శ్రీదేవీ - మహాత్త్వము - Sree Devi Mahatyamu

0
శ్రీదేవీ - మహాత్త్వము - Sree Devi Mahatyamu
చండీ తత్వము :
   ఆది తత్త్వమును స్త్రీ మూర్తిగా భావించి చేయు ఉపాసన శ్రీవిద్యోపాసన అని అందురు  . ఇది లలితా పర్యాయము, చండీ పర్యాయము అని రెండు విధములు.
రెండింటికీ శబ్దతః భేదమే కానీ వస్తుతః భేదము లేదు. మొదటిది పంచదశాక్షర మూల మంత్రము తో కూడినది   . రెండవది నవాక్ష ర మంత్రముతో కూడినది.  ఆ పరమాత్మ స్వరూపాన్ని స్త్రీ మూర్తిగా పూజించుటలో ఒక విశేష సౌలభ్యము కలదు. లోకములో తండ్రి దగ్గర కంటే తల్లి దగ్గర పిల్లలకు చనువు ఎక్కువ. తల్లి పిల్లల తప్పులు ఎంచక వాళ్ళను కడుపులో పెట్టుకొని లాలిస్తుంది. అన్ని విధముల వాళ్ళను బుజ్జగించుచూ మంచి అభివృద్దిలోకి తెస్తుంది. తండ్రి కోపపడినా తల్లి అంత తొందరగా కోపపడదు. ఎంతో ప్రేమానురాగాలతో బిడ్డను దగ్గరకు తీసుకొని పాలిస్తుంది. బిడ్డ యొక్క మంచి చెడులను తండ్రి కన్నా తల్లికే ఎక్కువగా తెలియును. అందువలనే వేదము కూడా “మాతృ దేవోభవ” అనుచూ తల్లిని పూజించమని తండ్రి కంటే తల్లికే అగ్ర పీట వేసినది. తల్లి యందలి ఈ నిర్వ్యాజ ప్రేమానురాగాల వలన పూజలలో గూడా భగవంతుడిని అమ్మ వారుగా పూజించుటలోని విశేషము.
  • కాళిదాసు తన రఘువంశము లో “వాగార్దా వివ” అని స్మరించినాడు. ఆది శంకరులు “మాతా చ పార్వతీ” అని స్తుతించినారు. వశిన్యాది వాగ్దేవతలు “ శ్రీ మాతా” అని అమ్మను పిలిచినారు.
  • “దుర్మార్గుడైన బిడ్డ వుంటాడు గాని, దుర్మార్గురాలైన తల్లి వుండదు”... అని ఆది శంకరుల వారు అన్నారు.
  • జగన్మాత పూజ ఇతర దేవతల కంటే త్వరితముగా ఫలితము నిచ్చి, బిడ్డను రక్షించును. జగన్మాత ఉపాసనము మాతృ సేవ వంటిది. తల్లి బిడ్డలను పెంచి పోషించినట్లు, ఆ జగన్మాత తన్ను ఉపాసించు భక్తులను తన బిడ్డలుగా ప్రేమించి భుక్తి ముక్తులను తప్పక ఇవ్వగలదు.  ఆమెను సేవించడము అత్యంత సులభము. తప్పులున్ననూ తల్లి సవరించును.
  • శ్రీ చక్ర సంచారిణి యైన జగన్మాత జగత్తునంతయు పోషించుచూ చరాచర సృష్టికి మూల కారణమై అంతటా వ్యాపించి సర్వ ప్రాణులలో శక్తి స్వరూపం లో చిచ్ఛక్తి అయి, చైతన్యమై, పర బ్రహ్మ స్వరూపమై ప్రకాశిస్తూ వున్నది.
  • సకల ప్రాణులకూ ఆమె తల్లి అయి “శ్రీమాత” గా పిలువబడు చున్నది.  అందుకే ఆమెను “ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ” అని పోతనామాత్యుడు అన్నారు.
  • వేదములు “విద్య” అని ఏ దేవిని చెప్పుతూ వుంటాయో, ఆ దేవిని ఆశ్రయించిన వారి ఆర్తిని పోగొట్టే దయామయి ఆ దేవి. తన్ను నమ్మిన వారిని ఆదుకునే అమ్మ. మునులు ఆ తల్లి పాదములను ధ్యానించి జ్ఞానులవుతారు.

పరమేశ్వరుని యందే అంతర్లీనమై, రక్త వర్ణ ప్రభలచే వెలుగొందుచూ, జీవన్ముక్తికి, ఐహిక ఫల సాధనకు ప్రత్యక్ష సాక్షియై, శ్రీచక్రము నందలి బిందు స్థానమై నెల కొని యున్న ఆ తల్లి శ్రీ లలిత యై, మహా త్రిపుర సుందరిగా, పిలువబడుచున్నది.
౧. జప చండీ  
౨. హోమ చండీ  
౩. తర్పణ చండీ అని త్రి విధములుగా చండీ ఉపాసన కలదు.
గుణ త్రయములకు ప్రతీక అయిన మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ రూప కలయక  చండీ.
జగన్మాత సాత్విక రూపం లలిత అయితే, తామస రూపం చండీ. చండీ పరాభట్టారికా అంటే మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ స్వరూపిని, చండీహోమము అనగా దుర్గా సప్తశతి అనే 700 శ్లోకమలచే హోమము చేయడము. ఇందు 700 శ్లోకమలు 3 చరిత్రలుగా విభజించి ఉన్నాయి.
ప్రధమ చరిత్ర మహాకాళీస్వరూపముగా, మధ్యమ చరిత్ర మహాలక్ష్మీ స్వరూపముగా,  ఉత్తమ చరిత్ర మహా సరస్వతీ స్వరూపముగా చెప్పబడి ఉన్నది.
   చండీసమదైవం నాస్తి అన్ని పురాణాలు చెపుతున్నాయి. కలియుగములో సమస్త బాధలు, అతివృష్టి. అనావృష్టి, శత్రునివారణ చేయటానికి కుటుంబమును సర్వసౌభాగ్యములతో వృధి చేయడానికి మహాకాళి. మహాలక్ష్మీ, మహాసరస్వతి అయిన చండీపరాదేవత అనుగ్రహము చాలా అవసరము. అమ్మవారి ప్రీతిపాత్రమైన పౌర్ణమి తిధియందు త్రిదేవిసహీత, త్రిశక్తి అయిన చండిపరాదేవతను ఆరాధించి చండిహోమము ఎవరైతే జరిపించుకుంటారో ఆ కుటుంబమంతా పుత్ర పౌత్రాదులతో సుఖముగా జీవిస్తారని శ్రీ డేవి భాగవతమందు చెప్పబడినది.

సృష్టి - స్థితి - లయములు గావించున్న ఆ మహా మాయను ఎవరు ఉపాసించు చున్నారో, వారు జనన మరణ రూపమగు సంసారము నుండి తరించు చున్నారని, మోక్షమును బొందుచున్నారని నృసింహతాపిన్యుపనిషత్తు తెలియ జెప్పుచున్నది. ఆ శక్తిని భజించినవాడు మృత్యువును జయించి మోక్షమును బొందును. త్వం వైష్ణవీ  శక్తి రనంత వీర్యా విశ్వస్య బీజం పరమాzపి మాయా సమ్మోహితం దేవి సమస్త మే తత్... ఈ లోక మంతయూ మాయా శక్తి చే సమ్మోహిత మగుచున్నది.
   ఒకప్పుడు దేవిని దేవత లెల్లరు “అమ్మా నీ వెవరు? అని అడుగగా “నేను బ్రహ్మ స్వరూపిణిని, నా వల్లనే ప్రకృతి పురుషులు పుట్టుచున్నారు, జగమును జనించు చున్నది” ... అని చెప్పినది.
 “సర్వే వై దేవా దేవీ ముపతస్థుః కాసిత్వం దేవీ సా zబ్రవీ దహం  బ్రహ్మ రూపిణీ మత్తః ప్రకృతి పురుషాత్మకం జగత్. అట్లే మాయ, బ్రహ్మ రూపిణి, విశ్వ మోహిని, ఆత్మ స్వరూపిణి అని భువనేశ్వరి ఉపనిషత్తు చెప్పుచున్నది. “ స్వాత్మ్యైవ  లలితా .... అని భావనోపనిషత్తు చెప్పు చున్నది.  హ్రీం బీజము పర బ్రహ్మ స్వరూపమని, మోక్షప్రదమని దేవీ భాగవతము చెప్పు చున్నది.
చితి స్తత్పదలక్ష్యార్దా చిదేకరస రూపిణి ... అని బ్రహ్మాండ పురాణము అమ్మను కొని యాడినది.
ఇట్లు అష్టాదశ పురాణములు, ఉప పురాణములు,  స్మృతులు దేవిని పర బ్రహ్మమని ప్రతి పాదించినవి.

శక్త్యక్ష రాణి  శేషాణి హ్రీం కార ఉభాయాత్మకః .. అని 
    ఇతర బీజాక్షరములు కేవలము  శక్తికి సంబంధించినవి వనియు, మాయా బీజమైన హ్రీం కారము మాత్రము ఉభాయాత్మక మైన శివ శక్త్యాత్మక బీజమని బ్రహ్మాండ పురాణము చెప్పు చున్నది.
" హ్రీం హ్రీమితి ప్రతి దినం జపతాం జనానాం,
కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే. "
త్రిపురముల యందు వసించు ఓ .. అమ్మా హ్రీం హ్రీం అని నీ బీజ మంత్రమును జపించు వారికీలోకమున దుర్లభమైన దేమియునూ లేదు. సకల కల్యాణ భాజనమైనదీ హ్రీంకారము. శ్రీదేవీ ప్రణవము  హ్రీంకారము. (సూచన:- ఉపదేశము లేనిదే మంత్రములను ఉపాసన చేయకూడదు.)
ఓం శ్రీ గురుః  పరమ కారణ భూతాశక్తిః  ... అని భావనోపనిషత్తు చెప్పు చున్నది.
శ్రీవిద్యా పూర్ణ దీక్ష నొసగిన శ్రీ గురువులు  శ్రీ పరాదేవి స్వరూపులే. శ్రీ గురుదేవుల అనుగ్రహము చేత మహా వాక్య ప్రాప్తి, ( శ్రీవిద్యా పూర్ణ దీక్ష యందు మహా వాక్యములతో గూడిన మహా పాదుకలను ఇచ్చెదరు.)  దాని వలన బ్రహ్మాత్మైక్య సిద్ది లభించు చున్నందున శ్రీ గురువులే పరమ కారణమైన పరా శక్తి స్వరూపులని,  శ్రీ గురువులకు శ్రీ మాతకు అభేదము అని చెప్పు చున్నది. అట్టి శ్రీ గురుదేవులకు నమస్కరిస్తూ

రచన: భాస్కరానందనాధ (దీక్షా నామము)  - కామరాజుగడ్డ రామచంద్రరావు గారు - 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top