయి. గ్రద్ద నెమలితో " నెమలి మిత్రమా!చూడూ కాకమ్మని!ఎప్పుడూ ఆమె ఇతరులకు సాయం చేయాలనే ఆలోచిస్తుంటుంది. ఎంత మంచి మనసో చూశావా? కాకమ్మ నుంచీ మన మంతా ఈ మంచి గుణం నేర్చుకోవాలి." కాకమ్మ నెమలితో " మిత్రమా!నీకు ఇంత అందమైన పింఛం ఉందికదా! నీవు నృత్యం నేర్చుకుని  పురివిప్పి ఆడావంటే ఎంత అధ్బుతంగా ఉంటుందోకదా!" అని ప్రొత్సహించింది, విందుసమయంలో. నెమలి నృత్యం నేర్చుకుంది. నృత్య రాణిగా పేరు తెచ్చు కుంది. ఆతర్వాత భారత జాతీయపక్షిగా గుర్తింపుపొందింది. కాకి ప్రోత్సాహమేదానికి అంత గొప్ప గుర్తించుతెచ్చింది.

నీతి: -- మనకు సేవాభావనఉంటే ,అందరూ మనకుమిత్రులవు తారు.  పైకి కనిపించే అందం గురించీ గర్వించరాదు.అది అశాస్వతమైనది.అందరినీ ప్రేమించే మంచి మనసూ కలిగి అవసరమైనవారిని సేవించడం మన ధర్మం .

రచన/సంకలనం: ఆదూరి.హైమావతి గారు (విశ్రాంత ఉపాధ్యాయిని - ప్రముఖ రచయిత). పుట్టపర్తి.

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top