భారతీయ సంస్కృతి - Bharatiya Samskruti

0
భారతీయ సంస్కృతి - Bharatiya Samskruti
భారతీయ సంస్కృతి - Bharatiya Samskruti

: భారతీయ సంస్కృతి :

సంస్కృతి ఒక జాతి విశిష్టతను, ఉన్నతిని చక్కగా తెలియజేస్తుంది. సంప్రదాయము, ఆధ్యాత్మికత, భౌతిక విషయాల సమాహారం సంస్కృతి. తరాలు మారుతుంటాయి. మారిన తరాలనుండి ఆ తర్వాత తరాలకు అందించే వారసత్వ సంపద సంస్కృతి. భారతదేశం అనేక విదేశీయుల దండయాత్రలకు, కుతంత్రాలకు లోనై ప్రజాస్వాతంత్య్రానికి ఎనలేని ముప్పు ఏర్పడింది. అయినా భారతీయులు తమ ఆర్ష సంస్కృతిని మరచిపోలేదు. అద్వితీయమైన తమ సంస్కృతి, సంప్రదాయము, ఆధ్యాత్మికతలను జాగ్రత్తగా కాపాడుకున్నారు.

ధర్మం, న్యాయం పట్ల భారతీయ సంస్కృతి కొన్ని నిబద్ధతలను పాటించింది. ప్రజలు చేసిన అనేక ప్రయత్నాలు, అనుసరించిన పద్ధతులవల్లే సంస్కృతి ఒక సనాతన ధర్మంగా పరిఢవిల్లిందని చెప్పవచ్చును. భారతీయులు అనేక భాషలు మాట్లాడతారు. కళారీతులు, ఆహార అలవాట్లు వేషధారణ, భిన్న మతాలు, కులాలు కల్గి ఉన్నారు. ఇది భారతీయ సంస్కృతి భౌతిక లక్షణము. హిందూ సంస్కృతి వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులకు ఆలవాలం. ఆధ్యాత్మికతకు సంగీత, సాహిత్యాలు, లలిత కళలు చక్కటి భూమికలు.

కథక్, మణిపురి, ఒడిస్సి, కూచిపూడి, భరతనాట్యం, మోహన్నాట్టం, కథాకళి నాట్యరీతులలో భారతీయత, నాగరికత అత్యున్నత స్థాయిలో వెల్లివిరిసి, మానసిక, ప్రాణ, జీవన రంగాలకు హేతుబద్ధతను కల్పించాయి. భారతదేశ సరిహద్దులు, నదీనదాలు, సముద్రాలు వాటి విశిష్టత, పురాణ, ఇతిహాసాలు, దైవలీలలు, ఎందరో విశిష్ట వ్యక్తుల ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఋషి పరంపర, భారత, భాగవత, రామాయణ, భవద్గీతలు, ఖురాన్, బైబిల్ గ్రంథాలలోని విషయాల విశిష్టత భారతీయ సంస్కృతికి అద్దంపడతాయి.

ప్రాంతాలు మారినా సంస్కృతి మారదు. వివిధ ప్రాంతాల సంస్కృతులు వారి ప్రజల జీవన విధానాన్ని తెలియజేస్తాయి. నాగరిక సంస్కృతి సులభంగా మార్పు చెందడానికి అవకాశముంది. ఆటవిక సంస్కృతిలో మార్పు చాలా కష్టం. ఆత్మానందం కోసమే మానవుడు శ్రమపడతాడు. అతడి ఆధ్యాత్మిక ఆలోచనా సరళి లక్ష్యం ఆత్మశోధన. ఆధ్యాత్మిక చింతన సనాతన ధర్మాన్ని సూచిస్తుంది. ప్రతి తరం గుండె చప్పుడు వివిధ రీతులో ప్రభావితం చెందటం ఆ తరాల యొక్క సంస్కృతి.
భారతీయుల నాగరికత, వారి సామాన్య జీవన విధానం, నాగరిక లాక్షణికత, సంప్రదాయం భారతీయ సంస్కృతికి ఆధారమైన భారతీయ తత్త్వాన్ని, భారతీయుల ఐకమత్యాన్ని తెలియజేస్తాయి. ఇవన్నీ వారి సంస్కృతిలో భాగాలు.
విజ్ఞానాభివృద్ధి విద్యుత్ వేగంతో విజృంభిస్తున్న నేటి యుగంలో, విజ్ఞాన విశేషాలు, అభివృద్ధి, ఆచార సంప్రదాయాలు కలగలసి వుండి, భావి తరాలవారికి ఈ విజ్ఞానాన్ని అందిస్తారు. అటువంటి మహత్తర మార్పే సంస్కృతి. గతకాలంలో ఒక్కొక్క రాజ వంశీకులు వారికి తగిన సంస్కృతిని ఆచరించారు. అనేక ఉద్యమాలకు సైతం భారతీయ సంస్కృతి ప్రభావం చెందింది.

అనేక నాగరికతలు, అనేక కళలు భారతీయ సంస్కృతి వరప్రసాదాలే. నాగరిక సమాజాల మనుగడ మానవతా విలువలపై ఆధారపడి వున్నది. మానవులు చక్కగా, ఆదర్శవంతంగా జీవించడానికి సంస్కృతి ఎంతగానో తోడ్పడుతుంది. ఎవరు ఏ ధర్మం పాటించినా, ధర్మరాజు పాటించిన మనోనిగ్రహ ధర్మం, వారి పరిపాలనా, సత్యవాక్పటిమ భారతీయ సంస్కృతి పుస్తకంలో అక్షర లక్షలు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top