దేవుడి ప్రత్యక్ష రూపం - Dēvuḍi pratyakṣa rūpaṁ


దేవుడు ఈ కలికాలంలో మనిషికి ప్రత్యక్ష రూపంలో కనిపించే అవకాశం ఉందా?

దేవుడు అంతటా ఉంటాడు. కాని అమూర్తంగా స్థిరాకారంగా ఉండాడు. ఆయన చర్మచక్షువులకు కనిపించడు. కనిపిస్తే ఆయన “దేవుడే” కాదు అంటారు కొందరు. అసలు దేవుడుంటే గదా కనిపించటానికి అని వాదించే వాళ్ళ సంఖ్య తక్కువేమి కాదు. అదేమిటంటే “నేను హేతువాదిని, నాది శాస్త్రీయమైన దృక్పథము. దేవుడున్నాడనేందుకు నా మనసుకు నచ్చే సాక్ష్యాధారాలు ఇంతవరకూ నాకెవరూ చూపలేదు. ‘నేనున్నాను’ అని నిరూపించుకొనేందుకు ఆయన కూడ ఇంతవరకూ నా ముందు హాజరు కాలేదు. కనుక దేవుడున్నాడనటం ఒక ఆంధవిశ్వాసం. లేదనటం హేతుబద్ధం దేవుడు లేదని గ్రహిస్తే తప్ప, మానవాళి ‘అభ్యుదయం’ ‘సాధించదు’ అంటారు.

ఇంతవరకూ నాకు కనబడని, తెలియని వస్తువు అసలు ఉండదేందుకే అవకాశం లేదనటం హేతువాదానికి కంటే, వితండవాదానికి దగ్గరగా ఉంటుంది. ఇప్పటి వరకూ తెలియనిదీ, అనుభవంలోకి రానిదీ ఇక ముందు రావచ్చు. ఒకవేళ రాకపోయినా, అనుభవంలో లేని విషయం విశ్వంలోనే లేదని ఎలా చెప్పటం? ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పటివరకూ నా అనుభవంలోకి రాలేదనటం హేతుబద్ధంగా ఉంటుంది. నాకు ముందు ఈ విషయాన్ని గురించి శోధించిన మేధావులూ, పేదలూ చెప్పిన మార్గంలో ప్రయత్నించి సత్యాన్వేషణ చేస్తాననటం మరింత సబబుగా ఉంటుంది. అది జిజ్ఞాసువు లక్షణం. జిజ్ఞాస ఉంటే ప్రమాణాలు, పూర్వపక్షాలూ, సిద్ధాంతాలు, నిరూపణల దాకా వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు. భారతీయ ప్రాచీనతాత్త్వికులూ, మతాచార్యులూ ఎందరో నడిచి చూపిన బాట అదే. సత్యశోధనలో కనిపించిన విరుద్ధవాదాలన్ని వాళ్ళూ, చిత్తశుద్ధితో, శాస్త్రీయదృక్పథంతోనే విశ్లేషించారు. అది అలా ఉంచుదాం.

ఆస్తికత్వం, నాస్తికత్వం గురించి వెనకటికొక ‘లౌకికుడు’ చమత్కారంగా ఇలా చెప్పాడు..

సందిగ్దే పరే లోకే, హితం-ఏవ-ఆచరేత్-నరః
నాస్తి చేత్-నాస్తి నః-హానిః, ఆస్తి చేత్ నాస్తికః హతః
(పరలోకం ఉన్నదా లేదా అన్న విషయం సందిగ్ధంగా ఉన్నప్పుడు, మనిషి తనకు పుణ్యం కలిగించే మంచి పనులే చేయటం మంచిది. పరలోకం లేదనుకోండి, మనకు నష్టం లేదు. ఉందనుకోండి, లేదని తప్పుగా నమ్ముతున్న నాస్తికుడు దెబ్బతింటాడు). ఆస్తి-నాస్తి విచికిత్సలో ఆస్తికుడి నమ్మకం తప్పయినా నష్టం లేదు. సరైనదైతే లాభం. నాస్తికుడి నమ్మకం సరైనదైతే ఒరిగే లాభం లేదు. తప్పయితే మాత్రం కొంపమునిగిపోతుంది! ఇదొక తమాషా సమీకరణం. అదీ అలా ఉంచితే.

మన ముందున్న ప్రశ్న ‘దేవుడు మనిషికి ప్రత్యక్షమవుతాడా?’ అని –

స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంసను అడిగిన మొట్టమొదటి ప్రశ్న అదే. ‘మీరు దేవుడిని చూశారా?’ అని. ఆ ప్రశ్నే ఆయన అంతకు ముందు ఇతరులెందరినో అడిగాడు. సరయిన సమాధానం దొరక లేదు.

రామకృష్ణులు మాత్రం, ‘చూడకేం? చూశాను. ఇప్పుడు కూడా చూస్తున్నాను. నువ్వు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నావో దేవుడు కూడా ఇంతే స్పష్టంగా కనిపిస్తున్నాడు’ అని సమాదానమివ్వటంతో, ఆ గురుశిష్యుల సుదీర్ఘమైన, అద్భుతమైన అనుబంధం మొదలైంది. ఆ పరమహంసకు, వివేకానందుడిలో కనిపించింది జ్ఞానికే సర్వే సర్వత్ర కనిపించే విశ్వవ్యాపి అయిన పరమాత్మ స్వరూపం. 

ఈశావ్యాసం ఇదం సర్వం,
యత్ కించ జగత్యాం జగత్!
(ఈ జగత్తులో చైతన్యవంతమై చలించేది సర్వమూ ఆ పరమేశ్వర పరివ్యాపితమే) అంటుంది ఉపనిషత్తు. ఇక ఈశ్వరుడు పరత్యక్షరూపంలో కనిపించనిదెక్కడ?

అయితే, అది జ్ఞానులకు మాత్రమే అనుభవమయ్యే విషయం. మరి సామాన్యులకు దేవుడు ప్రత్యక్షరూపంలో దర్శనమిస్తాడా?
ఆ భగవంతుడిలో అనన్యభక్తిగల భక్తులకూ భగవత్ సాక్షాత్కారం ఎక్కడపడితే అక్కడ కలుగుతుంది. భాగవతంలో ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు ఎలాగైనా ఆ శ్రీమన్నారాయణుడిని వెతికి పట్టుకోవాలని విశ్వప్రయత్నం చేశాడు. సాధ్యం కాలేదు. ‘నీ నారాయణుడు ఎక్కడుంటాడో చెప్పమని కుమారుని నిలదీశాడు.

‘అదేమిటి నాన్నగారూ, మీకు ఎక్కడ చూసినా, ఎంత వెదికినా నారాయణుడు కనబడ లేదంటారు? నాకయితే ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నాడు’ అంటూ

  • ఇందుగల, డందులేడని
  • సందేహము వలదు, చక్రి స్వరోప గతుం(డు)
  • ఎందెందు వెతకి చూచిన
  • అందందే గలడు దానవాగ్రణి వింటే
అన్న సత్యం బోధిస్తాడు ప్రహ్లాదుడు. అంతేకాదు. అప్పటికప్పుడు ఆ చక్రిని తండ్రి ముందు ప్రత్యక్షం చేయిస్తాడు. సరే, ఇది అనన్య భక్తి బలం. ప్రహ్లాదుడిలాంటి మహానుభావులకు సాధ్యం. సామాన్య మానవమాత్రుల విషయమేమిటి? వారికి దైవసాక్షాత్కారం కలుగుతుందా కలగదా? చిరకాలం కఠోర తపస్సు చేసిన తపస్వులకు దేవుడు, ఇష్టదేవతారూపంలో ప్రత్యక్షమై, కోరిన వరాలు ఇచ్చాడని అనేక పురాణ కథలలో వింటూంటాం. తులసీదాసు, పోతన త్యాగరాజు లాంటి పరమభాక్తులు కూడా తమ ఇష్టదేవతల సాక్షాత్కారాన్ని పొందిన వారేనని చేస్తారు.

అంతెందుకు? భగవంతుడిని ఇష్టదేవతారూపంలో నిశ్చలమైన ఏకాగ్రతతో ధ్యానించి స్వప్నంలోనే ధ్యానం లోనోనన్నా ఆయన సాక్షాత్కారం పొందిన యోగుల అనుభవాలు కోకొల్లలు. అంతేకాదు, కేవలం ఆపన్నులై ఆర్తిగా భగవంతుడిని ప్రార్థించి, ఆ ప్రార్థన ప్రభావంవల్ల దైవానుగ్రహం పొంది, లౌకికమైన కష్టసుఖాలలో సాఫల్యం చవిచూసిన అనుభవంగల సామాన్యభక్తులు ఎందరులేరు? ఇది హిందూమతంలోనే కాదు. అన్ని మతాలవారిలోనూ చూస్తుంటాం, వింటూంటాం. అదీ అలా ఉంచండి. మీరు ప్రార్థించిన, ప్రార్థించక పోయినా, ధ్యానించినా, ధ్యానించకపోయినా, కనిపించే భగవంతుడి ప్రత్యక్ష రూపాలున్నాయి. ప్రాణుల ప్రమేయం లేకుండా, నియమబద్ధంగా నడిచే ప్రాకృతికశక్తులన్నీ వాటిని నడిపిస్తున్న అలౌకికశక్తి తాలూకూ ప్రత్యక్షరూపాలు కావా?

ఈశ్వరుడు, మనిషికి ఎనిమిది ప్రత్యక్ష రూపాలలో నిత్యమూ దర్శనమిస్తూనే ఉన్నాడంటాడు కాళిదాస మహాకవి. ‘అభిజ్ఞాన శాకుంతలమ్’ నాటకం నాంది శ్లోకంలో.

యా సృష్టి – స్రష్టురాద్యా, వహతి విధిహుతం
యా హవిః – యా ఛ హో త్రీ,
యే ద్వే కాలం విధత్తిః, – శ్రుతి విషయ గుణా
యా స్థితా వ్యాప్య విశ్వం,
యాం-ఆహుః సర్వ బీజ ప్రకృతిః – ఇతి,
యయా ప్రాణినః – ప్రాణవంతాః,
ప్రత్యక్షాభిః – ప్రపన్నః –  అనుభిః – అవతు – వః
తాభి రష్టాభి రీశః!

ఈశ్వరుడికి ఎనిమిది ప్రత్యక్ష స్వరూపాలు. మొదటిది సృష్టికర్త సృష్టించిన మొదటిసృష్టి. అంటే జలం. నీరు. రెండవది, యథావిధిగా హోమం చేయబడ్డ హవిస్సును దేవతల కందజేసే అగ్ని. ‘అగ్నిముఖావై దేవాః’ అని శ్రుతి.

మూడోది, యా చ హోత్రీ. యజ్ఞం చేసె యజమాని రూపం. యజ్ఞంలోక క్షేమం కోసం మాత్రమే చేసె పుణ్య కార్యం కనుక ఆ యజ్ఞం జరిగేంతసేపూ, యజ్ఞకర్త అయిన యజమానిని శివుడి ప్రత్యక్ష రూపంగా భావిస్తారు. యాజమాన-ఆహ్వాయా మూర్తిః విశ్వస్య శుభాదాయినీ. యజమాని అనే పేరుగల మూర్తి జగత్ సంక్షేమం చేకూర్చగలదు.

నాలుగూ, అయిదూ రూపాలు కాలాన్ని నియంత్రించే సూర్య చంద్రులు. ఆరో ప్రత్యక్షరూపం, శబ్ద విషయం గుణంగా కలిగి విశ్వమంతా వ్యాపించి నిలిచినా ఆకాశం. ఏడోది, ఈ పృథ్వి. ఇది సర్వబీజాలకూ వృద్ధికి మూలం కదా, ఈశ్వరుడి ఎనిమిదో ప్రత్యక్షరూపం వాయువు. యయా ప్రాణినః ప్రాణవంతః. దేనివల్ల నయితే ప్రాణులకు ప్రానమనేది కలుగుతుందో, ఆ ప్రాణవాయువు ఈశ్వర స్వరూపమే గదా!

ఈ ఎనిమిది ప్రత్యక్ష రూపాలుగల ఆ ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాక, అని మహాకవి కాళిదాసు ప్రార్థన. ఆ స్వామి మనల్ని తప్పకుండా కాపాడుతాడు. తథాస్తు!

సంకలనం: నాగవరపు రవీంద్ర

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top