మాయ - అవిద్య - అజ్ఞానము - Maya - Avidya - Agnanamu

0
మాయ - అవిద్య - అజ్ఞానము - Maya - Avidya - Agnanamu

మాయ - అవిద్య - అజ్ఞానము
శ్లో||  భ్రమేణాహం భ్రమేణత్వం | భ్రమేణోపాసకాజనాః
భ్రమేణేశ్వరభావత్వం | భ్రమమూలమిదంజగత్‌ ||
మాయ :
లేని మాయ. ఏది లేదో, దానిని ఉన్నట్లు చూపునది. భ్రాంతి కలిగించునది. అందులోనే మరల వస్తువు ఒకటైతే మరొకటిగా చూపించునది. కల్పిత సృష్టికి మూలకారణము. ఇంద్రజాలమువలె తోపించునది. సత్‌ కాదు. అసత్‌కాదు. సదసత్‌ కూడా కాదు. అనిర్వచనీయము. నిర్గుణ బ్రహ్మమును సగుణ బ్రహ్మగా చూపి సర్వకారణ బ్రహ్మగా ప్రతీతి చేయునది. మాయ బ్రహ్మమందు ఏకదేశీయముగా ఒక్క పాదమును ఆశ్రయించి, సృష్టి స్థితి లయములు జరుగునట్లును చలనములను, వికారములను, నానాత్వమును, భేదములను చూపునది. మూడు పాదముల బ్రహ్మ మాయాశ్రయము లేనిదిగా పరమపద లక్ష్యమునకు మిగిలియుండును. సర్వమునకూ మాయ కారణమే గాని, బ్రహ్మ అన్ని పాదములు నిర్గుణమే. మాయయే ఒక్క పాద బ్రహ్మమును ఆశ్రయించి మాయా కార్యములు చేయుచు, నిర్గుణ నిర్వికార బ్రహ్మను కారణమైనట్లు చూపును. అట్టి మాయాశబలిత బ్రహ్మను కల్పించి చూపునది. ఇట్టి మాయ అనాది, కాని మాయ మర్మము తెలిసి, నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కరించుకొనిన వారిలో మాయకు అంతమున్నది.

మాయాతత్త్వము : 
జడశక్తి ధర్మియై, చైతన్యము దానికి ధర్మమై యుండును. శుద్ధ తత్త్వములు అయిదింటి యందును, చైతన్యము ధర్మియై, జడశక్తి ధర్మమై యుండును. భేదశక్తి ప్రబలమై జడశక్తి ధర్మిత్వమును పొందును. అప్పుడది మాయాతత్త్వమనబడును. ఈ తత్త్వము తెలిసినవారు చిత్‌ జడములను వేరు ధర్మములుగా తెలుసుకొని, తాము జడము కాదని, చిత్‌ స్వరూపులని ఎరుగుదురు.

జడశక్తి, భేదశక్తి :
అవిద్యయే జడశక్తి, భేదశక్తి. ముందుగా శుద్ధ తత్త్వములు అయిదును సృష్టించబడిన పిదప జడశక్తి, భేదశక్తి ప్రబలమగును. అప్పుడా రెండు శక్తులు ప్రధానమై చైతన్యము అప్రధానమగును. (శుద్ధ తత్త్వములైదు గురించి బ్రహ్మ 129వ పేజీవద్ద వివరించబడినది)

మాయా పంచ కంచుకము :
పరమ శివుని యొక్క సర్వకర్తృత్వము, సర్వజ్ఞత్వము, నిత్యతృప్తము, నిత్యత్వము, స్వాతంత్య్రము అను అయిదును సంకుచితమై అయిదు శక్తులగును. అవి కళ, అవిద్య, రాగము, కాలము, నియతి అని అయిదు ఆవరణములై చైతన్యమును బంధించును. వీటిని మాయా పంచ కంచుకము అందురు. చేతన పురుషుడు వీటిచేత బద్ధుడై యున్నట్లు కనిపించుచున్నాడు. చైతన్యము బంధించబడగా, అట్టి బద్ధత్వమే పురుషుడు అనబడును.
 • 1. కళ : కొంచెము కర్తవ్యము
 • 2. అవిద్య : కొంచెము తెలిసియుండుట
 • 3. రాగము : ఇది నాది అగుగాక! అను కోరిక
 • 4. కాలము : ఆయుష్షు గురించి దినములు, మాసములు, సంవత్సరములు మొదలగు పరిమాణముల పరిగణన.
 • 5. నియతి : పై నాల్గింటికి లోబడి యుండు పద్ధతి.
మాయా లక్షణ పంచకము : 
అసత్‌, జడము, దుఃఖము, అనిత్యము, ఖండితము.
 • మాయా నామ పంచకము : మాయ, తమస్సు, మోహము, అవిద్య, అనృతాత్మికము.
 • మాయా వృత్తి త్రయము : శుద్ధ సత్వ మాయ, లేక విద్య, మలిన సత్వ మాయ, లేక అవిద్య, తమః ప్రధాన ప్రకృతి. ఈ మూడూ కలిసిన వృత్తులే ఈశ్వర, జీవ, జగత్తులనే భేదములను కల్పించుచున్నది.
 • శుద్ధ సత్వ మాయ :  త్రిగుణములలో సత్వగుణము మాత్రము విజృంభించి, తమోరజోగుణములు అణగి యున్నప్పుడు అది శుద్ధ సత్వమాయ. తమోరజోగుణములు కలసి అవిద్య అనబడును. అవిద్య లేని మాయను శుద్ధసత్వమాయ అందురు.
 • మలినసత్వ మాయ : అవిద్య అనే మలినమును కలిగిన మాయను మలిన సత్వమాయ అందురు.
అవిద్య :
తమో గుణము వలన ఆవరణ శక్తి, రజోగుణము వలన విక్షేప శక్తి జనించి ఈ రెండింటి వలన జీవుడు తాను బ్రహ్మనని గాని, ఈశ్వరుడననిగాని మరచి, తాను జీవుడననియు, దేహమే నేననియు, భ్రాంతి చెందుచున్నాడు.

ఈశ్వరుడు : 
శుద్ధ సత్వ మాయయందు పరమాత్మ ప్రకాశించగా, ప్రతిఫలించిన ప్రకాశము చేత ఈశ్వరుడు తోచెను. అవిద్య దోషము లేదు గనుక ఈశ్వరుడు మాయకు వశుడు కానట్టి జ్ఞాని, సర్వజ్ఞుడు.

జీవుడు : 
మలిన సత్వమాయ యందు పరమాత్మ ప్రకాశించగా, ప్రతిఫలించిన ప్రకాశముచేత జీవులు తోచెను. అవిద్యా దోషము వలన జీవులు, తమ ఉపాధులతో తాదాత్మ్యము పొంది 'శరీరమే నేను' అనుచు అజ్ఞానులైరి. వీరు కించిజ్ఞులు, మాయకు వశులు.

శంబర శక్తి : 
మాయా శక్తినే శంబర శక్తి అందురు.

శంబర సృష్టి : 
సముద్రములో నున్న అలలు, బుడగలు, నురుగు సముద్రము కంటే వేరైనట్లు కనిపించే సృష్టి. అవన్నీ సముద్రమునందే కల్పింపబడుచు సముద్రమునందే లయమగుచున్నవి. విచారించగా సముద్ర స్వభావమైన తత్త్వమే వాటన్నిటిలోనూ ఉన్నది. శంబర అనగా మాయయని కూడా అర్థమున్నందున బ్రహ్మమనగా నిస్తరంగ చైతన్య సాగరము. అందలి అలలు, బుడగలు, నురుగు, చలనములు, వికారములు అన్నీ కల్పితము.

మాయానిర్వాచ్య నవ ప్రకారములు :
 • 1. భిన్నము కాదు 
 • 2. అభిన్నము కాదు. 
 • 3. భిన్నాభిన్నము కాదు. 
 • 4. సత్‌ కాదు 
 • 5. అసత్‌ కాదు 
 • 6. సదసత్‌ కాదు 
 • 7. సావయవము కాదు 
 • 8. నిరవయవము కాదు 
 • 9. సావయవ నిరవయవము కాదు. అనిర్వాచ్య మనవచ్చును.

ప్రకృతి : 

ప్రకృష్టముగా చేయబడినది. శ్రేష్ఠముగా చేయబడియున్నది అని అర్థము. త్రిగుణములు అంకురించి సామ్యముగా నున్నవి. అందలి సత్వగుణము సామ్య స్థితినుండి విజృంభించగా శుద్ధసత్వ మాయయు, తమోరజోగుణములు కూడా విజృంభించగా మలిన సత్వమాయయు రెండు విధములయ్యెను. త్రిగుణ సామ్యావస్థకంటే ముందు ఆ త్రిగుణములు బీజస్థితిలో నున్నది అవ్యక్తము. దీని పేరే మూల ప్రకృతి.
 • ప్రమాదము : సాధకుడు తాను స్వాభావికమైన బ్రహ్మజ్ఞానమును సముపార్జించుకొని కూడా, దానిని నిలబెట్టుకొనలేక త్రిగుణాత్మక మాయకు వశుడై అజ్ఞానియగుటను ప్రమాదమందురు. ప్రమాదమనగా అజ్ఞానమే.
 • విరించి :  సృష్టిని రచించిన బ్రహ్మను విరించి అందురు. విరించియే సృష్టికర్తయైన బ్రహ్మ.  అపరప్రకృతి : మనస్సు, బుద్ధి, అహంకారము, పంచ మహాభూతములు, వాటి పంచీకృతములు.
 • పరప్రకృతి : అపరప్రకృతితో కలిసి యున్నను, లేకున్నను, జీవ స్వరూపమనేది ఒకటి ఉన్నది. ఆ జీవ స్వరూపమే పరప్రకృతి.
 • అష్ట ప్రకృతులు : పంచతన్మాత్రలు, సూర్యుడు, చంద్రుడు, పురుషుడు.
 • జగత్తు : జ+గతి= సృష్టించబడి గతి లేక పరిణామము చెందుచుండునది. అవిద్య కారణముగా నేనుకు  వెలుపల నేను కంటె అన్యవస్తువులు తోచుచున్నట్లుండునది జగత్తు.
 • ప్రకృతి శక్తులు : ఆకర్షణ శక్తి, విద్యుదయస్కాంత శక్తి, అణువులను కలిపియుంచు శక్తి, అణువులను విచ్ఛేదన చేయు శక్తి.
అవిద్య లక్షణము : 
అనిత్యమునందు నిత్యత్వమును, అశౌచమందు శౌచమును, దుఃఖమును సుఖముగా భావించుట అవిద్య లక్షణము.

అవిద్యకు పేరులు : 
అవిద్య, సంసృతి, మాయ, భవము, మలము, సంకల్పము, తమోరజోగుణములు, ఆవరణ విక్షేపములు, త్రిగుణములు, ప్రకృతి అని కొంత బేధముతో అనేక పేరులు.

ప్రపంచము : 
పంచ మహాభూతములు, పంచీకృతములు, పంచ భూతాత్మకమైన శరీరములు, క్రియాశక్తి అయిన ప్రాణము, ఇచ్ఛాశక్తి అయిన జీవము, వీటన్నిటికీ మించిన ప్రత్యగాత్మ, దాని ఆధారముగా నున్న ప్రతీది- వీటన్నిటియొక్క సంఘాతమే ప్రపంచము.

భావనా సిద్ధి : 
మాయావరణము లేని బ్రహ్మము యొక్క భావనా శక్తి వలన సర్వము తోచుచున్నది. భేదములన్నీ బ్రహ్మము యొక్క భావనాశక్తి వల్లనే ప్రకాశించుచున్నవి.

జీవుల భావనాశక్తి మాయచేత ఆవరించబడి యున్నది. మాయను అధిగమించిన జీవులు బ్రహ్మమునకువలె భావనాశక్తి పునఃప్రాప్తి కలుగును. అట్టి జీవులకు భావనాసిద్ధి కలిగినదని అందురు. ఈ భావనా సిద్ధి వలన జీవులయందు భేదములు నశించి, సర్వము శూన్యమై యుండును. కేవల బ్రహ్మముగా నుండి పోవును.

ఉల్లాస శక్తి : 
ఆత్మయందు ఇచ్ఛాశక్తి, ఆకాశశక్తి, కాలశక్తి, నియతి శక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, కర్తృత్వశక్తి, అకర్తృత్వశక్తి మొదలగు అసంఖ్యాకమైన ఆత్మ శక్తులున్నవి. వీటివలన ఆత్మక్షోభ చెందును. ఈ క్షోభయే ఉల్లాసము. ఈ శక్తులన్నీ కలసి ఉల్లాసశక్తి అనబడును. ఇవి నిజానికి ఆత్మ శక్తులు కాదు. నిర్వికల్పాత్మయందు, ఆశ్రయించి యున్న మాయాశక్తులు. క్షోభవలన జీవాత్మకు అజ్ఞానము, సంసారము కల్పింపబడుచున్నవి. ఈ శక్తుల కారణముగా చిత్‌, లేక జ్ఞానము వికల్పములతో కూడిన దృశ్యములను సంకల్పించుచు, క్రమముగా చిత్‌ స్వరూపమునుండి తొలగి, దృశ్య రూప భావమును పొంది, సాకారమగును. క్రమముగా జీవభావమును పొంది జీవుడగును. తరువాత బుద్ధి రూపమై అహంకార రూపమై, మనస్సై సంసారమును కల్పించుకొనును. ఇదియే ఆత్మకు సంక్రమించిన ప్రమాదము, లేక అజ్ఞానము.

నిరోధ శక్తి : 
పైన చెప్పబడిన ఉల్లాస శక్తి ఉపసంహరింపబడుటకు అవసరమైన వ్యతిరేక శక్తిని నిరోధ శక్తి అందురు. ఈ శక్తివలన సంసార బంధము తొలగి జ్ఞానముదయించి, తిరిగి ఆత్మగా ఉండిపోవును.

మాయాశక్తులకు ఆధారమైన చైతన్యము : 
శుద్ధ చైతన్యమే అయినను, వివిధ శక్తుల భేదములను బట్టి మలిన చైతన్యమువలె కన్పించును. మనస్సు, బుద్ధి, జ్ఞానము, క్రియ, అహంకారము, ప్రకృతి, మాయ, కర్మము, బంధము, అవిద్య, ఇచ్ఛ మొదలగునవిగా ప్రతీతి అయినట్టి చైతన్యమే మలిన చైతన్యము. విచారణచేత సర్వాధారమైన శుద్ధ చైతన్యమును విలక్షణముగా భావము చేసుకొనుచు, మాయా శక్తుల ప్రతీతిని మిథ్యగా భావించుచు, చివరకు శుద్ధ చైతన్య రూపమగుటయే విముక్తి.
 • 🟒 శరీర త్రయము : అవిద్య వలన కారణ శరీరము, కారణము వలన కామ సంకల్పములు, కామ సంకల్పముల వలన సూక్ష్మ శరీరము, కామము, కర్మముల ఆవృతి వలన కర్మానుభవము కొఱకు స్థూల శరీరము అనెడి పనిముట్టు ఏర్పడెను. ఈ మూడు శరీరములను ధరించిన జీవుడు మూడు అవస్థలలో మూడు శరీరములతో సంబంధము పెట్టుకొని వ్యాపారము జరుపుట వలన సంసారము ఏర్పడెను. వీటికి ఆది మూల కారణము మూలావిద్య. ముందుగా అవిద్యా దోషమును పోగొట్టుకొని, మూలావిద్య రహస్య మెరిగినవాడే ముక్తుడు.
 • 🟒 స్వపితి : సుషుప్తియందు తనలోనే ఉండిపోవుట, జాగ్రత్‌ స్వప్నానుభవములు లేకుండుట, తనలోతాను శుద్ధ చిన్మాత్ర స్వరూపమందుండి, అయినను అజ్ఞానావరణయందుండుట. ఈ స్థితిలోనున్నవాడు స్వపితి అనబడును.
 • 🟒 బహిర్విక్షేపము : చింత చేయువాడు,చింతనము, చౌత్య విషయము అనెడి త్రిపుటి యుండుట.
 • 🟒 అంతర్విక్షేపము : ధ్యాత, ధ్యానము, ధ్యేయము అనెడి త్రిపుటి యుండుట. సర్వ త్రిపుటి రహితమే మోక్షము.
 • 🟒 ఆధ్యాస : నిజరూపములకు బదులు కల్పిత రూపములను నిజమనుకొనుట.
 • 🟒 మిథ్య : నిజము అనిపించుచున్నవన్నీ విచారించగా కల్పితములేనని కలిగిన నిశ్చయ జ్ఞానము.

ఆధ్యాసను జయించుట :

 • 1. మిథ్యాధ్యాసను జయించుట అనగా అంతా మిథ్య అని ఊరకుండుట.
 • 2. ఇతరాధ్యాసను జయించుట అనగా అంతా తనకు సంబంధము లేని ఇతరమేనని ఊరకుండుట.
 • 3. ఇతరేతరాధ్యాసను జయించుట అనగా ఇతరమును, ఇతరముకంటే ఇతరమును గుర్తించకుండా ఉండుట.
 • 4. సత్యాధ్యాసను జయించుట అనగా తనతో సహా అంతా సత్యమేననియు, అద్వయమనియు తెలిసి ఊరకుండుట.
ప్రకృతి రూపము : 
అణువు, నిత్యము, ఏకము, అక్రియ, అహేతుకము, ఇంద్రియములకు గోచరము కానిది, ఊహకు అందనిది, అవ్యక్తము. అందులో మహత్తు, మహదహంకారము, తన్మాత్రలు, మనస్సు, ఇంద్రియములు, పంచభూతములు, వాటి ధర్మములు మొదలగునవన్నీ క్రియా రూపములో వరుస క్రమముగా వ్యక్తమైనవి. ఆ మాదిరి వ్యక్తమగుటకు ఆ ప్రకృతిలోనే ఉన్న త్రిగుణములు కారణము.

క్రాంతి : 

వెనుకటి అసత్య అర్థానుభవములను తొలగించుచు, సత్యమునకు సంబంధించిన క్రొత్త అర్థానుభవములను ఆవిష్కరించుకొనుట.

క్రాంతి మార్గము :

 • 1. వెనుకటి దోషములను తొలగించుకొనుచు, అభ్యుదయమును చూపే క్రొత్త పద్ధతి.
 • 2. ప్రేయస్సు వలన లభించు భౌతిక సుఖములకు బదులు, శ్రేయస్సుకు సంబంధించిన ఆత్మ సుఖమును చూపు క్రొత్త సాధన పద్ధతి. ఇది శ్రేయోమార్గము కూడా.
 • 3. తమస్సు నుండి జ్యోతి ప్రకాశము వైపుకు తీసుకొనిపోవు క్రొత్త మార్గము.
 • 4. అసత్తునుండి సత్తువైపునకు గొనిపోవు క్రొత్త మార్గము.
 • 5. మృత్యువు, ప్రమాదములనుండి అమృతత్త్వమునకు చేర్చే సాధన మార్గము.

యోగమాయ : 
అవ్యక్తము, అవ్యాకృతము. అవ్యాకృతమనగా వ్యాపించు లక్షణము ఉపసంహరించుకొనునది, తిరిగి వ్యాపించగలిగినది.

సంసార పాశము : 
అనాది కర్మ వాసన చేత అనిర్వచనీయ మాయచేత, ఆత్మ అనాత్మతో కలిసి అనాత్మ భావనము చెంది, ఆత్మను మరచుట చేత సంసార పాశము తగులుకొనెను. ఆత్మానాత్మల కలయికయే చిత్‌జడ గ్రంధి, లేక హృదయ గ్రంధి. గ్రంధి అనగా ముడి. ఈ ముడి పేరే నేను. ఆత్మానాత్మ లెన్నడు కలియవో, హృదయ గ్రంధి వీడును, నేను మాయమగును. ఆత్మను మరచుట అనగా ఆవరణ. తమోగుణ ఆవరణ శక్తి వలన ఆత్మను మరచుట సంభవించెను. అనాత్మ భావన చెందుటయే విక్షేపము. రజోగుణ విక్షేపశక్తి వలన అనాత్మ భావము కలిగెను. ఈ రెండు గుణములు కలిసినదియే అవిద్య లేక అజ్ఞానము. పాశమనగా బంధము. సంసారమనగా ఎన్ని కష్టసుఖములు కలిగినను వైరాగ్యము లేక, విడచిపెట్టలేకపోవుట. పశుపతి అనగా పాశబద్ద్ధులకు ప్రభువు, ఈశ్వరుడు.

ప్రకాశ విధములు : 
సూర్యచంద్రుల ప్రకాశము జడప్రకాశము. అవి ప్రకాశించుచున్నట్లు వాటికి తెలియదు. వాటికి ఏ విధమైన అనుభవము లేదు. దేనికైతే దాని ప్రకాశము తెలుసో, మరియు అనుభవమున్నదో అది జ్ఞాన ప్రకాశము. అది స్వయం ప్రకాశము. స్వయం ప్రకాశానుభూతిగా నుండుటే స్వరూప బ్రహ్మము. శిష్యుడు అదిగానుండుటను స్వస్వరూప సాక్షాత్కారమందురు.

స్వప్రకాశానుభవమును మరచి, తనచేత ప్రకాశింపబడే వాటివలన కలిగే అనుభవములకు స్పందించుట అజ్ఞానము. తెలివితో కూడిన ప్రకాశమే జ్ఞానము. ఈ జ్ఞాన - అజ్ఞాన భేదములు మనస్సున్నంతవరకే. ఆత్మకు ఇవేమీ లేక స్వయం అయి ఉండుటే లక్షణము.

ముక్తికాంత : ముక్తికాంత అనగా మాయా శక్తియే. ఇది సృష్టికి ఉపక్రమించక మునుపు పరాశక్తి. ఉపక్రమించుచున్నప్పుడు ఆద్య శక్తి. ముక్తి కాంతను ప్రార్థించిన వారికి మాయ మర్మము తెలిసి వారు ఆధ్యాస వీడి, చేతన స్వరూపులగుదురు.

అవ్యక్తము : అవ్యక్తమనగా మూల ప్రకృతి, మూలావిద్య, మూలద్రవ్యము, మూల అజ్ఞానము. త్రిగుణముల బీజావస్థ.

వ్యక్తము : వ్యక్తమనగా, విశ్వము. సగుణమయ్యే ఆస్కారమున్న నిర్గుణ బ్రహ్మము.

సంసృతి : 

అన్ని దిక్కులా లోకాంతరములలో తిరుగుచు, జనన మరణ చక్రమందుండుటను సంసృతి అందురు. అందలి జీవితమే సంసార మనబడును. దీనికి భవము అని కూడా పేరున్నది. ఇదంతా అవిద్యా కార్యము.

సృష్టి క్రమము :
సృష్టి క్రమమును అనేక విధములుగా చెప్పెదరు. పంచీకరణ గాను, త్రివృత్కరణముగాను, బ్రహ్మము - అవ్యక్తము - మహదహంకారము - తన్మాత్రలు - అనే క్రమముగాను, ఇంకా ఎన్నో విధములుగా చెప్పెదరు. ఇవి అంత ప్రధానము కాదు. ఎందుకనగా కల్పితముల గురించి ఎలా చెప్పినను ఇబ్బంది లేదు. ప్రధానమైన బ్రహ్మ గురించి మాత్రము ప్రమాణముగా చెప్పవలెను.
తొలుత మహా శూన్యము మాత్రమే ఉండేది. దేశకాల విశ్వము లేవీ లేవు. బ్రహ్మము శివ శక్త్యాత్మక రూపమునకు రాకముందు బిందు రూపములో నుండెను. స్వ ఇచ్ఛ జనించగా బిందు రూపములో స్పందన రాగా, ముందుగా పరాశక్తి రూపమాయ వ్యక్తమయ్యెను. పరాశక్తి నుండి పరా ప్రకృతి వచ్చెను. బ్రహ్మములోనున్న కల్పనాశక్తిని పరాశక్తి అందురు. పరాశక్తి అపరాశక్తిగా మారగా, నాదము వచ్చెను. అదే క్షణములో విశ్వము ప్రకటితమయ్యెను. బిందు రూపము హిరణ్య గర్భముగా మారెను. ఆ గర్భమునుండి బ్రహ్మాండము, బ్రహ్మాండమునుండి అనేక పిండాండములు జనించెను. వాటినుండి చరాచర జగత్తు, జీవరాసులు జనించెను.

ప్రలయ క్రమము :
జీవులు, నిర్జీవులు క్షయమై బ్రహ్మాండము అంతర్ధానమై విష్ణుశక్తిలో లీనమై పోవును. జడ చేతనములు, నరులు, ఇంద్రులు, దేవతలు, పంచభూతములు కాల గర్భములో లుప్తమై పోవును. ప్రలయానంతరము విష్ణు శక్తి సూక్ష్మ స్థాయినుండి సూక్ష్మతర స్థాయికి మారును. విష్ణు తన విభూతిని లుప్తము చేసి నిజ స్థితిలో సమాహితమై, కారణ సముద్రములో శయనించును. మహా విశ్వము అంతము కాగా, జీవ చైతన్యము లుప్తమై పోవును. విష్ణు మాయచేత విశ్వము అస్తిత్వమును కోల్పోవును. మహా శూన్యము మాత్రమే మిగిలియుండును. సకల జీవుల కర్మల ఫలితములు వారి వారి కారణములలో లయమై యుండును. అవన్నీ కలిపి మహా కారణములో నిక్షిప్తమగును. పునఃసృష్టి జరిగేవరకు అలాగే అవ్యక్తమై యుండును.

కారణమునకు కారణము : 
జగత్తు అనబడే కార్యమునకు ప్రకృతి కారణము. ప్రకృతి అనబడే కార్యమునకు పురుషుడు కారణము. పురుషునికి మాయ యందున్న త్రిగుణముల వలన క్షోభ కారణము. దానికి అభివ్యక్తమయ్యే కాలము కారణము. పురుషుడు, గుణములు, కాలము - ఈ మూడింటికి ఉపాదాన కారణము పరమాత్మ పరబ్రహ్మ. అని వేదోపనిషత్తుల ప్రమాణము. కార్యములందు తత్కారణములు అనుస్యూతము. అనగా కార్యముకంటె కారణము వేరు కాదు. కనుక సర్వకారణమైన పరమాత్మ పరబ్రహ్మమే సత్యము. మరింతగా సత్యాన్వేషణ జరిపినచో, త్రిగుణముల క్షోభయే ఈ మాయా జగత్తుకు సర్వకారణము. పరమాత్మ పరబ్రహ్మ దేనికీ కారణము కాదు. అయినను సర్వకారణ పరమాత్మ పరబ్రహ్మను మాయాశబలిత బ్రహ్మముగా చెప్పవచ్చును.

కార్యములు తిరుగా తత్కారణములందు లయమగు విధానము :
ప్రలయ కాలములో దేహాదులు అన్నమందును, అన్నము పృథివి యందును లయము. పృథివి గంధత్వమునందును, అది జలమునందును, జలము రసత్వమునందును, అది అగ్నియందును, అగ్ని రూపత్వము నందును లయము. అది వాయువునందును, వాయువు స్పర్శత్వము నందును లయము. స్పర్శత్వము ఆకాశమందును, ఆకాశము శబ్దత్వము నందును లయము. ఈ క్రమములో అన్నియు లయమగును.

ఇంద్రియములు పంచీకరణ కాకముందున్న వాటి మూలతత్త్వము లందు లయమగును. ఆ మూలతత్త్వములైన అధిష్ఠాన దేవతా శక్తులు వాటి నియామకమగు మనస్సులోను, ఆ మనస్సు పంచతన్మాత్రలకు కూడా కారణమగు అహంకారమందు లయమగును. అహంకారము సర్వజగత్తును మోహింపజేయుచున్న మహత్త్తత్వమునందు లీనమగును.

జ్ఞానక్రియా రూపమగు మహత్తత్వము తన కారణభూతమైన త్రిగుణములందును, అవి అవ్యక్తమందును, అది తనకు మూలమైన, ప్రేరకమైన కాలమందును, కాలము మాయామయుడగు జీవుని యందును, ఆ జీవుడు తిరుగా జన్మాదులు కాని, మార్పు చేర్పులు గాని లేనట్టి నిర్వికార పరబ్రహ్మమందు లయమగును. ఆ పర బ్రహ్మమే మూల కారణము, సర్వ కారణము. కాని త్రిగుణముల ఆశ్రయము వలన జరిగినది గనుక కార్యములు కార్యరూపములు లేనేలేవు. కనుక పరర్రబహ్మము నిజమునకు మాయాతీతము, అసంగము, అచలము, పరిపూర్ణము.

మాయాశబలిత బ్రహ్మము : 
బ్రహ్మము మాయారతుడు. బ్రహ్మానందము తన మాయాశక్తిని విశదీకరించుటయందు కలదు. కనుక ఆనందమనగా మాయాశక్తి యొక్క విశదీకరణ. ఈశ్వరుడుగా, జీవుడుగా, జగత్తుగా విశదీకరణ జరుగుటకు కారణము ఆనందము. అందువలన ఆనంద బ్రహ్మమే మాయాశబలితము. ఆనందము భ్రాంతి లక్షణము. భ్రాంతి రహితమైతే, అచల పరిపూర్ణమే ఉన్నదున్నట్లున్నది.

హిరణ్యగర్భ సృష్టి : 
హిరణ్యగర్భుడనగా సర్వజీవ సమష్టి రూపము. సృష్టికి పూర్వము పరమాత్మ ఒక్కడే ఉండెను. ఆ పరమాత్మ మొదట అనేకము కాని ప్రపంచ రూపముగా వివర్తము చెందెను. అదియే సమష్టి రూపము. పిదప సమష్టి రూపము చిత్ర రూపముగా వివర్తమయ్యెను. అనంతరము సమష్టి చిత్రరూపము సమష్టి జీవరూపముగాను, తరువాత ఆ జీవరూపము అహంకార రూపముతోను, పిమ్మట మనోరూపముతోను, తాదాత్మ్యత చెందెను.

ఆ మనోరూపములు అనేక చిత్తములుగా ఏర్పడెను. అప్పుడు సమష్టి రూపము వ్యష్టిగా అనేక జీవులుగా అయ్యెను. వివర్తమనగా పై విధముగా అయ్యెనని భ్రాంతి. నిజమునకు ఏదీ కాలేదు. హిరణ్యగర్భుడే లేనివాడు. ఉన్నది నిర్వికల్ప పరబ్రహ్మమే.

మాయా విలాసము : 
మూలచేతనమునందు స్పందన తోచెను. ఆ స్పందనమే మాయకు మూలము. ఈ మూలమునే మూలావిద్య అనియు, లెహెర్‌ అనియు ఆది విలాసమనియు, ప్రథమ ప్రేరణ అనియు అందురు. మూలావిద్య కారణముగా మాయాశక్తి ఆవిర్భవించి, ఆ ఒకే ఒక్క శక్తి యొక్క సూక్ష్మాంశము (1) ఇచ్ఛాశక్తి (2) క్రియాశక్తి అనెడు రెండు శక్తులుగా మారి, ఆ రెండు శక్తుల మిశ్రమము యొక్క సూక్ష్మాంశము అయిదై, వెరసి ఆ ఒక్కటియే ఇరువది అయిదై, మరల ముప్పది రెండుగా విభజన చెందెను. 

ఈ ముప్పది రెండుగా నున్నదే జడజగత్తు అనబడును. ఇదే సృష్టి క్రమము.
తిరిగి ముప్పది రెండు ఇరువదైదులోను, ఇరువదైదు ఐదులోను, ఐదు రెండులోను, ఆ రెండు ఒక్కటిలోను లయమై, ఆ ఒక్కటే మాయాశక్తిగా మారి, అది దాని మూలచేతనములో సహజ మిలనమగును. అదియే ప్రలయ క్రమము. కాల ప్రభావమున పునఃసృష్టికి ప్రథమ స్పందనతో మొదలై సృష్టి, ప్రలయములు పునరావృతి చెందుచుండును. దీనికి అంతము లేదు.

పరమాత్మ విలాసము : 
సుస్థిరమైన పరమాత్మ నుండి అస్థిరమగు మనస్సు ఆవిర్భవించును. ఆ మనస్సుకు తాను పరమాత్మ అనెడి జ్ఞానము మరుపగును. ఆ మనస్సే మనస్సు యొక్క ధర్మమును పొందును. మనో ధర్మములైన సంకల్ప వికల్పములు తనవిగా తలచుకొనును. సమష్టి మనోభావమును పొంది హిరణ్యగర్భుడను పేరుతో పూర్వసృష్టి వాసనను బట్టి విరాడ్భావమును పొందుచున్నాడు. అతడి అసత్య సంకల్పముచేత జగద్రూపమగు ఇంద్రజాల విలాసము విస్తారమగును. అనగా హిరణ్య గర్భుడు స్వకీయ సంకల్పముచేత సంక్షోభము చెంది, మందమగు మనస్సుగా మారెను. అప్పుడు సమష్టి జీవభావమును పొందెను. తరువాత పుట్టిన అహంకారము, బుద్ధిల ద్వారా మనో రూపుడయ్యెను. ఆ విధముగా హిరణ్యగర్భుడే భూతకోటికి కారణ రూపుడయ్యెను. అదే సమయములో జీవ శబ్ద వాచ్యుడయ్యెను. అయినను ఇదంతయు ఇంద్రజాలమే గాని, సత్యము కాదు. అందువలన ఇది పరమాత్మ విలాసమనబడును.

భగవంతుని లీలా వినోదము : 
ఈ కనబడేదంతా ఇంద్రజాలమువలె తోచినది. జీవాత్మ యొక్క విక్షేప దృష్టిచే నానాత్వముగాను, భిన్నత్వముగాను, నామరూప క్రియాత్మకముగాను కనిపించుచున్నది. అవిద్యా దోషము లేని ఈశ్వరుని దృష్టిలో అది ఏకము, అభేదము. అయినను అది లేకనే ఉన్నట్లు ఇంద్రజాలమువలె తోచినదని తెలిసిన ఈశ్వరునికి లీలా వినోదము. ఈశ్వరుని ఈక్షణా విశ్వాసము కొనసాగుచున్నంత వరకు సృష్టి స్థితి లయములు, త్రిగుణాత్మక భావనలు, అనుభవములు, వివిధ స్వభావములతో కూడిన జీవాత్మల సంసారములను, ఆ జీవుల ఉపభోగములైన పితృ పుత్రాది రూపములను, అన్నీ చక్ర భ్రమణముగా కొనసాగుచునే యుండును. నిరుపాధికుడైన ఈశ్వరునికి ఏ బాధ లేనందునను, మాయకు వశుడు కానందునను, ఇవన్నీ లీలా వినోదముగానే యుండును.

కాలరూపమైన బ్రహ్మ వల్లనే బ్రహ్మాండ పిండాండముల కల్పన, ఉనికి, నాశము జరుగుచున్నది. మాయకు ఆశ్రయము కాని త్రిపాద బ్రహ్మము అచల పరిపూర్ణమై యుండగా మాయకు ఆశ్రయమైన ఏకపాద బ్రహ్మమునకే ఈ లీలా వినోదము. అందువల్లనే ఈ బ్రహ్మము సగుణము, మాయాశబలితము. లీల అనగా కదలిక, అస్పష్టము, స్వప్నతుల్యము అని అర్థము. ఈ లీలయే భగవంతుని లీలా వినోదమనబడును.

ఎరుక : 

మలినపుటెరుక అనగా అజ్ఞానము. శుద్ధ ఎరుక అనగా జ్ఞానము. అఖండ ఎరుక అనగా బ్రహ్మాండము, దాని అధిష్ఠానము, పిండాండములు, వాటి జీవాహంకారములు, ఈ నాలుగూ కలిసి ఒక్కటైనది. కేవలపు టెరుక అనగా మాయయందలి కేవల సత్వగుణము వలన కల్పించబడిన త్రిమూర్తులు, అధిష్ఠాన దేవతల శక్తిరూపము. మలినపు టెరుక అనగా తమోగుణము వలన ఏర్పడిన నామరూప నానావిధ భేదములుగా నున్న జగత్తు మరియు ప్రాణుల ఉపాధులు.

 • మిశ్రమపుటెరుక అనగా జీవులుగా, ప్రాణులుగా ఉన్న స్పందన రూపము. ఇది సత్వగుణ తమోగుణములు మిశ్రమముగా పుట్టిన రజోగుణము.
 • అన్ని విధముల ఎరుకలుగా నున్న క్రియలు, అనుభవములు, స్పందనలు, వికారములు అన్నీ త్రిగుణముల వలన కల్పితమై జరుగుచున్నందున, సర్వము మాయా కార్యమే. అనగా ఎరుక ఏనాడూ ఏమీలేదు. కల్పిత ఎరుక గనుక, అది లేనెరుక. ఎరుక యొక్క లేమితనమే పరారూప ఎరుక.
 • లేనేరుక లేకుండా చేసుకొనుటయే పరమపద మార్గము. లేనెరుక లేకుండా పోవుటయే పరమపదము. భ్రాంతి రహితము, మాయాత్పరము, త్రిగుణ రహితము. పరమపదమన్నా, అచల పరిపూర్ణమన్నా, బట్టబయలన్నా ఒక్కటే.
 • ఎరుకన్నా, మరుపన్నా, అజ్ఞానమన్నా, జ్ఞానమన్నా, విజ్ఞానమన్నా, చైతన్యమన్నా, ఎరిగే ఎరుకన్నా, ప్రజ్ఞానమన్నా ఒక్కటే. ఇవన్నీ పోతేనే బట్టబయలు.

ఎరుక యొక్క రూపములు :

 •  1. తేలికైన శుద్ధమైన ఎరుకను సంజ్ఞానమందురు.
 •  2. ఆజ్ఞా చక్రమందుండెడి ఆజ్ఞేయ ఎరుకను ఆజ్ఞానమందురు.
 •  3. వివేకముతో కూడిన విశేష ఎరుకను విజ్ఞానమందురు.
 •  4. ప్రకృష్ఠమైన ప్రశాంత ఎరుకను ప్రజ్ఞానమందురు.
 •  5. జ్ఞాపక సామర్థ్యపు ఎరుకను మేధా అందురు.
 •  6. ఇంద్రియార్థములైన ఇంద్రియ మూలకమైన ఎరుకను దృష్టి అందురు.
 •  7. క్రుంగిన ఇంద్రియములను ధైర్యముతో పైకెత్తిన ఎరుకను ధృతి అందురు.
 •  8. విషయ నిశ్చయమైన ఎరుకను మతి అందురు.
 •  9. స్వతంత్రమైన నిశ్చయాత్మకమైన బుద్ధిని మనీషా అందురు.
 • 10. రోగాదులవలన నలిగిన ఎరుకను జూతి అందురు.
 • 11. విషయములు దాచబడినప్పటి ఎరుకను స్మృతి అందురు.
 • 12. ఆలోచనల ఆరంభ స్థితిగా నున్న ఎరుకను సంకల్పము అందురు.
 • 13. ఎరుగబడుచున్నట్టి ఎరుకను క్రతువు అందురు.
 • 14. లయబద్ధ రూప ఎరుకను ఊపిరి అందురు.
 • 15. కోరికల రూప ఎరుకను కామమందురు.
 • 16. మాయావశమైన ఎరుకను ఈక్షణ అందురు.
 • 17. కర్తృత్వ భోక్తృత్వ రూప ఎరుకను కర్మ అందురు.
 • 18. తమోగుణ రూప ఎరుకను జగత్తు అందురు.
 • 19. తమోగుణ సత్వగుణ మిశ్రమరూప ఎరుకను జీవులందురు.
 • 20. సత్వగుణ రూప ఎరుకను దేవతలందురు.
 • 21. అవిద్యా వశమైన ఎరుకను వశమందురు.
 • 22. సత్‌ చిత్‌ ఆనంద రూప ఎరుకను బ్రహ్మమందురు.
 • 23. ఘనరూప అఖండ ఎరుకను పరబ్రహ్మమందురు.
 • 24. తిరిగి ద్రవరూప వ్యాపకము కాని ఘన రూప అఖండ ఎరుకను బయలు అందురు.
 • 25. ఆ ఘనరూప అఖండ ఎరుకను కూడా విడచితే బట్టబయలే ఉన్నది.
కం||  ఎరుకే ఇహపర సౌఖ్యము | లెరుకే జ్ఞానంబు జ్ఞేయ మెరుకే
మోక్షం|    బెరుకే భక్తి విరక్తులు - యెరుకే
సంకల్పమని నీవెరుగు సత్కీర్తీ | ఎక్కడికౌరా యెరుక సంపూర్తీ ||

ఎరుక కానిది, ఎరుక లేనిది, ఎరుకకుము మూలము కానిది, ఎరుక యొక్క ఏరూపమూ కానిది, ఎరుకను పుట్టించనిది, ఎరుకను తనలోనికి లయము చేసుకొననిది ఏదో అదే బట్టబయలు, అచలము, పరిపూర్ణము, శాశ్వతము, పరమపదమనెడి తిరిగిరాని మోక్షము.


మాయ ద్వారము : 
కేవల స్వయంప్రకాశ, నిర్వికార అచల బ్రహ్మమే ఉన్నది. మాయ ఆ బ్రహ్మమును ఏక దేశీయముగా ఆశ్రయించగా, మాయకు ఆవలి బ్రహ్మము మూడు పాదములు ఉన్నదున్నట్లున్నది. ఒక్క పాదము బ్రహ్మ కూడా అలాగే ఉన్ననూ, ఆ బ్రహ్మ స్వయం ప్రకాశమై యుండి కూడా, మాయావరణయందు కూడా ప్రకాశించుచుండెను. మాయ త్రిగుణాత్మము గనుక మాయావరణమందున్న బ్రహ్మ ప్రకాశము సగుణము. మాయలేనిది గనుక, సగుణ బ్రహ్మము లేనిదే. అయినను భ్రాంతిమయ సృష్టికిని, జగత్తు, ఈశ్వర, జీవులకు సర్వ కారణము గనుక, ఆ లేని బ్రహ్మమునకు మాయాశబలిత బ్రహ్మమని ప్రతీతి. నిజమునకు ప్రతీతికాదు గనుక బ్రహ్మము నిర్గుణమే. మాయ కావలి బ్రహ్మము సగుణ నిర్గుణాతీతము, త్రిగుణ రహితము.
 • త్రిగుణ రహిత బ్రహ్మము మాయ ద్వారము గుండా మాయా వరణములోనికి ప్రకాశించుచున్నట్లు తోచెను. ఆవరణయందు అంతకు ముందు పెను చీకటివంటి తమస్సున్నది. ఆ తమస్సును మాయాశబలిత బ్రహ్మ ప్రకాశము ప్రకాశవంతము చేయగా బ్రహ్మాండ పిండాండములు  వ్యక్తమయ్యెను. మాయావరణ ప్రకాశము పరమాత్మ అనియు, చిత్‌ అనియు చెప్పబడెను. ఈ రెండింటి కలయికలో అనగా ముడిలో ఉనికి స్ఫురించెను. అదే అధిష్ఠాన రూపమున ఈశ్వరుడు, జీవులు అయ్యెను. మానవులలో ఆ ఉనికి స్ఫురణమే అహం స్ఫురణగా నేనుగా చెప్పబడెను. చిత్‌ జడ గ్రంధి వీడితే నేను ఉండదు.
 • నేనుకు సోహం జ్ఞానమున్నది.మానవోపాధి వెలుపల అది శివ స్వరూపము, పరమాత్మ, మాయాశబలిత బ్రహ్మము. ఈ బ్రహ్మమే సగుణము. మాయ లేనిది గనుక సగుణ బ్రహ్మ నిజము కాదు. నిజానికి ఆ బ్రహ్మమే నిర్గుణము. మాయ ద్వారమునకు ఆవలి బ్రహ్మము సగుణ నిర్గుణాతీతము, త్రిగుణ రహితము.
 • కనుక సత్‌ చిత్‌ ఆనందము సగుణము, కల్పితము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నిర్గుణము, సత్‌చిదానంద ఘనము, ప్రజ్ఞాన ఘనము, చిత్‌ ఘనము, ఆనంద ఘనము, సత్‌చిత్‌ఆనంద స్వరూపము, విజ్ఞానము, విజ్ఞాన స్వరూపము. సాధకునికి అపరోక్షానుభూతి.
 • మాయ ద్వారమునకు ఆవలి బ్రహ్మము అచల పరిపూర్ణము, స్వస్వరూపము, స్వయంప్రకాశము, స్వప్రకాశము, ఉన్నదున్నట్లున్నది. పరబయలు అని పేరులు. సచ్ఛిష్యుల విషయములో దీనినే స్వస్వరూప సాక్షాత్కారమని అందురు.
తూలావిద్య - మూలా విద్య : 
దృష్టాంతమందు రజితముగా గోచరించుటకు శుక్తి ఆధారమనియు, పాముగా గోచరించుటకు త్రాడు ఆధారమని సూచన చేయుటను తూలా విద్య అందురు. అధిష్ఠాన బ్రహ్మమందు జగత్తు ఆరోపించబడినట్లు తెలుపునది తూలావిద్య. ఆధార ఆధేయ పద్ధతిగా తెలియజేయునది తూలా విద్య. ఇచ్చట ఆధార బ్రహ్మము సగుణము, లేక నిర్గుణమైనను సగుణమయ్యే ఆస్కారమున్నది. దీనిలోనే క్షరాక్షరములు, అజ్ఞాన జ్ఞానములు, క్షేత్ర క్షేత్రజ్ఞులు చెప్పబడినవి. ఇచ్చట జ్ఞానము వలన అజ్ఞానము నశించును. క్షేత్రజ్ఞ అనుభవము కలిగినతంటనే క్షేత్రములు మిథ్యయగును. త్రాడు జ్ఞానము కలిగినంతటనే, పాము ఉండదు.

మూలావిద్యయే సర్వ కారణము. బ్రహ్మము ఆధారము కాదు. ఒకవేళ ఆధారమని చెప్పిన, అది మాయాశబలిత బ్రహ్మమనబడును. తూలా విద్య మాయాశబలిత బ్రహ్మను మాత్రమే నిర్ణయించును. మూలా విద్యమర్మము తెలిసిన వారికి జ్ఞానాజ్ఞానములు రెండూ లేవు. కార్యకారణములు లేవు. త్రాడు పాములు రెండూ లేవు. ఉన్నదేదో ఉన్నది. అది అచలము, పరిపూర్ణము, నిత్యము, నిర్వికారము. సాధన చేత పొందబడేది కాదు. సిద్ధ వస్తువు, అద్వయము. తూలా విద్య మూలా విద్యలోని భాగమే. తూలా విద్య సగుణ బ్రహ్మమును అందించగా, మూలా విద్య దానిని కూడా నిరాకరించి, స్వస్వరూప సాక్షాత్కారమునందించును.

త్రిపురా :
 • 1. త్రిమూర్తుల శరీరములు మూడు కలసి త్రిపురము
 • 2. సోమ సూర్య అనలాత్మకమైనది త్రిపురము
 • 3. త్రికోణాత్మక మండలము, త్రిరేఖాత్మకమగు భూపురము, మూడక్షరములు కల మంత్రము - ఈ మూడూ కలిసినది త్రిపురము.
 • 4. శ్రీ చక్రమందున్న మూడు రేఖలు త్రిపురము.
 • 5. అవస్థాత్రయము త్రిపురము.
 • 6. భూఃభువఃసువః లోకత్రయము త్రిపురము.
 • 7. స్వర్గ మర్త్య పాతాళ లోకత్రయము త్రిపురము.
 • 8. త్రిగుణములు త్రిపురము.

వీటన్నింటికీ కారణము, అనుస్యూతము, అధీశ్వరి అయినది త్రిపురా. ఈమెయే త్రిపురాధీశ్వరీ, త్రిపురాసుందరీ.

పురా అనగా పూర్వమే ఉన్నదని మరొక అర్థము. అనగా త్రిపురము లున్ననూ, లేకున్ననూ సదా ఉండునది త్రిపురా సుందరీ. త్రిగుణములలో ఉంటూనే, త్రిగుణములకు ఆధారమై యుండికూడా, త్రిగుణాతీతమైనదియే త్రిపురాసుందరీ. ఈమెయే స్వరూపమందు పరాశక్తి. త్రిపురములందు ఆదిశక్తి. ఇదియే మాయాశక్తి. త్రిమూర్తులందు సరస్వతీ, లక్ష్మీ, గౌరీగా ఉన్న పరాశక్తి ఈమెయే. ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ పరాశక్తియే. సర్వము త్రిపురములుగా, త్రిపుటులుగా ఉన్నది. అందున్నది ఆది పరాశక్తియైన త్రిపురా సుందరీ ఒక్కటే. ఆమె లేని త్రిపుటులు లేవు. ఆమె కరుణ చేతనే మాయ మాయమై, భ్రాంతి రహితమగును.

శ్రీ చక్రము
శ్రీ చక్రము

శ్రీ చక్రము :

 • 1. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అనెడి శక్తి త్రయము కలది శ్రీచక్రము.
 • 2. అవస్థాత్రయము కలది శ్రీచక్రము.
 • 3. త్రిగుణములుగా ప్రకాశించునది శ్రీచక్రము.
 • 4. ప్రాతఃకాలములో గాయత్రిగాను, మధ్యాహ్నము సావిత్రిగాను, సాయంత్రమున సరస్వతీ గాను ఉండునది శ్రీచక్రము.
 • 5. అవస్థాత్రయాభిమానులైన విశ్వ తైజస ప్రాజ్ఞులుగా నుండునది శ్రీచక్రము.
 • 6. బిందువు నుండి తామసీ శక్తి శాంకరీగాను, నాదమునుండి రాజసీ శక్తి సరస్వతీగాను, బీజమునుండి సాత్విక శక్తి లక్ష్మీదేవిగాను జన్మించినది శ్రీచక్రము.
 • 7. జ్ఞాన, ఇచ్ఛా, క్రియా శక్తుల వలన జన్మించిన పురుషులే త్రిమూర్తులు.
 • 8. అథోముఖముగానున్న నాలుగు కోణములు శివచక్రము. ఊర్థ్వ ముఖముగా నున్న అయిదు కోణములు శక్తి చక్రము. ఈ రెండూ కలసి శివశక్తి స్వరూపము ఒక్కటే. అదే శ్రీచక్రము. తొమ్మిది కోణములతో కూడిన శివ శక్త్యాత్మకమైనదే ప్రపంచము. కనుక ప్రపంచమంతా శ్రీచక్రమే.
 • 9. శివశక్త్యాత్మకమైన అర్థనారీశ్వర శరీరమే ఉన్నది. అంతా అదే. శివుడనగా బిందువు. శక్తి అనగా త్రికోణాంతర్గతము. బిందువు శివ స్వరూపము. బీజము శక్తి రూపము. అయినను బిందువు త్రికోణములు అభేదము. ఒకే నాణెమునకు బొమ్మ బొరుసువంటిది. అంకురించే శక్తిగల విత్తనము వంటిది.
 • 10. శ్రీచక్రమే చరాచర జగత్తుగా నున్నది. చరమనగా పిండాండము. అచరమనగా బ్రహ్మాండము.
 • 11. సర్వశక్తులకు అతీతమైనది బిందు స్వరూపము ఒక్కటే. అదియును శ్రీ చక్రమే. బిందువునుండి త్రిపురాసుందరీ సమస్త లోకములను ఉత్పత్తి స్థితి లయములను చేయుచున్నది. శ్రీ చక్రము త్రిపురాసుందరీ ఒక్కటే.
 • 12. శ్రీచక్రమునకు మాతృకా చక్రమని పేరు. అ నుండి క్ష వరకు గల ఏబది అక్షరములను అక్షరమాల అందురు. ఇవి మాతృ స్థానీయములు. వీటిలో అచ్చులు పదునారు, శక్తి వర్ణములనబడును. హల్లులు ముప్పది నాలుగు శివ వర్ణములనబడును. ఈ ఏబది కలసి శివశక్తి వర్ణములు. ఇవి శబ్దార్థములను పోషించును. శక్తిలేని శబ్దములకు అర్థము లేదు. శబ్దములను ఆశ్రయించని శక్తి అర్థము నీయజాలదు. సమస్త శబ్దములను ధరించి యున్నది పార్వతీ దేవి. వాటిలోని అర్థ జ్ఞానమంతా శివునిచేత ధరించబడి యున్నది. ఈ రెండింటిలో అక్షర సముదాయములయొక్క శబ్దము ఆ శబ్దము సూచించే అర్థము ఈ రెండూ ఉంటేనే సృష్టి. లేకుంటే లేదు. శబ్ద శబ్దార్థములే శివశక్త్యాత్మకము. శివ శక్తి ఒక్కటైనదే త్రిపురా యొక్క శబ్దశబ్దార్థము.
 • 13. అయిదు కోణముల శక్తి చక్రమునుండి పంచభూతములు ఉద్భవించినవి. నాల్గు కోణము శివ చక్రమునుండి మాయ, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు ఉద్భవించెను. ఈ తొమ్మిది పదార్ధములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, పంచతన్మాత్రలు మనస్సు అనెడి పదునారు కలసి వెరసి మొత్తము (9+16) ఇరువది ఐదు తత్త్వములైనవి. ఈ ఇరవదియైదు తత్త్వములే శ్రీచక్రము. శ్రీ చక్రము నుండియే చరాచర జగత్తు, అనగా పిండాండ బ్రహ్మాండములు ఉద్భవించెను. ఇదంతయు కూడా శివ శక్తి స్వరూపమే, అనగా శ్రీ చక్రమే.

ఇక్కడ చెప్పబడిన అంశములన్నీ మాయా విలాసమే శ్రీచక్ర విలాసమే. శివశక్త్యాత్మకమైన భగవంతుని లీల.

అనుభూతి - భ్రమ :
క్రొత్తగా ఏ అనుభూతి ఉండదు. ఉంటే ఒక అనుభూతికి పాత అనుభూతి ఆధారమైయుండును. అనుభూతి పాతదే అయినా క్రొత్తగా అనిపించును. అనుభూతి ఏదైనా కాని భ్రమకు దారి తీయును. భ్రమ తృప్తికరముగా ఉండును. అందువలన ఆ భ్రమనే అట్టిపెట్టుకుని ఉందురు. ఒక్కొక్కసారి భ్రమ వలన బాధ కాని, భయము కాని కలుగవచ్చును. ఆ బాధ భయములే మన అసంపూర్ణతను బయటపెట్టును. సంపూర్ణతను పొందే లక్ష్యములో, మరల మరింతగా భ్రమతో ఐక్యమయ్యేలా తొందర కలుగును.
 • వర్తమాన అనుభూతిని గతానుభూతితో పోల్చుకోకుండా స్వీకరించవలెను. అలా స్వీకరించుట కొఱకు ఉదాసీనముగా ఉండవలెను. అప్పుడే క్రొత్త అనుభూతి తెలియబడును. భ్రమ నుండి విముక్తి లభించును.
 • అనుభవించేదీ, అనుభవము రెండూ ఉన్నప్పుడు సంఘర్షణ, భ్రమ ఉండును. అనుభవించేదీ, అనుభవము - ఈ రెండింటి ఐక్యతలో ఏది మిగిలియుండునో, అది నిర్విషయము. అట్టి నిర్విషయమునకు గతము ఉండదు, భవిష్యత్తు ఉండదు. వర్తమానము నిత్య నూతనముగా కొనసాగు చుండును. ఇట్టి అనుభూతి మాత్రమే భ్రమరహితము, సత్యము.
 • వర్తమానములో ఉండక, ఊహే ప్రధానముగా ఉండుటను మానవలెను. వర్తమానమును స్వీకరించక, గతముతో పోల్చుకొనే ఆలోచనలను మానవలెను. అలా మానకుంటే గతము, ఆలోచన, భవిష్యత్తు, ఊహ- ఇవన్నీ భ్రమలే. ఊహలను, ఆలోచనలను, ఆదర్శములను అవతలకు నెట్టివేసినచో భ్రమలు తొలగును. అప్పుడు మాత్రమే సత్యము గోచరించును. సత్యమును గురించిన జ్ఞానము ఉదయించగానే అనుభవించేవాడు లేకుండా పోవును. అనుభూతి మాత్రమే మిగులును.
 • అనుభవించేది ఉన్నంతవరకు తన్ను తాను వేరు చేసుకొనలేడు, ద్వైతమును తెచ్చిపెట్టుకొనుచునే యుండును. ఒక అనుభూతి నుండి మరొక అనుభూతికి ప్రయత్నించుచు ఉంటే భ్రమ ఎట్లు తొలగును? భ్రమలు పోతేనే గాని, అనుభూతియే తానైన అద్వైతము సిద్ధించదు. ఇదియే అపరోక్షానుభూతి.
సత్యాన్వేషణ అసాధ్యము :

మనస్సు, బుద్ధి, అహంకారములున్నంత వరకు సత్యమును కనుక్కునేవారే లేరు. అంతఃకరణ వృత్తులున్నంతవరకు సత్యము తెలియబడదు. అంతఃకరణ చతుష్టయముతో చేసే సత్యాన్వేషణ ఫలించదు. ఏ ప్రయత్నమైనా కల్పిత లక్ష్యమును పొందగలవే గాని, సత్యమును తెలుసుకొనుట గాని, పొందుట గాని అసాధ్యము. సత్యము సాధనలచేత వచ్చేది కాదు, చేరుకునే లక్ష్యము కాదు. క్రమశిక్షణ, ప్రతిఘటన, సంఘర్షణల వలన వచ్చేది కాదు. ఇష్టముతో చేసేవి, బలవంతముగా చేసేవి, శాస్త్ర ప్రకారము చేసేవి, గురువు బోధించినట్లుగా చేసేవి - ఇవేవీ సత్యమును అందిపుచ్చుకొనలేవు. కాకపోతే అవన్నీ అసత్యమును క్రమముగా నివృత్తి చేయగలవు.

ధ్యాన యోగ పద్ధతులన్నీ సత్యమును కనుగొనుటకు గల అవరోధములను తొలగించగలవు. సత్యమును తెలుసుకొనుటకు సమీపముగా తీసుకొని పోగలవు. సత్యాన్వేషి యోగ్యుడగుటకు ఉపయోగపడునే గాని, సత్యము దొఱకదు.

అన్ని సాధనల అవసరము తీరిపోయిన పిదప, అవరోధములన్నీ తొలగిన వెంటనే, అన్ని సాధనలు వాటికవే ముగిసినంతటనే, ఒకానొక సహజ నిష్క్రియా స్థితి కలిగినప్పుడు సత్యము ఆవిష్కరించబడును. అసత్య సంస్కారములు నశించినప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారములు కూడా నశించును. అవేమీ లేనప్పుడు మాత్రమే సత్యము ఆవిష్కరింపబడి సత్య ప్రతిష్ఠ జరుగును.

మనస్సు నిర్విషయమై అమనస్కము కావలెను. చిత్త వృత్తులు నశించి, చిత్త నాశనము కావలెను. అహం స్ఫురణ ఆగిపోయి మూలాహంకారము నశించవలెను. చంచల బుద్ధి నిశ్చల బుద్ధిగా మారి ప్రజ్ఞాన ఘనుడు కావలెను. అప్పుడే సత్య ప్రతిష్ఠ జరుగును. నిష్క్రియ, మౌనము, నిర్వికల్పము, నిశ్చలత, నిశ్శబ్దము, వాసనాక్షయము వంటివి ఎప్పుడు సహజమగునో, అప్పుడే సత్య ప్రతిష్ఠ జరుగును. అప్పుడు సత్వాన్వేషి మిగలడు. దానిని అపరోక్షానుభూతి అని గాని, స్వస్వరూప సాక్షాత్కారమని గాని, అచలము, పరిపూర్ణము అనిగాని పేరు పెట్టవచ్చును.

ఏయాపేక్ష జనించిన, ఆయాపేక్షలెల్ల మాయయని, తెలియదగున్‌|
ఆయాసమౌను దానను ఛాయని, అది విడువదగును, క్షేమము కొఱకై||

సీ||   చైతన్య మనియన్న  క్షేత్రజ్ఞుడనియన్న జ్ఞానమన్నను నహంకారమన్న| సద్రూపమనియన్న చిద్రూపమనియన్న | స్వస్వరూపంబన్న సాక్షియన్న | ఈశ్వరుడనియన్న నిలవిష్ణువనియన్న | పరమాత్మయనియన్న బ్రహ్మమన్న| యాది శక్త్యనియన్న యానందమనియన్న | పరమ పదంబన్న ప్రకృతియన్న

గీ||   మాయకేయిన్ని బహునామధేయములును | బట్టబయలందు నొకపేరు బుట్టలేదు  ||రమ్య గుణ ధామ భద్రాద్రిరామ పరుశు | రామ నరసింహ్వదాస సంరక్షితాహ్వ ||

 - భద్రాద్రి రామ శతకము

సంకలనం: చల్లపల్లి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top