నైవేద్యము విశేషాలు : Naivedyam

0
నైవేద్యము విశేషాలు : Naivedyam

నైవేద్యము అన్న మాట వినగానే గుళ్ళూ , పూజలూ గుర్తొస్తాయి. సమంజసమే. గుళ్ళూ , పూజలూ మాత్రమే గుర్తుకు రావలెను.  ఈ నైవేద్యము అన్న మాటను దేవుడికి ఆహారమును నివేదించు సందర్భములో మాత్రమే వాడవలెను. 

వెంటనే ఒక ప్రశ్న:- దేవుడు మనం ఇచ్చే ఆహారము తింటాడా ? మరి నైవేద్యము అయ్యాక , పదార్థాలన్నీ అలాగే ఉంటాయే ? వాటిని మనమే తింటున్నాము కదా ?
» అవును.  వాటిని మనమే తింటున్నాము ...
» అవును.  వాటిని దేవుడు తింటాడు.
పైవి రెండూ సరియైనవే. 

నివేదించిన పదార్థములు అలాగే ఉండుటకు కారణము , భగవంతుడు వాటిని ఆస్వాదించిన తరువాత , మనకు " ప్రసాదము " గా ఇస్తాడు కాబట్టి. 
అదెలాగ ? కొంచము అర్థమయ్యేటట్టు చెప్పరూ అంటారా ?  అలాగే. 
   మానవులకూ , ఇతర ప్రాణులకూ ఉన్నట్టే , మానవేతర జీవులకూ , భగవంతుడికీ కూడా ఒక శరీరము ఉంటుంది. మనకు ప్రాణము ఉన్నట్టే అందరికీ ప్రాణము ఉంటుంది...దానినే చైతన్యము అనవచ్చు. ఆ చైతన్యమే అంతటా ఉండేది.  మనకున్న ప్రాణము ఒకటి కాదు. అయిదు. వాటినే పంచప్రాణాలు అంటారు. అవే , ప్రాణము , అపానము , వ్యానము , ఉదానము మరియు సమానము. 

భగవంతుడికి శరీరమేమిటి ?
   శరీరమంటే మనకున్న , మనము అనుకునే పాంచభౌతికమైన శరీరం కాదు. దేవతల శరీరాలలో పృథ్వీ భూతము , జలభూతములుండవు. ఆకాశము , తేజస్సు , వాయువు రూపములలోనే దేవతలు సంచరిస్తారు. మనకు అయినట్టు వారికి ఆకలి కాదు. వారిక్ కలుగు ఆకలిని మనము మన పరిజ్ఞానముతో నిర్వచించలేము. అసలు వారున్న స్థాయి , మెట్టు వేరు. మనకు అన్వయించు అనేక విషయములు వారికి అన్వయించవు. అన్వయించేవి అదే తీరుగా ఉండవు. కాబట్టి అటువంటి పోలికలను వెదకుట పూర్తిగా అసంబద్ధమైనది.   కానీ మనము నివేదించిన పదార్థాలను చూచినంతనే సంతృప్తి చెందుతారు. వారి ఆకలి దానితో తీరినట్టే.
   ముఖ్యముగా హోమములు చేసి ఇచ్చిన ఆహుతులవలన అగ్ని , ఇంద్ర , యమ , వాయు , సూర్య , చంద్ర , బృహస్పతి , మిత్ర  వరుణ , సోమ , సవితృ , రుద్ర, విష్ణువు మొదలుగా అనేక దేవతలు  తృప్తి చెందుతారు. యజ్ఞ భావనతో సమర్పించిన యే నైవేద్యమునయినా ఆయా దేవతలు సంతోషముగా స్వీకరిస్తారు. దీనిని వివరిస్తూ , యజుర్వేదములోని మూడో కాండములోని నాలుగో ప్రశ్నలో , " అగ్నిర్భూతానమధిపతిః..  ." మొదలుకొని పదునెనిమిది మంత్రాలను ఆయా దేవతలను తృప్తి పరచుటకొరకు వినియోగించవలెను ...అని చెబుతుంది. ఆ పద్దెనిమిది  మంత్రాలను " " అభ్యాతాన " మంత్రములు అంటారు. 

   ఒకప్పుడు దేవతలూ , రాక్షసులూ కూడా ఒకే విధమయిన హోమములు , యజ్ఞములూ చేసేవారు. కానీ దేవతలకు మాత్రమే యజ్ఞ ఫలము దొరికేది. దానికి కారణము , దేవతలు ఈ పద్దెనిమిది అభ్యాతాన మంత్రములను కనుగొని వాటిని ఉపయోగించుకొని , తమ తమ కర్మలను సమృద్ధి పరచుకొన్నారు. రాక్షసులకు ఆ మంత్రములు తెలీక కర్మ భష్టులైనారు. యే కారణము చేత దేవతలు ఈ అభ్యాతాన మంత్రములను సంపాదించినారో , ఆ కారణము వలన ఆ మంత్రాలు " వైశ్వదేవములు " అని పిలవబడుతున్నాయి. భూతముల ఆకలితీర్చు యే ప్రక్రియ అయిననూ " వైశ్వదేవము " అనిపించుకుంటుంది. ఆ మంత్రములు దేవతలనుండీ ఋషులకూ , వారినుండీ  విప్రులకూ  వచ్చినవి. ఈనాటికీ యే చిన్న హోమమైననూ ఈ అభ్యాతాన మంత్రములు లేకుండా పూర్తి కాదు. [ ఇవే కాక జయాదులు , రాష్ట్రభృత్ మంత్రాలు అని ఉన్నాయి.. అవి ఈ చర్చలో అప్రస్తుతము ] వైశ్వదేవము అంటే  భూతముల ఆకలి తృప్తి పరచుటయే కాబట్టి , హోమమైననూ , పూజ అయిననూ యజ్ఞభావముతో చేసినపుడు , ఆయా దేవతల ఆకలి తీరి సంతుష్టులవుతారు. ఆయా మంత్రములు లేకున్ననూ , భావన ముఖ్యము. ఆ క్రమ విధానమే ఈనాటికీ పూజలలో పాటించబడుతున్నది. 
 • కాబట్టి , దేవతలకు నైవేద్యము సమర్పించుట వలన మన కర్మలు సఫలమై శుభములను పొందుతాము.  
 • దేవతలు మనకు వర్షాలు కురిపించగలరు. కానీ దుక్కి దున్ని పొలాలను పండించవలసినది మనమే. దేవతల శరీరాలు ఆ పని చేయలేవు.
 • అలాగే , దేవతలు పంటలు సమృద్ధిగా పండునట్లు చేయగలరు. కానీ ఆపండిన పంటలను శుచిగా వండుట వారికి రాదు. మానవులము మాత్రమే అది చేయగలము. 
 • మానవులకు వర్షాలు కురిపించు శక్తి లేదు. పొలాలను సాగుచేయ గలమే కానీ మొక్కలు , పంటలు పెరగకపోతే మనము చేయగలిగినదేమీ లేదు.  
 • దేవతలు , మానవులు ఎప్పటికీ మిత్రులేగానీ శత్రువులు కారు. కాబట్టి ఒకరికొకరు సహకరించుకుంటాము.  
 • దేవతల అనుగ్రహము వల్ల పండిన పంటలను మనము వండుకు తింటూ , అనుభవిస్తూ , వారికి నివేదించకపోవడము మహా పాపము. ఎవడైతే అలా నివేదించకుండా తాను మాత్రమే తింటున్నాడో వాడు పాపమును తింటున్నట్లే. అంతేకాక , వండిదానిని కొంచమైననూ అతిథులకు సమర్పించక తాను మాత్రమే తినరాదు. 
 • అది వీలుకానప్పుడు కనీసము మొదటి ముద్దనయిననూ , పశుపక్ష్యాదులను తలచుకొని , బయట పెట్టి మిగిలినదానిని దేవుడికి సమరించినట్టు భావించి , ఆ సమర్పణా భావముతో కళ్లకద్దుకొని తాను తినవలెను. అసలు భోజనము చేయుటయే ఒక యజ్ఞము. దానిని ఆత్మ యజ్ఞము అంటారు. దేహములోని అయిదు ప్రాణములకు ఆహుతులను ఇచ్చి తాను తినవలెను. [భోజనము చేయు విధానము మరొక వ్యాసములో..]
సరే ఈ నైవేద్యమును ఎలాగ సమర్పించవలెను ? 
  శుచిగా వండిన సాత్త్వికమైన ఆహారమును నేతితో అభిఘారము చేయవలెను [ నేతిని కొద్దిగా పదార్థముపై కలుపుట ] ఒక కంచు , ఇత్తడి పత్ర లేదా , అరిటాకు , లేదా విస్తరి [  ఈ మధ్య స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వాడుట వాడుక అయింది] లోకి వండిన పదార్థమును తీసుకోవలెను. దానిని ఆవాహన చేసి పూజించిన దేవుడి పటముగానీ విగ్రహముగానీ కలశమునకు గానీ ఎదురుగా , నేలపైన పెట్టవలెను. అయితే అలాగే పెట్టరాదు, మొదట నేలపై నీటితో ఒక చతురస్ర మండలమును గీయవలెను. దానిపై నాలుగు అక్షతలు చల్లి దానిపై పాత్రను మూత తీసి ఉంచవలెను. మండలము ఎలా గీయవలెనో బొమ్మలో చూడవచ్చు. 
  నైరృతి నుండీ  మొదలు పెట్టి వాయవ్యమునకు , అక్కడనుండీ  ఈశాన్యానికి, అక్కడనుండీ ఆగ్నేయానికీ , తర్వాత  నైరృతికీ సరళరేఖలు గీసి , నైరృతి నుండీ ఈశాన్యానికి అడ్డముగా ఒక సరళరేఖ గీయవలెను. ఇదే మండలము. 
తరువాత ఆ మండలముపై నైవేద్యపు పాత్రను పెట్టి , చేతిలో తులసీ దళమును శుద్ధోదకముతో పాటూ తీసుకొని ఈ మంత్రము పలుక వలెను.
ఓం విశ్వామిత్ర ఋషిః | సవితా దేవతా | గాయత్రీ ఛందః | 
తర్వాత గాయత్రీ మంత్రము పలుకుతూ నీటితో ప్రోక్షణ చేసి సవ్యముగా పాత్రచుట్టూ కూడా పరిషేచన చేయవలెను[ నీటిని వదలవలెను]. పరిషేచన చేయునపుడు, పగలైతే | సత్యం త్వర్తేన పరిషించామ్ | అనీ , రాత్రైతే |ఋతం త్వా సత్యేన పరిషించామి | అనీ పలకవలెను. తర్వాత | అమృతమస్తు | అమృతోపస్తరణమసి స్వాహా | అంటూ రెండు ఉద్ధరిణెల నీరు హరివాణములో వదలాలి.
తర్వాత  పంచప్రాణములకు ఆహుతులను ఇచ్చు సంకల్పముతో,
 • ప్రాణాయ స్వాహా , 
 • అపానాయ స్వాహా , 
 • వ్యానాయ స్వాహా , 
 • ఉదానాయ స్వాహా , 
 • సమానాయ స్వాహా  
అని పలుకుతూ పంచ ముద్రలు చూపవలెను. ఇంకా ధేను ముద్ర కూడా చూపుట ఉత్తమము. అన్ని పదార్థాలనూ చూపి, తులసిని అన్నము మీద ఉంచవలెను. ఈ ముద్రలు రాని వారు , అయిదు సార్లు కుడి అరచేతితో దేవుడికి నైవేద్యాన్ని చూపవచ్చును. భావము ముఖ్యము. 
ఒక ఉద్దరిణెడు నీరు వదలి , మనము సమర్పించిన నైవేద్యము స్థిమని సూచించుటకు , 
| అమృతోపిధానమసి స్వాహా | అని పలుక వలెను. ఇది నైవేద్యముపూర్తయినదని ఉద్వాసన చెప్పుట కూడా . 
తర్వాత కింది మంత్రాలు పలుకుతూ ఆరు సార్లు ఉద్ధరిణతో నీరు వదలాలి

ఉత్తరాపోశనం సమర్పయామి , 
హస్త ప్రక్షాళనం సమర్పయామి ,
ముఖ ప్రక్షాళనం సమర్పయామి
గండూషం కల్పయామి
పునరాచమనీయం సమర్పయామి ||
ఇక్కడికి నైవేద్య ప్రకరణము ముగిసినట్టు. ఆ పదార్థాలను తీసివేయవచ్చు. 

నైవేద్యము అంటే పైన చెప్పినవన్నీ చేస్తేనే అయినట్టు కాదు. ఇటువంటి తంతులన్నీ కేవలము మన మనో స్వచ్ఛత , ఏకాగ్రతలు పెరుగుట కొరకు మాత్రమే. ఏకాగ్రతలు బలమయినపుడు ఇటువంటి కర్మాచరణ దానంతట అదే తొలగిపోతుంది. ఒక ఆసక్తి కరమయిన సంఘటన శృంగేరీ శారదా పీఠములో , అప్పటి జగద్గురువులు శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ తీర్థుల వారి సమయములో జరిగింది.
కసారి వారి దర్శనానికై వచ్చిన  శిష్యులొకరు , పెద్దదైన ఒక మరకత లింగమును తెచ్చి వారి ముందుంచినారు. " ఏమిటి సంగతి ? " అని గురువులు అడిగినారు.
 • " మహాస్వామీ , ఈ మహా లింగము మాయింటిలో అనేక తరాలనుండీ ఉంది. ఇప్పటి మా పరిస్థితులలో , మాకున్న సమయములో సరియైన క్రమములో దీనిని పూజించుటకు మేము అసమర్థులమై ఉన్నాము. అందుకని దీనిని శ్రీ గురువులకు అప్పజెప్పిపోదామని వచ్చినాము. గురువులు దీనిని  స్వీకరించవలసినదిగా మా ప్రార్థన " అన్నారు. 
 • " సరియైన క్రమములో పూజ చేయుట అంటే ఏమిటి ? క్లిష్ట పరిస్థితి అంటున్నారు.. మీ యింటిలో అందరూ భోజనాలు చేయుట కూడా మానేసినారా యేమి ?" లేదు స్వామీ , అటువంటి పరిస్థితి లేదు "
 • " అయితే , దీనిని పూజించుటకు మీకు ఇబ్బంది యేమిటి ? భగవంతుడు యేమీ తినడు. మనవలె అతడికి ఎన్నడూ ఆకలి కాదు. మీరు నిత్యమూ భోజనము చేయుటకు వంట చేస్తూనే ఉన్నారు కదా ? 
   భగవంతుని కృపాశీర్వచనమును కృతజ్ఞతతో స్మరించుటకు , భోజనానికి ముందు ఆ పదార్థాలను దేవుడికి నివేదించండి. ఆ నివేదనవల్ల పవిత్రమగు ఆ ఆహారాన్ని మీరు స్వీకరించండి. దేవుడు మీనుండీ ఏమీ కోరడు. విశిష్టమైన కొన్ని ప్రత్యేక విగ్రహాలకు తప్ప , మిగిలిన విగ్రహాలకు , మీరు భుజించే , శాస్త్ర విరుద్ధము కాని పదార్థాలను నివేదిస్తే చాలు. దానికోసమై ప్రత్యేకముగా శ్రమపడనవసరము లేదు. విశేష ఖర్చులూ ఉండవు. మరి అలాంటప్పుడు పూజ చేయుటకు అసమర్థులము అని ఎందుకు భావిస్తున్నారు ? మీరు ఎంత పేదవారైననూ , భోజనమే మాను పరిస్థితి లేదు కదా ? అటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు అసమర్థులము అని చెప్పుకోవచ్చును. 

   ఒక ఫలమో , ఒక లోటా పాలో , చివరికి ఒక లోటా నీరైనా సరే , మీకు ఉన్నపుడు , అదే దేవుడికీ చాలు. దానినే భక్తితో అర్పించండి. కాబట్టి ఈ లింగాన్ని మీరే తీసుకొని వెళ్లవలెను. భగవదారాధనకు సమయాభావమని మానకండి. ఆకలైనపుడు సావకాశముగా భోజనము చేసే వ్యవధి లేకపోతే ఆత్రాత్రముగా నాలుగు ముద్దలైనా మింగుతాము కదా , ఉపవాసము ఉండము. మృష్టాన్నము లేకున్ననూ సామాన్య భోజనమైనా చేసి ఆకలి తీర్చుకుంటాము కదా , అట్లే దేవతార్చనను లఘువుగా నైననూ మీరు చేయవలెను. మానరాదు, " అని ఉపదేశించినారు.

రచన: గురువులు, జనార్ధన శర్మ గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top