స్థూల శరీరము - Sthula Shariramu

0
స్థూల శరీరము - Sthula Shariramu
: స్థూల శరీరము :

వైరాగ్యేణ వపుస్త్యాగో, నైవ కార్యో మనీషిణా;
ఆరంభతః క్రియానాశే, స్వయమేవ విపత్స్యతే ....
  దేహత్యాగము వలన విముక్తి లభించును ..అని కొందరు దేహమును త్యజించు చున్నారు.....అలా చేయకూడదు అని పరమేశ్వరుడు "శ్రీదేవీకాలోత్రము" నందు పార్వతితో హెచ్చరించు చున్నారు.....దేహ త్యాగము అంటే దేహము మీద మమకారము వదలడం. ఇంద్రియ సుఖముల మీద మమకారము వదలడం....గుణములను అదుపులో వుంచుకోవడము అంతే గాని ఆత్మ హత్య చేసుకోవడం కాదు....ఆత్మహత్య మహా పాపం.

విరక్తి కలిగింది అని, వైరాగ్యము వచ్చినది అని బుద్ధిమంతుడు శరీరమును వదలరాదు. ఏ పురాకృత కర్మ చేత ఈ శరీరము లభించినదో ఆ కర్మ నాశనము కలిగినంతనే ఈ శరీరము దానియంతట అదియే నశించును.... మరలా మిగిలిన కర్మను అనుభవించుటకు నూతన శరీరము వెంటనే లభించును లేనిచో నూతన శరీరము దొరకక పిశాచత్వము పొంది ఊర్ధ్వ లోకములకు పోలేక ఇచ్చటనే కొన్ని వేల సంవత్సరములు తిరుగుచూ వుండును....కావున ఆత్మ హత్య తగదు...

జ్ఞానము కలిగినంతనే ముక్తి దొరకదు, ప్రారబ్ధము పూర్తిగా నశింప వలయును. పురాకృతమైన పాపపుణ్యముల సముదాయమే ప్రారబ్ధము.  అది అనుభవించుటకు జీవునికి శరీరము కావలయును....శరీరమును బాధ పెట్టుట తప్పు, సుఖ పెట్టుట తప్పు....శరీరమును కాపాడుకోవలయును....దేనికోసం ధర్మ కార్యముల కోసం...ఆ పాప పుణ్య కర్మలు, సుఖ దుఃఖములు అనుభవించుట పూర్తియైన గాని ఈ శరీరము పడిపోదు...అంతవరకు జ్ఞాని ఈ శరీరమునందు వుండి సుఖదుఃఖములను అనుభవించి శరీరము పడిపోయినప్పుడు విదేహముక్తుడగును. దేహమున్నంత వరకును జ్ఞాని జీవన్ముక్తుడని చెప్పబడును.

ముక్తి అంటే కర్మల నుంచి ముక్తి, జన్మలనుంచి ముక్తి అప్పుడే మోక్షము.....కర్మలను అనుభవించక తప్పదు....బలవన్మరణం తగదు....పునర్జన్మ కలదు...పాప పుణ్యములు కలవు, తద్వారనే సుఖదుఃఖములు ప్రాప్తిస్తున్నాయి...జీవుడు కొన్నింటిని స్థూల శరీరము చేత, మరికొన్నంటిని సూక్ష్మ శరీరముచేత సుఖదుఃఖములను అనుభవిస్తూ వుంటాడు....

పూర్వ జన్మల కర్మ చేత అనగా ప్రారబ్ధము చేత పంచీ కృతములైన మహా భూతములతో రూపొందిన ఈ స్థూల శరీరమును జీవుడు సుఖదుఃఖములను అనుభవించడానికి పొందుచున్నాడు.....పృథ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనునవి పంచ భూతములు....ఈ పంచీకృతములు మొదట్లో అపంచీకృతములై వున్నవి...వీటినే పంచతన్మాత్రలు అని అందురు.... అయిదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, పది ఇంద్రియములు అనువానితో అపంచీకృతములైన సూక్ష్మ భూతముల వలన రూపొంది సుఖదుఃఖములను అనుభవించుటకు సాధనమగుచున్న శరీరమే స్థూల శరీరము అని అందురు....

రచన: భాస్కరానంద నాథ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top