హిందువుల జోలికొస్తే ఊరుకోం

0

ఆంధ్రధ్రప్రదేశ్ లో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుండి హిందూ ఆలయాలపై అనేక దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, విచారణల పేరుతో కాలయాపన చేస్తోందని 'హిందూ ధార్మిక సంస్థల' ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు 'అంతర్వేదిలో ఇటీవల లక్ష్మీనరసింహస్వామి రథాన్నిదగ్ధం' చేసిన నేపథ్యంలో సెప్టెంబర్ 9న వీహెచ్ పీ (శహిందూ పరిషత్) రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.

తిరుపతిలోని ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో నిరసనకారులు మాట్లాడుతూ హిందూ ఆలయాల మీద జరుగుతున్న దాడులు వలె చర్చి లేదా మసీదు మీద జరిగితే ప్రభుత్వం ఇలాగే చూస్తూ ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. 
  • 🖛 నెల్లూరులో రథం కాలిపోతే ఎవరో మతిస్టిమితం లేనివాళ్లు చేసిన దాడి అని తేల్చారు. 
  • 🖛 శ్రీశైలం ఆలయ పరిధిలోని షాపులను అన్యమతస్థులకు కేటాయించారు. 
  • 🖛 తూర్పుగోదావరి జిల్లాలో 12 ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసినా ప్రభుత్వం స్పందించలేదు.
ఈ చర్యలన్నిటినీ గమనిస్తే ప్రభుత్వం ఒక మతాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నట్లుగా స్పష్టమవుతోందని పేర్కొన్నారు. 

అంతర్వేదిలో గత అరవై మూడు సంవత్సరాలుగా స్వామివారి ఊరేగింపునకు ఉపయోగిస్తున్న రథం అగ్నికి ఆహుతి కావడం దారుణమని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యేనని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా, హిందూధర్మ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలను అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇలాగే చేసి దారుణంగా దెబ్బతిన్నదని గుర్తుచేశారు. నేడు అదే బాటలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే హిందువులంతా ఏకమై గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంతర్వేదిలో రథాన్ని తగులబెట్టిన దుండగులను గుర్తించి, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు.తిరుపతి, చిత్తూరు, మదనపల్లి కేంద్రాల్లోని ఆర్డీవో కార్యాలయాల ముందు హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలు ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా వివిధ సంస్థలకు చెందిన 1473 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాలొన్నారు. మొత్తం 66 మండలాల్లో 62 చోట్ల వినతి పత్రాలు అందజేసినట్లు వీహెచ్ పీ నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛ వీహెచ్పీ నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వరూపానంద స్వామి, రాధా మనోహర్ దాసు స్వామి, భానుప్రకాష్ రెడ్డి, కోలా ఆనంద్, రమేష్ నాయుడు, పొనగంటి భాస్కర్, సామంచి శ్రీనివాస్, వెంకటముని, ఎంఆర్ రాజా, అజయ్కూమార్, కీర్తి వెంకయ్య, గణపతి సింగ్, సుబ్బన్న, భరత్, వెంకటేశ్వరరావు, ప్రసాద్, వజ్రాల చంద్రశేఖర్, మురళి రాజశేఖర్, పార్వతి, కవిత తదితరులు హాజరయ్యారు. చిత్తూరు కార్యక్రమంలో ఆర్ఎస్ ఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యవాహ వేణుగోపాల నాయుడు పాల్గొన్నారు.

కావలి : అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం ఘటన పై నిష్పక్షపాత విచారణ జరిపాలని బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్థానిక హిందూ సంస్థల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటనకు పాల్పడిన వారిని గుర్తించడంలో విఫలమైన పోలీసులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న హిందూ కార్యకర్తలను అరెస్టులు చేసి బెదిరించడం దారుణమన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కావలి కూడలిలో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జి.భరత్ కుమార్, బ్రహ్మానందం, సుభాషిణి, సుధీర్, సుజి తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు : నగరంలో వీహెచ్ పీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలో భజరంగ్ దళ్, బీజేపీ, ఆర్ఎస్ఎస్, వివిధ అనుబంధ సంస్థలకు చెందిన వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవోకి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వీహెచ్ పీ ప్రాంత కార్యాధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి, సహ కార్యదర్శి సౌదికార్ ప్రాణేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

తెనాలి : తెనాలిలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. ప్రదర్శనలో పాల్గొన్న వక్తలు ప్రభుత్వ తీరును నిరసించారు. దోషులను వెంటనే శిక్షించాలన్నారు. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కన్నా భాస్కర్, శివశక్తి, వీహెచ్ పీ, వివిధ ధార్మిక సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు.

అంతర్వేది : వీహెచ్పీ, భజరంగదళ్, హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఆందోళన చేపట్టారు. నిరసనకారులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆలయాలకు భద్రత కల్పించాలని, రథం కాలిపోయిన కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భజరంగదళ్ ప్రతినిధి రవికుమార్ మాట్లాడుతూ 'రాష్ట్రంలో హిందువుల ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది. వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నామమాత్రపు చర్యలతో సరిపెడుతోంది. హిందూ ఆలయాలకు భద్రత కల్పించాలి. లేకపోతే ఉద్యమం ఉద్భృతం చేస్తాం' అని పేర్కొన్నారు.

రాయదుర్గం : అనంతవురం జిల్లా రాయదుర్గంలో తహశీల్దార్ కు వినతిపత్రం  సమర్పించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ అనంతపురం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి సిద్దప్ప, రామనాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు: విశ్వహిందూ పరిషత్, బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజరంగదళ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ ఎస్ అనంతపురం విభాగ కార్యవాహ వేంకటేశ్ రెడ్డి, బీజేపీ నాయకులు ఎస్ శ్రీనివాస్ రావు, బొద్దులూరి ఆంజనేయులు
తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

_జాగృతి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top