నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label స్థితి - సృష్టి - లయ. Show all posts
Showing posts with label స్థితి - సృష్టి - లయ. Show all posts

Tuesday, July 28, 2020

సృష్టి - Srushtiసృష్టి - Srushti

ఈ సమస్త సృష్టి వుద్బవించడానికి కారణం ఏమి మరియు ఈ సమస్త సృష్టి పాలకుడు ఎవరు ఈ సమస్తం ఎవరి చేత సృస్టింపబడుతుంది , ఎవరిచేత నాశనమవుతుంది మరియు ఎవరి ఆజ్ఞ చేత ఇది పాలించబడుతుంది అన్న విషయాన్ని ఇందులో మనం తెలుసుకుందాం.
సృష్టి - Srushti
సృష్టి - Srushti

సహస్రయుగపర్యంతం అహర్యద్బ్రహ్మనో విదు !
రాత్రిం యుగాసహస్రాoతాo తే హొరాత్రవిదో జనా !!   
(భగవద్గీత : 8.17)
వేయి ( పెక్కు ) యుగముల కాలము బ్రహ్మ (మూల ప్రకృతి) కి ఒక పగలు. అంతే కాలము తరువాత రాత్రి ముగుస్తుంది .

అవ్యక్తాద్వ్యక్తయః సర్వా ప్రభావoత్యహరాగమే !
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్త్రైవావ్యసoజ్ఞకే !!   
(భగవద్గీత : 8.18)    
( బ్రహ్మ ) పగలు ఆరంభమున సకలము అవ్యక్తమునుండి వ్యక్తమగును. రాత్రి రాగానే అవ్యక్తమునందు లీనమగును. (దీనిని ఒక కల్పమందురు).

సృష్టి ఆరంభమునకు ముందు అంతయూ శూన్యమే(ఆ శూన్యమే శక్తి అదియే భగవంతుడు). ఎక్కడను ఏమియు లేదు. సృష్టి అరంభమవగానే శున్యము నుండి శక్తి బయల్పడి (దానినే యోగమాయ అంటారు) అతి వ్యాపింప నారంభించెను. ఆవిధంగా శూన్యము నుండి లక్షల కోట్ల సౌర మండలాలు ఉద్భవించి వాటిలో ప్రకృతి , పెక్కు చరాచరులు, జీవరాశులు ఏర్పడినవి.

(ఇప్పటి సృష్టి మొదలై సుమారు 1400 కోట్ల సంవత్సరాలైనవని ఖగోళ శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు . సుమారు 10 వేల కోట్ల సంవత్సరాల తరువాత ఈ సృష్టిలోని సర్వస్వము శక్తిగా మారి అదృస్యమగునని తెలుపుతున్నరు . దీని తరువాత చాల కాలమునకు మరల సృష్టి జరుగునని కొందరు ఖగోల శాస్త్రజ్ఞుల అభిప్రాయము .)

సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్  !
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ !!    
(భగవద్గీత : 9:7)
కల్పాంతమున సకల భూతాలు (మూల ప్రకృతి , పంచభూతాలు, సకల ప్రాణులు ..) నా ప్రకృతిని (అవ్యక్తము) ప్రవేశించును. తిరిగి కల్పారంభమున వానిని నేనే సృజించుచున్నాను.

ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః !
భూతగ్రామమిం క్రుత్స్యమ్ అవసం ప్రకృతేర్వశాత్ !!
(భగవద్గీత : 9:8)
తమతమ స్వభావవశమున పరతంత్రమైయున్న భూత సముదాయమును నా ప్రక్రుతినాశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము మరలమరల పుట్టించుచున్నాను.

మయాద్యక్షేణ ప్రకృతిం సూయతే సచరాచరం !
హేతునాణేణ కౌన్తేయ జగద్విపరివర్తతే !!
(భగవద్గీత : 9:10)
నా అద్యక్షతన భౌతిక ప్రకృతి చరచారాలను (ప్రాణుల్ని) సృస్టించును . ఆ కారణంగా జగత్తు పనిచేయుచున్నది .

భూతగ్రామ స ఏవాయం భాత్వా భూత్వా ప్రలీయతే !
రాత్ర్యాగమే వశ పార్థ ప్రభవత్యహరాగమే !!   
(భగవద్గీత : 8:19
జీవ సముదయమంతయు ఈ విధముగా మరల మరల జన్మించును (బ్రహ్మకు) రాత్రి అవగానే నశించును, (బ్రహ్మకు) పగలవగానే జన్మింతురు.  ఈ విధంగా  ప్రాణి సముదాయము ప్రక్రుతివశమున మాటిమాటి కిని ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభకాలమున లీనమగుచుండును. మరల పగటి ప్రారంభ కాలమున పుట్టుచుండును.


కానీ మోక్షమును పొందిన వారు మాత్రం మరల మరల పుట్టరు. ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు. ఇదియే పరమగతి అని, పరమపదము అనియు అందురు. (భగవద్గీత : 8:21)

అనగా ఈ సమస్త సృష్టి వుద్బవించడానికి కారణం ఒకరే ఆయనే పరమాత్మా (అదియే శక్తి) మరియు ఈ సమస్త సృష్టి పాలకుడు కూడ ఆయనే, ఆయన చేతనే ఈ సమస్తం సృస్టింపబడుతుంది , నాశనమవుతుంది మరియు ఆయన ఆజ్ఞ చేత ఇది పాలించబడుతుంది.

సంకలనం: కోటేశ్వర్

Tuesday, April 21, 2020

పురుషసూక్తం - PurushaSuktamపురుషసూక్తం - PurushaSuktam
పురుషసూక్తం - PurushaSuktam
పురుష అనగా "తత్వం". (పురుషుడు అని అర్ధం కాదు. వివరించే అంశానికి రూపం లేదు, లేదా ఆ రూపాన్ని వివరించే సమానమైన ఉన్నతమైన నామం లేదు. 

పురుష అనేది శక్తి తత్వాన్ని చూపుతుంది). మనం ఈ భూమి పైకి రాక ముందు మన నివాసం అమ్మ. మన ఈ శరీరభాగాలు అమ్మ అందించిన వరాలు. అలాగే ఈ అనంత కోటి గ్రహనక్షత్ర సముదాయం అంత జగదాంబ నుంచి ఉద్బవించాయి.
మనలోని ఈ బలానికి మూలం, కారణం అమ్మ ఎలా అవుతుందో!!!, ఈ సృష్టి యొక్క ఉత్పతి కి కారణం కూడా అమ్మే అవుతుంది!!!.
సృష్టి ఆవిర్బావం వివరణ చేయాలంటే ఒక స్వరూపం కావాలి కనుక విశ్వమాత ఐన జగదాంబను శక్తితత్వంగా గ్రహిస్తున్నాను...పురుష సూక్తంలో పురుష అనే పదం శక్తి యొక్క స్వభావాన్ని,తత్వాన్ని తెలుపునది .ఈ చరాచర జగత్తుని నడిపిస్తున్న శక్తి స్వరూపం ఎలా ఉంటుంది??? అని ప్రశ్నించుకుంటే. దానికి సమాధానం ఈ పురుష సూక్తం!!!. సమస్తం ఇందులో ఉంది.
ప్రారంభం. 
(శ్లో) హరి ఓం||
తచ్చం యోరావృనీ మహే|గాతుం యజ్ఞ్యయా |
గాతుం యజ్ఞయ పతయే|దైవీ స్వస్తిరస్తునః |
స్వస్తిర్మానుషేబ్యహ|ఊర్ద్వమ్ జిగాతు భేషజం |
శంనో అస్తు ద్విపదే|శం చతుస్పదె |
ఓం శాంతిశాంతిశాంతిహీ ||
వివరణ:- అజ్ఞానం చేత కప్పివేయ్యబడి నిర్లక్షం చెయ్యబడిన ఈ విజ్ఞానాంశాన్ని భగవదనుగ్రహం కోసం ఆ స్వరూపం పైన భక్తి,ప్రేమా కలిగేవిధంగా తెలుసుకోవాలి అని నిర్నయించుకుంటూ, శ్లోకజనీత పదములకు అధిపతి వైన నీవు. ఈ శ్లొకార్దరూపం లోని వేడుకోలుకి ప్రసన్నమై నీ కృపాకటాక్ష వీక్షనాలతో నన్ను, ఈ ప్రపంచాన్ని,సమస్త జంతు పశు పక్ష్యాదులను రక్షిస్తూ.నీ అనుగ్రహం తో వాటిని ఆరోగ్యకరంగా ఉంచుము.

విరాట్స్వరూప వర్ణన ప్రారంభం:
సహస్ర శీర్షా పురుషః|సహస్రాక్షః సహస్రపాద్ |
సభూమిం విశ్వతో వృత్వా|అత్యద్ష్ట దశ అంగుళం ||
వివరణ:- ఈ విశ్వం లోని గ్రహాలను,నక్షత్రాలను శిరస్సులుగా. నేత్రములుగా, పాదములుగా కలిగి వెయ్యి తలలు వేల కన్నులు, పాదాలు కలిగి ఉండి.వాటి ద్వారా ఈ ప్రపంచానికి దిక్కులు,ఆకాశం ను కలిగించి ఎల్లప్పుడు ఈ శక్తి స్వరూపం రక్షిస్తూ ఉంటుంది. ఈ శక్తితత్వం యొక్కరూపాలు పదివేళ్ళతో లెక్కపెట్టలేనన్ని సంఖ్యలో ఉంటాయి.

పురుష ఏ వేదాగం సర్వం|
యద్బూతం యత్ చ్చభావ్యం |
ఉతామృతత్వస్యేసానాహా |
యదన్నే నాతిరోహాతీ ||
వివరణ: ఈ శక్తి స్వరూపం లేక శక్తి తత్వం సర్వాన్ని ఆవరించి ఉండి..,. ఏదైతేజరిగిందో, ఏదైతే జరుగుతోందో ఇంకా ఏదైతే జరగబోతోందో అన్నింటికి ఆ శక్తియే కారణమై ఉంటుంది. అన్నం నచ్చక పోయినంత మాత్రాన,తినకపోయినంత మాత్రాన అన్నపదార్దం విషతుల్యం అవ్వదు.నమ్మకపోయినంత మాత్రాన విజ్ఞానం అజ్ఞానం కానేరదు.

ఏతా వానస్య మహిమా |
అతోద్యయాగంశ్చ పురుషః |
పాదోస్య విశ్వా భూతాని |
త్రిపాదస్యామృ తందివి ||
ఆ శక్తి తత్వాన్నికి గల బలం అంతం లేనిది.అంతం లేనట్టి ఆ శక్తి తత్వం ఎల్లప్పుడు విజయాన్నే పొందుతుంది.మహా విశ్వం అంతయు ఆ శక్తి నుంచి ఉద్భవించినదై. నాలుగు వంతులుగా విస్తరించి ఉంది,అందులో ఒక వంతు మన భూలోకం గాను.మిగిలినవి మూడు వంతులు మూడులోకాలగాను ఉద్భవించాయి.

త్రిపాదూర్ద్వా ఉదైత్పురుషః |
పాడో సైహ భావాత్పునః |
తతో విస్వజ్వ్యక్రమాత్ |
సాశనానశనె అభి ||
వివరణ: శక్తి (జగన్మాత) నుంచి ఈ మూడు లోకాలను పాలించుటకు ముగ్గురు అధిపతులు సృష్టించబడ్డారు.వారు సృష్టి స్తితి లయ కారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.వీరు సృష్టి,స్తితి,లయ క్రియలు అదుపుచేస్తూ ఈ సమస్త విశ్వాన్ని వారి ఆధీనంలో ఉంచుకుని ఉండటం వలన,ఈ సమస్త విశ్వం వారి ఆజ్ఞానుసారం నడుస్తూ ఉంటుంది.

తస్మాత్ విరాడ జాయత |
విరాజో ఆదిపురుషః |
సజాతో అత్యరిచ్యత ||
పస్చ్చాద్భూమి మదోపురః|
వివరణ : యోగ నిద్ర లో ఉన్న స్తితి క్రియాదిపతి అయిన విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన పద్మపు మద్యలో ఉన్న బ్రహ్మ మొదటగా యోగ నిద్ర నుంచి మేల్కున్నాడు(అది పురుషః).బ్రహ్మ ద్వారా భూమి పుట్టుక,ప్రాణి పుట్టుక జరిగింది.మొదట సనక సనందాదులు,బ్రహ్మ మానస పుత్రులు,ప్రజాపతులు వీరి నుంచి దేవతలు ఉద్భవించారు.

యత్పురుషేన హవిషా |
దేవా యజ్నమతన్వత |
వసస్తో అస్యాసిదాజ్యం |
గ్రీష్మ ఇద్మ్స్సరద్దవిహ్ ||
బ్రహ్మ సృష్టి నిర్మాణానికి పూనుకున్నాడు.యజ్ఞం చెయ్యటానికి నిర్ణయించుకుని యజ్ఞం చేయటం ప్రారంభించాడు.ఆ యజ్ఞం నుంచి ముందుగా పంచ భూతాలు ఉద్భవించాయి.ఆకాశం(అంతరిక్షం),భూమి,నీరు,వాయువు మరియు అగ్ని.వీరిని ప్రదాన దేవతలుగా చేసి యజ్ఞాన్నిఅగ్నిమరియు మిగిలిన పంచభూతాల సహాయంతో ఉదృతం చేయసాగాడు.తద్వారా వాతావరణం,ఋతువులు మరియు కాలాలు ఏర్పడ్డాయి.

సప్తాస్యాసన్ పరిధయః|
త్రిస్సప్త సమిధః కృతాః |
దేవా యద్యజ్ఞం తన్వానాః |
అభధ్నన్ పురుషం పశుమ్ ||
వివరణ: యజ్ఞం చెయ్యటానికి సమిధలు,నెయ్యి కావాలి.కావున ఆ కాలంలో సమిధలుగా ఏడుగురు దేవతలు సమిధలు గాను,వసంతం నెయ్యి గాను మారి యజ్ఞ కార్యానికి తొడ్పడినారు.కావున యజ్ఞానికి తోడ్పడిన దేవతల పేరు మీదుగా ఈ ప్రక్రియను పిలవటం జరుగుతుంది.కావున వీరి నుంచి మూడు ఏదుల ఇరవై ఒక సూత్రాలు ఏర్పడినాయి.ఇలా వీరి సహాయం తో యజ్ఞం చేస్తూ బ్రహ్మ కామదేనువు(గోమాత,ఆవు)ను సృష్టించాడు.

తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్|
పురుషం జాత మగ్రతః |
తేన దేవా అయజన్త |
సాధ్యా ఋషయశ్చ యే ||
వివరణ: ప్రాణి పుట్టుక లో భాగం గా యజ్ఞం నుంచి మొదట నీటిలో ద్రవ్య రూపం లోని శైవళం ఏర్పడింది.ఈ శైవళం జాతి క్రమంగా మొక్కల వరకు చెట్ల వరకు అభివృధి చెందింది.తరువాత విజ్ఞులు,దేవతలు యజ్ఞాన్ని కొనసాగించారు.

తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః|
సంభ్రుతం పృషదాజ్యమ్ |
పశూగంస్తాగం శ్చక్రే వాయవ్యాన్|
ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే ||
వివరణ: ఈ యజ్ఞం నుంచియే బ్రహ్మ పక్షులను గాలిలో ఎగరటానికి,పశువులను అడవులలో పెరగటానికి సృష్టించాడు.

తస్మా ద్యజ్ఞాత్ సర్వహుతః|
ఋచః సామాని జజ్ఞిరే |
ఛందాగంసి జజ్ఞిరే తస్మాత్|
యజు స్తస్మా దజాయత ||

ఆ యజ్ఞం నుంచియే మొదట వేదానికి పునాది పడింది.

తస్మా దశ్వా అజాయన్త|
యే కే చోభయా దతః |
గావో హ జజ్ఞిరే తస్మాత్|
తస్మా జ్జాతా అజావయః ||
వివరణ: ఈ యజ్ఞం నుంచి ఒక దవడ లేక రెండు దవడలు దంతాలు గల నెమరువేసే జంతువులు.(గుర్రం,ఒంటె,గొర్రె,మేక మొ..) ఉద్భవించాయి.సమస్త ప్రాణి స్వరూపం,ప్రతి రేణువు,ప్రతి రసాయనం ఈ యజ్ఞం నుంచి శాకోపశాకలుగా పుట్టినవే. ఈ విదంగా యజ్ఞం ద్వారా బ్రహ్మ ఈ భూప్రపంచాన్ని సృష్టించాడు.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

Thursday, May 30, 2019

స్థితి - సృష్టి - లయ - మన జన్మ విధి - Srushti, Sthiti, Laya


Srushti, Sthiti, Laya
స్థితి అనగానే మనకు గుర్తొచ్చేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీరిలో విష్ణువు స్థితికారకుడు; బ్రహ్మ సృష్టికారకుడు; శివుడు లయకారకుడు. ముందుగా వీరినిగురించి కొంచెం వివరంగా చెప్పాలి. ఒకానొక కథ ప్రకారము:- విష్ణువు పుత్రుడు బ్రహ్మ. ఎందుకంటే విష్ణువు బొడ్డునుండి పుట్టిన పద్మంనుంచి బ్రహ్మ ఉద్భవించాడు కనుక. అందుకనే బ్రహ్మ స్వతంత్రుడుగా వుండాలేడు. తండ్రితొ జీవనం చెయ్యాల్సిందే. వేరు కాపురం పెట్టలేడు. ఇదికూడా మంచిదే కదండీ! ఉమ్మడి కుటుంబం – కలతలులేని కుటుంబం. ఇక శివుడు. ఈయన భార్య పార్వతి విష్ణువు చెల్లెలుకాబట్టి, విష్ణువుకు బావగారు. కొంచెం బెట్టుపోయినట్లు వుంటాడనీ, ఎవరితో కలవడనీ విష్ణుమూర్తిగారికి కొంచెం కినుక. బావగారు తనకు ఎవరితో పనిలేదన్నట్లుగా విభూతి రాసుకొని, శ్మసానాలలో తిరుగుతూవుంటాడనీ, ఎవరికిబడితే వారికి అనాలోచితంగా వరాలిచ్చేస్తుంటాడని విష్ణువు ఆరోపణ. అయినా చెల్లెలు పార్వతి, పిల్లలూ సంసారం బాగానే నడుస్తున్నదికాబట్టి శివుడితో స్నేహం కొనసాగుతూనేవున్నది. అయితే, బ్రహ్మగారికి శివుడంటే కొంచెం కోపమే. కారణం మీరే ఊహించండి… తెలియరాలేదా? బ్రహ్మగారి సృష్టినంతటినీ చివరకి శంకరుడు లయింపచేస్తుంటాడనేది కారణం.

సరే వీరిగురించి తెలుసుకోవటానికి మరికొంత ముందుకుపోదాం. ఈ ముగ్గురి వ్యవహారం క్షణం తీరికలేదూ, దమ్మిడీ ఆదాయంలేదన్న చందాన వుంటుంది. అదేమిటో చూద్దాం. బ్రహ్మకు శివునిమీద కొంచెం కోపంవున్నా, వీరిద్దరికీ ఒక సారూప్యంవుందండీ! వీరిద్దరూ ఎప్పుడూ కళ్ళుమూసుకునే వుంటారు. బ్రహ్మగారు, కొత్తగా దేన్ని సృష్టిద్దామా అని కనులు మూసుకొని ఆలోచిస్తుంటే, శంకరుడు, ఎవరికీ బాధకలగకుండానే కాలదోషంపట్టిన వాటిని/వారిని ఎలా తనలో లయం చేసుకోవాలా అని కనులు మూసుకొని ‘తపన’ (తపస్సు) పడుతుంటాడు.

బ్రహ్మ తన సృజనశక్తితో ఈ విశ్వాన్ని సృష్టించి, అందులో అనేక గోళాలను సృష్టించాడు. మీకు తెలిసిందేగదా. భూగోళం, సూర్య, చంద్రగోళాలు, నవగ్రహాగోళాలు, నక్షత్ర మండలగోళాలూ. ఇలా ఎన్నో గ్రహగోళాలను సృష్టించి, అవి విశ్వంలో తేలియాడుతూ వుండేటట్లుగా చేసాడు. నీలాకాశంలో మిలమిలా మెరిసేటట్లుగా అందంగా సృష్టించాడు. ఇక భూగోళానికివస్తే, మనుషుల్ని; చెట్లు,చేమల్ని; పశుపక్ష్యాదుల్నీ; జలచరాల్నీ సృష్టించాడు. పంచభూతాల సమ్మేళనంతో ప్రాణుల్ని సృజించి, బాహ్యంలోకూడా పంచభూతాల్ని నిలబెట్టాడు. నదుల్ని, సముద్రాలనీ, కొండల్నీ, అడవుల్ని ఉచితంగా ఇచ్చాడు. మనుషులు, ఇతర ప్రాణులుండటానికి, ఎదగటానికి అంతులేని ఆకాశాన్ని (space) ఆవిష్కరించాడు; పీల్చుకొని, బతకటానికి ప్రాణవాయువునిచ్చాడు; ఆహారం పచనం కావటానికి గాలితోకలిసి మండేలా అగ్నినిచ్చాడు; దాహానికి నీరిచ్చాడు; వుండటానికి, పండటానికి భూమినిచ్చాడు. అన్నీ ఉచితంగానే!! ఇంతకంటే మనకి మరేంకావాలండీ? ఈ పంచభూతాలతోకూడిన ప్రకృతితో సహజీవనంచేస్తే, ప్రాణులకు, ముఖ్యంగా మనుషులకు వేరేవాటితో పనేముంటుంది మీరేచెప్పండి!!
విష్ణుమూర్తి
విష్ణుమూర్తి
ఇప్పుడు విష్ణుమూర్తిగారి విషయానికి వద్దాం. ఈయన సహజంగా శాంతస్వభావుడు. చాలా తెలివిగలవాడేగానీ, మెత్తనివాడు. మెత్తనివాడ్ని చూస్తే మొత్తబుద్దైవుతుందనీ; మోసేవారినిచూస్తే మరింత భారం మోపాలనిపిస్తుందనీ పెద్దలమాట. తండ్రిగారు తన సృష్టిని ఎట్లాగో మోస్తున్నారుగదాఅని, బ్రహ్మగారు కళ్ళుమూసుకొని, కలల ఊహలలో కడలి కెరటాల్లా ఊగిసలాడుతూ, అంతులేని కెరటాల్లా, తన మనస్సులోని ఎన్నెన్నో సంకల్పాలను కంటూ, వాటికి రూపాల్నిచ్చి, బ్రతకమనిచెప్పి, వదిలేస్తుంటాడు. పాపం, విష్ణువుగారు, తనపై భారం ఎక్కువవుతున్నా, కొడుకును కాదనలేకా, పొమ్మనలేకా ( ఎలా పొమ్మంటాడు చెప్పండి – పేగు బంధమాయె – ఆ పద్మజుడు మరి విష్ణువు నాభినుండేకదా పుట్టింది!! ) ఆ సృష్టినంతా స్థితి పరుస్తుంటాడు; ఆయా ప్రాణుల్ని స్తిమితపరుస్తుంటాడు.

ఏమాటకామాటే చెప్పుకోవాలండీ! ఇక్కడో ముఖ్య విషయం చెప్పాలి మీకు. ఈ త్రిమూర్తులు ఎవరికివారే అంతులేని పనులతో సతమతమవుతూవున్నా పనిభారం కొంచెం ఎక్కువున్నది మాత్రం విష్ణుమూర్తికేనండీ! ఈయనకి అటు శివుడ్నుంచి, ఇటు బ్రహ్మవైపునుంచీ ఆటుపోట్లే! అంతులేకుండా సృష్టించి, వాళ్ళ ఆలనాపాలనా చూసుకొమ్మని తండ్రిమీదకు వదిలేస్తుంటాడు కొడుకు బ్రహ్మగారు; నా భార్యా, పిల్లలతో అచ్చటా, ముచ్చటాలేకుండా ఎప్పుడూ మీ ( బ్రహ్మ, ఆయన సృష్టించిన ప్రాణులు ) సంతానాన్ని లయింపచేయటమేనా నా పని? అని బావగారైన ముక్కంటి అనేకసార్లు మూడోకన్ను తెరవాల్సివస్తుందని గరళకంఠంతో గరుకుగా అన్న సందర్భాలూ లేకపోలేదూ!!

ఇంతకీ విష్ణుమూర్తిగారిపై అంత భారముంటుందా? అంటే అవుననే చెప్పాలి. ఆకాశంలో చూడటానికి ఎంచక్కావుంటుందని, ఆకాశదీపాల్లా నక్షత్రాలనీ, సూర్య,చంద్రులనీ, నవగ్రహాల్నీ సృష్టించి వదిలేసారు బ్రహ్మగారు. అవి క్రిందపడిపోకుండా, ఒకదానిని మరొకటి ఢీ కొట్టుకోకుండా, ఎప్పుడూ సమదూరంలో, సమన్వయంతో సంచరించేలాగా వాటి స్థితిగతుల్ని చూడాల్సిన బాధ్యత మరి విష్ణువుగారిదే కదండీ! ఈ గ్రహగోళాలన్నీ, పుటుక్కున మండిపోయి, జారిపోకుండా, వేరెవరిపైనా పడకుండా వుండటానికై, వాటికి కావాల్సిన సౌరశక్తిని సమకూర్చాల్సిందీ ఈయనే! ఏ గ్రహపాటునో, ఈ గ్రహగోళాల్లో ఏవైనా గ్రహాలు అతిగా స్పందించి, మండిపోయి, ప్రళయాన్ని సృష్టించే పరిస్థితి వస్తే, వాటికి తిరిగి శక్తినివ్వటానికై, వాటిని కృష్ణబిలాల్లోకి పంపి, బయటకు తీసుకువచ్చి, కొడుక్కిచ్చిన మాటను నిలబెట్టుకోవటానికై వాటిని యథాస్థితిలో నిలబెట్టాల్సిన బాధ్యత ఈయనదేకదామరి! అబ్బో ఈ మధ్యవర్తిత్వం, బరువు,బాధ్యతలను మోయటం అంత సులభం కాదండోయ్!! ఎదో పదిమందిలో ఇంత పేరొస్తుందన్న మాటేకానీ, నిమంత్రణ, నియంత్రణా కష్టమేనండీబాబూ! అందుకేగదా మనల్ని ఎవరైనా బాధ్యతలని తీసుకోండి అంటే ఒక పట్టాన ఒప్పుకోందీ!!

పాపం, ఈ విష్ణువుగారి మరికొన్ని బాధ్యతలేంటో చూద్దామా: ఇప్పుడు మీరు అలా ఆకాశంనుంచి ఇలా భూమ్మీదకు దిగండి. అన్ని గోళాలకంటేకూడా ఈ గోళం బహు సుందరంగా, ప్రకృతిరమ్యంగా వుంటుంది. బ్రహ్మగారు ఈ భూమిని, మిగిలిన గోళాలకంటే బహుగొప్పగా, మోహనంగా సృష్టించారు. అందుకేనేమో, మనుషులతోపాటుగా, దేవతలకుకూడా ఈ భూగోళం అంటే అంత మోహం. మరందుకే విష్ణువుగారికికూడా పని చాలా ఎక్కువే. బ్రహ్మగారు ఈ భూమ్మీద ప్రాణులకోసం గాలి, అగ్ని, నీరు, చెట్లు ఇలా ఎన్నెన్నో సృష్టించి ఇచ్చారు. అంతటితో ఆయన పని అయిపోయింది. ఆ తరువాతనే విష్ణువుగారి పని మొదలయింది. …….

గాలి వుంటే సరిపోయిందా? ఆ గాలి అటూ ఇటూ అందరికీ అందాలంటే వాయుదేవుడు సరిగా పని చేస్తున్నాడా లేదా అని చూడాలా? చెట్లుకూడా గాలిని అటుఇటూ వీచేటట్లుగా చూడాలా? వేడికోసం పగలు సూర్యుడూ, చల్లదనంకోసం చంద్రుడూ తూర్పు,పడమర్లన ఉదయించేటట్లూ, అస్తమించేటట్లూ చూడాలా? తాగటానికి నీరు, పండించటానికి నీరు, జలచరాలు బ్రతకటానికి నీరూ కావాలంటే వరుణదేవుడు తన పని తాను సవ్యంగా చేస్తున్నాడో లేదో చూడాలా? నారు పోసినవాడు నీరు పోయడా? అని దబాయించి అడుగుతుంటారు కొందరు తెలివైన మనుషులు. కానీ, వాస్తవంగా ఇది నిజంకాదే!? నారుబోసినవాడు బ్రహ్మ-సృష్టికర్త; కానీ, ఆయన నీరు పోయట్లేదే? మరి నీరుపోస్తున్నది విష్ణువాయే! అందుకే తనకు తప్పదుకాబట్టి, భూదేవి పంట ఫలాల్ల్ని చక్కగా ఇస్తున్నదా, లేదా? అని చూడాల్సిన బాధ్యత విష్ణువుదేకదండీ? మరి, మరికొందరు ఒంటికాలిమీద నిలబడి తపస్సుచేస్తే వారు పడిపోకుండా చూడాలీ; వారి తపస్సుకు మెచ్చి, బ్రహ్మో, శివుడో అనాలోచితంగా వరాలిచ్చి, ఆ వరాలవలన ఇతరుల ప్రాణాలమీదకు వస్తే, వారినీ, వారితోపాటు వరాలిచ్చిన ఆ దేవుళ్ళనూ రక్షించి, వారి స్థితిగతుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది మన విష్ణుమూర్తిగారే కదండీ! అష్టదిక్పాలకులను సమన్వయపరుస్తూ, అష్టకష్టాలుపడుతూ, అష్టావధానం చేస్తుంటాడీయన. అయ్యో పాపం! ఈయన స్థితి స్తిమితంగా వుండాలంటే ఈయన ఎన్ని భవసాగరాల్ని దాటాలో కదా? ఎందుకొచ్చిన తిప్పలండీ బాబూ ఇవి?

ఇక ఇప్పుడు మూడో ఆయన అయిన శివుడు దగ్గరకు వద్దాం. కాలాహాలాన్ని మ్రింగి, చల్లగా వుండటానికై నెత్తిన గంగనూ, చంద్రుడునీ, ప్రక్కన పార్వతినీ, అటుపైన మంచుకొండల్ని, వంటిపైన బూడిదనూ ఆశ్రయించినవాడు ఈయన. మీ ఆట మీరాడండీ, మీ గోల మీరు చేయండీ, ప్రాణాంతక సమయాన మాత్రమే నేను మీ సంగతి చూసుకుంటానంటూ లయ-స్థితిలో వుంటూవుంటాడు ఈయన. ఈయన లక్షణాలు చాలా విలక్షణంగా వుంటాయి. 
మీరూ ఆలకించండి: ఎవరికీ అందనంత ఎత్తైన పర్వతాలపై వుంటాడు; మంచుపర్వతాలు రాళ్ళలాగా గట్టిగావుంటాయి; అవసరం వచ్చినప్పుడు కరిగిపోతూ, అన్నింటినీ కొట్టేసుకుపోతూవుంటాయి; నెత్తిమీద గంగా అంతే – వేటినీ అంటుపెట్టుకోక, తనతోపాటుగా పారేటట్లు చూస్తుంటుంది; అన్నీ వదిలించుకుంటే మనస్సు ప్రశాంతంగా చంద్రుడి వెన్నెలలాగానే వుంటుంది కదండీ! వంటికి బూడిద రాసుకుంటాడు. అది వంటికి పట్టీపట్టనట్లుగానే వుంటుంది. ఆయనకూడా నిమిత్తమాత్రంగా, నిమిళిత నేత్రాలతో, నిశ్చలంగా వుంటాడు.

ఇంతకీ ఇదంతా మీకు చెబుతున్నది ఎవరు? ‘నేనే’ కదండీ! వాళ్ళ ముగ్గురు గురించి చెప్పానుకానీ, మరి నా సంగతేమిటి?

అమ్మానాన్నలు జన్మనిచ్చారు. నారుబోసినవాడు నీరు పోయడా? అన్నట్లు వారు పెంచి, పెద్దచేసి, అన్నం పెట్టి, చదువుచెప్పించి, ఉద్యోగం ఇప్పించి, పెళ్ళిచేసి నా ఆలనాపాలనా అంతా చూసారు. వారి స్థితి అది. ఆ తరువాత నా స్థితి ఏంటి? సంసారం, పిల్లలు; ఉద్యోగం వున్నాయి; వుండటానికి ఇల్లుంది. చాలదా? ఊహూ!! బ్రహ్మగారు మా తాతగారేకదండీ!! నాలో అంతులేని వాసనలు; కోరికలు; సంకల్పాలు. అంతులేని డబ్బు, హోదా, గౌరవం, సుఖసౌఖ్యాలు, సిరిసంపదలూ కావాలి! కడలిలో అలలు అంతులేనివే, కానీ అవి హద్దుగావున్న ఒడ్డును దాటవు!! కానీ, నా కోరికలు విశ్వాన్నే దాటాలనే సంకల్పం, ప్రయత్నం. 
పెద్దలు చెబుతుంటారు: ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకోవాలని. అయితే, ఎవరికివారు తమ స్థాయిని గుర్తెరిగి సాధనకు ఉపక్రమించాలి. నా మనస్సు దీన్ని గుర్తించాలిగదా?

అమ్మా, నాన్నలు ఇచ్చిన శక్తితో, నా స్వయం శక్తితో కలిపి నేను ఎదిగాను; సంసార జీవనాన్ని సాగిస్తూ, అందినవాటిని అనుభవిస్తూ, సుఖాల్ని పొందుతూనే వున్నాను. బాగానే వున్నదికదా? నా మనస్సు నిప్పును తొక్కిన కోతిలాంటిది. నిలకడగా వుండదు. హద్దులు మీరుతుంటుంది. నా బుద్ధి ఎప్పటికప్పుడు నా స్థితిని బేరీజువేసి తస్మాత్, జాగ్రత అని చెబుతూనే వుంటుంది. అయినా నేను వూరుకుంటానా? ఊహూ!! తెలిసీ నా అనుచితమైన, అసాధ్యమైన, అపరిమితమైన కోరికల్ని సాధించుకోవటానికీ, అనుభవించటానికీ అగ్ని పర్వతాలని అయినా దాటటానికి సాహసిస్తాను. ఫలితాల్నిమాత్రం కోరికల మత్తులో ఊహించను. భగవద్గీతలో, కృష్ణుడు, “ కర్మలను చేయటం నీవంతు; ఫలితాల్ని ఆశించకు, వాటిని నాకు వదిలివేయు ” అని చెప్పాడు. కానీ, నేనో? కర్మలనూ, చేయలేని కర్మలనూ చేస్తాను; ఫలితాలనీ ఆశిస్తాను. చివరకు ఏమవుతుందో తెలుసుకదా? తెలియదు కానీ, చివరకు తెలుస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు!! అప్పుడంటా శివ, శివా; శివ, శివా అని!!!

ఉపసంహారం: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులెవరోకారు. నా మనసు బ్రహ్మ. అపరిమితమైన సంకల్పాలూ, కోరికలూ నా సృష్టి. కోరుకున్న కోరికలు తీరి, అనుభవిస్తూ, సుఖాల్ని పొందుతూవుండేలాగా వుంచే స్థితే నాలోని విష్ణువు. ఈ విష్ణువే నాలోని బుద్ధి -ఇది నా మనస్సుయొక్క రెండవ పొర – విచక్షణాజ్నానం కలదీ, బుద్ధి చెప్పేదికూడా. 

మనస్సుయొక్క స్థితి గతి తప్పుతున్నప్పుడు తట్టిలేపేది నా బుద్ధే!! స్థిమితంగా వుండేలా ప్రయత్నించేదీ ఇదే. నాలోని మహేశ్వరుడు ‘చిత్తం’ – ఇది నా మనస్సుయొక్క మూడో పొర. అంతులేని, అసాధ్యమైన కోరికలతో నా స్థితి గతి తప్పుతున్నప్పుడు నా మనస్సు చిత్తం చేతిలో చిక్కిపోతుంది. చిత్తానికి తన, మన అనే బేధంలేదు. అది నన్ను ఉద్ధరించనూవచ్చు, లేదా, నన్ను తనలో (నాలో) లయమూ చేసుకోవచ్చు. లయ స్థితికి చేరినవాడు, మానసికంగా బతికిలేనట్లే. మానసికంగా బతికిలేనివాడు, భౌతికంగా బతికివున్నా, బతికిలేనట్లే. ఎందుకండీ నాకీ దు‘స్థితి’? కానీ, నా బుద్ధి-విచక్షణతో, నా మనసు నా మనసులోనే లయం చెందితే నా స్థితి ఉన్నతి స్థితే. నాక్కావాల్సిందీ, అందరికీ కావాల్సిందీ ఆ స్థితే.

రచన: పబ్బరాజు మాధవ రావు - Retired Asst.General Manager in Sericulture Coprn.

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com