నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label పూరీ జగన్నాథ. Show all posts
Showing posts with label పూరీ జగన్నాథ. Show all posts

Wednesday, June 24, 2020

నిరాడంబరంగా పూరీ జగన్నాథ రథయాత్ర - Rath Yatra


సుప్రీంకోర్టు ఆంక్షల మధ్య పూరీ పట్టణంలో జగన్నాథ రథయాత్ర నిరాడంబరంగా ప్రారంభమయింది. మూడు దారు రథాల్లో ఆసీనులైన సుభద్రా, బలభద్ర సమేత జగన్నాథ స్వామిని భక్తులు స్వయంగా లాగుతూ ‘బడొదండొ’ మార్గంలో గుండిచా దేవి మందిరానికి తీసుకువెళ్లే యాత్రనే రథయాత్ర అంటారని తెలిసిందే.

కాగా నేడు ప్రత్యేక పూజల తర్వాత సంప్రదాయానుసారం మధ్యాహ్నం 12 గంటలకు పూరీ మహారాజు దివ్యసింగ్‌దేబ్‌ గజపతి.. బంగారు చీపురుతో స్వామివారి రథాన్ని శుభ్రం చేసే కార్యక్రమం ‘ఛెర్రా పహన్రా’ పూర్తిచేశారు. దీనితో జగన్నాధుడు తన నందిఘోష్‌ రథంలో, బలభద్రుడు తాళ ధ్వజంలోను, సుభద్రా దేవి దర్పదళన్‌ రథంలో తరలివచ్చే రథయాత్రకు మార్గం సుగమమయింది.

ఒక్కో రథాన్ని లాగేందుకు భద్రతా సిబ్బందితో సహా కేవలం 500 మందినే సుప్రీం కోర్టు అనుమతించిన నేపథ్యంలో… లక్షలాది భక్తులతో కిక్కిరిసి ఉండాల్సిన పూరీ వీధులు ఈసారి బోసిపోవడం గమనార్హం. చరిత్రలోనే తొలిసారిగా నేటి యాత్రలో కేవలం పూజారులు, సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. రథయాత్ర కొనసాగుతుండగానే క్రిమినాశక శానిటైజేషన్‌ ద్రవాన్ని పరిసరాల్లో పిచికారీ చేశారు. అంతేకాకుండా, కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలను నియంత్రించేందుకు పట్టణంలోని అన్ని ప్రవేశ ద్వారాలను మూసివేశారు.

_విశ్వ సంవాద కేంద్రము

Tuesday, June 23, 2020

పూరీ జగన్నాధ ఆలయం - ముఖ్య విశేషాలు - Puri Jagannatha Aalayam Mukhya Vishesalu

puri-jagannatha-aalayam
పూరీ జగన్నాధ ఆలయం..!!💐శ్రీ💐

పూరి జగన్నాధ ఆలయంలోని నగల భాండాగారం తాళాలను 34 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత రేపు తీస్తున్నారు.

800 ఏళ్ళ నాటి ఈ పురాతన ఆలయంలో స్వామివారి నగలను భద్ర పరిచిన గదిని రత్నభండార్ అంటారు. 1984లో ఈ రత్న భాండారాన్ని తెరిచి స్వామి వారి సంపదను చూసిన తర్వాత మూసివేశారు.

మళ్ళీ ఇన్నాళ్ళకు బుధవారం నాడు (04-04-2018) పది మంది సమక్షంలో ఈ తలుపులు తెరిచారు. ఈ పది మంది మాత్రమే ఆ గదిలోకి ప్రవేశిస్తారు. ఇందులో పురావస్తుశాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు ఉంటారు.

34 ఏళ్ళుగా తలుపులు తీయకపోవడంతో లోపల పాములు వుండే అవకాశాలున్నాయి. అందువల్ల వీరితో పాటు పాములు పట్టే ఇద్దరిని లోపలికి అనుమతిస్తారు. ఒరిస్సా హైకోర్టు ఆదేశాల మేరకు రత్న భాండాగారం నిర్మాణం లోపల ఎలా వుందో చూసేందుకు ఈ ప్రత్యేక బృందం ఆ తలుపులు తెరవబోతోంది.

రత్న భాండాగారంలో లైట్లు కూడా వుండవు. కేవలం టార్చి లైట్ల సహాయంతోనే ఆ గదిలోకి ప్రవేశించి గోడలు, ఫ్లోరింగ్ ఎలా వుందో పరిశీలిస్తారు. పది మందిని లోపలికి పంపేముందు.. బైటికొచ్చిన తర్వాత క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.

గదిలో స్వామివారి ఆభరణాలను లెక్కించడంగానీ, వాటిని తాకడం గానీ చేయకూడదు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆ భాండాగారం ఎలా వుందో చూడడం వరకే వీరి బాధ్యత. రత్న భాండాగారంలోకి ప్రవేశించే పది మందిలో ఒరిస్సా మహరాజు గజపతి మహారాజ్ దివ్యసింగ్ దేవ్, లేదా రాజు పంపే ప్రతినిధి, ఇద్దరు ఆర్కియాలజీ శాఖ అధికారులు, హైకోర్టు నియమించిన న్యాయవాది, వార్తా సంస్థల నుంచి పీటీఐ ప్రతినిధి వుంటారు.

రత్న భాండాగారంలో ఏడు అరలు వుంటాయి. 1984లో ఈ ఏడింటిలో మూడింటిని మాత్రమే తెరిచారు. మిగిలిన నాలుగు అరలను గత 98 ఏళ్ళుగా తెరవలేదు. వాటిలో ఏముందో కూడా ఎవరికీ తెలియదు. పూరి జగన్నాధుడికి కొన్ని లక్షల కోట్ల విలువ చేసే వజ్రవైఢూర్యాల నగల సంపద వుందని ఎప్పటి నుంచో ప్రచారంలో వుంది.

అయితే ఆ సంపదను ఇంతవరకు కంటితో చూసిన వారెవరూ లేరు. స్వామి వారి సంపద వున్న ఆ రత్నాభాండాగారం పటిష్టమైన భద్రతను కలిగి వుంటుంది. ఈరోజుకు కూడా హైకోర్టు ఆదేశాలతో ఆ గది తలుపులు తీస్తున్నారు.

ఇక లోపలికి వెళ్ళే ప్రత్యేక బృందం కూడా స్వామి నగలను తాకకుండా, చూడకుండా, కనీసం టార్చి లైట్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందంటే, పూరి జగన్నాధుడి సంపదను ఊహించడమే తప్ప ఎవరూ లెక్కకట్టలేనిది.

త్రివేండ్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లక్షల కోట్ల ఆభరణాల సంపదను మదింపు వేసిన తర్వాత దానిని కేంద్ర భద్రతా దళాల నిఘాలో పెట్టి జాగ్రత్త చేశారు.

ఇప్పుడు పూరి జగన్నాధస్వామి ఆలయంలో ఖజానా ఒక్కటే ఈ దేశంలో ఇంతవరకు లెక్కించకుండా, చూడకుండా వున్న నిధి. అందువల్ల దాని విలువ ఎన్ని లక్షల కోట్ల విలువ వుంటుందో ఊహకందనిది.

జై..జగన్నాధ..!!
లోకా సమస్తా సుఖినో భవంతు..!!💐


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


పూరీ జగన్నాథ రథయాత్రా వైభవం - Puri Jagannatha Yatra

పూరీ జగన్నాథ రథ యాత్రా వైభవం - Puri Jagannatha Yatra
జగన్నాథ వైభవం 

పూరీ రహస్యములు
హిందువుల ఆధ్యాత్మిక జీవనంలో తీర్థయాత్రలకు ఒక విశిష్ట స్థానం వుంది. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతిప్రాణి పుడుతూనే భగవత్ భక్తిని శ్వాసిస్తూ పుడుతుంది. అందుకే భగవంతుడు వివిధరూపాలతో, వివిధ నామాలతో ఈ భారతావనిపై అవతరించి, ఆధ్యాత్మిక సుసంపన్నం చేశాడు.

అందుకే భారతదేశం పుణ్యభూమి అనీ, కర్మభూమి అనీ, వేద భూమి అనీ, జగత్ విఖ్యాతి గాంచింది. విదేశీయులు సైతం తన ఆధ్యాత్మిక స్రవంతిలోకి ఆకర్ఛించే శక్తి ఒక్క మన భారతదేశానికే వున్నదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇందుకు కారణం మన సంస్కృతి, పండుగలు, ఆలయాలలో జరిగే ఉత్సవాలు, వేడుకలు. మనదేశంలో ఎన్నో పవిత్రం దేవాలయాలు వున్నప్పటికీ, పూరీ క్షేత్రంలో సోదర, సోదరీ సహితుడై కొలువున్న 'జగన్నాథ స్వామీ' ఆలయానికి ఓ ప్రత్యేకత వుంది. ఆ ఉత్సవ మూర్తి ఆకారంలోనే కాదు, ఆయనకు సమర్పించే ప్రసాదాలలోనూ ఓ ప్రత్యేకత, ఆయనకు జరిగే వేడుకల్లోనూ, ఉత్సవాలలోనూ, ఓ ప్రత్యేకత చోటు చేసుకుంటుంది. విశేషించి జగన్నాథుని రథయాత్ర అంటే, ఆబాలగోపాలానికి ఓ పర్వమే, ఓ వేడుకే, ఓ ఆనంద సందోహ, సంభ్రమ, సంతోష మరీచికే.
జగన్నాధుని ప్రసాదం
పూరీక్షేత్ర విశిష్టత
ఉత్కళ రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి విశ్వ, విశిష్ట స్థానం కలగటానికి కారణం శ్రీ జగన్నాథుడే. ఒకసారి చరిత్ర పుటంలోనికి ప్రయాణిస్తే, చారిత్రాత్మక విషయాలనే స్పృశిస్తామే కానీ, వాటి వెనుకవున్నపురాణ, ఇతిహాస, సత్యాలను గ్రహించడం, నమ్మడం, అంత తేలికైన విషయంగా కనిపించదు. సత్యం ఎప్పుడూ గోప్యంగానే వుంటుంది. మానవ నమ్మకానికి దూరంగానే వుంటుంది. కానీ, అదెప్పుడూ అందరినీ ఆకర్షిస్తూనే వుంటుంది. అందుకు ప్రత్యక్ష సాక్షి పూరీ జగన్నాథుడే. ఏ ఆలయంలోనైనా గర్భాలయంలోని మూల విరాట్టు కరచరణాలతో, సర్వాలంకారాలతో, నేత్రపర్వంగా దర్శనమిస్తాడు. కానీ పూరీ జగన్నాథుడు మాత్రం కరచరణాలు లేకుండా, కొలువుదీరి దర్శనమిస్తాడు. ఇదే ఆయన ప్రత్యేకత. ఈ ప్రత్యేకతకు ఓ కథ వుంది.

ఆ వృత్తాంతం ఏమిటంటే.
పూర్వం ద్వాపర యుగంలో మనదేశాన్ని 'ఇంద్రద్యుమ్న' మహారాజు పరిపాలించే వాడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ఒకసారి శ్రీ మహావిష్ణువు 'ఇంద్రద్యుమ్నుని ' కలలో కనిపించి, తన కోసం ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించమని, ఆదేశించాడు. ఇంద్రద్యుమ్నుడు మహావిష్ణువు ఆదేశాన్ని మహద్భాగ్యంగా స్వీకరించి, ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే ప్రతిష్టా మూర్తుల రూపాలు ఎలా వుండాలనే విషయంలో సంగ్దిద్ధానికి గురి అయ్యాడు. ఎందుకంటే కలలో కనిపించిన విష్ణువు రూపాన్ని తను శిల్పంగా మలచలేడు. సాధారణ శిల్పులు తను దర్శించిన రూపాన్ని వారు శిల్పంగా మలచలేరు. కారణం వారికి మహావిష్ణువు దర్శనం కలుగకపోవడమే. ఈ విషయంలో మహారాజుకు చింత రోజురోజుకీ ఎక్కువ కాసాగింది.

తన భక్తుడు పడుతున్న ఆవేదన శ్రీమహావిష్ణువుకు అర్థమయ్యి, తానే ఒక శిల్పాచార్యునిగా రూపం ధరించి, ఇంద్రద్యుమ్న మహారాజు దగ్గరకు వచ్చి, మీకు సంతృప్తి కలిగే విధంగా మూలవిరాట్టు నిర్మాణం చేస్తాననీ, అయితే తన పని పూర్తి అయ్యేంత వరకూ, ఎవరూ తన గదిలోనికి ప్రవేశించరాదని, తనంతట తాను బయటకు వచ్చేవరకు, తనపనికి ఎవరూ అంతరాయం కలిగించరాదని నిబంధన విధించాడు. మహారాజు అందుకు సమ్మతించాడు. ఒక ఏకాంత మందిరంలో మాయాశిల్పి పని ప్రారంభించాడు. వారాలు, నెలలు గడుస్తున్నాయి. ఏకాంత మందిరంలో పని జరుగుతున్నట్టు శబ్దాలు వస్తూనే వున్నాయి. మూలవిరాట్టు రూపాన్ని చూడాలనే ఆత్రుత, మహారాజు దంపతులకు ఎక్కువ కాసాగింది. కొద్ది రోజులకు ఏకాంత మందిరం నుంచి శబ్దాలు రావడం మానేశాయి. రాజ దంపతులకు ఆతృతతో పాటు అనుమానం కూడా ఎక్కువైంది. నిద్రాహారాలు లేకుండా ఏకాంత మందిరంలో పని చేస్తున్న శిల్పి మరణించి వుంటాడేమోనని సందేహం కలిగింది.

అంతే శిల్పి నియమాన్ని త్రోసిపుచ్చి, ఏకాంత మందిరంలోకి ప్రవేశించారు రాజదంపతులు. వారి ప్రవేశంతో నియమభంగం అయిందని గ్రహించిన మాయాశిల్పి మరుక్షణంలో మాయమయ్యాడు. అక్కడ దర్శనమిచ్చిన మూడు మూర్తులను చూసి, ఆశ్చర్య పోయాడు ఇంద్రద్యుమ్నుడు. కరచరణాలు లేకుండా, వున్న ఆ మొండి విగ్రహాలను ఆలయంలో ఎలా ప్రతిష్ఠించాలా అనే సందేహం ఆయనకు మరింత వ్యధను కలిగించింది. ఆ రాత్రి శ్రీ మహావిష్ణువు ఇంద్రద్యుమ్నుని కలలో కనిపించి, ''మహారాజా, బాధపడకు. ఇదంతా నా సంకల్పం. ఆ శిల్పాలనే ఆలయంలో ప్రతిష్ఠించు. నేను ఆ రూపాలతోనే కొలువుతీరి జగన్నాథుడు అనే పేర సర్వజన కోరికలూ తీరుస్తూ వవుంటాను '' అని పలికి అదృశ్యమయ్యాడు. ఇంద్రద్యుమ్నుడు ఆ మూర్తులనే ఆలయంలో ప్రతిష్ఠించాడు. అవే నేటికీ సర్వజనుల చేత పూజలందుకుంటున్న బలభద్ర, సుభద్ర, జగన్నాథులు. ఇది పురాణకథ.

చరిత్ర:
11వ శతాబ్దంలో కళింగ దేశాన్ని (ఒరిస్సా రాష్ట్రాన్ని) పరిపాలించిన '' ''అనంత వర్మన్ చోడగంగ దేవుడు ''ఈ ఆలయాన్ని కట్టించాడు. అయితే ఆయన పాలనాకాలంలో ''విమాన గోపురాన్ని '' (గర్భగుడి), ' 'జగమోహన మందిరాన్ని '' (నాట్య మంటపాన్ని) మాత్రమే నిర్మించాడు. తర్వత కాలంలో అనగా, క్రీ.శ.1174లో ఒరిస్సాను పాలించిన ''అనంగ భీమదేవుడు '' ఈ ఆలయాన్ని అభివృద్ది చేశాడు. ప్రస్తుతం పూరీ క్షేత్రంలో దర్శనమిస్తున్న జగన్నాధస్వామి ఆలయ సంపద అంతా అనంగ భీమదేవుని కాలంలో నిర్మించినవే.
బలభద్ర, సుభద్ర, జగన్నాథులు
1.బలభద్ర, 2.సుభద్ర, 3.జగన్నాథులు
మూలవిరాట్టు ప్రత్యేకత
సాధారణంగా ఏ ఆలయంలోనైనా భగవంతుడు భార్యాసమేతుడై కొలువుతీరి వుంటాడు. కానీ పూరీ క్షేత్రంలోని జగన్నాథుడు మాత్రం తన సోదరుడు 'బలభద్రుడు 'తోనూ, సోదరి 'సుభద్ర 'తోనూ, కొలువుతీరి సేవలు అందుకొంటూ వుంటాడు. సుమారు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన జగన్నాథుని ఆలయంతోపాటు వినాయకునికి, లక్ష్మీ పార్వతులకు, శివునకు, నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు వున్నాయి.

శిల్ప సంపద

ఈ మహా ఆలయనిర్మాణంలో ముఖ్యంగా నాలుగు భాగాలు వుంటాయి.
 1. 'విమాన గోపురం ' (గర్భగుడి)- ' రత్నవేది ' మీద నిర్మించబడిన ఈ గర్భగుడిలోనే సోదర, సోదరీ సహితుడైన జగన్నాధుడు కొలువు తీరి వుంటాడు.
 2. ' గాలిగోపురం' (ప్రధాన ప్రవేష ద్వారం) - ఈ ద్వారం నుంచే భక్తులు ప్రవేశించాలి.
 3. 'జనమోహన మండపం ' (నాట్య మంటపం)- ఇక్కడే భక్తుల సమక్షంలో ఆలయ ఉత్సవాలన్నీ జరుగుతాయి.
 4. ' భోగమంటపం' (వంటశాల) - ప్రపంచంలోని అతిపెద్ద వంటశాల పూరి జగన్నాథునిదే. ఇదే భోజనశాల కూడా. స్వామివారికి సమర్పించే నైవేద్య, భోజనాలన్నీ ఇక్కడే తయారవుతాయి. ఈ ప్రసాదాలన్నీ పర్యవేక్షించేది శ్రీ మహాలక్ష్మీదేవి. పాక కళాకోవిదులైన ఎందరో బ్రాహ్మణులు (పాండాలు) ముక్కుకి, నోటికి గుడ్డలు కట్టుకుని పదార్థాల వాసన కూడా చూడకుండా, భయభక్తులతో, ప్రతినిత్యం సుమారు 54రకాల పదార్థాలను స్వామివారి నైవేద్యానకి సిద్ధం చేస్తారు. పొరపాటున ముక్కుకు కట్టిన గుడ్డ జారితే, వండిన పదార్థాలను వృథా చేసి, మరలా కొత్తగా నైవేద్యాలను అన్నింటినీ సిద్ధం చేస్తారు. ఆ ప్రసాదాలనే భక్తులకు విక్రయిస్తారు. జగన్నాథుజు ప్రసాదప్రియుడు. అందుకే ఇన్ని రకాల నైవేద్యాలు.
జగన్నాథ్ పూరీ ఆలయం
జగన్నాథ్ పూరీ ఆలయం
 గర్బగుడి వైభవం
కళింగ దేశ శిల్పసంపదతో అలరారే గర్బగుడికి నాలుగు ప్రవేశ ద్వారాలు వుంటాయి.
 1. హాథీ ద్వార (గజద్వారం) -
 2. సింహ ద్వార (సింహద్వారం)
 3. అశ్వద్వార (అశ్వద్వారం)
 4. వ్యాఘ్ర ద్వార (వ్యాఘ్ర ద్వారం)
గర్భగుడిపై భాగంలో గల ఆలయశిఖరం ఎనిమిది కోణాలు గల శ్రీ చక్ర ఆకారంలో వుంటుంది. ఈ శ్రీ చక్రం ఎనిమిది ధాతువులతో (ఎనిమిది లోహాలతో తయారు చేయబడింది. ఒరిస్సా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలోనూ, అతిపెద్ద దేవాలయం పూరీజగన్నాధునిదే. ఈ జగన్నాధుని ఆలయ ఆవరణలో సుమారు 120 చిన్న చిన్న ఆలయాలు వున్నాయి.
సింహద్వారానికి ఎదురుగా 16 ముఖాలు గల ఒక పెద్ద 'అరుణ స్తంభం ' భక్తులను ఆకర్షిస్తూ వుంటుంది. ఆ స్తంభానికి కుడి వైపున నిలబడి చూస్తే లోపలవున్న జగన్నాథుడు దర్శనమిస్తాడు. పూర్వకాలంలో అంటరాని వారికి ఆలయప్రవేశం వుండేది కాదు. అందుచేత అంటరానివారు గర్భాలయ ప్రవేశం చేయకుండా ఈ అరుణ స్తంభం దగ్గరే నిలబడి స్వామిని దర్శించుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. జన్మతః హిందువులయినవారు ఎవరైనా సంప్రదాయ దుస్తులు ధరించి (ఆడవారు చీర రవికెలు, మగవారు పంచెలు, ఉత్తరీయాలు) జగన్నాథుని దర్శనం చేసుకోవచ్చు. హైందవేతరులకు ఈ ఆలయ ప్రవేశం నిషిద్ధం. ఒకనాటి మనదేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిని జగన్నాధుని దర్శనానికి ఆలయ నిబంధనలు అనుమతించని కారణంగా జగన్నాథుని దర్శనం ఆమెకు కలగానే మిగిలిపోయింది. సంప్రదాయ పరిరక్షణ విషయంలో జగన్నాధుని ఆలయం అంత కఠినంగా వుంటుంది. వేడుకలో వచ్చే విదేశీయుల విన్నపాలను గౌరవించి ఈ ఆలయ నిబంధనల విషయంలో కొన్ని సడలింపులు జరిగాయి. అందుకే విదేశీయులకు సైతం జగన్నాధుని దర్శనం నేడు కలుగుతోంది.

జగన్నాధుని రథయాత్ర
జగన్నాధుని రథయాత్ర
రథయాత్ర
జగన్నాథుని వైభవానికి, వేడుకకు నిలువెత్తు నిదర్శనంగా, కన్నుల పండుగగా జరిగేది జగన్నాధుని రథయాత్ర. ఈ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియనాడు ప్రారంభమవుతుంది. ఈ రథయాత్రలో మూడు ప్రధాన రథాలు వుంటాయి.
 1. బలభద్రుని రథం
 2. సుభద్రా దేవి రథం
 3. జగన్నాధుని రథం
ఈ మూడు రథాలు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు కొత్తవి తయారుచేస్తారు. రథయాత్ర ముగిసాక ఈ రథాలను భగ్నం (విరిచేస్తారు) చేస్తారు. జగన్నాధుడు ఊరేగే రథాన్ని నందిఘోష అంటారు. ఈ రథం 34న్నర అడుగుల ఎత్తు వుంటుంది.
18చక్రాలు వుంటాయి.

'బలభద్రుడు ' ఊరేగే రథాన్ని ' తాళద్వజ' అంటారు. ఈ రధం 33 అడుగుల ఎత్తు కలిగి వుంటుంది. ఈ రథానికి 16 చక్రాలు వుంటాయి.

సుభద్రాదేవి ఊరేగే రథాన్ని దేవదాలన అంటారు. ఈ రథం 31న్నర అడుగుల ఎత్తు వుంటుంది. ఈ రథానికి14 చక్రాలు వుంటాయి.

ఈ మూడు రథాలు అలంకరించడానికి 12 వందల మీటర్ల పట్టు వస్త్రాన్ని ముంబాయిలోని సెంచరీమిల్స్ వారు విరాళంగా సమర్పిస్తారు.

ఈ రథయాత్ర జగన్నాథుని ప్రదాన ఆలయం నుంచి మొదలై, ' గుండిచ' ఆలయం దగ్గర ముగుస్తుంది. జగన్నాథుడు ' గుండిచ' ఆలయం దగ్గర9 రాత్రులు ' శ్రీ మందిరం'లో విడిది చేస్తారు. ఈ రథయాత్రలో ఎందరో భక్తులు పాల్గోని శక్తి వంచన లేకుండా రథాన్ని లాగుతూ, భజన పాటలు పాడుతూ, స్వామికి సేవలు అందిస్తారు. ఈ రథయాత్రను ' గుండిచ జాతర' అని అంటారు. జగన్నాథుడు శ్రీమందిరంలో విడిది చేసే 9 రాత్రులను వేసవి సెలవు దినాలుగా భావించి భక్తులు సేవిస్తారు. ఈ తొమ్మిది రోజులు జగన్నాధుడు అక్కడే పూజాదికాలు అందుకుంటాడు. ఈ తొమ్మిది రోజులు జగన్నాధుని ప్రధాన ఆలయం మూలవిరాట్టు శూన్యంగా వుంటుంది. సాధారణంగా రథాలలో ఉత్సవమూర్తులనే ఊరేగిస్తారు. కానీ జగన్నాధుని రథయాత్రలో మూలవిరాట్టులే ఊరేగడం ప్రత్యేకత. జాతి, మత, కుల భేదాలు లేకుండా అందరూ పాల్గొంటారు.

పూరీ క్షేత్రానికి సమీప గ్రామమైన నారాయణపూర్ లో నివసించే సుమారు వెయ్యి కుటుంబాలు ఈ మూడురథాల తయారీలోనూ, రథయాత్రలో ' జైజగన్నాథ' అని అరుస్తూ రథాన్ని లాగడంలోనూ పాల్గొనడం మరో ప్రత్యేకత.

ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక విశేష పూజ జరుగుతుంది. ఈ పూజలో గర్భాలయాలలోని మూల విరాట్టులను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఊరిచివర దహనం చేసేస్తారు. తరువాత కొత్త మూలవిరాట్టులను పునః ప్రతిష్టిస్తారు.

స్వామిపారికి రకరకాలైన ఆయుర్వేద ఔషధాలను నైవేద్యంగా సమర్పిస్
ఔషధసేవ
జగన్నాధునికి నిత్య పూజలు జరిగే సాధారణ దినాలలో రోజుకి ఆరుసార్లు చొప్పున వివిధ రకాలైన సుమారు 54 ప్రసాదాలు నివేదన చేస్తారు. అందుకే రథయాత్ర ప్రారంభమైన రోజు నుంచి శ్రీమందిరంలో విడిది చేసిన 9 రోజులు స్వామి వారికి సమర్పించే నివేదనలో నియంత్రణ వుంటుంది. ఏడాది పొడుగునా ఇన్ని రకాల ప్రసాదాలు ఆరగించే స్వామికి ఆరోగ్యం దెబ్బతింటుందేమోనన్న భావనతో నైవేద్యాలకు ఆటవిడుపు ప్రకటించి స్వామిపారికి రకరకాలైన ఆయుర్వేద ఔషధాలను నైవేద్యంగా సేవింపచేస్తారు. ఇటువంటి ఔషధసేవ జగన్నాధుని ఆలయంలో తప్ప మరెక్కడా కనిపించదు.

ముగింపు
జగన్నాధుడు శ్రీమందిరంలో విడిది చేసిన 9 రోజుల అనంతరం తిరిగి అవే రథాలలో మహా వైభవంగా గర్భాలయాన్ని చేరుకుంటాడు. దూరదర్శన్ ప్రసారాలు, యితర ప్రయివేటు ఛానల్స్ వారి ప్రసారాలు అందుబాటులోకి వచ్చాక జగన్నాధుని రతయాత్ర ప్రపంచంలోని ప్రతి యింటి ముంగిటలోకి వస్తోంది. ఇది సంతోష పరిణామమే. అయినా జగన్నాధుని రథ యాత్రలో ప్రత్యక్షంగా పాల్గొని, ఆ స్వామిని సేవించడంలోనే నిజమైన ఆనందము, సంతోషము ఉందనే నిజం అనుభవించిన వారికే తెలుస్తుంది. అదే ఈ మానవ దేహం చేసుకునే నిజమైన రథయాత్ర.

సర్వేజనా సుఖినోభవంతు..
గో బ్రాహ్మణేభ్యః శుభం భవంతు..

అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి

పూరి జగన్నాథ - Purii Jagannath


భారతీయ సంస్కృతిలో అదో అద్భుతం. పౌరాణిక- చారిత్రిక ప్రాధాన్యం కలిగిన పుణ్యక్షేత్రం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒకానొక దివ్యయాత్రా ధామం. అక్కడ విగ్రహం నుంచి ప్రసాదం వరకూ అంతా విశిష్టమే. ఆషాడ మాసంలో జరిగే జగన్నాథ రథయాత్ర మహిమ ఏమిటి? మన సంస్కృతీ- సంప్రదాయాలకూ ఇక్కడి యాత్రకూ సంబంధమేంటి? జగన్నాథుడు దేవేరులతో కాక సోదర- సోదరీ మణులతో దర్శనమివ్వడానికి కారణాలేమిటి?

రథోత్సవం అంటే అదే. అశేష భక్తజనులను ఒక్కసారిగా దర్శించాలంటే ఆ ఉత్సవాలకు వెళ్తే సరి. ప్రపంచంలో భక్తజనం పోటెత్తే.. కొన్నంటే కొన్ని ఉత్సవాల్లో దీనికి ప్రత్యేక స్థానముంది. ఆ ఉత్సవాల్లో పాల్గొనడం అంటే  జనసంద్రాన్ని దగ్గరుండి చూడ్డం. సోదర తత్వానికీ, మత సామరస్యానికీ ప్రతీక అయిన జగన్నాథ్ రథయాత్ర విశేషాలు ..
 • 9 రోజులు
 • 18 ఏనుగులు
 • 38 మంది మల్లయోధులు
 • 101 వాహనాలు
 • 136వ రథయాత్ర
 • మొత్తంగా  = 420 ఏళ్ల చరిత్ర..
ఇదీ గణాంకాల్లో పూరీ జగన్నాథ రథయాత్రా వైభవం. జగన్నాథుడంటే విశ్వానికి అధిపతి అని అర్ధం. అలాంటి జగన్నాథుడు కొలువైన పురుమే పూరీ. అంతటి జగన్నాథమూర్తికి చేసే రథయాత్ర ఎలా వుండాలి? అదే కనిపిస్తుందీ యాత్రలో. ఈ వేడుకలు తొమ్మిరోజుల పాటూ అంగరంగ వైభవంగా జరుగుతాయి. కుల- మత- వర్గ బేధాలను మరచి దేశవిదేశీ భక్తులు పోటెత్తుతారు. బలభద్ర, సుభద్రా సమేత జగన్నాథుడ్ని తనివితీరా దర్శిస్తారు. 

ఎప్పటికప్పుడు కొత్తగా చేసే రథాలతో ఆ ఉత్సవ తీరు అద్భుతం. మూలవిరాట్, ఉత్సవ విగ్రహాలు రెండూ ఒకటిగా వుండే ఏకైక ఆలయం. అంతే కాదు  మహావిష్ణు అవతారాల్లో ఒకటైన కృష్ణుడు  ఇక్కడ తన దేవేరులతో కాక, సోదరుడు బలరాముడు.. సోదరి సుభద్రలతో దర్శనమిచ్చే అరుదైన పుణ్యధామం.. పూరీ జగన్నాథ్  దేవాలయం. 

వైష్ణవాలయాల్లో పూరీ జగన్నాథ్ కి విశిష్ట స్తానముంది. ఆదిశంకరుల వారి దృష్టిలో ఈ క్షేత్రానికి విశేష ప్రాముఖ్యత వుంది. 17వ శక్తి పీఠంగా ఇక్కడి విమలాదేవి పూజలందుకుంటోంది. శివకేశవ తత్వానికి ప్రతీక. వైష్ణవ శక్తికి కేంద్రంగా భక్తుల నీరాజనాలందుకుంటోన్న వైభవ క్షేత్రం పూరీ. ప్రతి హిందువూ తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించి తీరాలనుకునే ఒకానొక దివ్యధామం. చార్ ధామ్ క్షేత్రాల్లో అత్యంత ప్రధానమైంది.
పూరీ రథోత్సవం
జగన్నాథ్ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుంచి మధుర వరకూ చేసే యాత్రగా పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి.. రథంలో పత్రిష్ఠించి యాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలయ్యే యాత్ర.. కిలో మీటరు దూరంలోని 'గుండీచ' మందిరం వరకు సాగుతుంది.  రథయాత్ర ప్రారంభంమయ్యే ముందు రథాన్ని, అక్కడి ప్రాంతాన్ని.. రాజ వంశీయులు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. రాజైనా.. దేవుడి ముందు సేవకుడే అని తెలిపేందుకు అనాదిగా ఈ ఆచారం పాటిస్తుడటం విశేషం. 

రథోత్సవాలు ఎన్నో జరుగుతాయి. కానీ పూరీ రథోత్సవానికి మాత్రమే విశేషమైన ప్రాధాన్యత వుంది. ఇక్కడి జగన్నాథుడు రథమెక్కి వూరేగడానికే ఉన్నాడనిపిస్తుంది. ఇంతకీ రథోత్సవ సంబరం దేన్ని సూచిస్తుంది? జగన్నాథడి తత్వం ఇందులో దాగి వుందా? రథాల తయారీ నుంచి విగ్రహాల మార్పు వరకూ జగన్నాథుని ఇతర విశేషాలేమిటి? 

రథోత్సవం అంటే సాక్షాత్తూ ఆ భగవంతుడే భక్తుడెక్కడ వున్నాడో వెతుక్కుని మరీ రావడం. కృష్ణుడసలే భక్తజనసమ్మోనుడు. అందుకే ఆయనకు జనార్ధనుడన్న పేరు. నరులతో అత్యంత సన్నిహిత సంబంధాలుంటాయి కనుకనే, నరనారాయణ స్వరూపుడిగా  పూజలందుకుంటాడు. ఆయనకు భక్తజనులతో కలసి మెలసి వుండటం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన బాల్యం, యవ్వనం, జనసమూహంతో కలసి కనిపిస్తుంది. కృష్ణుడికి చిన్నప్పుడు ఎందరో మిత్రులు. పెద్దయ్యాక పదహారు వేల మంది గోపికలతో సహవాసం. అష్టభార్యలతో సంసారం. ఇలా కృష్ణుడు ఏది తీసుకున్నా అసంఖ్యాక భక్తజనంతో సరస-సంభాషణలు సాగిస్తున్నట్టు కనిపిస్తుంది. భాగవతం చదివితే కృష్ణుడెంతటి ప్రజాదైవమో అర్ధమవుతుంది. కనుక జనమంటే కృష్ణుడు కృష్ణుడంటే జనంగా భావించడం వుంది. అందుకే జగన్నాథుడి రథోత్సవానికి  భక్తజనులు అంతగా పోటెత్తుతారు.

జగన్నాథ రథయాత్ర విశేషాల సమాహారం. అందులో ప్రతిదానికీ ఓ వైశిష్ట్యం వుంది. రథయాతల్రో జగన్నాథుని రథాన్ని 'నందిఘోష్‌' గా  వ్యవహరిస్తారు. ఎరుపు, పసుపు రంగులతో చేయబడిన దివ్య వస్త్రాలతో అలంకరించబడిన ఈ రథం 45 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దీనికి  పదహారు చక్రాలుంటాయి. బలభద్రుడి రథాన్ని 'తాళ్‌ధ్వజ్‌'  పేరుతో పిలుస్తారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న దివ్య వస్త్రాలతో దీన్ని అలంకరిస్తారు. దీని ఎత్తు 44 అడుగులు. తాళ ధ్వజ్ కు 14 చక్రాలు ఉంటాయి. అదేవిధంగా సుభద్రాదేవి రథాన్ని 'దర్ప దళన' అంటారు. ఈ రథానికి 12 చక్రాలుంటాయి.  జగన్నాథుడు ఎన్ని ఆటంకాలనైనా దాటుకుని తన భక్తజనాన్ని కలుసుకోడానికి పెద్ద పెద్ద చక్రాలను రథానికి పూన్చుకుని అంగరంగ వైభవంగా వస్తాడు.  అందుకే వాటికి 'జగన్నాథ రథచక్రాల్' అన్న పేరొచ్చింది. 

గర్భాలయంలో రత్న సింహాసనంపై కొలువై ఉంటాడు జగన్నాథుడు. జగన్నాథుడు, ఆయన సోదరుడు బల భద్రుడు, సోదరి దేవి సుభద్ర దేవతా మూర్తులను ఆలయ సింహద్వారం గుండా బయటకు తీసుకువచ్చి అలంకరించిన రథాలలో ఉంచి ఊరేగింపు చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు తన్మయత్వం మాటల్లో చెప్పడం కష్టం. విశేష పూజలు నిర్వహిస్తారు.  ప్రత్యేక రీతిలో మూడు రథాలు  ముందుకు కదులుతూ అదో సంబరంగా ఉంటుంది. రథం కదిలే సమయంలో శంఖారావం, గంటానాదం చేస్తారు. ప్రాచీన ఐరోపా నావికులు ఈ రథచక్రాల కింద ప్రమాదవశాత్తు పడటమో, మొక్కు కోసం ఆత్మబలిదానాల ఇవ్వడమో జరిగేదని కథలు కథలుగా చెబుతారు.

జగన్నాథ విగ్రహాలు, రథాల నిర్మాణానికి  ఒక విధానముంది. జగన్నాథ ఆలయంలో జరిగే విశేష పూజలు కూడా నియమనిష్టలతో కూడి వుంటాయి.  ప్రతి పన్నెండు నుంచి పందొమ్మిదేళ్లకొకసారి ఏ ఏడాదిలో ఆషాడ మాసం రెండుసార్లు వస్తుందో.. అప్పుడు 'నబకలేవర' ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను  మారుస్తారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే 'చందన యాత్ర'  రథాల నిర్మాణం మొదలు పెట్టడాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం 'స్నానయాత్ర' పేరుతో జ్యేష్ట మాసంలోని పౌర్ణమి రోజున జగన్నాథ తదితర ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంతకాలంలో 'డోలయాత్ర' వర్షాకాలంలో 'ఝులన్‌' యాత్ర పండుగలు చేస్తారు. 
పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం, దమనక ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే కార్తీక, పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంటారు. ఆగమ, జ్యోతిష, గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననంచేసి వాటిస్థానే కొత్తవి చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాధుని నాభిపద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది కానీ, తీసి వేయటం జరుగదు.
సుదర్శన చక్రం
ఇంతకీ పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర ఏమిటి? స్థలపురాణం ఏం చెబుతోంది. జగన్నాథ ఆలయంపై నున్న సుదర్శన చక్రానికీ, ఎగిరే జెండాకూ అర్ధం ఏమిటి? జగన్నాథ ఆలయానికీ బౌద్ధానికీ వున్న సంబంధమేమిటి?  తెలుసుకుందాం.

వాస్తవానికి మహావిష్ణువును జగన్నాథుడితో పాటు పద్మనాభుడని కూడా పిలుస్తారు. విష్ణువు నాభిలోంచి బ్రహ్మ పుట్టాడని చెబుతుంది విష్ణు పురాణం. అందుకే జగన్నాథుడి విగ్రహాలను మార్చినా, నాభి మాత్రం అలాగే వుంచుతారు. జగన్నాథుడి నాభిలో బుద్ధుడి దంతం పొందుపరచబడి వుండేదన్న మరో కథనం కూడా ప్రచారంలో వుంది. అందుకే ఇక్కడి మూర్తి నాభికి అంతటి విలువని చెబుతారు. బుద్ధడి దంతానికీ ఇక్కడి ఆలయంలోని స్థూపానికీ సంబంధముందని కూడా చెబుతారు. బుద్ధుడి దంతం కూడుకున్న స్థూపం.. తర్వాతి కాలంలో శ్రీలంకలోని కాండీకి తరలించబడిందని అంటారు.  

జగన్నాథుడ్ని హిందువులందరూ దర్శించవచ్చు. కానీ అన్యమతస్తులకు అనుమతి లేదు. ఇలాంటి వారు దగ్గర్లోని రఘునందన లైబ్రరీ భవనంపై నుంచి ఆలయం మొత్తాన్ని చూడవచ్చు. ఇక్కడ బడే కృష్ణ, రోహిణీ, మార్కండేయ, మహారథి, నరేంద్ర అనే పంచతీర్ధాలున్నాయి. బడే కృష్ణ, రోహిణీ తీర్ధాలు వీటిలో ప్రముఖమైనవి. నరేంద్ర తీర్ధం స్వచ్ఛమైన జలాలతో నిండి వుంటుందట. అందువల్ల దీనిలో స్నానం చేస్తే మంచిదని చెబుతారు.


పూరీ జగన్నాథ ఆలయ గోపురపు అంచు మీద.. సుదర్శన చక్రం దర్శనమిస్తుంది. ఇది నారాయణ రూపంలో నాలుగోది. దీనిపై ఒక పసుపు జెండా ఎగురుతూ కనిపిస్తుంది. దీనిలోని ఎరుపు గుర్తు జగాన్నాథుడు ఆలయంలోనే వున్నాడని సూచిస్తుందని భావిస్తారు. 
ఈ మధ్య కనుగొన్న గంగా రాజవంశానికి చెందిన రాగి ఫలకాల ప్రకారం, ప్రస్తుతమున్న జగన్నాథ ఆలయం ఎప్పటిదో తెలిసింది.  ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన 'అనంతవర్మన చోడ గంగాదేవ' ప్రారంభించాడట. ఈ ఆలయంలోని జగన్మోహన, విమన భాగాలు ఈ రాజు హయాంలో.. అంటే 1078 - 1148 CE మధ్య కాలంలో నిర్మించబడ్డాయి. అయితే 1174 CE లో ఒరిస్సా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునర్నిమించాడని తెలుస్తోంది.  ప్రస్తుతమున్న ఆలయ రూపు అప్పటిదే అంటున్నారు.

ఈ ఆలయ మూలాలకు సంభందించిన సంప్రదాయ గాథల గురించి  చెప్పాల్సి వస్తే కృతయుగానికి వెళ్లాల్సి వుంటుంది. ఇక్కడ ప్రచారంలో వున్న కథనం ప్రకారం, కృతయుగంలో  జగన్నాథుడు  పూరీ సముద్రతీర సమీపంలోని మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల ఆభరణంగా అవతరించాడట. అది ఎంత ప్రకాశావంతమైందంటే, దాన్ని చూసిన వారికి తక్షణ మోక్షం లభిస్తుందన్న నమ్మకం వుండేది. ఈ నీలాభరణాన్ని యముడు   భూమిలో దాచిపెట్టాలనుకున్నాడట. అందులో విజయం సాధించాడు కూడా. ద్వాపర యుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు.. అంతుపట్టని ఆభరణ రూపం గురించి తెలుసుకోవాలన్నాడట. అందుకోసం ఘోర   తపస్సు చేసాడట. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి, జగన్నాథ పురి సముద్ర తీరానికి వెళ్లి.. అక్కడ తేలుతున్న చెట్టు దుంగను కనుక్కొని.. దాని కాండం నుంచి తనకు కావలసిన రూపు తయారు చేయమని ఆజ్ఞాపించాడట.

విష్ణు మూర్తి ఆజ్ఞ ప్రకారం.. రాజు చెక్క దుంగను కనుక్కొన్నాడట. తర్వాత అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించాడు.  యజ్ఞ ఫలంగా యజ్ఞ నరసింహరాజు ప్రత్యక్షమై.. నారాయణుడ్ని నాలుగు రూపాల్లో నిర్మించమని చెప్పాడట. అలా చెట్టు దుంగ నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన రూపాలను తయారు చేశాడు.  ఆ రూపాలే వాసుదేవ, సంకర్షణ, యోగమయీ, సుదర్శన రూపాలు. ఇలా కృష్ణమూర్తి తన సోదరులు, సుదర్శన చక్రంతో దర్శనమిస్తూ.. భక్తజన నీరాజనాలు అందుకుంటున్నాడు. 

హైందవాలయాల్లో మూలవిరాట్టును రాతి రూపంలో, ఉత్సవ విగ్రహాలను పంచ లోహ విగ్రహాల్లో చేస్తారు. కానీ పూరీలో విగ్రహాలను కొయ్యతో చేస్తారు. ఎందుకిలా? దీనికి కారణంగా పౌరాణిక గాథలను చెప్పుకున్నా.. ఇందులో మరేదైనా సాంస్కృతిక మర్మం దాగి వుందా? ఇక్కడి విగ్రహం ధర్మం, ప్రధాన ద్వారం, ప్రసాదం వరకూ ప్రతిదీ ఓ చారత్రాత్మక- సాంస్కృతిక- ఆధ్యాత్మిక వైభోగమే. అదేమిటో చూద్దాం.

జగన్నాథ్ ఆలయమున్న స్థలాన్ని శ్రీక్షేత్రగా పిలుస్తారు. ఇది మన   భారతీయ సంస్కృతులకు అద్దం పడుతుందని అంటారు.  ఈ స్థలాన్ని భారతీయ చరిత్రలోకెల్లా భిన్నమైందిగా భావిస్తారు. పౌరాణికాంశాలను పక్కన పెట్టి చరిత్ర ప్రస్తావిస్తే.. శబరాలనే ఆదివాసీలు జగన్నాథుడ్ని చెక్కరూపంలో చెక్కి నారాయణ రూపంగా పూజించేవారు. ఈ చెక్క విగ్రహాలు, ప్రాచీన కాలం నుంచి వస్తున్న చెక్క స్తంభాలను కొలవటం అనే ఆచారంతో ముడిపడిన అంశాలని అంటారు. అంతేకాదు ఒడిశ్శాకు చెందిన ఆదివాసీ వంశస్థులుగా చెప్పుకొనే ధైతపతులు ఇప్పటికీ ఆలయంలో జరిగే పూజా కార్యకలాపాల్లో పాల్గొంటారు. దీన్ని బట్టి..  శ్రీక్షేత్ర చరిత్ర హైందవ- ఆదివాసీ సంస్కృతులకు చెందిందని చెప్పవచ్చు. 

ఇలా జగన్నాథ సేవ భారతీయ సంస్కృతిలో భాగమయ్యింది. అంతే కాదు జైన సంప్రదాయానికీ జగన్నాథ ఆరాధనకూ సంబంధముంది. ఈ మూడు విగ్రహాలు.. త్రిరథ జైన ఆచారాలుగా పిలిచే సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానంద్, సమ్యక్ చరిత్రకు ప్రతీకగా భావిస్తారు.  మోక్షం లేక అనంతమైన ఆనందానికి మార్గమని దీనర్ధం. 

జగన్నాథుడు  ఇక్కడ వైష్ణవ రూపుగా కొలవబడుతున్నాడు. అదే సమయంలో ఈ ఆలయంలోని మరికొన్ని విగ్రహాలను శివ రూపమైన భైరవ, శివ పత్ని  విమలగా కొలుస్తుంటారు.  పూరి జగన్నాథ్ శ్రీక్షేత్ర  సంస్కృతీ సంప్రదాయాలు.. హైందవంలోని శివ-శక్తి- వైష్ణవ తత్వాలకు ప్రతీకలుగా నిలిచాయి. అలాగే జైన, బౌద్ధమతాల్లోని అంశాల మేలుకలయికతో ఏర్పడినట్టు కూడా చెబుతారు.   

పూరీ ఎంతటి ప్రసిద్ధ క్షేత్రమంటే, ఇప్పటి వరకూ ప్రతి హైందవ మతాచార్యుడూ ఈ క్షేత్ర దర్శనం చేశారు. ఒక్క మాధవాచార్యులు తప్ప.. ఈ క్షేత్రాన్ని ప్రముఖ ఆచార్యులందరూ దర్శించారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు. అలాగే రామానుజాచార్య, నింబర్కాచార్యలతో పాటు గుడియ వైష్ణవ మతానికి చెందిన అనేక మఠాలను ఇక్కడ చూడవచ్చు. శ్రీపాద వల్లభాచార్య కూడా పూరీని సందర్శించినప్పుడు.. ఇక్కడ తన భైఠకాన్ని ఏర్పరుచుకున్నారు. గురునానక్, కబీర్, తులసీదాస్ లు కూడా ఈ స్థలాన్ని దర్శించిన ఆధారాలున్నాయి. 

పూరీ ఆలయం విశాలమైంది. నాలుగు లక్షల చదరపు అడుగుల  కన్నా ఎక్కువ వైశాల్యంలో నిర్మించబడి వుంది. ఇందులో సుమారు 120 ఉపాలయాలు, ఇతర పూజా స్థలాలున్నాయి. ఒడిశ్శా నిర్మాణ శైలిలో.. అమోఘమైన శిల్ప సంపద దర్శనమిస్తుంది. అందుకే పూరీ జగన్నాథ ఆలయాన్ని భారత అద్భుత కట్టడాలలో ఒకటిగా చెబుతారు. ప్రధాన ఆలయంలో విష్ణువుకు చెందిన శ్రీచక్ర నిర్మించబడి వుంటుంది. ఇది ఎనిమిది ఆకుల చక్రం. దీన్ని "నీలచక్ర"గానూ పిలుస్తారు. అష్టదాతుతో తయారైన ఈ చక్రం ఎంతో పవిత్రమైంది. ఈ ఆలయ ధ్వజస్తంభం ఎత్తైన  రాతి దిమ్మపై ఉంది. ఇది విగ్రహాలున్న గర్భగుడి కన్నా ఎత్తులో వుంటుంది. 

మాములుగా ఆలయంలోకి వెళ్లే ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సింహద్వారంగా పిలుస్తుంటారు. పూరీ ఆలయం చూస్తే ఇలా ఎందుకు పిలుస్తారో అర్ధమవుతుంది. దీనికా పేరు రావటానికి కారణం.. ద్వారాలకు ఇరువైపులా వుండే రాతి సింహాలు. ఆలయంలోని మిగిలిన మూడు ద్వారాల పేరేమిటో తెలుసా.. హాథీద్వార, వ్యాఘ్రద్వారా, అశ్వద్వారా. అంటే ఏనుగు, పులి, గుర్రపు ద్వారాలన్నమాట. ప్రధానమైన సింహ ద్వారం.. తూర్పు ముఖంగా ఉండి 'బడా దందా' గా పిలిచే  పెద్ద రోడ్డు కు దారి చూపుతుంది . బైసీ పహచ అంటే, ఇరవై రెండు మెట్ల వరుస.. ఆలయంలోకి దారి చూపుస్తుంది. 

రథయాత్ర మొదలయ్యే ముందు జగన్నాథ్, బలభద్ర, సుభద్రల విగ్రహాలను ఈ దారిలోనే తీసుకెళ్తారు. వాటిని గుండీచ మందిరం నుంచి తీసుకు వచ్చేటప్పుడు తనను నిర్లక్ష్యం చేసి  యాత్రకు తీసుకు వెళ్లనందుకు అలిగిన మహాలక్ష్మిని జాతర రూపంలో శాంత పరుస్తారు. అప్పుడే విగ్రహరూపంలో ఈ ద్వారం తలుపులపై ఉన్న మహాలక్ష్మి వారిని ఆలయంలోకి రావడానికి అనుమతిని ఇస్తుందని నమ్ముతారు. అంతే కాదు పూరీ ఆలయ ప్రసాదం కూడా అద్భుతమైన రుచి కలిగి వుంటుంది. నూనె చుక్క వాడకుండా మట్టికుండలను ఒకదానిపై ఒకటి పెట్టి, వేడి చేసి వుడక పెడతారిక్కడి ప్రసాదాన్ని. దీనికింతటి రుచి రావడానికి కారణం..  సాక్షాత్తూ ఆ మహాలక్ష్మీ దేవి పర్యవేక్షణలో వంటావార్పు జరగడమే అని నమ్ముతారు.  

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి 

Tuesday, June 16, 2020

1800 మరియు 1900 మధ్య తీసిన జగన్నాథ్ పూరి యొక్క అరుదైన ఫోటోలు - Rare Photos of Jagannatha Puri from the 1800’s and 1900’s
ఒరిస్సాలోని జగన్నాథ్ పూరి యొక్క పాత అరుదైన చిత్రాల చూడవచ్చు . ఈ ఫోటోలను  విలియం హెన్రీ కార్నిష్ 1880 నుండి 1890 మధ్యన తీశారు.

1892 లో విలియం హెన్రీ కార్నిష్ చేత తీసిన జగన్నాథ ఆలయం యొక్క సింహం ద్వారం మరియు అరుణ-స్తంభాల దగ్గరి దృశ్యం.
1892 లో విలియం హెన్రీ కార్నిష్ చేత తీసిన జగన్నాథ ఆలయం యొక్క సింహం ద్వారం మరియు అరుణ-స్తంభాల దగ్గరి దృశ్యం.

1892 లో విలియం హెన్రీ కార్నిష్ చేత తీసిన చిత్రంలో ఆలయ ముందు భాగంలో ఉన్న బజార్‌తో తూర్పు నుండి జగన్నాథ ఆలయం వైపు చూడండి.
1892 లో విలియం హెన్రీ కార్నిష్ చేత తీసిన చిత్రంలో ఆలయ ముందు భాగంలో ఉన్న బజార్‌తో తూర్పు నుండి జగన్నాథ ఆలయం వైపు చూడండి.

1971 లో అసుతోష్ సిన్హా తీసిన చిత్రం: నందిగోష్ రథంపై చేరపహన్రా సమయంలో గజపతి మహారాజా దిబ్యాసింగ్ దేవ్.
1971 లో అసుతోష్ సిన్హా తీసిన చిత్రం: నందిగోష్ రథంపై చేరపహన్రా సమయంలో గజపతి మహారాజా దిబ్యాసింగ్ దేవ్.పూరిలోని జగన్నాథ ఆలయ సముదాయంలోని డోలా-మండపం యొక్క ఛాయాచిత్రం పూర్నో చందర్ ముఖర్జీ 1890 లో తీసినది.
పూరిలోని జగన్నాథ ఆలయ సముదాయంలోని డోలా-మండపం యొక్క ఛాయాచిత్రం పూర్నో చందర్ ముఖర్జీ 1890 లో తీసినది.


1960 లో అసుతోష్ సిన్హా తీసిన చిత్రంలో - జగన్నాథ ప్రభువు రథ రథాల నిర్మాణం.
1960 లో అసుతోష్ సిన్హా తీసిన చిత్రంలో - జగన్నాథ ప్రభువు రథ రథాల నిర్మాణం.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

Saturday, August 19, 2017

పూరీ జగన్నాథ దేవాలయం మరియు రథయాత్ర - Jagannadha Radhayatra

పూరీ జగన్నాథ దేవాలయం మరియు రథయాత్ర - Jagannadha Radhayatra

న దేశము లో నాలుగు దిక్కులావున్న పవిత్ర పుణ్యక్షేతాలను ' చార్ ధామ్‌' గా పిలుస్తారు .
 1. ఉత్తరాన - బదరీ,
 2. దక్షినాన - రామేశ్వరము ,
 3. పడమరన - ద్వారక ,
 4. తూర్పున - పూరీ క్షేత్రాలు ఉన్నాయి .
ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జులై నెలల్లో ( ఆషాడ శుద్ద విదియ నుండి )నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి.దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.

పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథుడు (విశ్వానికి ప్రభువు) పేరుతో ఆలయ దైవం యుంటుంది. సంస్కృత భాషలో జగత్ (విశ్వం) మరియు నాథ్ (ప్రభువు) అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారం, భక్తులకు ముఖ్యంగా విష్ణువు మరియు కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన "ఛార్ థాం" పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది.

ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా మరియు అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. మధ్య కాలంనుంచి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడిపడి ఉంది. వైష్ణవ సంప్రదాయాలకు మరియు ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది. గౌడియ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది. ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చాన్నాళ్ళు పూరిలోనే నివసించాడు.
పూరి జగన్నాథుని ఆలయ శిఖరాలపై సుదర్శన చక్రానికి సంబంధమున్న వైదికర్మల చక్రాలు మరియు పతాకాలు. ఎరుపు పతాకం జగన్నాథుడు భవనంలోనే ఉన్నాడని సూచిక.
దేవాలయ మూలాలు:
ఈ మధ్యనే కనుగొన్నగంగా రాజవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారం, ప్రస్తుతమున్న
జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడగంగాదేవ ప్రారంభించాడు. ఈ ఆలయంలోని జగన్మోహన మరియు విమన భాగాలు అతని హయాం (1078 - 1148 CE) లోనే నిర్మింపబడ్డాయి. కాని 1174 CE లో ఒడిషా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునఃనిర్మించి ఈ ఆలయానికి ప్రస్తుతమున్న రూపునిచ్చాడు. 1558లో ఒడిషాపై ఆఫ్ఘన్ సేనాధిపతి కాలాపహాడ్ దాడి చేయక ముందు వరకు ఆలయంలో జగన్నాథున్ని కొలవటం కొనసాగింది. తర్వాత కాలంలో రామ చంద్ర దేవ, ఖుర్దా అనే స్వతంత్ర రాజ్యాన్ని ఒడిషాలో ఏర్పరిచినప్పుడు ఈ ఆలయాన్ని పవిత్రం చేసి, విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాడు.

ఐతిహ్యం:
ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని పన్నెండో శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్‌ మొదలుపెట్టాడు. ఆయన మనుమడు రాజా అనంగభీమదేవ్‌ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనకో కథ ఉంది. జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ, నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడనీ స్థలపురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడతాడు. విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు, అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి తెలివిగా దారిపొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునే లోగానే విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించనిదీ అందుకేనంటారు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి.

దేవాలయ మూలాలకు సంభందించిన కథ:
ఈ ఆలయ మూలాలకు సంబంధించిన సంప్రదాయ గాథల ప్రకారం, క్రిత యుగం చివరలో అసలు రూపంలో జగన్నాథుడు (విష్ణువు విగ్రహరూపం), పూరి సముద్రతీర సమీపంలోని మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల లేదా ఒక నీలి ఆభరణంగా అవతరించాడు. అది ఎంత ప్రకాశావంతమైనదంటే దాన్ని చూసినవారికి తక్షణ మోక్షం లభిస్తుంది. కనుక ధర్మదేవుడు లేక యముడు దాన్ని భూమిలో దాచిపెట్టాలనుకున్నాడు. అందులో విజయం కూడా సాధించాడు.ద్వాపర యుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు అంతుపట్టని ఆ రూపం గురించి తెలుసుకోవాలని సంకల్పించి తన లక్ష్యం కోసం ఘోరమైన తపస్సు చేయసాగాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి, పూరి సముద్ర తీరానికి వెళ్లి అక్కడ తేలే చెట్టు దుంగను కనుక్కొని దాని కాండంలో నుంచి తనకు కావలసిన రూపును తయారు చేసుకొమ్మని అతన్ని ఆజ్ఞాపించాడు. ఆ రాజు చెక్క దుంగను కనుక్కొన్నాడు.తర్వాత అతను అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించాడు. దానికి యజ్ఞనరసింహరాజు ప్రత్యక్షమై నారాయణున్ని నాలుగు అక్షలలో విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు. అవి పరమాత్ముణ్ణి వాసుదేవుని లాగా, వ్యూహని సంకర్షణ వలె, యోగమయని సుభద్ర లాగా మరియు విభవున్ని సుదర్శన వలె నిర్మించామన్నాడు. రాజు ముందు విశ్వకర్మ చిత్రకారుని రూపంలో ప్రత్యక్షమై చెట్టునుంచి జగన్నాథ, బలభద్ర మరియు సుభద్రల రూపాలను తయారు చేశాడు.

ఆచార్యులు మరియు జగన్నాథ పూరి:
మాధవాచార్యులు తప్ప ఈ క్షేత్రాన్ని అందరు ఆచార్యులు దర్శించారు.ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు.దీంతో పాటు రామానుజాచార్య, నింబర్కాచార్య మరియు గుడియ వైష్ణవ మతానికి చెందిన అనేక మఠాలను ఇక్కడ చూడవచ్చు. శ్రీపాద వల్లభాచార్య కూడా పూరిని సందర్శించినప్పుడు ఇక్కడ తన భైఠకాన్ని ఏర్పరుచుకున్నారు. గురునానక్, కబీర్ మరియు తులసీదాస్ లు కూడా ఈ స్థలాన్ని దర్శించినట్లు ఆధారాలు ఉన్నాయి.

ఆలయ నిర్మాణం:
ఈ భారీ ఆలయ భవనం 400,000 square feet (37,000 m2) కన్నా ఎక్కువ వైశాల్యంతో ప్రహరీగా చుట్టూ ఎత్తైన కోటగోడలను కలిగి ఉంది. ఇందులో కనీసం 120 గుళ్ళూ మరియు పూజా స్థలాలు ఉన్నాయి. ఒడిషా శైలి నిర్మాణ గుణాలను మరియు అమోఘమైన శిల్ప సంపదను కలిగిన ఈ ఆలయం, భారత అద్భుత కట్టడాలలో ఒకటి.

ప్రధాన ఆలయం కిందనుంచి పైకి కొంచెం వంపులు తిరిగి ఉండి దానిపైన విష్ణువుకు చెందిన శ్రీచక్ర (ఎనిమిది ఆకుల చక్రం) వుంటుంది. "నీలచక్ర"గా కూడా పిలవబడి, అష్టదాతుతో తయారైన ఈ చక్రం ఎంతో పవిత్రమైనది. ఈ ఆలయ ధ్వజస్తంభం ఎత్తైన ఒక రాతి దిమ్మపై నిర్మింపబడింది. ఇది విగ్రహాలు వున్న గర్భగుడి కన్నా ఎత్తు 214 feet (65 m)లో ఉంది చుట్టు పక్కల పరిసరాలలో పెద్దదిగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న గుళ్ళు, మండపాల యొక్క న్యూచగస్తూప రూపంలోని గోపురాలు ధ్వజస్తంభం చుట్టూ మెట్లుగా ఉండి పర్వతశ్రేణిని తలపిస్తాయి.

ప్రధాన పూజాస్థలం ఎత్తైన గోడతో చుట్టబడి 20 feet (6.1 m) ఉంటుంది. ఇంకొక గోడ ప్రధాన ఆలయాన్ని చుట్టి ఉంటుంది.

1870లో సింహాల శిలలు మరియు ముందువరుసలో అరుణ స్తంభాన్ని కలిగిన సింగద్వారం.
1870లో సింహాల శిలలు మరియు ముందువరుసలో అరుణ స్తంభాన్ని కలిగిన సింగద్వారం.
ఆలయ సింహద్వారం
సంస్కృతంలో సింగద్వారం గా పిలవబడే సింహ ప్రవేశం ఆలయంలోని నాలుగు ద్వారాలలో ఒకటి మరియు ఆలయం లోపలికి వెళ్ళటానికి ప్రధాన ప్రవేశద్వారం. దీనికి ఆ పేరు రావటానికి కారణం ఆ ద్వారం రెండు ప్రక్కల ఉన్న గాండ్రించే సింహాల పెద్ద రాతి శిలలు. ఈ ద్వారం తూర్పు ముఖంగా ఉండి బడా దందా లేదా పెద్ద రోడ్డుకు దారి చూపుతుంది .బైసీ పహచ లేదా ఇరవై రెండు మెట్ల వరుస ఆలయ భవనంలోకి దారి చూపుస్తుంది. సంస్కృతంలో పతిత పావన గా పిలిచే జగన్నాథుని శిల్పం ప్రవేశంలో కుడివైపున చెక్కివుంటుంది. పతిత పావన అంటే అణగారిన మరియు దిగజారిన వారి బాంధవుడు అని అర్థం. ప్రాచీన కాలంలో ఆలయంలోకి అంతరానివాళ్ళకు ప్రవేశం వుండేది కాదు కనుక వాళ్ళు ఈ పతిత పావనున్ని పూజించేవాళ్ళు. జయ, విజయ అనే ఇద్దరు ద్వారపాలకుల ద్వారానికి రెండు వైపులా నుంచుని వుంటారు. రథయాత్ర మొదలయ్యే ముందు జగన్నాథ్, బలభద్ర మరియు సుభద్రల విగ్రహాలను ఈ దారిలోనే తీసుకెళ్తారు.వాటిని గుండీచ మందిరం నుంచి తీసుకు వచ్చేటప్పుడు తనను నిర్లక్ష్యం చేసి తమతో పాటు యాత్రకు తీసుకు వెళ్లనందుకు అలిగిన మహాలక్ష్మిని జాతర రూపంలో శాంత పరుస్తారు. అప్పుడే విగ్రహరూపంలో ఈ ద్వారా తలుపులపైన ఉన్న మహాలక్ష్మి వారిని ఆలయంలోకి రావడానికి అనుమతిని ఇస్తుంది. ప్రధాన ద్వారం ముందు అద్భుతమైన పదహారు ముఖ ఏకశిలా స్తంభామైన అరుణ స్తంభం కూడా ఉంది. దీని పైభాగంలో సూర్య భగవానుడి రథసారథి అయిన అరుణుడి విగ్రహం వుంటుంది. అసలు ఈ స్తంభం కోణార్క్ లోని సూర్య ఆలయంలో ఉంటే, ఖుర్దా రాజు ఇక్కడికి మార్పిడి చేయించాడు.
జగన్నాథ, బలభద్ర మరియు సుభద్రల నకలులు.
జగన్నాథ, బలభద్ర మరియు సుభద్రల నకలులు.
జగన్నాధుని విగ్రహాలు: 
గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ్, బలభద్ర మరియు సుభద్రల మూల విరాట్టులు రాత్నవేది అనే ఆభరణాలతో అలంకరించిన దిమ్మెపై కొలువు తీరి ఉంటారు. వీటితో పాటే సుదర్శన చక్ర, మదనమోహన, శ్రీదేవి మరియు విశ్వధాత్రిల విగ్రహాలు కూడా రాత్నవేదిపై ఉంటాయి. జగన్నాథ్, బలభద్ర, సుభద్ర మరియు సుదర్శన చక్రాల విగ్రహాలు దారు బ్రహ్మగా పిలిచే పవిత్రమైన వేప కాండాల నుంచి తయారయ్యాయి.కాలాలను బట్టి ప్రతిమల నగలు, దుస్తులను మార్పు చేస్తుంటారు. వీటిని కొలవటం ఆలయ నిర్మాణం ముందు నుంచే అంటే ప్రాచీన ఆదివాసుల కాలం నుంచే ఉండేది.

ఆలయ వంటశాల మరియు మహాప్రసాదం:
జగన్నాథ ఆలయ వంటశాల భారతదేశంలోనే అతి పెద్ద వంటశాల. సంప్రదాయాల ప్రకారం ఇక్కడ వండిన వాటిని శ్రీమందిర రాణి అయిన మహాలక్ష్మి దేవి పర్యవేక్షిస్తుందని అంటారు. ఒకవేళ అక్కడ తయారైన వంటలలో ఏదైనా లోపం వుంటే వంటశాల దగ్గర కుక్క నీడ కనిపిస్తుందని చెబుతుంటారు.మహాసురులుగా పిలిచే వంటవాళ్ళు దీన్ని మహాలక్ష్మిదేవి కలతకు ప్రతీకగా భావించి ఆ వంటను సమాధి చేసి మళ్ళీ కొత్తగా వంట మొదలు పెడతారు. ఇక్కడ మొత్తం వంటంతా హిందూ ఆచారాల ప్రకారం జరుగుతుంది. వంటకు మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు. వంట కోసం వంటశాల దగ్గర వున్నా గంగ, యమునా అనే రెండు పవిత్ర బావుల నుంచి తోడిన నీటిని మాత్రమే ఉపయోగిస్తారు.ఇక్కడ ఐదు ప్రత్యేక ముహుర్తా లలో రత్నవేది మరియు భోగ మండపాలలో ఉన్న ప్రతిమలకు పెట్టడానికి 56 రకాల నైవేద్యాలు ఉన్నాయి.ఆలయ వైదిక కర్మల ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు పెట్టె కోతోభోగ లేదా అబద అనే ప్రసాదం కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. జగన్నాథునికి సమర్పించిన తర్వాత ఈ భోజనాన్ని తగినంత మొత్తంలో మహా ప్రసాదంగా ఆలయంలోని సింహద్వారానికి ఈశాన్యంలో ఉన్న ఆనంద బజారులో పంచుతారు. అక్కడి భక్తులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.

జగన్నాధుని పండుగలు:
స్నాన యాత్రా సందర్భంగా పూరి జగన్నాథ ఆలయాన్ని ధర్శించుకుంటున్న భక్తులు.
రోజూవారి ఆరాధనా సేవలు వివరంగా ఉన్నాయి. ప్రతీ సంవత్సరం ఇక్కడ వేలాదిగా భక్తులు తరలివచ్చే పండుగలు అనేకం జరుగుతుంటాయి. అన్నిటికన్నా ముఖ్యమయినది జూన్ లో జరిగే రథయాత్రగా పిలిచే రథాల ఉత్సవం పండుగ. ఈ బ్రహ్మాండమైన పండుగలో జగన్నాథుడు, బలరాముడు మరియు సుభద్రల విగ్రహాలు ఉన్న మూడు పెద్ద రథాలను ఊరేగిస్తారు.ఈ ఊరేగింపు బడా దందా గా పిలిచే పూరిలోనే అతిపెద్ద మార్గంనుంచి చివరి గమ్యస్థలమైన గుండీచ ఆలయం వరకు జరుగుతుంది.

ప్రతి పన్నెండు నుంచి పందొమ్మిది ఏళ్ళకొకసారి ఏ ఎడాదిలోనైతే ఆషాఢ మాసం రెండుసార్లు వస్తుందో అప్పుడు నబకలేవర ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను కొత్త వాటితో మారుస్తారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే చందనయాత్ర పండుగ రథోత్సవం కోసం రథాల నిర్మాణం ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో జ్యేష్ట మాసంలోని పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంతకాలంలో డోలయాత్ర మరియు వర్షాకాలంలో ఝులన్ యాత్ర లాంటి పండుగలను ప్రతిఏటా నిర్వహిస్తారు. పంజిక లేదా పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం మరియు దమనక ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే కార్తీక, పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంటారు.

అలాగే విమలాదేవి కోసం ఆశ్వీజ మాసం యొక్క మహాలయ ప్రారంభానికి 8 రోజుల ముందు అలాగే విజయదశమి ముగింపునకు సూచకంగా జరిగే షోడశ దినాత్మక అనే 16 రోజుల పూజకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో మదనమోహన మరియు విమల యొక్క ఉత్సవ మూర్తులు పాలు పంచుకుంటాయి.

బ్రహ్మపరివర్తన వేడుక
పూరీ జగన్నాథ క్షేత్రంలో ఆలయంలోని జగన్నాథుడి మూలవిరాట్టులో ఉండే బ్రహ్మ పదార్థాన్ని.. కొత్తగా రూపొందించిన దారుశిల్పంలోకి మార్చే ఉత్సవాన్ని బ్రహ్మపరివర్తన వేడుక అంటారు. ఇది జ్యేష్ఠ మాసపు కృష్ణ చతుర్దశి నాడు అర్ధరాత్రి 'బ్రహ్మం' మార్పిడి అత్యంత గోప్యంగా జరుగుతుంది, ఈ బ్రహ్మపదార్థం మార్పిడి పూర్తయితే కొత్త దారు విగ్రహాలకు జీవం వచ్చినట్టే భావిస్తారు. ఆ విగ్రహాలకు పట్టువస్త్రాలు ధరింపజేసి బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.

అనావాసర లేదా అనాసర
వాడుక భాషలో విహార యాత్ర అని అర్థం.ప్రతీ ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరిగే పవిత్ర స్నాన యాత్ర తర్వాత జగన్నాధ, బలభద్ర, సుభద్ర మరియు సుదర్శన విగ్రహాలు అనవాసర ఘర్గా పిలిచే రహస్య మందిరానికి వెళ్లి అక్కడే తర్వాత కృష్ణ పక్షం వరకు ఉంటాయి.కాబట్టి అప్పుడు వాటిని భక్తులు చూడడానికి వీలు పడదు.బదులుగా భక్తులు బ్రహ్మగిరి అనే సమీప ఊరులో విష్ణు స్వరూపమైన అల్వర్నాథ్ అనే నాలుగు చేతుల రూపాన్ని కొలుస్తారు.భక్తులకు కేవలం రథయాత్ర ముందు రోజు మాత్రమే మొదటి చూపు దక్కుతుంది. దీనిని నవయవ్వన అని అంటారు. అధిక స్నానం తర్వాత దేవుళ్ళకు జ్వరం చేసిందని అందుకే పదిహేను రోజులపాటు రాజ వైద్యునితోటి చికిత్స చేయిస్తారు.

జగన్నాధుని చేరుటకు ప్రయాణ మార్గాలు:
 • ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం ఉంది.
 • భువనేశ్వర్‌లోని బిజూపట్నాయక్‌ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో ఉంది.
 • దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి.
 • కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్‌ రైల్వేస్టేషన్‌ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో ఉంది.
 • భువనేశ్వర్‌, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.
సంప్రదించండి:
 • Shree Jagannath Temple
 • Administration, Puri
 • Phone : +91-6752-222002/252900 
 • Fax : +91-6752-252100
 • E-Mail : jagannath[dot]or[at]nic.in

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com