తీర్ధ యాత్రికులతో సాధువులు ! |
:: తీర్ధ యాత్రా ఫలం ::
ధార్మికులైన వారు కష్ట పడుతున్నారు, బాధ పడుతున్నారు, అధార్మికులు సుఖ పడుతున్నారు. పాపం చేసే వారు హాయిగా వున్నారు, పుణ్యాత్ములు కష్ట పడుతున్నారు. మంచితనానికి మనుగడ లేదా ? దేవుడు వున్నాడా అని మనలో చాలా మంది అడుగుతూ వుంటారు. ఇదిగో సరిగ్గా ఇదే ప్రశ్నను మహాభారతములో ధర్మ రాజు అడిగినాడు రోమశ మహర్షిని. ఈ ధర్మ సందేహం బడబాగ్ని వలె ధర్మ రాజును బాధిస్తూ వుండేది. పుణ్య చరితులైన పాండవులు అడవుల పాలైనారు, ఇదేమి న్యాయం అని మనకు అనిపిస్తూ వుంటుంది.
ధర్మరాజు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం ప్రత్యక్షంగా చెప్పిన వారు ఇద్దరు,
౧, రోమశుడు
౨. మార్కండేయుడు
పరోక్షంగా చెప్పిన వారు మరొక ఇద్దరు ..
౧. వేద వ్యాసుడు,
౨. ధౌమ్యుడు.
ధర్మ రాజు వెంట వేద విప్రులు కూడా వున్నారు. హితమును కోరే వేద బ్రాహ్మణులను వెంట పెట్టుకోవాలి అనేది ఇది మనకు చెబుతుంది. ధర్మ విషయాన్ని చెప్పే బ్రాహ్మణులు మన వెంట వుండాలి. పదిమంది హితమును కోరే వేద విప్రులు మనకు ధర్మ సూక్ష్మములను చెప్పి దిశానిర్దేశం చేస్తారు. అందుకు కావాలి బ్రాహ్మణులు సమాజమునకు.
తీర్ధ యాత్రల పట్ల ఆసక్తితో మొదట నారదుడి వలన తీర్ధాల పేర్లు, మహిమలు తెలుసుకొన్నాడు. ధౌమ్యుడి వలన ప్రేరితుడై తీర్ధయాత్రలు చేయాలని సంకల్పించినాడు. రోమశ మహర్షి వలన వివిధ తీర్ధ మహత్వ గాధలను అడిగి చెప్పించుకొని, తరించినాడు. తీర్ధాలలో మునిగి దివ్య దృష్టిని, దూర శ్రవణ శక్తిని పొంది, దివ్య లోకాలను దర్శించినాడు.
తపస్సు వలన దివ్య లోక గమన శక్తిని అర్జునుడు సాధిస్తే, ధర్మజుడు కర్మ మార్గములో తీర్ధ సేవా పుణ్య ఫలంగా సంపాదించ గలిగాడు. చాలా మంది అడుగుతూ వుంటారు తీర్ధ యాత్రల వలన ఏమి లాభం అని? దేవుడు ఎక్కడ లేడు, కాశీలోనే వున్నాడా ? ఇక్కడ లేడా? డబ్బులు దండగ అని. అటువంటి వారికి ఇది సమాధానం. భారతీయ గార్హస్థ్య ధర్మంలో, కర్మ పద్ధతిలో తీర్ధ యాత్రా వ్రతాన్ని పెద్దలను అడిగి తెలుసుకొని, ఆచరించి, తత్ఫలితాన్ని సంపూర్ణముగా సాధించిన ఏకైక మహాత్ముడు ధర్మరాజు అటువంటి ధర్మ రాజు అడిగాడు...... “ ధరణి నధార్మికులగు కా పురుషుల కభివర్ధనంబు బుణ్య చరిత్రం బరఁగెడు ధార్మికులకు దుర్ధరమగు నవివర్ధనంబుఁ దగునే మునీంద్రా ! “.......దానికి రోమశ మహర్షి ఇలా చెప్పినాడు.....
అధర్మ పరులు అభ్యుదయాన్ని సాధించినా అది ఎక్కువ కాలం నిలువదు, త్వరలో నశించిపోతుంది. ఇతరులను బాధించి సంపాదించి ధనము తో భాగ్యములను అనుభవించినారు, కానీ ...అది కల కాలం నిలువదు. ధర్మ వర్తనులు, ధర్మాన్ని నమ్ముకొన్న వాళ్ళు తాత్కాలికంగా సౌఖ్యాలకు దూరమైనా, త్వరలోనే తమ స్వీయ ధర్మ శక్తితో విజయాలను సాధిస్తారు. తాము కోల్పోయిన దానిని తిరిగి పొందుతారు. ...అని అయినా ఈ సమాధానంతో తృప్తి పడలేదు ధర్మ రాజు. అందుకే తిరిగి ఇదే ప్రశ్నను మార్కండేయ మహర్షిని అడిగినాడు.
దానికి మార్కండేయ మహర్షి ఇలా అన్నాడు....” అత్యుత్కటైః పుణ్య పాపైః ఇహైవ ఫలమశ్నుతే”.....అన్నదాని ప్రకారం కౌరవుల పాపం పండి, త్వరలోనే రాజ్య భ్రష్టులౌతారు. పాండవులు తిరిగి రాజ్య పదవిని పొందుతారు. ఈ లోకంలో సంపదలు గడించి, పుణ్య మార్గమున పోవక, లోభ మోహితులై ఇంద్రియ భోగము లకు లోనై జీవించే వారికి, ఇహం లో సుఖము వున్నా, పరం లో మిగిలేది దుఖమే. పుణ్య కర్మలు చేసిన వారు ఇహ లోకంలో దుఃఖం పొందినా, పర లోకంలో సుఖిస్తారు. ధర్మాన్ని ఆచరిస్తూ సత్కర్మలు, సత్ర్కతువులు చేసే వారు ఇహ పర సుఖము లను రెంటినీ అనుభవిస్తారు. పాండవులు ధర్మశీలురు, పుణ్యవ్రతులు కావటం చేత శత్రువులను జయించి రాజ్యాన్ని పాలించి కీర్తిని గడించుతారు అని చెప్పాడు మార్కేండేయ మహర్షి.
తాత్కాలికంగా కష్టాలు అనుభవించినా ధర్మాత్ములు చివరికి గెలుస్తారు, శాశ్వత కీర్తిని పొందుతారు, ధర్మం గెలుస్తుంది. భగవంతుణ్ణి నమ్మి బ్రతుకుదాము.
రచన: భాస్కరానంద నాథ