'శివ' ఆరాధన: ప్రశ్నలకు సమాధానాలు - శివరాత్రి ప్రత్యేకం - Shivaratri

0
'శివ' ఆరాధన: ప్రశ్నలకు సమాధానాలు - శివరాత్రి ప్రత్యేకం - Shivaratri
'శివ'
ప్రశ్న: మా ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించే అవకాశం లేదు, పటం మాత్రమే ఉంది. 'రుద్ర నమకం' అభిషేక సమయంలో మాత్రమే చదవాలా? కేవలం పారాయణగా చదువుకోవచ్చా? మరో విషయం అనే నామస్మరణ చేస్తుంటాను. అలా చేయవచ్చా? లేక శివా' లేదా 'కేశవా' అనే స్మరణ మాత్రమే చేయాలా? 
జవాబు: 'రుద్రనమకం' స్వరసహితంగా మాత్రమే చదవాలి. అభిషేకంలోనే చదవాలని నియమం లేదు. పారాయణగా చదువుకోవచ్చు. 'శివకేశవ' అనే నామస్మరణలో తప్పులేదు. వాటిని విడిగానూ స్మరించవచ్చు - కలిపి కూడా స్మరించే పద్దతి బాగుంది.

ప్రశ్న: ఇంట్లో బిల్వ(మారేడు) వృక్షం ఏ రోజుల్లో కోయాలి? ఎన్నాళ్లు వాడవచ్చు?
జవాబు: ఇంట్లో బిల్వవృక్షం పెంచుకోవచ్చు. తగిన స్టలం ఉండి చక్కగా వృద్ధిపొందే అవకాశం ఉన్నప్పుడు బిల్వాన్ని వేయవచ్చు. ఈశాన్య, తూర్పు, ఉత్తర దిశలలో బిల్వ వృక్షాన్ని వేయవచ్చు. బిల్వంతో శివార్చన చేయడం మహా పుణ్యఫలప్రదం.
   బుధ, శని వారాల్లో మారేడు దళాలు కోయాలి. అప్పుడు కోసి భద్రపరచుకుని రోజూ వాడవచ్చు. నిన్న పూజించిన బిల్వాన్ని కడిగి ఇవాళ మళ్ళీ పూజించవచ్చు. అలా ముప్పది రోజుల వరకు పూజించవచ్చు. చతుర్ధశి. అమావాస్య, పూర్ణిమ, చతుర్ధి, అష్టమి తిథుల్లో బిల్వాలను కోయకూడదు. వాటికి ముందే కోసి దాచి వాడుకోవాలి.

ప్రశ్న: శివారాధన వేదకాలానికే ఉందా? రుద్రుడూ, శివుడూ ఒకటేనా? వేరు వేరేనా? మన సంస్కృతిపై అనేక ఇంగ్లీషు గ్రంథాలు, వాటి అనువాదాలు చదివాక నాకు మిగిలిన సందేహాలివి.
జవాబు: వేదకాలమంటూ ఒకటి ప్రత్యేకించి లేదు. వేదాలు అపౌరుషేయాలు. అనంత కాలానికి చెందినవి. ఈ వరమన త్యాన్ని జీర్ణించుకోలేక వేదాలకీ కాలాన్ని నిర్ణయించాలని నానా అగచాట్లూ పడ్డారు; పడుతున్నారు అస్తు. అలా ఉంచుదాం. ఇక వేదాల్లో శివుని ప్రస్తావన పూర్ణంగా ఉంది. 'ఈశాన స్పర్వవిద్యాణాం. సదాశివోం తన్మేమనశ్శివ సంకల్ప మస్తు', 'ఉమాసహాయం పరమేశ్వరం విభుం'. 'అంబికా పతయ ఉమాపతయే' - మొదలైన వేదోపనిషన్మంత్రాలెన్నో శివుని స్తుతిస్తున్నాయి. రుద్రుడు, శివుడూ ఒకరే. ఇది వేదంలోనే ప్రస్తావించబడింది. ఘోర రూపాలతో ఉన్న శివతత్త్వం రుద్రునిగా చెప్పబడింది."యాతే రుద్రశివా తనూ " ”నమస్తోమాయచ రుద్రాయచ...నమశ్శంభవేచ మయోభవేచ, నమశ్శం కరాయచ మయన్కరాయచ, నమశ్శివాయ చ శివతరాయచ.......” అని రుద్రనమక మంత్రాల్లో ప్రస్తావితాలు. శివుడు లయకారకుడు. ఈ లయ మూడు 
విధాలు :-
1. సంహారం, 2. తిరోధానం(కనబడకుండా లీనమవడం), 3. అనుగ్రహం(మోక్షప్రదానం). ఈ మూడూ చేసేది 'లయ స్వరూపుడైన శివుడే. ఒకొక్క పనికీ ఒకొక్క పేరుతో 1. రుద్ర, 2. మహేశ్వర, 3. సదాశివ. ఈ మూడు ఒకే శివుని పేర్లు, పరతత్త్వంలో లయమైతేనే మోక్షం, ఆనందం దానినిచ్చేదీ ఆ పరతత్త్వమే.

ప్రశ్న: ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించవచ్చా? ఇంట్లో శివలింగం ఉంటే మంచిది కాదని అంటుంటారు. ఇది ఎంతవరకు నిజమో తెలుపగలరు. ఒకవేళ ఉంచాలనుకుంటే ఏ పరిమాణంలో ఉండవచ్చు. ఇంట్లో రోజూ నిత్యార్చన ఎలా కొనసాగించాలి?
జవాబు: ఇంట్లో శివలింగాన్ని ఉంచి పూజించవచ్చు. అయితే స్పటికలింగం, బాణలింగం వంటివి ఉంచితే ఎక్కువ నియమాలు, నిష్ఠ అవసరం. వాటిలో తేడా రారాదు. కనుక వెండి, స్వర్ణం, ఇత్తడి వంటి లోహాలతో శివలింగాలు ఉంచుకోవచ్చు. శివలింగం బొటన వేలంత పరిమాణానికి మించకుండా ఉండాలి. శివలింగం ఇంట్లో ఉంటే మంచిదికాదనే మాట పూర్తిగా అసత్యం. 
  నిత్యం శివలింగార్చన జరిగే ఇంట ఐశ్వర్యం సుస్థిరమై వర్ధిల్లుతుంది. నిత్యార్చన పొందే శివలింగం ఉన్న ఇంటికీ ఇంటిల్లి పాదికీ శుభపరంపరలు లభిస్తాయి. శివలింగాన పార్వతీ పరమేశ్వరుల్ని ధ్యానించి షోడశోపచార పూజ చేసుకుంటే చాలు. 'స్నానం' అనే చోట శివనామాలతో అభిషేకం చేసుకోవచ్చు లేదా శివ స్తోత్రంతో జరపాలి. అష్టోత్తరశత నామాలతో బిల్వం, తులసీ, పువ్వులతో పూజించవచ్చు. 'శివాయ నమః' అంటూ ఉపచారాలన్నీ జరిపించవచ్చు. మన శక్తి కొలదీ ఆరాధన.

ప్రశ్న: స్త్రీలు శివలింగాన్ని పూజించరాదని అంటారు. నిజమేనా?
జవాబు: శివలింగాన్ని అందరూ పూజించవచ్చు. అయితే స్పటిక, బాణ లింగాలను పూజించేందుకు మాత్రం ఉపదేశం, నియమం వగైరాలుండాలి. ఇతర లోహలింగాలను ఎవరైనా పూజించవచ్చు

ప్రశ్న: మా ఇంట్లో స్పటికలింగం దేవుని మందిరంలో ఉంది. నేను అభిమానంతో తెలిసినంత మేర పూజ జరుపుతున్నాను. అయితే స్పటికలింగం ఇంటిలో ఉండరాదని తెలిపారు. ఉంచాలా, తీసివేయాలా తెలియజేయ కోరిక.
జవాబు: సృఫటికలింగం ఉంచవచ్చు. కానీ శౌచం, నిత్యపూజ, నివేదన ముఖ్యం. శుచిగా నిత్యం పూజించి, నివేదన చేయాలి. ఆ ఇంట్లో ఏ విధమైన అశౌచమూ ఉండరాదు. అవి కుదరనప్పుడు స్పటికలింగాన్ని ఉంచరాదు. ఏదైనా దేవాలయంలో సమర్పించాలి. 

ప్రశ్న: శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకు రారాదని అంటారు. ఎందుకు?
జవాబు: ప్రసాదం' అంటే అనుగ్రహం. శివదర్శనంతో, అర్చనతో అనుగ్రహం సంప్రాప్త మవుతుంది. అయితే వస్తురూపేణ ఉండే నిర్మాల్యం మాత్రం తీసుకురారాదు. కానీ అన్నిచోట్లా ఈ నియమమే వర్తించదు. మహాశివభక్తుడైన చండే(డ్రే)శ్వరుడు' అనే ఒక దేవత తన తపస్సుకి ఫలంగా ' శివనిర్మాల్యం ' పై అధికారాన్ని వరంగా సంపాదించుకున్నాడు. అందుకే ఆ నిర్మాల్యం అతడికే చెందాలి. ఆ కారణంచేతనే మనం ఇంటికి తీసుకురారాదు. 
   శివలింగంపై నుండి వచ్చే తీర్థాన్ని మనం సేవించవచ్చు, కానీ గర్భగుడి ప్రాకారం బైట  'నాళం'(తూము) ద్వారా జారే తీర్థాన్ని మాత్రం సేవించరాదు. దానిపై కూడా చండేశ్వరునిదే అధికారం. అది అతడి సొత్తు. అయితే -జ్యోతిర్లింగాలు (కాశీ, శ్రీశైలం, మొదలైనవి) ఉన్నచోట్ల మాత్రం శివనిర్మాల్యాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. స్ఫటిక, బాణలింగాలున్నచోట కూడా తీసుకోవచ్చు. చండేశ్వర ప్రతిష్ట లేని ఆలయాలలోనూ గ్రహించవచ్చు. ఇంకా స్వయంభూ (అరుణాచలం, కాళహస్తి - వంటివి) లింగముల వద్ద, సిద్ద ప్రతిష్ఠిత లింగముల వద్ద నిర్మాల్యాన్ని స్వీకరించవచ్చు.

ప్రశ్న: 'పంచాక్షరీ' మంత్రంలో 'ఓం' కారం ఎందుకు లేదు? 
జవాబు: 'నమశ్శివాయ', లేదా 'శివాయ నమః' అనేది పంచాక్షరి, దీనికి 'ఓం' కారం కలపకపోయినా మహిమాన్వితమే వేదంలో సైతం 'నమశ్శివాయ' అనే ఉంది. ఉపదేశం అయినప్పుడు 'ఓం'కారంతో కలిపి ఉపదేశిస్తే అలాగే జపించవచ్చు. 
.  'ఓం'కారంలో ఉన్న శక్తి పంచాక్షరిలో ఉంది, 'ఓం'కారాన్ని 'సూక్ష్మప్రణవం' అనీ, పంచాక్షరిని స్టూలప్రణవం' అని అంటారు. అందుకే విడిగా ఓంకారం చేర్చనవసరం లేదు. ఓంకారంలోని అయిదు భాగాలు అ, ఉ,మ,బిందు, నాదాలు. అవే పంచాక్షరిలోని అయిదక్షరాలు, ఆ కారణంచేత ప్రణవం అవసరం లేకుండానే పంచాక్షరి మహామంత్రమయ్యింది.

సద్గురు చరణారవింద అర్పణంలో - సమర్పకులు : శ్రీ దువ్వూరి ఎస్.జి.శాస్త్రి, కీ.శే. జి.లక్ష్మీనారాయణ - భాగ్యనగరం..
ప్రశ్నలకు సమాధానాలు: సామవేదంషణ్యుఖశర్మ గారి- శివరాత్రి ప్రత్యేకం..ఋషిపీఠం..
{full_page}

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top