కర్మయోగము - Karma Yogamu : Page - 2

0
కర్మయోగము - Karma Yogamu : Page - 2

శ్లోకము - 4 

న కర్మణామనారమ్బాత్ నైష్కర్మ్యం పురుషోకశ్నుతే |
 న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ||


కర్మ - కర్మలను; అనారమ్బాత్ - చేయకపోవడం వలన; నైష్కర్మ్యం - కర్మఫల విముక్తి ; పురుషః - మనిషి; న అశ్నుతే - పొందడు; సన్న్యసనాత్ - సన్న్యాసము ద్వారా; ఏవ - కేవలము; సిద్ధిం - జయము; - కూడ; న సమధిగచ్చతి - పొందడు.

కేవలము కర్మను చేయకపోవడం ద్వారా మనిషి కర్మఫలం నుండి బయటపడడు. అలాగే కేవలము సన్న్యాసము ద్వారా అతడు పూర్ణత్వమును సాధించలేడు.

భాష్యము : లౌకికజనుల హృదయాలను పవిత్రం చేయడానికి చెప్పబడినట్టి విధులను నిర్వహించడం ద్వారా మనిషి పవిత్రుడైనపుడే సన్న్యాసాశ్రమమును స్వీకరించగలుగుతాడు. పవిత్రీకరణ లేకుండ అతడు హఠాత్తుగా నాలుగవ ఆశ్రమస్థితిని (సన్న్యాసము) స్వీకరించడం వలన జయమును పొందలేడు. సాంఖ్య తత్త్వవేత్తల అభిప్రాయం ప్రకారము కేవలము సన్న్యాసము స్వీకరించగానే, అంటే కామ్యకర్మలను ఆపివేయగానే మనిషి నారాయణునితో సమానుడౌతాడు. కాని శ్రీకృష్ణ భగవానుడు ఈ సిద్ధాంతాన్ని ఆమోదించలేదు. హృదయశుద్ధి లేనిదే సన్న్యాసము కేవలము సంఘానికి ఉత్పాతమే కలిగిస్తుంది. ఇంకొక ప్రక్క మనిషి తన విధులను నిర్వహించకపోయినా భగవంతుని దివ్యమైన సేవను స్వీకరిస్తే శక్త్యనుపారము కావించే ప్రగతిని (బుద్ధియోగం) ఆ దేవదేవుడు స్వీకరిస్తాడు. “స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్" అట్టి సిద్ధాంతాన్ని కొద్దిగా ఆచరించినా మనిషిని అది గొప్ప సంకటాలను అధిగమించేటట్లు చేస్తుంది.

శ్లోకము - 5

న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ |
కార్యతే హ్యవశః కర్మ సర్వ: ప్రకృతిజైరుతైః ||

హి - నిశ్చయముగా; కశ్చిత్ - ఎవ్వడూ; క్షణం - ఒక్కక్షణము; అపి - కూడ; జాతు - ఎప్పుడు; న తిష్ఠతి - ఉండలేడు; అకర్మకృత్ - ఏదీ చేయకుండ; కార్యతే - చేయడానికి ప్రేరేపించబడతాడు; హి - నిశ్చయంగా; అవశః - నిస్సహాయుడై; కర్మ - కర్మ; సర్వః - సర్వులు; ప్రకృతిజైః - ప్రకృతి గుణాల నుండి పుట్టిన; గుణైః - గుణాలచే.

ప్రతియొక్కడు ప్రకృతి గుణాల నుండి పొందిన లక్షణాల ననుసరించే అవశుడై కర్మలో ప్రేరేపింపబడతాడు. కనుక ఏదీ చేయకుండ క్షణకాలమైనా ఎవ్వడూ ఉండలేడు.

భాష్యము : సర్వదా చురుకుగా ఉండడము ఆత్మస్వభావమే గాని దేహలక్షణం కాదు. ఆత్మ లేనిదే భౌతికదేహము కదలనే కదలదు. కేవలం ఒక చలనం లేని వాహనము వంటి దేహము సర్వదా చురుకైనది, క్షణమైనా ఆగనిది అయినట్టి ఆత్మ చేతనే పనిచేస్తుంది. అయినా ఆత్మను కృష్ణ భక్తి భావనమనే సత్కర్మలోనే తప్పక నియోగించాలి. లేకపోతే మాయచే నిర్దేశింపబడే కార్యాలలో అది నెలకొంటుంది. ప్రకృతి సంపర్కములో ఆత్మ భౌతికగుణాలను పొందుతుంది. దానిని అటువంటి సంబంధాల నుండి శుద్ధిపరచడానికి శాస్త్రాలలో చెప్పబడిన ధర్మాలలో నెలకొనడం తప్పనిసరి. కాని ఆత్మను దాని సహజమైన కృష్ణభక్తి కార్యాలలో నెలకొల్పితే ఎంత చేయగలిగితే అంత దానికి శుభము కలుగుతుంది. దీనిని శ్రీమద్భాగవతము (1.5.17) ఈ విధంగా ధ్రువపరచింది:

త్యక్త్వా స్వధర్మం చరణామ్బుజం హరే
ర్భజన్నపక్వోకథపతేత్తతో యది |
యత్ర క్వ విభద్రమభూదముష్య కిం
కో వార్థ ఆపోఃభజతాం స్వధర్మతః ||

“ఎవడేని కృష్ణ భక్తి భావనను చేపడితే శాస్త్రాలలో చెప్పబడిన విధులను పాటించకపోయినా, భక్తియుతసేవను సక్రమంగా నిర్వహించకపోయినా, తన స్థితి నుండి పతనం చెందినా నష్టము గాని, దోషము గాని లేదు. కాని అతడు కృష్ణ భక్తి భావనాయుతుడు కాకపోతే శాస్త్రాలలో పవిత్రీకరణ ఆదేశాలన్నింటినీ నెరవేర్చినా లాభమేముంది?" అంటే ఈ కృష్ణ భక్తిభావనా స్థితికి చేరడానికి పవిత్రీకరణ పద్ధతి అవసరమౌతుంది. కనుక కృష్ణ భక్తి భావనాయుతుడు కావడమనే చరమగమ్యాన్ని చేరడానికి సన్న్యాసము లేదా ఏ పవిత్రీకరణ విధానమైనా సహాయపడుతుంది. కృష్ణ భక్తి భావనే లేకపోతే సమస్తము నిష్ఫలమైనదిగా భావించబడుతుంది.

శ్లోకము - 6

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ |
ఇన్ద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే ||

కర్మ ఇంద్రియాణి - ఐదు కర్మేంద్రియాలను; సంయమ్య - నిగ్రహించి; యః - ఎవ్వడు; ఆస్తే - ఉంటాడో; మనసా - మనస్సుచే; స్మరన్ - ఆలోచిస్తూ; ఇంద్రియార్థాన్ - ఇంద్రియ విషయాలను; విముఢ - మూర్ఖుడు; ఆత్మా - జీవుడు; మిథ్యాచారః - కపటి; సః - అతడు; ఉచ్యతే - చెప్పబడతాడు.

కర్మేంద్రియాలను నిగ్రహించినా మనస్సు ఇంద్రియార్థాల పైననే లగ్నమై ఉన్నవాడు నిక్కముగా తనను తాను మోసగించుకొని మిథ్యాచారి అనబడతాడు.

భాష్యము : కృష్ణభక్తి భావనలో పని చేయడానికి నిరాకరించినా నిజానికి ఇంద్రియభోగం గురించే మనస్సులో ఆలోచిస్తూ ధ్యాన ప్రదర్శన చేసే కపటులు చాలామంది ఉంటారు. అటువంటి మిథ్యాచారులు తమ ఘరానా అనుయాయులను మోసగించడానికి శుష్కవేదాంతాన్ని కూడ పలికినా ఈ శ్లోకం ప్రకారం వారుగొప్ప మోసకారులే అవుతారు.
    ఇంద్రియ భోగానికై మనిషి ఏదేని ఆశ్రమస్థితిలో వర్తించినా తన స్థితికి సంబంధించిన నియమనిబంధనలను పాటిస్తే స్వీయ అస్తిత్వ పవిత్రీకరణలో క్రమంగా పురోగమిస్తాడు. కాని యోగియైనట్లు ప్రదర్శించుకుంటూ నిజానికి ఇంద్రియభోగ వస్తువులను వెదికేవాడు ఒక్కొకప్పుడు తత్త్వము గురించి మాట్లాడినా గొప్ప మోసగానిగానే పిలువబడతాడు. అతని జ్ఞానానికి ఎటువంటి విలువ లేదు. ఎందుకంటే అట్టి పాపి యొక్క జ్ఞానప్రభావము భగవన్మాయచే హరింపబడుతుంది. అటువంటి కపటి మనస్సు సర్వదా అపవిత్రమై ఉంటుంది. అందుకే అతని యోగధ్యాన ప్రదర్శనకు ఎటువంటి విలువ ఉండదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top