మారుతి శతకము - Maruti Satakamu

మారుతి శతకము - Maruti Satakamu
మారుతి

: మారుతి శతకము :

శా. శ్రీమద్రామ పదారవిందయుగళిన్‌ సేవించి, యస్మద్గురు
స్వామిన్‌ వేడ్క భజించి, సత్కవి నమస్కారంబుఁ గావించి, వా
గ్భూమప్రౌఢిమ నీకు నొక్క శతకంబున్‌ భక్తి నర్పించెదన్‌
నా మీదం గృపజేసి కైకొను మమందప్రీతితో మారుతీ! 1

మ. అనఘా! నీవు జనించి నప్పుడె సముద్యద్భూరితేజంబునన్‌
వినువీథిం గనుపట్టు బాలరవి సద్బింబంబు నీక్షించి, యె
ఱ్ఱని పండంచు గ్రసింప బత్రిపతిలీలన్‌ వేడ్క మున్నూరు యో
జనముల్‌ మింటికి దాటితౌఁ ద్రిభువనశ్లాఘ్యుండవై మారుతీ! 2

మ. నిజగర్భస్థితశైవతేజము, సమున్నిద్రాత్మ తేజంబుఁ గూ
డ జగత్ప్రాణుఁ డమోఘ కేసరివనాటక్షేత్రమందర్థి నిం
చ, జయశ్రీ మహిమాప్తి నయ్యుభయతేజంబుల్‌ రహిన్‌ మిశ్రమై
త్రిజగంబుల్‌ గొనియాడ బుట్టితివి గాదే నీవిలన్‌ మారుతీ! 3

మ. అనిమేషేభము తెల్లపండనుచు బాల్యక్రీడలన్‌ మ్రింగ నొ
య్యన డాయం బవిచే బలారి నిను మూర్ఛాక్రాంతునిం జేయ బూ
ర్వనగాధిత్యక మీఁద వామహనువున్‌ భగ్నంబుగా వ్రాలినన్‌
హనుమంతుండను పేరు నాడమరె నీకన్వర్థమై మారుతీ! 4

మ. అపుడా గంధవహుండు నీదయిన మూర్ఛావస్థ వీక్షించి, తా
గుపితుండై నిజమూర్తి వైభవము సంకోచింపఁగాఁ జేయ న
చ్చపు గూర్మిన్‌ నిఖిలాస్త్రశస్త్రముల బంచత్వంబు లేకుండ స
త్కృపతో నీకు వరంబులిచ్చిరిగదా బృందారకుల్‌ మారుతీ! 5

మ. ఒక పాదంబు మహోదయాచలముపై నొప్పారఁగా నుంచి వే
ఱొక పాదం బపరాద్రి మీఁద నిడి యయ్యుష్ణాంశుచే బల్విడిన్‌
సకలామ్నాయము లభ్యసించిన భవచ్చాతుర్య మేమందు దా
పక దివ్యోరుతర ప్రభావము నుతింపన్‌ శక్యమే? మారుతీ! 6

మ. బలవంతుండగు వాలి ప్రోలు వెడలింపం, బత్నిఁ గోల్పోయి మి
క్కిలి దుఃఖంబున ఘోరకాననములం గ్రీడించి వర్తించు నా
జలజాప్తాత్మజు నొజ్జ పట్టి యని యశ్రాంతంబుఁ జేపట్టి యా
బలభిత్సూతికిఁ జిక్కకుండ ననుకంపం బ్రోవవే మారుతీ! 7

మ. తనపత్నిం దిలకింపుచున్‌ నిబిడకాంతారోర్వి వర్తించు రా
మ నరేంద్రోత్తము పాలి కర్కజుఁడు పంపం భిక్షువేషంబునన్‌
జని, సుగ్రీవుని చందముం దెలిపి యా క్ష్మానాథు దోడ్తెచ్చి, మె
ల్లన నయ్యిద్దఱకుం ధనంజయుని మ్రోలన్‌ సఖ్యసంబంధమున్‌
వినయం బొప్ప ఘటింపఁ జేసినది నీవే కాదొకో మారుతీ! 8

మ. మనుజగ్రామణి సత్కృపాత్త కపిసామ్రాజ్య స్థితుండయ్యు భూ
తనయాన్వేషణ కార్యమున్‌ మఱచి కందర్పక్రియామత్తుఁడై
తనివిం జెందక యున్న భానుజునిఁ దత్కాలార్హ నీత్యుక్తయు
క్తిని బోధించిన నీతిశాలివి నినుం గీర్తించెదన్‌ మారుతీ! 9

శా. లేరా కీశులనేకులుం? ద్రిజగముల్‌ వీక్షించి రా నేర్పరుల్‌
గారా? రాముఁడు జానకిన్‌ వెదక వీఁకన్‌ గీశులం బంపుచో
నారూఢిన్‌ భవదీయ దివ్యమహిమ వ్యాపారముల్‌ సూచి కా
దా! రత్నాంగుళి భూషణం బిడియె నీ హస్తంబునన్‌ మారుతీ! 10

మ. వనజాప్త ప్రియపుత్రుఁ డెంత ధిషణావంతుఁడొ, సర్వంసహా
తనయాన్వేషణ మాచరింప గపులం దా బంపుచో, గార్యసా
ధనమందీ వతి దక్షిణుండవని కాదా! నేర్పుతో దక్షిణం
బునకున్‌ నిన్నధికారిఁ జేసి పనిచెన్‌ మోదంబునన్‌ మారుతీ! 11

శా. సీతన్‌ గానక, దప్పిచే బడలి గాసిం జెందు శైలాట సం
ఘాతంబుం గొని, శైలగహ్వర సుధా కల్పాంబువుల్‌, సత్ఫల
వ్రాతంబుం దనివార నందఱ భుజింపంజేసి, తద్దేవతా
ఖాతశ్వభ్రము వెల్వరించితివి యోగప్రౌఢిచే మారుతీ! 12

మ. జనకక్ష్మాపతిపుత్రి యున్నవిధమున్‌ సర్వంబు సంపాతిచే
విని, నీలాంగదముఖ్యవానరుల్‌ వేగంబె ప్రాయోపవె
శమున్‌ మాని భవత్సమేతులగుచున్‌ సంప్రీతితో నా మహేం
ద్ర నగారోహణ మాచరించి రఁట విన్నాణంబుగా మారుతీ! 13

మ. శరధిం గాంచి యలంఘనీయ మని తత్సంతారణాదక్షులై
వరుసన్‌ గీశులు భీతిచేఁ గళవళింపన్‌ వారి వారించి ని
న్నురుపాథోధి విలంఘన క్షమునిఁగా నూహించి ధీమంతుఁడా
పరమేష్ఠి ప్రియపుత్రుఁ డంచితగతిన్‌ బ్రార్థింపఁడే మారుతీ! 14

శా. "ఏలా మీకు భయంబు నేఁ గలుగ, మీ రిందుండుఁ డేనొక్కఁడన్‌
వాలాయంబు పయోధి దాటి యనువొందన్‌ లంకలో జానకిం
బోలం గన్గొని వత్తు, నిత్తు బరమామోదంబు మీ" కంచు ధై
ర్యాలాపంబులు వల్కి తేర్చితివి గాదా కీశులన్‌ మారుతీ! 15

మ. బలి బంధించిన నాఁటి వామన తనుప్రాబల్యముం దాల్చి, యు
జ్జ్వల చంద్రోదయవేళఁ బొంగు తటినీశస్ఫూర్తి నుప్పొంగి, ఘో
ర లయాభ్రంబు తెఱంగునన్‌ భయద గర్జారావముం జేసి, త
జ్జలధిం దాటఁగఁ బూనితీవు పరమోత్సాహమ్మునన్‌ మారుతీ! 16

మ. స్థిరసత్త్వంబున శైలరాజము ధరిత్రిం గ్రుంగఁ బాదంబులూ
ది, రహిన్‌ భూరిభుజోరు వేగమున ధాత్రీజాతముల్‌ పెల్లగి
ల్లి రయంబారఁగఁ దోడ రా, గగనమున్‌ లీలాగతిన్‌ మ్రింగ సు
స్థిరశక్తిం జనుమాడ్కి దాటితివి గాదే నింగికిన్‌ మారుతీ! 17

మ. అగజాలావృతమూర్తివై భుజరయోద్యద్వారివాహంబు లొ
ప్పుగ నిర్వంకల నంటి రా గదలి యంభోరాశిమధ్యంబునన్‌
గగనాధ్వంబున నేగు నిన్నమిషుల్‌, గంధర్వులున్‌ లంబప
క్ష గిరీంద్రంబును బోలె జూచిరికదా సంభ్రాంతులై మారుతీ! 18

శా. లోకాలోకగుహాముఖంబులు బదుల్‌ మ్రోయంగ నుద్వృత్తి న
స్తోకధ్వానమొనర్చి, వజ్రనిభ వక్షోఘట్టనస్ఫూర్తి మై
నాకంబున్‌ సుడిబెట్టి దాని పిదపన్‌ మన్నించి కేలూది ప్ర
త్యేకం బా బలవైరిచేత నభయంబిప్పింపవే మారుతీ! 19

మ. గరిమన్‌ వేల్పులు నీదు శక్తి దెలియం గాంక్షించి, నాగాంబయౌ
సురసం బంపిన వ్యాపితాస్య యగుచుం జొప్పాగి పోనీక ముం
దఱఁ దోతెంచిన, సూక్ష్మమూర్తివగుచుం దద్వక్త్రముం జొచ్చి గ్ర
మ్మర నేతెంచిన యోగసిద్ధుని నినుం బ్రార్థించెదన్‌ మారుతీ! 20

మ. పటుపాథోధి తరంగ పంక్తులు గణింపం బోవు చందాన ను
త్కటవేగంబునఁ బోవు నిన్నుఁ గని వేడ్కన్‌ వీతసందేహులై
చటుల స్థైర్యబలద్యుతిస్యదమతుల్‌ శౌర్యంబు ధైర్యంబు మి
క్కుట మౌఁగా కని నీకొసంగరె దివౌకుల్‌ దీవనల్‌ మారుతీ! 21

మ. పవనాభస్యద మొప్ప నీవు కడిమిం బథోనిధిం దాటుచో
భవదీయోరు భుజోరువేగ జనితాభంగోర్మికాజాలముల్‌
దివితో రాయ ఘుమంఘుమార్భటులు దిగ్దేశంబులం బర్వఁ బ
త్రవహేంద్రుండని భీతిలెన్‌ ఫణులు పాతాళంబునన్‌ మారుతీ! 22

మ. శరదశ్రేణుల దూరుచున్‌ వెడలుచుం జాబిల్లి చందానఁ బు
ష్కర మార్గంబున నేగు నిన్నుఁ గని నీ చాతుర్యమున్‌ మెచ్చి ని
ర్జరు లానంద మెలర్పఁ జల్లిన మరుత్సంతానపుష్పంబుల
ట్లరుదారన్‌ గననయ్యెఁ జుట్టును సముద్యత్తారకల్‌ మారుతీ! 23

శా. ఛాయాగ్రాహిణి నామరాక్షసి సరస్వ న్మధ్యమందుండి నీ
కాయచ్ఛాయను బట్టి వేఁ దిగువఁ దద్గర్భంబు భేదించి త
త్కాయంబుం గొని మింటిపై కెగసి కిన్కన్‌ వార్ధిలో జీవితా
పాయంబుం గలుగంగ వైచిన నినున్‌ వర్ణించెదన్‌ మారుతీ! 24

శా. మైనాకంబు నతిక్రమించి, సురసన్‌ మన్నించి, యా సింహికా
ఖ్యానన్‌ రాక్షసిఁ గీడటంచి నడుమన్‌ గాలూద కస్తాద్రికిం
భానుండేగక మున్నె, మారుతగతిన్‌ వారాశి నూఱామడన్‌
గ్లానిం జెందక దాటితీవు సురసంఘంబెన్నఁగా మారుతీ! 25

మ. అనఘా! భాస్కరుఁడొక్క మాఱుదయశైలాగ్రంబునందుండి య
స్తనగాగ్రంబున కేగునంతకు సముద్యచ్ఛక్తి వేమాఱు బె
ల్చన నక్కొండల రెండునుం దిరుగు తేజశ్శాలికిన్‌ నీకు చ
య్యన నూఱామడ దాటుటేమి విషయం బస్తోకమే మారుతీ! 26

మ. తతవేగంబున వార్థి దాటి గడిమిం దద్యామ్యతీరస్థ ప
ర్వతముం జేరి నగోపమాన నిజగాత్రవ్యాప్తి జాలించి, ని
ర్గత మోహుండగు యోగిభంగిఁ బ్రకృతిం బ్రాపించి, లంకాపురీ
స్థితసర్వంబును బోల జూచితివి గాదే దవ్వులన్‌ మారుతీ! 27

శా. పంకేజాసను శాసనంబున జయింపన్‌ రాక యశ్రాంతమున్‌
లంకాద్వారముఁ గాచియున్న కుపితన్‌ లంకన్‌ జయాంకన్‌ నిరా
తంకప్రౌఢి నశంకముష్టిహతి చేతం దూలఁగాఁ బుచ్చి, వీ
రాంకగ్రామణివై వెలింగెడు నినున్‌ బ్రార్థించెదన్‌ మారుతీ! 28

శా. ప్రాచుర్యంబుగ చందురుండు కిరణవ్రాతంబు పైఁ జల్లుచున్‌
సాచివ్యం బొనరింప యోగమహిమన్‌ మార్జాలమాత్రుండవై
నీచుల్‌ దైత్యులు చూడకుండ సతి నన్వేషింపగా శేముషీ
వైచిత్రిన్‌ వెస లంక డాసిన నినున్‌ వర్ణించెదన్‌ మారుతీ! 29

శా. లంకానామనిశాటి నాకరణిఁ దూలం బుచ్చి యాప్రోలిఁకన్‌
గంకోలూక వశంబు గాగలదు నిక్కంబంచు వామాంఘ్రి ని
శ్శంకన్‌ ముందుగ బెట్టుచున్‌ సురభిళాంచద్రాజమార్గంబునన్‌
లంకాకాననవహ్నివై చనవె ధీరత్వంబునన్‌ మారుతీ! 30

శా. నానావికారరూపులను నానావేషులన్‌ దైత్యులన్‌
నానాఘోరశరీరులం గనుచు నానాగుల్మముల్‌ చూచుచున్‌
నానావాద్యరవంబులన్‌ వినుచు, విన్నాణంబుగా రాఘవో
ర్వీనాథ ప్రియపత్ని భూమిసుత నన్వేషింపవే మారుతీ! 31

శా. సాహంకారత దానవుల్‌ సలుపు వీరాలాపముల్‌ గాంత లు
త్సాహంబొప్పఁగఁ జేయు గానములు మంత్రజ్ఞాసురప్రేరిత
స్వాహానాదము లాలకింపుచు నవాచ్యం బీపురీవైభవం
బాహా! చిత్రమటంచు మెచ్చుకొనవే స్వాంతంబునన్‌ మారుతీ! 32

మ. వరుసన్‌ గ్రంతులు రచ్చచావడులు భాస్వచ్చైత్యముల్‌ భూరిగో
పురముల్‌ మేడలు పుణ్యవీధులగముల్‌ భూమీగృహశ్రేణులున్‌
హరిజిత్కుంభ నికుంభులున్‌, శుకుఁడు యూపాక్షాసురుం డాదియౌ
సురవిద్వేషుల చారుమందిరములన్‌ శోధింపవే మారుతీ! 33

మ. చలమొప్పన్‌ దశకంఠరాక్షస నివేశంబు బ్రవేశించి యం
దు లతామందిరముల్‌ దివాగృహకముల్‌ తోరంపుక్రీడాగృహం
బులు, చిత్రావసదంబులున్‌ మణిగృహంబుల్‌ చారుశయ్యాగృహం
బులు వీక్షింపుచు నంతటన్‌ వెదకవే భూపుత్రికన్‌ మారుతీ! 34

మ. నలువొప్పం గమనీయ పుష్పకవిమానంబుం దగం జూచి యు
జ్జ్వల నానావిధధూపవాసనలు దివ్యస్రక్సుగంధంబు లిం
పలరారం బ్రియబంధునిం బలె సముద్యత్ప్రీతి రమ్మంచు నిం
జెలిమిం బిల్వఁగ నేగుదెంచినక్రియన్‌ జెంతం గుబాళింప ద
ద్విలసద్దివ్యగృహంబు జేరితివి కాదే మెల్లనన్‌ మారుతీ! 35

మ. అమరారాతికిఁ బ్రీతిగా వివిధవాద్యధ్వానముల్‌ చేసి పా
నమదావేశము చేత మైమఱచి నానాచేలభూషాఢ్యలై
క్రమతన్‌ జాల్గొని సుప్తవాహినుల లీలం గూర్కు కాంతానికా
యముల న్గన్గొని ధర్మలోపభయముం బ్రాపించి నీ వాత్మలో
విమలప్రజ్ఞున కేల శంక? యని యన్వేషింపవే మారుతీ! 36

మ. కమనీయోన్నత పుష్పతల్పము పయిం గన్మూసి గుర్వెట్టు పం
క్తిముఖున్‌ నీలఘనాభదేహు గని తత్తేజంబునన్‌ రత్న దీ
పములం దద్గృహమెల్ల వెల్గుచునికిన్‌ భావంబునన్‌ మెచ్చుచున్‌
సముదంచద్గతి నచ్చటన్‌ వెదకవే క్ష్మాపుత్రికన్‌ మారుతీ! 37

మ. సరసాన్నంబులు పక్వమాంసచయముల్‌ సౌరభ్య సంవాసిత
స్ఫురదుచ్చావచ మద్యపూరితఘటంబుల్‌, మాల్యముల్‌ నిద్రితా
సురకాంతల్‌ గల పానశాల గని యచ్చో రాఘవ ప్రేయసిన్‌
సురకాంతాసదృశన్‌ విదేహతనయన్‌ శోధింపవే మారుతీ! 38

మ. అరవిందోత్పల కైరవోదరమరందాస్వాదనోన్మత్తబం
భరమాలా పరిషన్మనోజ్ఞ మధురధ్వానాభిరంజత్‌ సరొ
వరతీరంబులఁ బుష్పపల్లవ ఫలవ్రాతాగ్ర ధాత్రీరుహో
త్కరమూలంబుల నేర్పునన్‌ వెదకవే ధాత్రీసుతన్‌ మారుతీ! 39

శా. ఈలీలన్‌ దశకంఠుపట్టణములో నేపారఁగాఁ బెక్కు చం
దాలమ్‌ గేలలిడునంత భూమితల మైనం దప్పకుండంగ నీ
వాలోకించి మహీజఁ గానక నిజస్వాంతంబులోఁ గొంతసే
పాలోచింపవే స్వామికార్యఘటనావ్యాపారమునన్‌ మారుతీ! 40

శా. కంటిం జారణ సిద్ధ కిన్నర మరుద్గంధర్వ కాంతావళిన్‌
గంటిన్‌ మానవయోషలన్‌ బవనభుగ్రామా లలామంబులన్‌
గంటిన్‌ సర్వనిశాచరప్రమదలన్‌ గంటిం బురంబందు నే
వెంటం జానకిఁ గాననైతి నని నిర్వేదింపవే మారుతీ! 41

శా. ఈ లంకాపురరాజ్యమందుగల చోట్లెల్లన్‌ సమగ్రంబుగా
నాలోకించితి నింక నొక్క వన మీ యంతఃపురాభ్యాసమం
దాలేఖేశవనంబు మాడ్కిఁ గడు హృద్యంబై రహిం గ్రాలెడిన్‌
బాలారత్నము నచ్చటన్‌ వెదకెదం గాకంచు డెందాన నీ
వాలోచించి రయంబు మీరఁ జనవే యచ్చోటికిన్‌ మారుతీ! 42

మ. వనముఙ్మండలిఁ జొచ్చు చంద్రుని గతిన్‌ బ్రచ్ఛన్నవేషంబుతో
వనముం జొచ్చి లతాగృహోత్కర తరువ్రాతంబులన్‌ దీర్ఘికల్‌
ఘనసౌధంబులు చూచుచున్‌ జని మరుత్కల్పుండవై శింశుపా
ఖ్య నగారోహణ మాచరించితివి గాదా నేర్పునన్‌ మారుతీ! 43

మ. తరుణిం గ్రీష్మగభస్తి, తప్తలతచందానన్‌ రహిన్‌ వాడి భీ
కర దైత్యాంగన లాడు మాటలకు నాకంపించుచున్‌ సారెకున్‌
జిరభక్తిన్‌ రఘురామ, రామ యనుచుం బేర్కొంచు శోకార్తయై
తరుమూలంబున నున్న జానకిని సందర్శింపవే మారుతీ! 44

మ. కమనీయాకృతి శింశుపాఖ్యతరుశాఖాపర్ణలీనుండవై
యమరారాతి దశాస్యుడన్న కటుక్రూరాలాపముల్‌ రాక్షస
ప్రమదల్‌ వల్కు దురుక్తులంత త్రిజటాస్వప్నప్రకారంబు న
య్యమ గావించు విలాపమంతయును నీ వాలింపవే మారుతీ! 45

శా. రామాధీశుడు తండ్రి పంపున మహారణ్యోర్వికిన్‌ వచ్చె ని
ష్కామం దత్సతి సీత బల్మిఁ గొని వీకం బోయె బంక్త్యాస్యుఁడా
రామన్‌ వే వెదకంగ నేను జలధిన్‌ లంఘించి శోధించి యి
చ్చో మన్మాతను గంటిమంటి ననుచున్‌ శ్రోత్రానుకూలంబుగా
వేమాఱున్‌ మధురంబుగాఁ బలుకవే విన్నాణివై మారుతీ! 46

మ. ఇది సంధింపఁగ వేళ యంచుఁ గడఁకన్‌ వృక్షంబు వేఁడిగ్గి య
మ్మదిరాక్షీమణి మ్రోల నిల్చి పతిసేమంబంతయుం జెప్పి త
ద్వదనాద్యాకృతి చిహ్నముల్‌ దెలిపి విశ్వాసంబు పుట్టించి దీ
ప్యదనర్ఘాంగుళి ముద్రికం గుఱుతుగా నర్పింపవే మారుతీ! 47

మ. అతిసూక్ష్మాంగుఁడ వీవు ననుఁ గొని యీయంభోనిధిం దాటి యే
గతి పోవంగలవంచు సీత పలుకం గౌతూహలం బొప్ప న
ప్రతిమానామర శైలసన్నిభ శరీరం బర్మిలిం జూపి యా
క్షితికన్యామణి కద్భుతంబు ముదముం గీల్కొల్పవే మారుతీ! 48

మ. ప్రమదం బొప్పఁగ సీత యిచ్చిన శిరోరత్నం బొగిన్‌ సంగ్రహిం
చి మహాత్ముండగు రాము నిచ్చటికి నే శీఘ్రంబునఁ దోడి తె
త్తు మదిన్‌ శోకముఁ దక్కియుండుమని యెంతో భక్తితో నూరడిం
చి, మహిన్‌ సాగిలి మ్రొక్కి గైకొనవె యాశీర్వాదముల్‌ మారుతీ! 49

మ. జనకక్ష్మాపతిపుత్రిచేఁ దగ ననుజ్ఞాతుండవై 'యూరకే
జననేలా, దశకంఠదైత్యునకు మత్సామర్థ్య మొక్కింత జూ
పనగుం గా' కని తండ్రివోలె నతిరంహం బర్మిలిం దాల్చి గ్ర
ద్దన నద్దైత్యుని ప్రాణతుల్యవన ముత్పాటింపవే మారుతీ! 50

మ. అసురాధీశ్వరుఁడవ్విధంబు విని కట్టల్కన్‌ రణార్థం బశీ
తిసహస్రంబులఁ గింకరాఖ్యుల మహాతేజః ప్రభావాఢ్యులన్‌
వెసఁబంపన్‌ విలయాంబుదంబు కరణిన్‌ మిన్నంది గర్జించి దీ
మస మొప్పం దగ వారినెల్లఁ గడిమిన్‌ మర్దింపవే మారుతీ! 51

శా. వప్రంబుల్‌ బడఁగూల్చి బల్విడి నభోభాగంబుతో రాయు చై
త్యప్రాసాదముఁ గూలఁదన్ని విపులస్తంభంబుచే బాహుస
త్త్వప్రావీణ్య మెలర్పఁ దద్వనముఁ దత్ప్రాసాదముం గాచు దే
వప్రద్వేషుల నెల్ల దారుణగతిన్‌ భంజింపవే మారుతీ! 52

శా. శైలోత్పాటన దక్షిణుండగు నభస్వత్పుత్రుఁడన్‌ జన్యవి
ద్యాలోలుండగు రామభద్రునకు నే దాసుండ సుగ్రీవునిన్‌
వాలాయంబు భజించువాఁడ హనుమన్నామంబునం బొల్తు భూ
పాలుండంపఁగ భూమిపుత్రిఁ బరికింపన్‌ వచ్చితిన్‌ గ్రవ్యభు
క్కాలుండన్‌ జనుతెండు పోరి కని లంకం జాటవే మారుతీ! 53

మ. కడఁకన్‌ రావణప్రేరితుం డగుచు వీఁకన్‌ జంబుమాల్యాఖ్య దై
త్యుఁడు సేనాయుతుఁడై రణంబునకుఁ దోడ్తో డాసినన్‌ వానిఁ బ
ల్విడి భాస్వత్పరిఘాయుధంబున బలోపేతంబుగా నాజిలో
గడిమిం జంపి యుగాంతమేఘముక్రియన్‌ గర్జింపవే మారుతీ! 54

మ. వరుసన్‌ దారుణ సప్తమంత్రితనయుల్‌ బాహాబలంబొప్ప బం
దుర వైశ్వానర సప్తహేతులన దోడ్తో వెల్గుచున్‌ డాసినన్‌
కరులం గన్న మృగేంద్రులీల పెనుకిన్కం బొంగి యద్దైత్యుల
స్థిరసత్వంబున ద్రుంపవే కలన నిశ్శేషంబుగా మారుతీ! 55

మ. దురితాత్ముల్‌ దశకంఠుపంపున మదాంధుల్‌ పంచసేనాగ్రగుల్‌
పరుషోగ్రాస్త్రము వేయుచుం గదియఁ గాలం గేల మర్దించి భీ
కరభంగిన్‌ పరిమార్చి తోరణ విటంకస్థుండవై, వెండి దు
ష్కరదైతేయ సమాగమంబు మదిలోఁ గాంక్షింపవే మారుతీ! 56

శా. అక్షీణస్ఫుట బాహుశౌర్యుఁడు మహాహంకారుఁడున్‌ దైత్యహ
ర్యక్షుం డక్షుఁడు డాయఁ దార్క్ష్యుఁడహినట్ల వాని పదంబులన్‌
దక్షత్వంబునఁ బట్టి యెత్తి వడి మింటన్‌ బల్మరుం ద్రిప్పి జ
న్యక్షోణిం బడవైచి చంపవె బలౌద్ధత్యంబునన్‌ మారుతీ! 57

మ. జనితామర్షణుఁ డింద్రజిత్తు సకలాస్త్రజ్ఞుండు బ్రహ్మాస్త్రబ
ద్ధునిఁ గావింప వరప్రభావమునఁ దోడ్తొ బంధముక్తుండవై
దనుజేంద్రుం గని వానితో విభుని దోర్దర్పంబు సర్వంబు దె
ల్పనగుం గాకని బద్ధుఁడైన పగిదిన్‌ వర్తింపవే మారుతీ! 58

మ. దితిజాధీశుని మ్రోల నిల్చి వెస దత్తేజంబు రూపంబు సం
స్థితి సర్వంబును బోలఁ జూచి యహహా తేజస్వి యౌ వీని యం
దతి దౌష్ట్యంబిది లేక యున్న సురలోకాధీశ్వరత్వంబున స
మ్మతి నొందం దగ నర్హుఁడంచు మదిలో భావింపవే మారుతీ! 59

మ. భవదీయాకృతియున్‌ బ్రతాపమును శుంభద్వీర్యముం గాంచి దై
త్యవిభుండీతఁడు కీశమాత్రకుఁడుగాఁ డాదిత్యులుం బంపఁగా
భువిఁ గీశాకృతిఁ దాల్చి వచ్చిన మహాభూతంబగుం గానిచో
దివిజారాతులఁ జంపునే యనుచుఁ జింతింపండొకో మారుతీ! 60

శా. 'ఓరి రావణ! నేను రామనృపవంశోత్తంసు దాసుండ నా
శూరాగ్రేసరుపత్ని నీవు వనిలో జోరుండవై తెచ్చిత
న్నారీరత్నము నిమ్ము రాఘవునకున్‌ గాకున్న నీవింక త
ద్ఘోరాస్త్రంబులఁ జత్తు వాజి' నని నీతుల్‌ దెల్పవే మారుతీ! 61

శా. "బాలారత్నము సీత మ్రుచ్చిలిటు నీ పాలింటికిన్‌ మృత్యువం
చాలోకింపక దెచ్చితింత కెపుడో యద్దేవి కోపానల
జ్వాలాళిం బడి భస్మమై చనక సప్రాణుండవై యుండుటల్‌
చాలన్‌ చిత్రము భర్తచేఁ గలన నిన్‌ జంపింప నిందాక ని
ట్లాలస్యం బొనరించె" నంచనవె దేవారాతితో మాఅరుతీ! 62

మ. "ఖల దైత్యాధమ! జానకీసతిని నీ కంఠస్థశాతాసిగాఁ
దలపై బడ్డ మహాశనిచ్ఛదముగాఁ దాలుస్థితోద్యద్ధలా
హలముంగా వసనాంచలగ్రథిత దీప్తాగ్నిస్ఫులింగంబుగా
తలప న్నేరక దెచ్చి తీ" వని రహిన్‌ దర్జింపవే మారుతీ! 63

మ. "తరమే నీకిక నెందుఁ బోఁగలవు పాతాళంబులో డాఁగినన్‌
శరధిం జొచ్చిన మిన్నుఁ బ్రాకిన దశాస్యా! వజ్రి వజ్రాభ భీ
కరబాణంబుల నీ శిరంబులనిలో ఖండించి యా కాకుత్స్థుఁడా
వరవర్ణిన్‌ గొనిపోవు నిక్క" మనుచున్‌ వాదింపవే మారుతీ! 64

మ. 'దశకంఠాసుర! పుణ్యసాధ్వియగు సీతం గానలో దొంగవై
పశుబుద్ధిం గొనితెచ్చి నందుకిపుడే బంధించి ముష్టిన్‌ త్వదు
గ్రశిరంబుల్‌ వెస వ్రక్కలింపనగు నా రామాజ్ఞ లేకున్కి దు
ర్దశ నొందింపక యోర్చియుంటి' ననుచుం దర్జింపవే మారుతీ! 65

మ. దనుజాధీశుఁడు నీదువాలమునకున్‌ తైలార్ద్రచేలంబు లొ
య్యనఁ జుట్టించి కొనన్‌ కృశాను నిడి దేవారాతు లివ్వానరుం
గొని ప్రోలంతయుఁ ద్రిప్పుడంచుఁ బలుకన్‌ ఘోషింపుచున్‌ దైత్యుల
ట్లొనరింపన్‌ బురి గుప్తికర్మము తదుద్యోగంబు వీక్షింపఁ బె
ల్పన దత్కర్మ మొకింతసేపు మదిలో సైరింపవే మారుతీ! 66

మ. ప్రకటింపన్‌ జగముల్‌ దహించు శిఖి నీవాలాగ్రగుండయ్యు జా
నకి యాశీర్వచనంబునన్‌ బవనబాంధవ్యంబునన్‌ జేసి తా
వకవాలాంచితరోమమైనఁ గమలింపన్‌ శక్తుఁడుంగాక పొం
దికతోఁ జందనపంకశీతుఁ డగుచున్‌ దీపింపఁడే మారుతీ! 67

మ. తనువుం గొంచెముఁ జేసి రజ్జుమయబంధంబుల్‌ వడిం ద్రుంచి వెం
టనె కాలాభ్రము వైఖరిన్‌ బెరిగి తోడన్‌ వచ్చు దోషాటులన్‌
మునుముట్టం దునుమాడి నిర్జరులు సంతోషింప వాలాగ్నిచే
ఘనలంకానగరంబు సర్వ మవిశంకం గాల్పవే మారుతీ! 68

మ. జనకక్ష్మాపతిపుత్రి యున్న నగరాజంబున్‌, నయజ్ఞుండు స
జ్జనమాన్యుండగు నవ్విభీషణుని వేశ్మశ్రేష్ఠముం దక్క త
క్కిన లంకాపురమెల్ల వాలకలితాగ్నిం గ్రాగి క్రుద్దేశనే
త్రనటత్పావక దగ్ధలోకసమతం బ్రాపించెఁగా మారుతీ! 69

మ. నిను బంధించుట నీదువాలమున వహ్నిం గొల్పుటల్‌ రాక్షసుల్‌
వినిపింపన్‌ విని సీత యేను పతికిం బ్రేమాస్పదీభూత నౌ
ట నిజంబేని కృపీటజన్మ! కడువేడ్కన్‌ మత్ప్రియార్థంబు పా
వనికిన్‌ శీతుఁడవై వెలుంగు మనుచున్‌ బ్రార్థింపదే మారుతీ! 70

మ. ఘనవాలాగ్ని శిఖాళిఁ గాల్చితిని లంకన్‌ సీత యేమయ్యెనో
యని శంకించి కృశానుచేఁ గమల కాహా! నేఁడు వైదేహనం
దిని సేమంబున నున్న దంచు వినువీథి న్మ్రోయు దేవోక్తులన్‌
విని మోదంబున భూమిపుత్రి మరలన్‌ వీక్షింపవే మారుతీ! 71

మ. శరధిం దాటి దశాస్యు ప్రోలమరు లెంచం జొచ్చి సర్వంసహా
వరజం గాంచి, యశోకానననము విధ్వంసంబు గావించి కొం
దఱ దైతేయులఁ జంపి వెండి జలధిన్‌ లంఘించి శీఘ్రంబె యు
త్తర తీరస్థ నగంబుఁ జేరితివి గాదే బల్విడిన్‌ మారుతీ! 72

మ. కనుగొంటిన్‌ రఘురామపత్ని నల లంకాపట్టణాభ్యంతరం
బున నంచుం దగఁ బోయి వచ్చిన విధంబునన్‌, సర్వకార్యంబులున్‌
వినయంబొప్పఁగఁ దెల్పి యంగదునకున్‌ నీలాజపుత్రాదికీ
శనికాయంబుల కట్లొసంగవె మహాసమ్మోదమున్‌ మారుతీ! 73

మ. చిరకాలంబునుండి పెంచిన మధుస్ఫీతోరుకాంతారముం
గరమర్థిన్‌ వడిఁ జొచ్చి విచ్చలవిడిన్‌ సంతుష్టియౌ నట్లుగా
వరుసన్‌ దేనెలుఁ ద్రావనిచ్చి ఫలముల్‌ భక్షింపఁగాఁ జేసి వా
నరులం దృప్తులఁ జేయవే సమధికానందముతో మారుతీ! 74

శా. ఆరామాధిపు పాదపద్మముల కుద్యద్భక్తితో మ్రొక్కి గ
న్నారన్‌ జూచితి భూమిపుత్రిని దశాస్యావాసమౌ లంకలో
సారోద్యానమునందు దైత్యయువతీ సందోహమధ్యంబునన్‌
వీరగ్రామణి! చిక్కియున్నదని తద్వృత్తాంత మాద్యంత మిం
పారం దెల్పి, ముదబ్ధిఁ దేల్పవె నృపాలాగ్రేసరున్‌ మారుతీ! 75

మ. మహిపుత్రీకుశలంబు దెల్పి, మము సమ్యగ్ప్రీతి పాథోధి వా
ర్లహరిన్‌ దేల్చితి వింక నేను ప్రతికారం బేమి గావింతు? మ
త్సహనోదగ్రభుజాయుగాంచితపరిష్వంగంబు నీకిచ్చెదన్‌
రహి మీఱ న్గొను మంచొసంగఁడె కృపన్‌ రాజేంద్రుఁడున్‌ మారుతీ! 76

శా. ఆ లంకాపురి గుప్తికర్మము, నిశాటాళిప్రలాపంబులున్‌
వాలాయంబు దశాస్యుగర్వమును సర్వంబున్‌ నివేదించి కీ
శాళిం దోడ్కొని ఘోరజన్యమునకున్‌ యానంబు గావింపు, మిం
కాలస్యంబది యేలటంచు విభునిం బ్రార్థింపవే మారుతీ! 77

మ. మతిమంతుండు విభీషణుండు, రఘురామా, నన్ను రక్షింపు మం
చతిదైన్యంబున నేగుదెంచిన దదీయాకార వాగింగితా
తతశీలంబుల చేత వాని పరిశుద్ధత్వంబు బోధించి, స
మ్మతి నిప్పింపవె వాని కట్లభయమున్‌ క్ష్మానాథుచే మారుతీ! 78

మ. నలుఁడా సేతువు గట్టునప్పుడు కపుల్‌ నానాప్రకారంబులన్‌
శిలలం జెట్టులు దెచ్చివైచునెడ నిస్సీమప్రభావంబునన్‌
జలమారం దగ నీవు రాఘవుఁడు మెచ్చం గొప్ప శైలంబులన్‌
బలువొప్పం గొని తెచ్చి వైచి జలధిం బంధింపవే మారుతీ! 79

మ. కనకోర్వీధరరాజ మద్భుతగతిం గాలాభ్రముం దాల్చిన
ట్లనుమానింపఁగ నీవు భూరివిపులోద్యత్పృష్ఠభాగంబునన్‌
దిననాథాన్వయసోము రాము నమితస్థేమున్‌ రహిం దాల్చి గ్ర
న్ననఁ దత్సేతుపథంబునం జలనిధిం దాటింపవే మారుతీ! 80

మ. సురనాథుండు శతారధార నలుకన్‌ క్షోణీధ్రముం బోలె సం
గరభూమీస్థలి ధూమ్రలోచన మహాక్రవ్యాదునిం బట్టి ని
ష్ఠురశైలప్రహతిన్‌ విభిన్నపృథుశీర్షుం జేసి, దుర్దాంత భీ
కరభంగిన్‌ బడఁగూల్పవే నృపతి వేడ్కం జూడఁగా మారుతీ! 81

మ. ఘనబాహాబలుఁ డయ్యకంపనుఁడు దైత్యానీక సంయుక్తుఁడై
యనికిం డాసిన భూరిరౌద్రరసదీప్తాస్యుండవై ఘోరవృ
క్షనిపాతంబున వాని పెన్నురము వ్రక్కల్‌ చేసి వాతూల మొ
య్యన వృక్షంబును బోలె గూల్పవె సురల్‌ హర్షింపఁగా మారుతీ! 82

మ. వదనంబు బ్రళయార్కబింబము క్రియన్‌ భాసిల్ల, లాంగూల మా
త్రిదశేంద్రాయుధవైఖరిన్‌ మిగుల నుద్దీపింప బంచాననో
ద్యదహీంద్రంబును బోని దక్షిణకరం బాసక్తితో నెత్తి, వా
రిదనాదంబున ధాత్రి గ్రక్కదలఁ బేరెంబెత్తుచున్‌ వచ్చి త
ద్ద దశాస్యుండు సగంబుఁ జావ నఱచేతన్‌ వ్రేయవే మారుతీ! 83

మ. రణరంగమ్మున మూర్ఛనొందిన సుమిత్రాపుత్రునుం, ధీరునిన్‌
ఫణినాధాంశజు, లంకకట్లు గొనిపోవం జూచు దుష్టాత్ము రా
వణునిం వజ్రనికాశముష్టిహతి నొవ్వంజేసి తూలించి, ల
క్ష్మణునిం దేర్చి యొసంగవే విభునకున్‌ సంతోషివై మారుతీ! 84

మ. హరిజిచ్చాపవిముక్త ఘోరతరబ్రహ్మాస్త్ర ప్రభావంబునన్‌
వరుసన్‌ మూర్ఛిలి చాపకట్టుగ రహిన్‌ సంగ్రామరంగమ్మునం
దరుదారం బడియున్న వానరుల నుద్యచ్ఛక్తి సంజీవిచే
కర మర్థిం బ్రతికించి మెప్పు గొనవే కాకుత్స్థుచే మారుతీ!  85

శా. దైత్యానీకపయోధి మధ్యమున మందానాద్రిభంగి రయౌ
ద్ధత్యం బొప్పఁగ సంచరింపుచు బలౌదార్యం బెలర్పన్‌ బృహ
ద్వాత్యాచక్రము శుష్కపర్ణముల చందానన్‌ వడిం ద్రిప్పి, యా
దిత్యుల్‌ మెచ్చఁగ బట్టి గీటడఁచవే దేవాంతకున్‌ మారుతీ! 86

శా. జంభారాతి నిజోరుపాణిగత భాస్వద్ఘోరదంభోళిచే
గాంభీర్యంబున విశ్వరూపుశిరముల్‌ ఖండించి నట్లీవు స
ర్వాంభోధుల్‌ గలగంగ నార్చుచు ఫణీంద్రాభాసి నంకించి, సం
రంభం బొప్ప వెసన్‌ త్రిశీర్షుశిరముల్‌ ఖండింపవే మారుతీ! 87

శా. మాయాసీతను జంపి నిన్ను భ్రమియింపం జేసి దుర్వారదై
తేయ ప్రావృతుఁడై నికుంభిలకు నెంతేఁ గోర్కితో నేగి, య
చ్చో యాగం బొనరింపుచున్న యసురేశున్‌ మేఘనాధాఖ్యు దీ
క్షాయుక్తిన్‌ సమరోర్వి లక్ష్మణునిచేఁ జంపింపవే మారుతీ! 88

శా. విద్యుద్వల్లిక భంగి వాలము వియద్వీథిం బ్రకాశింప ను
ష్ణద్యుత్యున్నతమండలంబు కరణిన్‌ వక్త్రంబు శోభిల్లగా
ప్రోద్యద్బాహుబలం బెలర్పఁగ నికుంభుం గుంభకర్ణాత్మజున్‌
సద్యోమృత్యువు నొందఁజేయవె మహాజన్యంబునన్‌ మారుతీ! 89

మ. ఘనశాండిల్య మునీంద్రుశాపంబున నుగ్రగ్రాహియై ధాన్యమా
లిని కాసారములోన నుండి జలముల్‌ నీ వర్ధిఁ గ్రోలన్‌ వడిన్‌
నిను మ్రింగం జనుదేరఁగాఁ గడిమి వానిన్‌ వ్రేల్మిడిం జంపి గ్ర
క్కున దచ్ఛాపము దీర్చి పుచ్చవొకొ శక్రుం గొల్వగా మారుతీ! 90

మ. చతురత్వంబున నీవు లక్ష్మణునికై సంజీవిఁ దేఁబోవుచో
దితిజాధీశ్వరు పంపునం బ్రబల దైతేయుండు మారీచదై
త్యతనూజాతుఁడు కాలనేమి ఘనమాయామౌనియై త్రోవఁ జిం
తితవిఘ్నం బొనరింప డాయుటయు వానిం ద్రుంపవే మారుతీ! 91

మ. తొలుతం బల్మరు మందు లిమ్మనుచు నెంతో వేడి, యీకున్న కే
వలశక్తిన్‌ హరి మందరాచలము నుత్పాటించినట్లీవు క
ట్టలుకన్‌ వాలముఁజుట్టి పాదముల నిట్టట్టూచి దిగ్రాజిఘూ
ర్ణిల దివ్యౌషధశైలముం బెఱుకవే క్రీడాగతిన్‌ మారుతీ! 92

శా. గీర్వాణాద్రివిభాగమున్‌ శిరముపై గీల్కొల్ప దుర్దాంతదో
ర్గర్వం బొప్పఁగ వచ్చుచుండ గిరికిం గాపున్న పెక్కండ్రు గం
ధర్వుల్‌ బోవఁగనీక నడ్డపడినన్‌ దర్పంబునన్‌ వారలన్‌
దుర్వారోద్ధతి వాలజానిలమునం దూలింపవే మారుతీ! 93

మ. గరిమన్‌ మాల్యవదాది రాక్షసు లసంఖ్యాతంబుగా వచ్చి యం
బరవీథిం జలరాశిమధ్యమున దర్పం బేర్పడం దాకినన్‌
గిరిరాజంబును కందుకంబు కరణిన్‌ గేలన్‌ రహిం దాల్చి దు
ర్భరవీర్యంబున వారిఁ జంపి జముఁ గొల్వం బంపవే మారుతీ! 94

మ. అవలీలన్‌ నిశిజాములోపల రయం బారంగ సంజీవిశై
లవరంబుం గొని తెచ్చి జన్యమునఁ బౌలస్త్యోల్లసచ్ఛక్తిచే
నవనిన్‌ మూర్ఛితుఁడైన లక్ష్మణున కీవా మందులర్పించి, శూ
రవరేణ్యుం బ్రతికించి మెప్పుఁ గొనవే రాజేంద్రుచే మారుతీ! 95

మ. అనఘా! యెంతని చెప్పవచ్చు భవదీయావార్యదోస్సత్త్వమున్‌
కనకోర్వీధరసన్నిభౌషధగిరిన్‌ వాలంబునం జుట్టి గ్రం
దున లంకాపురినుండి సత్వరమునం దొల్లింటిచోటం బడన్‌
వినువీథిన్‌ వడి ద్రిప్పివైవవె జగద్విశ్రాంతిగా మారుతీ! 96

మ. అల మైరావణుఁ డొక్కనాఁటి నిశి నిద్రాసక్తులై యున్న భూ
పలలామేంద్రుల మ్రుచ్చిలించియు వెసన్‌ పాతాళలంకాపురిన్‌
ఖలుఁడై చొచ్చిన వాని వెంటఁ జని యాకష్టాత్మునిం ద్రుంచి శో
భిలుచున్‌ నీవటు రామలక్ష్మణుల దేవే క్రమ్మఱన్‌ మారుతీ! 97

మ. దశకంఠుం బరిమార్చి, యాత్మజయముం ధాత్రీజకుం జెప్పి, త
త్కుశలం బారసి రమ్మటంచు వెస గాకుత్స్థుండు పంపం బురం
బు శశిప్రక్రియఁ జొచ్చి, రావణువధంబుం దెల్పి, సీతాసతిన్‌
విశదానందరసాబ్ధిఁ దేల్చినది నీవే కావొకో మారుతీ! 98

శా. ధీరోదాత్తుఁడు రాముఁడంప నటు నందిగ్రామముం జేరి, నీ
వారూఢిన్‌ భరతున్‌ మహాత్ముఁ గని, రామాధీశ్వరుం డర్థి సీ
తారామవరజాన్వితంబుగ భరద్వాజాశ్రమం బర్మిలిం
జేరెన్‌ ఱేపట వచ్చునంచు నమృతస్ఫీతోక్తులం తెల్పి యా
ధీరున్‌ హర్షపయోధి వీచికలపై దేలింపవే మారుతీ! 99

మ. సరసాగ్రేసరుఁడైన రామవిభుఁ డంచద్రత్నసౌవర్ణపు
ష్పరథంబెక్కి సుమిత్రపట్టి వెనుకన్‌ ఛత్రంబుఁ బట్టన్‌ మహా
భిరతిన్‌ లక్ష్మణుఁ డవ్విభీషణుఁ డొగిన్‌ వింజామరల్‌ వీవ సుం
దరసాకేతపథంబుఁ బట్టి చనుచోఁ దత్పాదుకల్‌ మౌళిపైఁ
బరమప్రీతి ధరించి మ్రోలఁ జనవే వర్ణింపుచున్‌ మారుతీ! 100

మ. ప్రమదం బొప్పఁగ రాముఁడున్‌ భవదభిప్రాయంబు నూహించి, నీ
సముదంచద్పదభక్తికిన్‌ విమలప్రజ్ఞాయుక్తికిన్‌ మెచ్చి, సం
యములైనన్‌ బడయంగరాని మహనీయాధ్యాత్మ విద్యోపదే
శముఁ గావింపఁడె నీకు మేదినిసుతాసంయుక్తుఁడై మారుతీ! 101

మ. భవదీయోరుతపఃప్రభావమును శశ్వత్సాధుభావంబు, యో
గ్యవివేకంబును శాస్త్రపాండితియు నిష్కామత్వమున్‌ సంతతా
ర్జవమున్‌ జూచి రఘుప్రవీరుఁడు భవిష్యద్బ్రహ్మవౌదంచు నీ
కు వరం బర్థి నొసంగడే బృహదనుక్రోశంబునన్‌ మారుతీ! 102

మ. మునిశాపంబున నీప్రభావమహిమంబున్‌, శక్తియున్‌ నీవెఱుం
గని బీజంబున శైలసుప్తవిలసత్కంఠీరవేంద్రంబు లా
గున నట్లుంటివి గాక నిక్కము మదిన్‌ గోపించినన్‌ సర్వలో
కనికాయంబుల నొక్క పెట్ట నుఱుముం గావింపవే మారుతీ! 103

మ. హరివంశోత్తమ! నీవు చేసిన విచిత్రాచింత్యకార్యంబులా
హరియైనన్‌, హరుఁడైన, పంకజభవుఁడైనన్‌, దిగీశుల్‌, పురం
దరుఁడైనన్‌, నిఖిలాహిలోకపతులైనం జేయఁగా లేరు నీ
సరివారెవ్వరు లేరు ముజ్జగములం జర్చింపఁగా మారుతీ! 104

మ. ధృతియున్‌, నీతియు, సాహసంబు, స్మృతియున్‌, తేజంబు సర్వశ్రుతి
స్మృతిపారీణతయున్‌, యశంబు, విజయోన్మేషంబు, శాస్త్రజ్ఞతా
చతురత్వంబు, శమక్షమాదిగుణముల్‌, సాధుత్వమున్‌, శౌర్యమున్‌
వితతప్రజ్ఞ, జితేంద్రియత్వము రహిన్‌ నీకే తగున్‌ మారుతీ! 105

శా. నీ మాహాత్మ్యము, నీ రయోపచయమున్‌, నీ సత్త్వసామగ్రియున్‌
సామాన్యంబె యొకింత వాయువునకున్‌, నాగారికిన్‌ కల్గితే
నేమోకాని తలంప ముజ్జగములం దెవ్వారికిం గల్గదో
హైమాద్రిప్రతిమోన్నతీ! గురుమతీ! అర్కద్యుతీ! మారుతీ! 106

మ. ఉదయాస్తాద్రులమీఁద పాదయుగళం బొప్పారగా నుంచి, మే
ను దివంబంతయు నిండఁ బెంచి, యలభానుం డర్మిలిం జెప్పఁగా
జదువుల్‌ నేర్చుతఱిన్‌ భవత్తనువిలాసంబంతయుం జూచి స
ర్వదివౌకుల్‌ వెఱతోఁ ద్రివిక్రమునిగా భావింపరే మారుతీ! 107

మ. అమరాద్రిప్రతిమానవిగ్రహము, బాలార్కప్రతీకాశవ
క్త్రము శోభిల్లఁగ బారిజాతతరుమూలం బందు గూర్చుండి, యు
త్తమభక్తిన్‌ రఘురామమూర్తిని మదిన్‌ ధ్యానింపుచున్‌ దత్పవి
త్రమహామంత్ర మొగిన్‌ జపించు నిను నే బ్రార్థించెదన్‌ మారుతీ! 108

శా. నీ కళ్యానగుణంబులున్‌, మహిమయున్‌, నీరేజగర్భుండు, తా
రాకాంతుండును, భోగివల్లభుఁడు, గీర్వాణప్రభుండును, భవా
నీకాంతుండు గణింపజాల రనినన్‌ నేనెంతవాడన్‌ రహిన్‌
నాకుం దోఁచినభంగి నెన్నితిఁ గృపన్‌ మన్నింపవే మారుతీ! 109

శా. ఆరామాధిపు నొద్ద వానరు లనేకాక్షౌహిణుల్‌ లేరె? యె
వ్వారైనన్‌ బహులక్షయోజనము లవ్వారాశి లంఘించి, సొం
పారన్‌ యామములోన నౌషధినగం బాసక్తి తేఁజాలిరే?
ఔరా! నీకది జెల్లెఁగాక! కపివంశాగ్రేసరా! మారుతీ! 110

శా. నీ నామంబు పఠించినన్‌ నిను మదిం జింతించినన్‌ నీ కథా
గానం బుద్ధతి సల్పినం గరము వేడ్కన్‌ నిన్నుఁ బూజించినన్‌
నానావ్యాధులడంగు, వేలుపుల సన్మానంబు సంధిల్లు, వి
ద్యానైపుణ్యము గల్గు, చేకుఱును దీర్ఘాయుష్యమున్‌ మారుతీ! 111

శా. నీపేరెంచిన శత్రువర్గము వెసన్‌ నిర్మూలమైపోవు సం
తాపంబుల్‌ దొలఁగున్‌, సమస్తదురితాంతం బౌను, కూశ్మాండ మా
రీ, పైశాచిక యక్ష రాక్షసగ్రహ, ప్రేతోగ్ర భూతాదినా
నాపీడల్‌ నశియించు, భద్రమొదవున్‌ సత్యంబుగా మారుతీ! 112

మ. విమలంబై, వినఁ జిత్రమై, వితతమై, విద్యోతమై, వేద్యమై,
యమృతంబై, యఘహారమై, యమితమై, యానందమై యాద్యమై
సుమనస్సమ్మతమై, సుధీవినుతమై, సుజ్ఞానమై, సూచ్యమై,
సముదంచద్గతి నొప్పు నీ మహిమ కీశగ్రామణీ, మారుతీ! 113

శా. ఆ సుగ్రీవుఁడు కీశరాజ్యపదవిం బ్రాపించుటల్‌ రాముఁడు
ల్లాసంబొప్పఁగ నవ్విభీషణునకున్‌ లంకాపురం బిచ్చుటల్‌
వాసింగాంచి తరించుటల్‌ దశముఖున్‌ భంజించుటల్‌, మూర్ఛితుం
డౌ సౌమిత్రినిఁ దేర్చుటల్‌, మరల సీతావాప్తియున్‌ సర్వమున్‌
నీ సాహాయము చేతనే కద? లసన్మేధానిధీ మారుతీ! 114

మ. పదదోషంబులు సంధిదోషము, యతిప్రాసాదిదోషంబులున్‌
ప్రథితవ్యర్థ సమాసదోషము రసార్థప్రక్రియాదోషముల్‌
పదపద్యంబులఁ గల్గియున్న ననుకంపన్‌ వాని నన్నింటి నీ
మది సైరించి, గుణంబుగాఁ గొని ననుం బాలింపవే మారుతీ! 115

మ. చతురత్వంబున గోపినాథకులవిస్తారుండు శ్రీపద్మనా
భతనూజుండగు వేంకటాఖ్యకవి విద్వత్సమ్మతంబైన యీ
శతకంబున్‌ రచియించి, నీకు సముదంచద్భక్తి నర్పించె, స
మ్మతితో దీనిఁ బరిగ్రహించి, కరుణ బాలింపవే మారుతీ! 116

: శతకములు :
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | కామేశ్వరీ శతకము | మాతృ శతకము | కఱివేల్పు శతకము | మదనగోపాల శతకము | చక్కట్లదండ శతకము | సుందరీమణి శతకము | కాంతాలలామ శతకము | తాడిమళ్ళరాజగోపాల శతకము | భక్తమందార శతకము | కుక్కుటేశ్వర శతకము | భర్గ శతకము | లావణ్య శతకము | వేణుగోపాల శతకము | విశ్వనాథ శతకము | ఒంటిమిట్ట రఘువీరశతకము | మృత్యుంజయం | చెన్నమల్లు సీసములు | సంపఁగిమన్న శతకము | కుమార శతకము | శ్రీ అలమేలుమంగా శతకము | సూర్య శతకము | నీతి శతకము | శృంగార శతకము | వైరాగ్య శతకము | మంచి మాట వినర మానవుండ | సదానందయోగి శతకము | శివముకుంద శతకము | మృత్యుంజయ శతకము

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top