నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
ఆధ్యాత్మిక సూత్రాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆధ్యాత్మిక సూత్రాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఏప్రిల్ 2020, గురువారం

ఆత్మజ్ఞానం - Aathma Gnanam

 ఆత్మజ్ఞానం - Aathma Gnanam
లోచన మనస్సు పరిధిలోది. 'ఆత్మ' మనస్సు దాటిన తర్వాత కలిగే అనుభూతి. ఆత్మ ఉండీ లేనట్లు, లేకపోయినా ఉన్నట్లు అనిపిస్తుంది.

అనుభూతికి మాత్రం అందుతుంది. ఆత్మ అంతరాత్మ, పరమాత్మ అనేవి మూడూ ఒక్కటే. రూపగుణాలు ఒక్కటే. అవధులు మాత్రం వేర్వేరు.  ఒక్కటే అయిన ఆత్మ అవసరానికి 'అంతరాత్మ' అనిపిస్తుంది. పైకి వెళ్లాక  'పరమాత్మగా' వ్యవహరిస్తుంది. ఆ రహస్యం తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. అసలు ఆత్మను తెలుసుకోవడమే జ్ఞానం. ఆత్మను గురించి మరింతగా తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. ఇక్కడ తెలుసుకునేది మనస్సుతో కాదు. అత్మతో - అది ప్రజ్ఞా విశేషం.

అయితే 'ఆత్మ' వివేకం ముందు కలగాలి వివేకానికి జిజ్ఞాస జతపడాలి. అప్పుడు ప్రజ్ఞ బయటకొచ్చి ఆత్మజ్ఞానానికి తుదిమెరుగులు దిద్దుతుంది. 'ఆత్మ'ను గురించి కనీస అవగాహన ఏర్పడితే అటువైపు దృష్టి సారించవచ్చు. మామూలు దృష్టికి ఆత్మ కనిపించదు. అందుకు అంతర్దృష్టి ఏర్పడాలి. మనస్సును నిద్రపుచ్చి లేదా శూన్యంచేసి ఆలోచనలు తలఎత్తకుండా చేసినప్పుడు ఆత్మ అనుభూతికి అందుతుంది. నిజానికి ఆత్మసహకారం లేనిది ఆత్మజ్ఞానం' కలగదు.

- జాగృతి

11, మే 2018, శుక్రవారం

విశ్వాసమునకు నిజమైన అర్ధం - Vishwasam

ఒకవేళ నీవు ఇతరులకు సహాయం చేయదలిస్తే అందుకు విశ్వాసము తప్పనిసరి. విశ్వాసము రెండు విధాలుగా ఉంటుంది – నీవు ఇతరులపై విశ్వాసమునుంచడము మరియు ఇతరులు నీపై విశ్వాసమును ఉంచడము.

నీవు సరైన పద్ధతిలో, స్థిరంగా సమస్యలను ఎదుర్కోవడం చూసి ఇతరుల నీపై స్వతహాగా విశ్వాసమును ఉంచుతారు. అంతేకాక, నీవు ఇతరులపై విశ్వాసమును ఉంచడం వలన కలిగిన అనుభవాలను పంచుకోవడం ద్వారా ఇతరులు నీపై దీర్ఘకాలం వరకు వి శ్వాసమును ఉం చుతారు.

విశ్వాసమును ఉంచడము అను కళ ఈ క్రిందివాటి ద్వారా పెంపొందించుకోవచ్చు –
ఎప్పుడూ వ్యర్థ మాటలను వినకు, వాటిని పెంచకు, వీటి ఆధారంగా ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలను, అభిప్రాయాలను ఏర్పరచుకోవద్దు. నీ భావాలను ఎప్పుడూ ఆధ్యాత్మికతతో నిండుగా, స్వచ్ఛంగా ఉంచుకో. ఇతరుల పట్ల శుభ భావనను పెంచుకో. ఇతరులను విశ్వసించే నీ సామర్థ్యానికి ఇదే మూల కొలమానం. …బ్రహ్మాకుమారీస్‌.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


13, నవంబర్ 2017, సోమవారం

పూజకు ఎలా చేయాలి మరియు ఏమీ వస్తువులు కావలి ?

pooja-yela-cheyali-pooja-vidhanam-pooja-vastuvulu

పూజకు ఏమీ వస్తువులు కావలయును మరియు ఎలా చేయాలి:
ప్రాతః కాలములోనే నిద్రలేవాలి, లేచి కాలకృత్యములు పూర్తిచేయలి. తర్వాత స్నానముచేసి (Dress Code పాటించాలి) శుభ్రమైన పొడి వస్త్రము (ధోవతి) ధరించాలి, ఉత్తరీయమును నడుముకు కట్టుకోవాలి. హృదయము పైన ఎలాంటి వస్త్రమూ (బనియను, చొక్కా లాంటివి ధరించరాదు) వుంచుకొనరాదు. వారివారి సాంప్రదాయమును అనుసరించి నుదుటిభాగమును (విభూదితో కానీ చందనముతో కానీ తిరుమణితో కానీ శ్రీ చూర్ణముతో కానీ) తిలకధారణ చేయలి. తిలకధారణ (ముఖాన బొట్టు) లేకుండా పూజమందిర ప్రవేశము నిరుపయోగము. మనము నుదుట బొట్టు ధరించడము, మన సనాతన ధర్మములపట్ల, వేదములపట్ల, పునర్జన్మ సిద్ధాంతము పట్ల, నమ్మకమునకు, గౌరవమునకు సూచన.

పూజామందిరము ముందు నిలబడి మెల్లగా చప్పుడు (మూడు పర్యాయములు మెల్లగా సున్నితముగా చప్పట్లుకొట్టుచూ) చేయాలి. మనము పూజమందిరము తలుపుతీయుటకు స్వామి వారిని అనుమతిమ్మని కోరుతూ ఇలా అనుమతిని కోరుతూ చేయుక్రియ. తర్వాత మెల్లమెల్లగా పూజమందిరము తలుపును తీయలి.

పూజమందిరములోనికి వినయముతో, భయభక్తులతో, అతిజాగ్రత్తగా, వినమ్ర మనస్కులమై లోనకు ప్రవేశించాలి (ఒక అధికారి తో అతి ముఖ్యమైన ఎంతో అత్యవసరమైన పని ఉన్నప్పుడు ఎంతో గౌరవముగా తలుపువద్ద నిలబడి అతివినయము ప్రదర్శిస్తూ (“MAY I COME IN SIR,”) అని అడిగి లోనకు ప్రవేశిస్తాముకదా. మరి మన స్వామి జగత్తు కే అధికారి, ఆ అధికారి గదిలోనికి ప్రవేశించేటప్పుడు, ఎంత జాగరూకతతో ప్రవేశించాలి, ఒకసారి ఆలోచించండి.

అతి జాగ్రత్తగా స్వామివారి సింహాసనమును, పూజామందిరములోని నిర్మాల్యమును (నిన్నటి రోజున మనము స్వామివారికి సమర్పించిన ఫల పుష్పాది తీర్థప్రసాదములను, కుంకుమాది అక్షితాది పూజా వినియోగములను, దీపారాధన సామగ్రిని) అతి సున్నితముగా, భయభక్తుతలతో, తొలగించాలి. తదుపరి పూజామందిరమును శుభ్రముగా శుభ్రపరచాలి.
pooja-yela-cheyali-pooja-vidhanam-pooja-vastuvulu
1. పూజకు సమయ పాలన అతి ముఖ్యమైన అంశము. ఉదయం 6 గం|| పూజ అంటే మనము ఎక్కడ ఉన్నా తప్పకుండా ఉదయం 6 గం|| పూజ ప్రారంబించాలి, అనే నడవడిని మనము మన మనస్సుకు తరఫీదు ఇవ్వాలి. ఉదా :- పదవీ విరమణ చేసిన ఒక సైనికుడు ఇంటికి వచ్చేస్తాడు. (మిలటరీ ఉద్యోగి). అయినా అతడు మరణించే అంత వరకు, మిలటరీలో ఎలా అయితే ఉదయం 4 గం|| నిద్ర లేస్తారో, అదేవిధముగ పదవీవిరమణ చేసి, ఇంటి దగ్గర తన భార్యబిడ్డలతో ఉన్నా, క్రమం తప్పకుండా 4గం|| నిద్రలేస్తాడు. ఎందుకు? అతని మనసుకు కొన్ని సంవత్సరములుగ మిలటరీ వారు ఇచ్చిన ప్రాక్టీసు.

2. పూజకు (పూజ వేళకు) ఉపయోగించడానికి విడి విడిగా పాత్రలలో (పంచ పాత్ర) శుద్ద జలము సిద్దము చేసుకోవాలి. పూజకు ఒక ఉద్దరిణి, పంచపాత్ర, చిన్న గ్లాసులు రెండు , తట్ట, గంట, హారతి పళ్ళెము సిద్దము చేసుకొనవలయును.

3. వారి వారి అభిరుచుల (ఇష్టదేవత/గురూపదేశము) ను అనసరించి అర్చనామూర్తిని సిద్దము చేయవలయును.

ముఖ్య గమనిక:- దైవము యొక్క ప్రతిమగానీ, Photo గానీ సిద్దము చేసుకున్న తరువాత, త్రికరణ శుద్దిగా, పూజ సమయంలో కానీ, పూజానంతరం కానీ, పూజ గదిలో ఉన్నది ప్రతిమ, Photo అనే భావన ఏ పరిస్థితులోనూ రాకూడదు. అక్కడ సింహాసనము పై అర్చనా మూర్తి ఆసీనులైఉన్నారని, అక్కడ కూర్చొని మనలను మన కుటుంబమును ఎల్ల వేళలా, చూచుచూ మనలను కాపాడు చున్నాడని, మరువ రాదు. స్వామి వారు అక్కడకు వచ్చి కూర్చొని ఉన్నారు, అనే భావనతో భయ భక్తులతో పూజ ప్రారంభించాలి.

4.దీపారాధనకు పత్తితో తయారు చేసిన వత్తులను సిద్దం చేసుకోవాలి. దీపారాధనకు యధాశక్తి తైలమును(నూనెను) ఉపయోగించాలి. ఆవు నెయ్యి సర్వశ్రేష్ఠము.
5.ధూపారాధనకు అగరబత్తీలు, ధూప్ స్టిక్కులు, సాంబ్రాణి సిద్దంచేసుకోవాలి. అగ్ని హోత్రము తయారుచేసి సాంబ్రాణి వేయడము శ్రేష్ఠము.

6.పసుపు, కుంకుమ, అక్షితలు, పూలు, పళ్ళు, తమలపాకులు, వక్కలు, గంధము (అంగడిలో అమ్మే గంధము కాకుండా ఇంటిలో సానరాయి, గంధపు చెక్క ఉంచుకుని, నిత్యము గంధము తీసి భగవంతునికి సమర్పించడం సర్వ శ్రేష్ఠము) ఆగరు వత్తులు, హారతికి కర్పూరము, కొబ్బరికాయ (యధాశక్తి) సిద్దం చేసుకొనవలయును.

7. నివేదన నిమిత్తo నిత్యము బెల్లము ముక్కను తప్పనిసరిగా ఉంచవలయును. అలాగే నైవేద్యమునుకు సాత్వికాహారము, సాత్విక పదార్థాము లను, నివేదించవలయును. భగవంతునికి (పూజకు) ఒకటి, మనము భుజించడానికి ఒకటి, తయారు చేయుట నిషిద్దము. భగవంతునికి ఏమి నివేదించుతామో మనము కూడా అదే తీసుకొనవలయును.
pooja-yela-cheyali-pooja-vidhanam-pooja-vastuvulu

తర్వాత 

గురుపరంపర ప్రార్థన:
శ్రీమతే రామానుజాయ నమః శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమః
పోదు త్తనియన్లు ప్రాతార్నిత్యాను సంధేయ శ్లోకములు
మణవాళమహామునుల తనియన్ –శ్రీ రంగనాథులు ప్రసాదించినది.

1) శ్రీ శైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్|
యతీన్దృ ప్రవణం వన్దే రమ్యజామాతరం మునిమ్||
శ్రీ గురుపరంపర తనియన్- కూరత్తాళ్వానులు సాయించినది.

2) లక్ష్మీనాథ సమారమ్భాం నాథ యామున మధ్యమామ్ |
అస్మదాచార్య పర్యన్తాం వన్దే గురుపరమ్పరామ్||
ఎంబెరుమానార్ తనియన్- కూరత్తాళ్వాన్ సాయించినది.

౩. యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే|
అస్మద్గురో ర్భగవతోఽ వ్యామోహత స్య దయైకసిన్దోః
రామానుజస్య చరణౌ శరణం ప్రవద్యే ||
నమ్మాళ్వార్ తనియన్- ఆళవందార్ సాయించినది.

4. మతా పితా యువతయ స్తనయా విభూతిః
సర్వం యాదేవ నియమేన మదన్వయానామ్
అద్యస్య నః కులపతే ర్వకుళాభి రామం
శ్రీమత్త దం ఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా
ఆళ్వారుల తనియన్ – శ్రీ పరాశరభట్టర్ ఆనతిచ్చినది.

5. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాధ
శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహన్
భక్తాంఘ్రిరేణుపరకాల యతీన్దృమిశ్రాన్
శ్రీ మత్పరాంకుశ మునిం ప్రణతోఽస్మి నిత్యమ్

గురుపరంపర ప్రార్థన తర్వాత
“శుక్లాం భరధరమ్ విష్ణుమ్” శ్లోకం తో ప్రారంభించి ఇష్టదేవతా ప్రార్ధనాశ్లోకాలు పద్యాలు, మంత్రాలు పఠించుచూ పూజ చేసుకోవలయును.
వారివారి సమయభారమునుబట్టి శ్రీ విష్ణుసహస్రనామాలు, శ్రీ లలితా సహస్రనామాలు శ్రద్దాభక్తులతో మనసును స్వామి పదములమీద ఉంచి ఏకాగ్రతతో పఠించి పూజాకార్యక్రమమును చేసుకొనవలయును.

నిత్యాంతరంగ ప్రార్ధన:

1. పరమాత్మా నన్ను బ్రాహ్మ ముహూర్తములో (ఉదయం 4 గంటలకు) నిద్ర నుండి లేచి ఈశ్వరారాధనాభిముఖునిగా ఉండునట్లు, నా బుద్ధిని ప్రచోదనము చేయుము. దయా సింధో సర్వకాల సర్వావస్తలయందు, నిన్ను స్మరించు బుద్ధిని నాకు ప్రసాదించు.

2. సత్సాంగత్యము(భగవాన్ భక్తులతో స్నేహము) నిరంతరము కొనసాగునట్లు నన్ను ఆశీర్వదింపుము. అనాయాస మరణము, చివరి శ్వాస నీ ధ్యాసలో ఉండునట్లు అనుగ్రహింపుము.

3. అరిషడ్వర్గములను జయించు శక్తిని, నా బుద్ధికి ప్రసాదింపుము. నిరంతరం పరోపకారమే పరమావధిగా, మానవ సేవే మాధవ సేవ యను భావము, నాలో నిరంతరము కొనసాగించుము.

4. దేహాభిమానమును నాలోని అహమును పారద్రోలుము. ప్రేమతో నా హృదయమును నింపుము. ప్రకృతిలో సకల జీవరాసులలో, పరమాత్మను చూచు భూత దయను, నాకు ప్రసాదింపుము.
5. ప్రతి స్త్రీ యందు మాతృమూర్తిని, పరదేవతను (అమ్మను) దర్శించగలిగే బుద్ధిని, జ్ఞానమును నా బుద్ధికి,మనస్సుకు ప్రసాదించుము.

6. నిజాయితీతో ధర్మబద్దమైన జీవితమును, ధర్మయుత సంపాదనను, ధర్మ పాలనను ప్రసాదించుము. ధర్మానుష్టానములో వచ్చే ప్రమాదములను, బాధలను,కష్టములను, మీ యొక్క ప్రసాదముగా స్వీకరించి నిరంతరము మీరు ఇచ్చిన దానితో, సంతృప్తిగా జీవించే బుద్ధిని అనుగ్రహింపుము. ధర్మచట్రములో ఇముడు పనులను మాత్రమే నా బుద్ధికి మనస్సుకు ప్రచోదనము చేయుము.

7. తల్లి తండ్రుల, గురువుల, పాదపద్మములకు, ప్రాతః కాలమున త్రికరణ శుద్ధితో, సాంజలి బంధకముగా నమస్కరించే బుద్దిని ప్రసాదించుము.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


13, అక్టోబర్ 2017, శుక్రవారం

మృత్యువు - ఒక వరంలాంటిది

maranam-mrituvu-death-is-heaven


ఎవరైనా మరణిస్తే లేదా దేని మరణమైనా చూస్తే నాకు ఆందోళనగా అనిపిస్తుంది – అది మా పెరట్లో పావురం కావచ్చు, రోడ్డు మీద కుక్క కావచ్చు. నాకెందుకలా అనిపిస్తుంది? మరణమంటే ఏమిటో నేను తెలుసుకోగలిగెట్లు చేయగలరా?

మృత్యువు – ప్రకృతి రిత్యా మీరు కూడా మర్త్యులు (mortal). ఈ విషయమే మీ భయానికి మూలం. మీరు మర్త్యులు కాకపోతే మీకు భయమే ఉండదు, మిమ్మల్ని ముక్కలుగా కోసినా మీరు మరణించరు. కాని దేన్ని గురించి భయపడాలి? మరణం చాలా అద్భుతమైనది; ఎన్నిటి నుంచో  అది విముక్తి కలిగిస్తుంది. ప్రస్తుతం మీరు ఇలా ఉన్నారు కాబట్టి మీకది భయంకరంగా అనిపించవచ్చు, కాని మీకు వెయ్యేళ్ల జీవితం ఉందనుకోండి, మరణం గొప్ప ఉపశమనంగా కనిపిస్తుంది. మీరిక్కడ సుదీర్ఘ కాలం ఉంటే మీరెప్పుడు పోతారోనని జనం ఎదురుచూస్తారు. అందువల్ల మరణం గొప్ప ఉపశమనం; అది అర్ధాంతరంగా జరగకూడదంతే. మనమింకా సృజించగల, లోకానికేదైనా ఇవ్వగల, పనిచేయగల స్థితిలో ఉన్నవారు చనిపోవడం బాధాకరం.

ఇలా కాకుండా, సరైన సమయంలో మీరు మరణించాలంటే మీరు సాధన చేయాలి. అప్పుడు మీరెప్పుడు మరణించాలో మీరే నిర్ణయించుకోగలుగుతారు. లేకపోతే మీరు చచ్చిన పావురాన్ని చూసినా మీ మృత్యువును గుర్తు చేసుకొంటారు. నిన్న ఎగురుతూ ఉన్నది ఇప్పుడు చనిపోయింది, రేపటికి ఎండిపోతుంది. మీ సంగతి కూడా ఒకనాడు ఇంతే అని ఊహించుకోవడం వల్ల భయం కలుగుతుంది. మీరు పోగుచేసుకున్న దానితో మిమ్మల్ని మీరు గుర్తించుకోవడం అన్నది మీకో నిర్బంధ చర్యగా మారిపోయింది. మీరు పోగుచేసుకున్నదంటే –  మీ శరీరం. ఇది కేవలం చిన్న మట్టిముద్దే అని నేను అంటాను. మీరు పోగుచేసుకున్న ఈ శరీరం మట్టితో ఏర్పడినదే. మీ శరీరం, మీ గుర్తింపులు, మీలో ఎంత గాఢంగా నాటుకు పోయాయంటే, వాటిని కోల్పోవడం మీకు భయంకరంగా కనిపిస్తుంది.
మీ శరీరం, మీ గుర్తింపులు, మీలో ఎంత గాఢంగా నాటుకు పోయాయంటే, వాటిని  కోల్పోవడం మీకు భయంకరంగా కనిపిస్తుంది.
మీరు చాలా బరువున్నారనుకోండి, మీరొక పదికిలోలు తగ్గేటట్లు మేము చేస్తే మీరు భయపడి, ఏడుస్తారా? లేదు కదా! పదికిలోలు తగ్గినందుకు చాలామంది ఆనందంతో తబ్బిబ్బవుతారు. ఇప్పుడు మీ బరువు మొత్తం 50 కిలోలో, 60 కిలోలో మొత్తం నశించిపోతే మాత్రం, ఏమవుతుంది? జీవన విధానం ఉన్నది ఉన్నట్టుగా మీరు తెలుసుకున్నప్పుడు మీరు పోగుచేసుకున్న గుట్టల్లో మీరు కూరుకుపోకుండా ఉనప్పుడు, శరీరాన్ని విడిచిపెట్టడమన్నది పెద్ద విషయమేమీ కాదు.

పక్షులు, పురుగులు, కుక్కలు, మనుషులు..అందరి మృతదేహాలు మట్టి మాత్రమే. మట్టి మట్టిలో కలిసిపోతుంది. అదో పెద్ద నాటకమేమీ కాదు; అదొక సహజ ప్రక్రియ. మీరు తీసుకున్నది, తిరిగి ఇవ్వవలసిందే. దాన్ని రీసైకిల్ చేయవలసిందే. మీ జననం, జీవితం, మరణాలకు మీరెంతో ప్రాధాన్యం ఇవ్వవచ్చు. కాని భూమాతకు సంబంధించి అది రీసైక్లింగ్ మాత్రమే. అది మిమ్మల్ని బయట పడేస్తుంది, లోపలికి లాక్కుంటుంది. మీ గురించి మీరు చాలా ఉహించుకోవచ్చు, కాని మీరు తీసుకుంది, తిరిగి ఇవ్వవలసిందే, అది మంచి అలవాటు. మీరెవరి దగ్గర ఏమితీసుకున్నా ఎప్పుడో ఒకప్పుడు తిరిగి ఇవ్వాల్సిందే. మరణం మంచి అలవాటు; నన్ను నమ్మండి. __సద్గురు

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

3, జులై 2017, సోమవారం

ఆధ్యాత్మిక యోగము - Spiritual Practice

ఆధ్యాత్మిక యోగము - Spiritual Practice
జీవితంలో అనుసరించవలసిన నియమాలగురించీ, సాధించవలసిన లక్ష్యాలగురించీ వివిధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటి సాధనకు పాటించే మార్గాన్నియోగము అని అంటారు. ప్రతి మనిషి తన జీవిత పరమార్థాన్ని చేరుకోవడానికి యోగులు వివిధ రకాలైన పద్ధతులను ఉపదేశించారు. వీటిలో ఏదైనా ఒక యోగాన్ని సాధన చేసేవారిని యోగి అని అంటారు. భగవద్గీత, యోగ సూత్రాలు, హఠయోగ ప్రదీపిక మరియు వీటన్నింటికీ మూల గ్రంథాలైన ఉపనిషత్తులు యోగం కోసం అంకితమైనవి. ఎవరైనా ఆధ్యాత్మిక లక్ష్యాన్ని (మోక్షం, సమాధి, లేదా నిర్వాణం)చేరుకోదలచిన వారు,
క్రింద పేర్కొన్న మార్గాలను అనుసరించ వచ్చు.
  • భక్తి యోగం (ప్రేమ మరియు భక్తితో కూడిన మార్గం)
  • కర్మ యోగం (విధులను సక్రమంగా నిర్వర్తించడం )
  • రాజ యోగం (ధ్యాన మార్గం)
  • జ్ఞాన యోగం (జ్ఞాన సముపార్జన)
ఒక మనిషి తన ఇష్టాన్ని బట్టి లేదా అర్థం చేసుకొనే శక్తిని బట్టి ఈ నాలుగింటిలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొనవచ్చు. కానీ కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఈ కలియుగంలో భగవంతునికి చేరువ కావడానికి భక్తి మార్గం కంటే మించిన మార్గం మరొకటి లేదని చెపుతుంటారు. ఒక మార్గాన్ని అనుసరించడం ద్వారా మరొక మార్గాన్ని అనుసరించకూడదని నియమమేమీ లేదు. ఉదాహరణకు జ్ఞాన యోగాన్ని శ్రద్ధగా ఆచరించడం ద్వారా పవిత్రమైన ప్రేమను కూడా సాధించవచ్చు. ధ్యాన యోగాన్ని అనుసరించేవారు తప్పని సరిగా కర్మ యోగం, జ్ఞాన యోగం మరియు భక్తి యోగ భావనల్ని ఇముడ్చు కోవాల్సి ఉంటుంది.

వివిధ యోగాల ఆచరణ గురించీ, వాటిలోని భేదాల గురించీ, వాటి మధ్యనున్న సమన్వయం గురించీ అనేక గ్రంథాలు, సూత్రాలు, అభిప్రాయాలు, ఆచారాలు ఉన్నాయి.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

11, జూన్ 2017, ఆదివారం

విజయానికి ఆధ్యాత్మిక సూత్రాలు - Devotional ways to success

విజయానికి ఆధ్యాత్మిక సూత్రాలు - Devotional ways to success
ప్రతివారికీ ఒక సమున్నత లక్ష్యం ఉండాలి. దానిని సాధించేందుకు తగిన సాధన సంపత్తిని బలపరచుకోవాలి. అయితే ఆ లక్ష్యం స్వార్థపూరితమైనది కాకుండా, వ్యక్తిని నియంత్రించి విశ్వహితం కలిగించేదిగా ఉండడం సముచితం.

జీవితంలో ఏ రంగంలో విజయం సాధించాలన్నా కావలసినవి ఏమిటి? ఈ విషయమై అనుభవజ్ఞులు, మేధావులు చాలా సూచనలు చేయడం, చిట్కాలు చెప్పడం మామూలే.
మన సనాతన గ్రంథాలలో - కార్యదక్షత, కర్మశీలతపై ఎంతో అధ్యయనంతో ఆచరణయోగ్యమైన సూత్రాలను సాధన రూపంలో అందించారు.

ఒక్కసారి రామాయణాన్ని పరిశీలిస్తే నిలువెత్తు ఆదర్శాలు కోకొల్లలుగా కనిపిస్తాయి.
బుద్ధిమంతుడు, మహావాగ్మి, కార్యదక్షుడు, బలశాలి - అయిన హనుమంతుడు మనముందుంటే చాలు... కార్యసాఫల్యానికి కావలసిన లక్షణాలు అవగతమవుతాయి.

బుద్ధిర్బలం యశోధైర్యం
నిర్భయత్వం అరోగతా |
అజాడ్యం వాక్పటుత్వంచ
హనుమాన్‌ స్మరణాద్ధవేత్‌|| -

అన్నారు పెద్దలు. దీనిని మంత్రంలా, భజనలా దర్శించడంతో సరిపుచ్చకూడదు. హనుమంతుని ప్రవర్తన ద్వారా మనం గమనించి, అలవరచుకోవలసిన లక్షణాలివి... అని అసలైన అంతరార్థం.

(1) మొదట - సముద్ర లంఘనానికి సిద్ధపడినప్పుడు, ''ఈ సముద్రాన్ని నేను అవలీలగా దాటుతాను. పనిని సఫలం చేసుకువస్తాను'' అని వానరులకు అభయమిచ్చాడు. దీనిద్వారా, ఒక పనికి మొదట కావలసినది 'ఆత్మ విశ్వాసం' అని చాటి చెప్పాడు.
(2) సముద్ర లంఘన సమయంలో మొదట ఎదురైనది మైనాక పర్వతం. తన శిఖరాలపై కాసేపు విశ్రమించి ఆతిథ్యం స్వీకరించమన్నది. ఏనాడో హనుమంతుని తండ్రి వాయుదేవుని సహాయం వల్ల క్షేమంగా సముద్రంలో ఉన్నాడు మైనాకుడు. అందుకు కృతజ్ఞతగా సహకరించే అవకాశం ఇప్పుడు వచ్చిందని, వాయు తనయునికి ఆతిథ్యమిచ్చి తన ప్రేమను ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. (ఇది గమనిస్తే - ఒక వ్యక్తికి కృతజ్ఞత ఎంత అవసరమో తెలుస్తుంది. సహకరించినవాని పట్ల మాత్రమే కాక, వారి తరువాతి తరం వారికి కూడా కృతజ్ఞత ప్రకటించాలని, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ సంస్కారం ఎంత గొప్పది!)
కానీ 'అనుకున్న పని నెరవేరే వరకు విశ్రమించను'- అని ఆదరంగా చెప్పి, హనుమంతుడు ముందుకు సాగాడు. దీని ద్వారా తెలుసుకోవలసినది - విజయానికి రెండవ సూత్రం 'అవిశ్రాంత ప్రయత్నం'.
(3) అటు తరవాత, సురస అనే శక్తి అడ్డుకొని తన నోటిలోనికి ప్రవేశించమని, అది దేవతల ఆజ్ఞ అని చెప్పగా - యుక్తితో అల్పాకారం దాల్చి ప్రవేశించి వెలికి వచ్చాడు. ఇక్కడ ప్రకటించింది- వినయాన్నీ, యుక్తిని. ఎదురైన అడ్డంకిని 'యుక్తి'తో ఎదుర్కొనే లక్షణం ఇందులో గోచరిస్తుంది.
(4) ఆ పిమ్మట - 'సింహక' అనే రాక్షసి పట్టు నుండి బలిమితో బయటపడి లంకను చేరాడు. అక్కడి లంకిణికి బుద్ధి చెప్పాడు. ఇక్కడ 'శక్తి'ని ప్రదర్శించి అవాంతరాలను అధిగమించాలి- అనే పాఠం ఉంది.

ఇలా ఆత్మవిశ్వాసాన్నీ, శ్రద్ధనీ, యుక్తినీ, శక్తినీ విజయసోపానాలుగా మనకు నేర్పించిన ఆచార్యుడు హనుమ.

ఈ సందర్భంలో హనుమను కీర్తిస్తూ దేవతలు చెప్పిన మాటలు - ధృతిఃదృష్టిః మతిః దాక్ష్యం స్వకర్మసు నసీదతి.

-ఇది వాల్మీకి చెప్పిన అద్భుతమైన విజయసూత్రం.

1. ధృతి, 2. దృష్టి, 3. మతి, 4. దాక్ష్యం - ఈ నాలుగు ఉన్నవారు తమ పనిలో విజయాన్ని సాధించి తీరతారు.

1. ధృతి - పట్టుదల. ఎట్టి పరిస్థితులలోనూ సడలని ప్రయత్నమే ధృతి.
2. దృష్టి - ఏకాగ్రత, పనియొక్క పరిపూర్ణతను ముందుగా దర్శించగలగడం. దీనినే దార్శనికత అనవచ్చు.
3. మతి - బుద్ధిబలం - ప్రణాళిక రచన (ప్లానింగ్‌) చక్కగా ఆలోచించడం.
4. దాక్ష్యం - (దక్షత) సమర్థత. పనికి తగిన శరీర, బుద్ధుల పనితీరు.
- ఈ నాలుగూ ఎవరికి ఉంటాయో విజయం వారినే వరిస్తుంది.

లంకలో రాక్షసుల కంటపడకుండా తనని తాను తగ్గించుకొని తిరిగి అన్వేషణ కార్యంలో లీనమయ్యాడు హనుమ. 'అనువుగాని చోట అధికులమనరాదు' అన్న వేమన సూక్తికి ఇది ఉదాహరణ. తనని తాను ఎక్కడ పూర్తిగా బైటపెట్టుకోవాలో, ఎక్కడ ఎంత మరుగుపరచుకోవాలో తెలియాలి. అహంకారంతో అన్నిటా తన పూర్తి బలాన్ని ప్రకటించుకుని గుర్తింపు పొందాలనే తాపత్రయం పనికిరాదని ఇందులో పాఠం.

అన్వేషణలో భాగంగా అంతఃపురంలో స్త్రీలలో సీతకోసం చూస్తూ సాగుతున్న మారుతి - ''పరస్త్రీలను నిద్రాస్థితిలో మైమరచి ఉండగా చూడడం తగునా?''- అని ప్రశ్నించుకున్నాడు. తిరిగి, తనను తాను విశ్లేషించుకొని ''స్త్రీని స్త్రీలలోనే వెతకాలిగనుక, అంతఃపురంలో అన్వేషిస్తున్నాను. పైగా నా దృష్టి అన్వేషణాత్మకమే కానీ, వికారంతో కూడినది కాదు'' అని తన హృదయాన్ని తాను దర్శించుకున్నాడు. కార్యసాధకుడు ఏ వికారాలకు లోనుకాని ధీరత్వాన్ని కలిగి ఉండాలని ఇక్కడి పాఠం. అంతేకాదు- ''ఆత్మ పరిశీలన'' ముఖ్యం అనే అంశం... ఏ విజయంలోనైనా 'సచ్ఛీలత' (క్యారెక్టర్‌) చాలా ముఖ్యం. మన మనస్సుని మనం విశ్లేషించుకొని నిష్పాక్షికంగా మనల్ని మనం గమనించుకుంటే చాలు.

పై గుణాలతోపాటు, ఉత్సాహం, సాహసం, ధైర్యం, ఉద్యమం (ప్రయత్నం) విజయానికి అవసరం- అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి.

(అతి) నిద్ర, కునుకుపాటు, బద్ధకం, ఉద్రేకం, వాయిదాలు వేసే మనస్తత్వం (నిద్రా, తంద్రా, భయం, క్రోధం, ఆలస్యం, దీర్ఘసూత్రతా) ఉన్నచోట విజయం లభించదు - అని కూడా ఋషుల మాట. పవిత్రతతో కూడిన కార్యదక్షత మాత్రమే విజయానికి మూలభూమిక.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి