వైరాగ్యము: బ్రహ్మానుభవమునకు మార్గము - Vairagyamu

 వైరాగ్యము: బ్రహ్మానుభవమునకు మార్గము - Vairagyamu వైరాగ్యము
శ్లో||  ఓం పరాశరపౌత్రం | శ్రీవ్యాసపుత్ర మకల్మషమ్‌ |
       నిత్యవైరాగ్యసమ్పన్నం | జీవన్ముక్తం శుకం భజే ||

వైరాగ్యము : 

కర్తృత్వ భోక్తృత్వములు క్షేత్రజ్ఞుడివని, నిజానికి తాను బ్రహ్మమే అయి యున్నందువలన, జీవభావము అవిద్యా కల్పితము గనుక, కర్తృత్వ భోక్తృత్వములనెడి భ్రాంతిని విడచిపెట్టుటయే వైరాగ్యము. ఆత్మేతర వస్తువులందు ఆశ లేకుండుట, వాటిపై ఉదాసీనత వహించి యుండుట, వాటిని ఏ రూపములోనైనా స్పృహ లోనికి రానీయకుండుట వైరాగ్యము. ఆశా మోహభయములు లేకుండుట, వాటిపై స్పందన, ప్రతిస్పందనలు లేకుండుట వైరాగ్యము. నిజ వైరాగ్యము బ్రహ్మానుభవమునకు దారి తీయును.

వైరాగ్య పంచకము :

1. తామస వైరాగ్యము : 
సమస్త వస్తువులందు కలిగెడు రాగమునందు ఆ వస్తువులు తనవి కాదనుకొని, నిగ్రహించగలుగుట తామస వైరాగ్య మనబడును.

2. తామసీ రాజసీ వైరాగ్యము :
సమస్త వస్తువులందు కలిగెే విరాగము ననుసరించి దేహేంద్రియములు, ప్రాణ మనస్సులు తాను కాదనుకొని శమించి యుండుట తామసీ రాజసీ వైరాగ్యమనబడును.

3. రాజసీ వైరాగ్యము :
సమస్త భావములందు విరాగముండుట.

4. సాత్విక వైరాగ్యము :
దృశ్యములు, దృక్‌ కూడా తోచక యుండునట్టి, సాక్షి కూడా లేడు అనుకొనుట సాత్విక వైరాగ్యము.

5. గుణగంధ వైరాగ్యము :
కారణ సహిత బ్రహ్మము కార్యరూప జగత్తునకు ఆధారమనియు, అట్టి బ్రహ్మ రూపము తానేనని నిశ్చయమై యుండుట మరియు గుణ సంబంధ కార్యములను పారమార్థిక జ్ఞానముతో ఎరిగి నందున కలిగే వైరాగ్యమును గుణగంధ వైరాగ్యమందురు.

అపర వైరాగ్యము : ఇది నాలుగు విధములు.

1. యతమాన వైరాగ్యము : 
ఈ ప్రపంచమునసారమైనదేదో, అసారమైన దేదో గురూపదేశము, శాస్త్ర విచారణ ద్వారా తెలుసుకొందును గాక అని ఉద్యోగించుటను యతమాన వైరాగ్యమందురు.

2. వ్యతిరేక వైరాగ్యము : 
తన చిత్తమందు పూర్వమందున్న దోషములతో, తరువాత వివేక వైరాగ్యాభ్యాసము వలన ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని దోషములు నివర్తింపబడుచున్నవో, ఇంకను ఎన్ని దోషములు మిగిలియున్నవో అని ప్రతి దినము పరిశీలించుకొనుచుండుటను వ్యతిరేక వైరాగ్యమందురు.

3. ఏకేంద్రియ వైరాగ్యము : 
దృష్టమైన, అదృష్టమైన విషయములలో ప్రవర్తించుటను దుఃఖరూపమని తెలిసి, ఆ ప్రవృత్తిని విడచిపెట్టి, అయినను మనస్సునందు మాత్రము విషయములు కలిగియుండుట ఏకేంద్రియ వైరాగ్యమనబడును.

4. వశీకార వైరాగ్యము : 
ఏకేంద్రియమైన మానసిక రుచిని కూడా దృష్ట అదృష్ట విషయములందు తొలగించుకొని యుండుట వశీకార వైరాగ్య మనబడును. ఈ నాలుగు రీతుల అపర వైరాగ్యము సంప్రజ్ఞాత సమాధికి అంతరమై యున్నది.

పర వైరాగ్యము : 

సంప్రజ్ఞాత సమాధిని దృఢతరముగా అభ్యసించుటచేత త్రిగుణములకు విలక్షణమైన ప్రత్యగాత్మ సాక్షాత్కారమగును. పిదప గుణత్రయ జన్యములైన సమస్త పదార్థములందును కలిగే వైరాగ్యమును పరవైరాగ్యమందురు.

బ్రహ్మలోకమాది పరమాణు పర్యంత భోగ్య జాతమందు బొడమ వలయు |
గాకి రెట్ట యెడల గలుగు జుగుప్స, వైరాగ్యమనగ నదియె యోగ్యమగును ||

శ్రు||  యదాహరేవ విరజ్యేత్తదహరేవ ప్రవజ్యేత్‌
        - పరమహంస పరివ్రాజకోపనిషత్‌
తా||    ఏ రోజున విరక్తుడగునో, ఆ రోజుననే సన్న్యసించవలెను. (వైరాగ్యాభ్యాసము పూర్తియైన పిదప సన్న్యసించవలెను. సన్న్యసించిన తరువాత నిష్ఠగా ఉండవలెను గాని, సాధన అవసరము ఉండరాదు)

సంకలనం: చల్లపల్లి 
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top