కర్మ చేసేవాడు కార్మికుడు. అతడు చేసే కర్మలు (సేవలు) సకల మానవాళికి ఉపయోగపడాలి- అని ఉపనిషద్ వాక్యం. తాను జీవితకాలమంతా సేవలతోనే గడపాలని మనిషి కోరుకోవాలి. ఇంతకంటే వేరైన జీవిత పరమార్థం మరేదీ ఉండకూడదని ‘ఈశోపనిషత్’ చెబుతోంది.
సకల చరాచర జగత్తుకు సృష్టికర్త బ్రహ్మ. ఆయన సృష్టించేది మూలపదార్థాన్నే! దాన్ని ఆధారంగా చేసుకొని మానవ అవసరాలకు అనుగుణంగా అనేక రూపాల్ని, ఉత్పత్తుల్ని సృజించేవారు కార్మికులు. వారందరికీ ఆద్యుడు విశ్వకర్మ. బ్రహ్మదేవుడి అంశతో ఉద్భవించిన ఆయన బ్రహ్మ అంతటి పురాతనుడని శుక్ల, కృష్ణ యజుర్వేదాలు చెబుతున్నాయి. పంచభూతాలు, త్రిమూర్తులు, ఇంద్ర, సూర్య, నక్షత్రాదులు ఉద్భవించక ముందే- బ్రహ్మ స్వయంభువుగా సంకల్పమాత్రంగానే అవతరించాడట. మరుక్షణంలోనే తన అంశతో మరొక మూర్తిని సృష్టించాడని రుగ్వేదం పేర్కొంది.
చరాచర సృష్టికర్త
ఏ విశ్వకర్మ ఈ సమస్త భువనాలు తనలో లీనం చేసుకుని చరాచర సృష్టికి తానే తండ్రి అయి ఉన్నాడో విశ్వకర్మ తన సంకల్ప బలంతో పున:సృష్టి చేయదలచి ప్రాణుల హృదయ ప్రదేశాన్ని ప్రవేశించాడని ఋగ్వేదం ఉద్ఘోషిస్తున్నది.
‘‘యఇమా విశ్వాభువనాని జుహ్యదృషిర్హోతానిషసాదపితానః
సఆశిషాద్రవిణమిచ్చమానః పరమచ్ఛదోవర అవివేశ! (10-81-1)
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది సృష్టి- ప్రళయం పున:సృష్టి అనేవి క్రమబద్ధంగా జరగటానికి కారణభూతమయ్యే కర్మ విధిగా విశ్వకర్మ కర్తవ్యం-సర్వజీవుల్లో సంకల్ప రూపంగా ప్రవేశించి మానసిక కర్మలకు కావలసిన శక్తి ప్రసాదించే తత్వం విశ్వకర్మతత్వమని గుర్తించవచ్చు. ‘‘విశ్వమే నేత్రాలుగా విశ్వమే ముఖాలుగా, విశ్వమే బాహువులుగా, విశ్వమే పాదాలుగా అద్వితీయుడై ప్రకాశిస్తూ అతడు ధర్మాధర్మ బాహువులతో జగత్తును స్వాధీన పరచుకున్నా’’డని యజుర్వేదీయ విశ్వకర్మ సూక్తం చెబుతుంది.
విశ్వకర్మరూపం- సర్వజీవుల హృదయాలలో సంకల్పాత్మ కర్మ రూపంగా భాసించే నిరాకార విశ్వకర్మతత్వం సాకారమై భౌతికరూపం సంతరించుకున్నది. ఉపాసకుల సౌకర్యంకోసం భగవత్తత్వం నిరాకారస్థితి నుండి సాకారస్థితి పొందటంలో వింతయేమీలేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాది అనేక దేవకోటి రూపురేఖలు ఆ విధంగా వృద్ధి పొందినవే కదా. విశ్వతోముఖుడైన విశ్వకర్మకు బ్రహ్మకంటే విశేషంగా ఊర్ధ్వముఖం ఒకటి ఉన్నట్లు చెబుతారు. అంటే ఈ ఊర్ద్వముఖంతో కలిసి ఆయన పంచముఖుడు. ఆయనకు ఐదు ముఖాలు, పది చేతులు ఉన్నాయి. కుడివైపున ఐదు చేతుల్లో కుద్దాలం, కరణి, వాప్య, యంత్రం, కమండలం అనే పని ముట్లు ఎడమవైపున ఉన్న ఐదు చేతుల్లో మేరుపు, టంకం, స్వను, భూష, వహ్మి అనే ఉపకరణాలు ఉన్నట్లు వాయు పురాణ భూఖండంలో వర్ణించారు.