ముద్రలు ముద్రలు – రకములు శ్లో|| మోదనాత్ సర్వ దేవానాం ద్రావణాత్ పాపసంతతేః తస్మాన్ముద్రేతి విఖ్యాతః మునిభిస్తన్త్ర వేదిభిః || (మంత్ర మహ...
![]() |
ముద్రలు |
ముద్రలు – రకములు
శ్లో|| మోదనాత్ సర్వ దేవానాం ద్రావణాత్ పాపసంతతేః
తస్మాన్ముద్రేతి విఖ్యాతః మునిభిస్తన్త్ర వేదిభిః || (మంత్ర మహోదధి)
→ ము అంటే మోదము, సంతోషము కలిగించునది,
→ ద్రా అంటే పాపములను క్షయింప జేయునది.
ఒక్కో దేవతకు ఒక్కో పూజావిధానము, ధ్యాన శ్లోకము, మంత్రము, యంత్రము, తంత్రము వుంటుంది. తంత్రము అంటే పూజా విధానము. ఆయా దేవతల పూజా కల్పము ననుసరించి ధ్యాన ముద్రలు వుంటాయి. ఆయా దేవతలను ఉపాసించు సమయమున ఆయా దేవతలకు ఇష్టమైన ముద్రలను ప్రదర్శించాలి. ఆయా దేవతల హస్తముల యందు ధరించిన ఆయుధములను, వస్తువులను ప్రదర్శించుట ముద్ర అని అందురు. ఒక్కో దేవత ఒక్కో ముద్ర పట్టుకొని వుంటుంది. జప పూజాదుల సమయము నందు ఆయా ముద్రలను ప్రదర్శించి ఆయా దేవతల కరుణాకటాక్షములను, ప్రసన్నం చేసుకోవడానికి ముద్రలను ప్రదర్శిస్తూ వుంటారు. ముద్రలు దేవతలకు ప్రీతీ కలిగిస్తాయి. గాయత్రీ జప సాధనయందు కూడా పూర్వ ముద్రాః, ఉత్తర ముద్రాః అని ముద్రలు ప్రదర్శించుట శిష్టాచారముగా గలదు.
శ్రీవిద్యోపాసకులు ముఖ్యముగా శ్రీచక్రార్చన యందు ఆవాహనాది ముద్రలు, మరియు దశ ముద్రలు ప్రదర్శించెదరు. శ్రీచక్రము నందు త్రైలోక్య మోహన చక్రము నందు మూడు వృత్తములు గలవు. వీటిని భూపుర త్రయము అని అందురు.
మొదటి భూపురము నందు అణిమాది అష్ట సిద్దులు, రెండవ భూపురము నందు బ్రాహ్మి మొదలగు అష్ట మాతృకలు గలరు. వీటిలో మూడవదైన తృతీయ భూపురము నందు దశ ముద్రా శక్తులు గలవు. ఆయా దేవతల పేర్లు,
→ సర్వ సంక్షోభిని,
→ సర్వ విద్రావిణి,
→ సర్వాకర్శిణి,
→ సర్వ వశంకరి,
→ సర్వోన్మాదిని,
→ సర్వ మహాంకుశ,
→ సర్వ ఖేచరి,
→ సర్వ బీజ,
→ సర్వ యోని,
→ సర్వ త్రిఖండ.
ఈ దశ దేవతలకు దశ ముద్రలు గలవు. ఈ దశ ముద్రలతో ఆయా దేవతలను ఆవాహన చేయుదురు. (భాస్కరరాయల వారి సేతు బంధనము)
ఆవాహనాది ముద్రలు.:-
౧. ఆవాహన,
౨, సంస్థాపన,
౩, సన్నిధాపన,
౪, సన్నిరోధన,
౫, సంముఖీకరణ,
౬, అవగుంఠన,
౭, సకలీకరణ,
౮, అమృతీకారణ,
౯, పరిమీకరణ,
౧౦, నమస్కార ముద్ర. (ఇవి గురువుల వద్ద నేర్చుకోనవలెను)
నైవేద్య ముద్రలు
యజమాని కుడి చేతి వైపు నీళ్ళు చల్లి , మత్స్య ముద్ర తో, చంధనముతో, చతురస్రము, దానిలో వృత్తము లిఖించ వలెను. దాని పైన మహా నివేదన పాత్ర వుంచవలెను. గాలినీ ముద్రతో విషమును వడ కట్టి, గరుడ ముద్రతో ఆ విషమును హరించి, ధేను ముద్రతో అమృతీకరణము గావించి, గాయత్రీ మంత్రముతో ప్రోక్షణ గావించి పంచ ప్రాణములకు, పంచ ఆహుతులు, పంచ ముద్రలతో సమర్పించ వలెను స్వాహా కారముతో.
విష్ణు ముద్రలు:- శంఖ, చక్ర, గదా, పద్మ, వేణు, శ్రీవత్స, కౌస్తుభ, వనమాల, జ్ఞాన, బిల్వ, గరుడ, నారసింహి, వారాహి, హయగ్రీవి, ధనుః, బాణ, పరశు, జగన్మోహిని, కామ అను ఈ 19 ముద్రలు విష్ణు ప్రియమైనవి.
ఇలా ఒక్కో దేవతకు ఒక్కో ముద్ర గలదు.
కుంభ ముద్రతో అభిషేకము, పద్మ ముద్ర తో ఆసన శుద్ధి చేయవలెను.
తామర పువ్వు సమర్పించడానికి త్రిఖండ ముద్ర వేసి చూపించెదరు.
ఇలా వివిధ మైన ముద్రలతో చివరన సర్వ ఖేచరీ ముద్ర, యోని ముద్రలతో పూజ, అర్చన పరి సమాప్తము అగును. ఆయా దేవతల ముద్రలు గురువుల వద్ద నేర్చుకొన వలెను.
రచన: భాస్కరానంద నాథ గారు