నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label అనంత పద్మనాభ స్వామి Anantha Padmanabha Swami. Show all posts
Showing posts with label అనంత పద్మనాభ స్వామి Anantha Padmanabha Swami. Show all posts

Tuesday, July 14, 2020

కేరళ పద్మనాభస్వామి వారి దేవాలయం విషయంలో ధర్మ విజయం - Hindus victory over Kerala Padmanabha Swamy temple case


పద్మనాభస్వామి వారి దేవాలయం విషయంలో ధర్మ విజయం

మరో దేవాలయాన్ని నాశనం చేద్దామని లౌకిక ప్రభుత్వాలు (బీజేపీ కాదు) పన్నిన కుట్రని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు నీరుగార్చి ధర్మాన్ని నిలబెట్టింది. 

శ్రీ పద్మనాభస్వామి వారి దేవాలయం నిర్వహణ వందల సంవత్సరాలుగా ట్రేవెన్కోర్ రాజ వంశీయుల చేతుల్లోనే ఉంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం వారిని తప్పించాలి అని చేసిన ప్రయత్నం ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో విఫలం అయ్యింది. ఇదే విధంగా దేశంలో ఉన్న అన్ని దేవాలయాలలో జరగాలి అని ఆ పద్మనాభుడిని కోరుకుందాం.

ఇందులో కీలకపాత్ర పోషించిన మిత్రులు, సర్వోన్నత న్యాయస్థానం న్యాయవాది శ్రీ సాయి దీపక్ అయ్యర్ (Sai Deepak Iyer J) గారికి యావత్ హిందూ సమాజం రుణపడి ఉండాలి. ప్రభుత్వ కుట్ర కనుక నెరవేరి ఉంటే లక్ష కోట్లకు పైగా ఉన్న దేవాలయ సంపదను క్రమంగా గాదె కింద పందికొక్కులలా రాజకీయ నాయకులు తినేసేవారు. సమానత్వం, లౌకికవాదం లాంటి పేర్లు ఉపయోగించి మెల్లగా దేవాలయం యొక్క సంప్రదాయాలను నాశనం చేసేవారు.

మన దేశంలో ఉన్న అత్యద్భుతమైన ఆలయాలలో పద్మనాభస్వామి వారి దేవాలయం ఒకటి. నా అదృష్టం కొద్దీ నేను కొంత కాలం క్రితం ఆ ఆలయాన్ని దర్శించుకున్నాను. ఉదయం నాలుగు గంటలకే దర్శనానికి వెళ్ళాను. నా అదృష్టం ఏంటో గానీ, ఆరోజుకి స్వామిని దర్శించుకున్న మొదటి వాడిని నేనే. నేను రెండో వాడిని అయినా, నేను చాలా దూరం నుండి వచ్చాను అని నా ముందున్న వ్యక్తి వెనకకు వచ్చి నాకు మొదటి దర్శన భాగ్యం కల్పించారు. అంతేకాక అక్కడి నుండి నా ప్రయాణ ప్రణాళిక అంతా కూడా ఆయనే చెప్పారు. అందువల్లనే నా ప్రణాళికలో భాగం కాని కొన్ని ఇతర దేవాలయాలను కూడా దర్శించుకోగలిగాను.

చెప్తే కొంచెం అతిశయంగా ఉండవచ్చు గానీ, స్వామిని దర్శించుకునప్పుడు పొందిన అనుభూతి నిజంగా వర్ణనాతీతం. ఆరోజు నా అదృష్టం ఏమిటో కానీ, ఎందరో భక్తులు ఉన్నా, నేను దర్శనం చేసుకుని కొంచెం వెనకకు వచ్చి స్వామిని చూడగలిగేలా నిలబడ్డా, నన్ను ఎవ్వరూ వెళ్ళమని అనలేదు. దాదాపు 15 - 20 ని. ల పాటు స్వామిని చూడగలుగాను. స్వామిని మొదట చూసిన వెంటనే ఒక మహాద్భుతాన్ని చూసిన భావన నాకు కలిగింది. ఆనందం మనసంతా నిండిపోయి ఇక అక్కడ చాలక నా కంటివెంట నీరులా బయటకు రావడం నాకు ఇప్పటికీ గుర్తే. ఇది రాస్తున్న ఈ సమయంలో కూడా నా కళ్ళు చమ్మగిల్లాయి అంటే స్వామి దర్శన ప్రభావం నా మీద ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు.

ఆ మూర్తి ఒక మహాద్భుతం, ఆ అనుభూతి అనిర్వచనీయం. పడుకున్న స్వామే దాదాపు 5 అడుగులు ఉంటారు. మూడు ద్వారాల ద్వారా మనం స్వామిని చూడాలి. మొదటి ద్వారం నుండి కేవలం ముఖం మాత్రమే కనబడుతుంది. నాకు తెలిసి స్వామి పొడవు బహుశా 20 అడుగులు ఉంటుందేమో. పద్మనాభస్వామి వారిని ప్రతీ హిందువూ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని తీరాలి. అక్కడి అర్చకులు ఆ దేవాలయాన్ని ఎంత నిష్ఠగా నిర్వహిస్తారో, అక్కడ కొంత సమయం గడిపితే మనకు అర్థం అవుతుంది. ప్రభుత్వం ఈ విషయంలో విజయం సాధించి ఉంటే, దానివలన జరిగే నష్టం అపారం. ఆ పద్మనాభుడు మన మీద దయతలచి, అలా జరగకుండా చూశాడు.

శ్రీ పద్మనాభాయనమః

  __వడియాల రంజిత్

Monday, July 13, 2020

ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికే అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ - Anantha Padmanabha Swami,

కేరళలోని ప్రముఖ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఈ ఆలయ నిర్వహణ బాధ్యత ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికే ఉండటాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఆలయ నిర్వహణపై రాజకుటుంబానికి ఉన్న హక్కులను సమర్థిస్తూనే.. తదుపరి నిర్వహణ బాధ్యత కూడా వారికే అప్పగిస్తూ నిర్ణయం ప్రకటించింది. దీనిపై ఇప్పటికే త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమించి ఆలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకూ ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని సుప్రీం స్పష్టం చేసింది.

అనంత పద్మనాభస్వామి దేవాలయం నేలమాళిగల్లో భారీ నిధి నిక్షేపాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ట్రావెన్‌కోర్ రాజకుటుంబమే ఈ నిధులను కాపాడుకుంటూ వస్తోంది. అయితే, కొంతకాలం క్రితం వీటి నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంతో ట్రావెన్‌కోర్ కుటుంబసభ్యులు సుప్రీంను ఆశ్రయించారు. తాజాగా సుప్రీం కోర్టు ఆలయ నిర్వహణ బాధ్యతలు రాజకుటుంబానికే ఉండటాన్ని సమర్థించింది.

__vsk ap

Monday, November 28, 2016

Ananthapadmanabha Vrata అనంతపద్మనాభ స్వామి వ్రతం, అనంత పద్మనాభ చతుర్దశి

Ananthapadmanabha vratam అనంతపద్మనాభ స్వామి వ్రతం

అనంత పద్మనాభ చతుర్దశి
భాద్రపద శుక్ల చతుర్దశినాడు జరుపుకొనే వ్రతం అనంత పద్మనాభ చతుర్దశి. ఇది కేవలం వ్రతమేకానీ ఉత్సవం మాత్రం కాదు. సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ఇది ప్రధానమైందని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో కూరుకొనిపోయి ఉన్నప్పుడు బయట పడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది. వనవాస కష్టాలను అనుభవిస్తున్న కాలంలో ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అనంతపద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్లచతుర్దశినాడు చేయమని చెప్పాడట. అలా ఎంతో పూర్వ కాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తుండటం విశేషం. ఎవరీ అనంతుడు, అనంతపద్మనాభస్వామి? అనే సందేహాలు ఈనాటి వారికొచ్చినట్టుగానే ఆనాడు ధర్మరాజు వచ్చి శ్రీకృష్ణుడిని అడిగాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఓ చక్కటి సమాధానం చెప్పాడు. అనంతుడన్నా, అనంతపద్మనాభస్వామి అన్నా సాక్షాత్తూ కాలమే అన్నాడు. యుగ, సంవత్సర, మాస తదితర కాలం అంతా తన స్వరూపమన్నాడు. అనంతపద్మనాభుడంటే ఎవరో తెలుసుకోగలిగాడు ధర్మరాజు.
శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు - Lord Krishn
శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు - Lord Krishn
వైకుంఠవాసుడి అవతారమే శ్రీకృష్ణుడు. పాల కడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకొని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజించటం కనిపిస్తుంది. వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంతపద్మనాభ అవతారం కళ్ల ముందు మెదలాడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో ఏడు పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి పూజించటం కనిపిస్తుంది. దర్భలతో చేసిన పామును మూతపెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ మొత్తంలోనూ శేషశయనుడి రూప భావన కనిపిస్తుంది. వ్రతంలో ఉంచటం కోసం సిద్ధం చేసుకొన్న కలశంలో పవిత్ర జలాలను ఉంచుతారు. ఆ నీటిలో కొద్దిగా పాలు, ఒక పోకచెక్క, ఓ వెండి నాణెం వేస్తుంటారు. కలశంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తుంటారు. ఈ విషయాలన్నిటినీ పరిశీలించి చూస్తే అనంతపద్మనాభ వ్రతం తొలుత యమునా నది పరిసర ప్రాంతాలలో ఆవిర్భవించి ఆ తర్వాత దేశం అంతటా విస్తరిల్లి ఉంటుందన్నది పండితుల భావన. అనంతపద్మనాభస్వామి పూజలో పద్నాలుగు సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. పద్నాలుగు లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి పద్నాలుగులో సగమైన ఏడు సంఖ్యలో పడగలను పెట్టడం, పద్నాలుగుకు రెండింతలైన ఇరవై ఎనిమిది సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి పద్నాలుగేళ్లకొకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి 14 ముడులుంటాయి. మరి కొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు, పిండి వంటలు, పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా ఏడేడు పద్నాలుగు లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుడిని తలచుకోవటం కోసమే.
ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసముంటుంటారు.

వ్రతానికి సంబంధించి కథను పరిశీలిస్తే అంతా సత్యం, ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించినవారు జన్మజన్మలకూ కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక కనిపిస్తుంది. తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని, ఇంటికి వెళ్లి తన లేగదూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకొని పులి దగ్గరకు వెళ్లి సత్యవ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకొంటుంటారు. ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్న అని భావించింది. తన లేగదూడకు కడుపునిండా పాలుపట్టి ధర్మాన్ని బోధించింది. అలాంటి దర్శ జీవన విధానాన్ని ఈ వ్రత సందర్భంగా తలచుకుంటారు. అనంతపద్మనాభ వ్రతాన్ని ఎలా చేయాలి? తోరాన్ని ఎలా తీసుకోవాలి? పూజా ద్రవ్యాలు లాంటివి ఏమేమి వాడాలి అనే విషయాలన్నీ బాగా తెలిసిన పండితుడితో చెప్పించుకొని ఆయన సహాయంతో వ్రతాన్ని చేసుకొని పుణ్య ఫలాలను పొందాలంటున్నాయి వ్రత గ్రంథాలు.

అనంతపద్మనాభ స్వామి వ్రతవిధానము : 
  • ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి .
  • అందులో పధ్నాలుగు పడగలు గల అనంతుడుని తయారుచేసి ప్రతిస్ఠించాలి.
  • సామానముగా దర్బలను ఉపయొగించి అనంతుణ్ణి తయారుచేస్తారు.
  • ముందుగా గణపతిని , నవగ్రహాలను పూజించిన తరువాత ' యమునా పూజ ' చేయాలి . యమునా పూజ అంటే నీటిని పూజించాలి . 
  • బిందెతో నీటిని తెచ్చుకొని , ఆ నీటిలోకి యమునను ఆవాహనం చేసి పూజించాలి . 
  • తరువాత అనంతుడుని షోడశోపచారాలతో పూజించి , బెల్లము తో చేసిన ఇరవై ఎనిమిది అరిసెలను నైవేద్యముగా పెట్టాలి . 
  • వ్రతకథ చెప్పుకొని అనంతపద్మనాభస్వామికి నమస్కరించి అక్షతలు తలపై చల్లుకోవాలి . వ్రతముతో తోరమును కట్టుకోవాలి . 
  • ఎరుపు రంగులో పద్నాలుగు పోచలతో తయారైన తోరాన్ని ధరించాలి .

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

అనంత పద్మనాభ స్వామి ,శుక్ల చతుర్డశి,అనంత చతుర్దశి వ్రతం - Anantha Padmanabha Swami

Sri Anantha Padmanabhaswamy Temple
నంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ’అనంత చతుర్దశి వ్రతం’ లేదా ’ అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.

అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే సకల సంపదలు చేకూరుతాయి. శ్రీకృష్ణ భగవానుడు అనంత పద్మనాభ వ్రతాన్ని ధర్మరాజుకు వినిపించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భాద్రపద శుక్ల చతుర్ధశి నాడు (ఇంగ్లిష్ క్యాలడర్ ప్రకారము ఒక్కోసంవత్సర్ము ఒక్కో తేదీ ) శుచిగా స్నానమాచరించి, గృహాన్ని, పూజామందిరాన్ని శుభ్రపరుచుకోవాలి.

పూజామందిరము నందు అష్టదశ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ రంగవల్లికలతో అలంకరించుకోవాలి. దానికి దక్షణ భాగంలో నీరు నింపిన కలశం ఉంచాలి.

పద్మానికి నడుమ దర్భలతో తయారు చేసిన ఏడు పడగలతో ఉన్న అనంత పద్మనాభ స్వామి బొమ్మను పెట్టాలి. దర్భలతో చేసిన ఆ బొమ్మలోకి అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేయాలి. ఎర్రని రంగులో ఉండే 14 ముడులతో ఉన్న తోరాన్ని స్వామి దగ్గర ఉంచాలి. షోడశోపచార పూజ చేయాలని పురోహితులు చెబుతున్నారు.

ఇలా పద్మనాభ వ్రతాన్ని ఆచరించే వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల-కౌండిన్య దంపతుల సకల సంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంకా అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించిన భక్తులు ఆ రోజున తమకు వీలైనంత దానధర్మాలు చేయడం ద్వార మోక్షఫలములు, పుణ్యఫలములు, అష్టైశ్వర్యాలు పొందుతారని పురోహితులు సూచిస్తున్నారు.
అనంత పద్మనాభుని మహిమ  Anantha Padmanabha Swami
అనంత పద్మనాభుని మహిమ :
కృతయుగములో సుమంతుడు , దీక్ష అనే దంపతులు ఉండేవారు . వారికి " శీల " అనే కుమార్తె కలిగింది. శీల పుటీన కొంతకాలానికి దీక్ష మరణించడముతో సుమంతుడు " కర్కశ " అనే మహిళని వివాహము చేసుకున్నాడు . శీలను సవతితల్లి  కర్కశ అనేక కష్టాలకు గిరిచేసింది.  ఒక సారి కౌండిన్య మహర్షి  సుమంతుడు ఇంటికి  వచ్చి  శీలను చూసి  సుమంతుడి అనుమతితొ శీలను వివాహము చేసుకున్నాడు . శీలను వెంటబెట్తుకొని తన ఆశ్రమానికి బయలు దేరిన కౌండిన్య మహర్షి  మధ్యాహ్న సమయానికి నదీ తీరానికి చేరి విశ్రమించాడు .  ఆ సమయములో నదీతీరములో కొందరు స్త్రీలు ఎదో వ్రతము చేస్తూండడము గమనించిన శీల వారి దగ్గరికెళ్ళి - దానిని గురించి తెలుసుకొని వారి సహాయము తో శీల కూడా ఆ వ్రతాన్ని ఆచరించి , చేతికి తోరమును ధరించి , భర్తతో కలిసి సాయంత్రానికి ఆశ్రమానికి చేరుకుంది. ఈ విధముగా  అనంతవ్రతాన్ని ఆచరించిన ఫలితము గా వారికి అష్టైశ్వర్యాలు సిద్ధించాయి.

కొన్ని రోజులు గడిచాక కౌండిన్యుడు తన భార్య్ శీల చేతిలోని తోరము ను గమనించి " ఏమిటిది ? నన్ను వశపరచుకోవడానికి కట్టుకున్నావా? " అని కోపముగా ప్రశ్నించినారు. భర్త కోపావేశాన్ని చూసి భయపడిన శీల , తను చేసిన అనంత వ్రతము గురించి వివరించింది .  ఐతే కౌండిన్యుడు ఆ మాటలను లెక్క చేయక శీల చేతికి ఉన్న తోరమును తెంచి మంటల్లో పడేశాడు .  అప్పటినుండి  ఆశ్రమం లో దారిద్ర్యం తాండవించసాగింది. ఇలా ఎందుకు జరుగుతుందో తెల్సుకునే ప్రయతన్ములో అనేక రకాల ఆలోచనలు చేసి చివరకు అనంతవ్రతాన్ని ఆక్షేపించడమేనని తెలుసుకొని పశ్చాత్తాపముతో " అనంతపద్మనాభుడి " కోసము అడవికి ప్రయాణమయ్యెను . మార్గమధ్యములో ... ఒక పక్షి కూడా వాలని ఫలపుష్పాలతో కూడిన మామిడిచెట్టు , పచ్చగడ్డిలో మేయకుండా తిరుగుతూవున్న ఆవు, పచ్చిక బీడు పై పడునివున్న ఎద్దు , కమలాలతో నిండిన సరోవారాలు , గాడిద , ఏనుగులు కనిపించా , అనంతుడ్నిగురించి వాటిని కౌండిన్యుడు అడిగాడు .. అవన్ని తెలియవని చెప్పగా చివరికి ప్రాణత్యాగానికి సిద్ధమయాడు.  ఇలాంటి పరిష్తితులలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కౌండిన్య మహర్షి ముందు ప్రత్యక్షమై .. అతనికి ఒక గుహలోనికి తీసుకువెళ్ళి అనంత పద్మనాభుడి గా దర్శనమిచ్చాడు . స్వామిని కౌండిన్యుడు క్షమించమని వేడుకుని ప్రాయశ్చిత్తము చెప్ప్పమని ప్రాధేయ పడ్డాడు . అందుకు " ప్రతి సంవత్సరమూ భాద్రపద శుక్ల చతుర్ధశి నాడు అనంతపద్మనాభ వ్రతము ఆచరించు , ఇలా 14 సం.లు ఆచరించు అనిచెప్పి ... అన్నికష్టాలు తొలగిపోతాయని ఉద్భోదించెను.

అడవి మార్గం లో కనిపించినవాటిని గురించి ప్రశ్నించగా.... మామిడిచెట్టు  పూర్వజన్మలో విద్యావేద విశారదుడగు విప్రుడు , విద్యాదానము చేయక చెట్టుగా పుట్టినది. ఆవు  విత్తులను హరిందు భూమి , ఎద్దు ధర్మస్వరూపము , పుష్కరిణులు రెండు అక్కచెళ్ళెల్లు ... దానధర్మాలు చేయక అలా జన్మనెత్తారు. గాడిద క్రోధము , ఏనుగు మదము . నీవు ప్రవేశించిన గుహ సంసారము . వృద్ధుడను నేనే .అని చెప్పి స్వామి అంతర్ధానమయ్యెను. కౌండిన్యుదు ఆశ్రమానికి చేరి ప్రతి సం. ము వ్రతాన్ని ఆచరించసాగాడు . ఫలితము గా ఆశ్రమం అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో నిండింది . ఇలా శాస్త్రోక్తము గా అనంతుడిని పూజించడము వల్ల సకల సంపదలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకము .

రచన: డా శేషగిరి రావు

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com