స్థితి - సృష్టి - లయ - మన జన్మ విధి - Srushti, Sthiti, Laya

0

Srushti, Sthiti, Laya
స్థితి అనగానే మనకు గుర్తొచ్చేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీరిలో విష్ణువు స్థితికారకుడు; బ్రహ్మ సృష్టికారకుడు; శివుడు లయకారకుడు. ముందుగా వీరినిగురించి కొంచెం వివరంగా చెప్పాలి. ఒకానొక కథ ప్రకారము:- విష్ణువు పుత్రుడు బ్రహ్మ. ఎందుకంటే విష్ణువు బొడ్డునుండి పుట్టిన పద్మంనుంచి బ్రహ్మ ఉద్భవించాడు కనుక. అందుకనే బ్రహ్మ స్వతంత్రుడుగా వుండాలేడు. తండ్రితొ జీవనం చెయ్యాల్సిందే. వేరు కాపురం పెట్టలేడు. ఇదికూడా మంచిదే కదండీ! ఉమ్మడి కుటుంబం – కలతలులేని కుటుంబం. ఇక శివుడు. ఈయన భార్య పార్వతి విష్ణువు చెల్లెలుకాబట్టి, విష్ణువుకు బావగారు. కొంచెం బెట్టుపోయినట్లు వుంటాడనీ, ఎవరితో కలవడనీ విష్ణుమూర్తిగారికి కొంచెం కినుక. బావగారు తనకు ఎవరితో పనిలేదన్నట్లుగా విభూతి రాసుకొని, శ్మసానాలలో తిరుగుతూవుంటాడనీ, ఎవరికిబడితే వారికి అనాలోచితంగా వరాలిచ్చేస్తుంటాడని విష్ణువు ఆరోపణ. అయినా చెల్లెలు పార్వతి, పిల్లలూ సంసారం బాగానే నడుస్తున్నదికాబట్టి శివుడితో స్నేహం కొనసాగుతూనేవున్నది. అయితే, బ్రహ్మగారికి శివుడంటే కొంచెం కోపమే. కారణం మీరే ఊహించండి… తెలియరాలేదా? బ్రహ్మగారి సృష్టినంతటినీ చివరకి శంకరుడు లయింపచేస్తుంటాడనేది కారణం.

సరే వీరిగురించి తెలుసుకోవటానికి మరికొంత ముందుకుపోదాం. ఈ ముగ్గురి వ్యవహారం క్షణం తీరికలేదూ, దమ్మిడీ ఆదాయంలేదన్న చందాన వుంటుంది. అదేమిటో చూద్దాం. బ్రహ్మకు శివునిమీద కొంచెం కోపంవున్నా, వీరిద్దరికీ ఒక సారూప్యంవుందండీ! వీరిద్దరూ ఎప్పుడూ కళ్ళుమూసుకునే వుంటారు. బ్రహ్మగారు, కొత్తగా దేన్ని సృష్టిద్దామా అని కనులు మూసుకొని ఆలోచిస్తుంటే, శంకరుడు, ఎవరికీ బాధకలగకుండానే కాలదోషంపట్టిన వాటిని/వారిని ఎలా తనలో లయం చేసుకోవాలా అని కనులు మూసుకొని ‘తపన’ (తపస్సు) పడుతుంటాడు.

బ్రహ్మ తన సృజనశక్తితో ఈ విశ్వాన్ని సృష్టించి, అందులో అనేక గోళాలను సృష్టించాడు. మీకు తెలిసిందేగదా. భూగోళం, సూర్య, చంద్రగోళాలు, నవగ్రహాగోళాలు, నక్షత్ర మండలగోళాలూ. ఇలా ఎన్నో గ్రహగోళాలను సృష్టించి, అవి విశ్వంలో తేలియాడుతూ వుండేటట్లుగా చేసాడు. నీలాకాశంలో మిలమిలా మెరిసేటట్లుగా అందంగా సృష్టించాడు. ఇక భూగోళానికివస్తే, మనుషుల్ని; చెట్లు,చేమల్ని; పశుపక్ష్యాదుల్నీ; జలచరాల్నీ సృష్టించాడు. పంచభూతాల సమ్మేళనంతో ప్రాణుల్ని సృజించి, బాహ్యంలోకూడా పంచభూతాల్ని నిలబెట్టాడు. నదుల్ని, సముద్రాలనీ, కొండల్నీ, అడవుల్ని ఉచితంగా ఇచ్చాడు. మనుషులు, ఇతర ప్రాణులుండటానికి, ఎదగటానికి అంతులేని ఆకాశాన్ని (space) ఆవిష్కరించాడు; పీల్చుకొని, బతకటానికి ప్రాణవాయువునిచ్చాడు; ఆహారం పచనం కావటానికి గాలితోకలిసి మండేలా అగ్నినిచ్చాడు; దాహానికి నీరిచ్చాడు; వుండటానికి, పండటానికి భూమినిచ్చాడు. అన్నీ ఉచితంగానే!! ఇంతకంటే మనకి మరేంకావాలండీ? ఈ పంచభూతాలతోకూడిన ప్రకృతితో సహజీవనంచేస్తే, ప్రాణులకు, ముఖ్యంగా మనుషులకు వేరేవాటితో పనేముంటుంది మీరేచెప్పండి!!
విష్ణుమూర్తి
విష్ణుమూర్తి
ఇప్పుడు విష్ణుమూర్తిగారి విషయానికి వద్దాం. ఈయన సహజంగా శాంతస్వభావుడు. చాలా తెలివిగలవాడేగానీ, మెత్తనివాడు. మెత్తనివాడ్ని చూస్తే మొత్తబుద్దైవుతుందనీ; మోసేవారినిచూస్తే మరింత భారం మోపాలనిపిస్తుందనీ పెద్దలమాట. తండ్రిగారు తన సృష్టిని ఎట్లాగో మోస్తున్నారుగదాఅని, బ్రహ్మగారు కళ్ళుమూసుకొని, కలల ఊహలలో కడలి కెరటాల్లా ఊగిసలాడుతూ, అంతులేని కెరటాల్లా, తన మనస్సులోని ఎన్నెన్నో సంకల్పాలను కంటూ, వాటికి రూపాల్నిచ్చి, బ్రతకమనిచెప్పి, వదిలేస్తుంటాడు. పాపం, విష్ణువుగారు, తనపై భారం ఎక్కువవుతున్నా, కొడుకును కాదనలేకా, పొమ్మనలేకా ( ఎలా పొమ్మంటాడు చెప్పండి – పేగు బంధమాయె – ఆ పద్మజుడు మరి విష్ణువు నాభినుండేకదా పుట్టింది!! ) ఆ సృష్టినంతా స్థితి పరుస్తుంటాడు; ఆయా ప్రాణుల్ని స్తిమితపరుస్తుంటాడు.

ఏమాటకామాటే చెప్పుకోవాలండీ! ఇక్కడో ముఖ్య విషయం చెప్పాలి మీకు. ఈ త్రిమూర్తులు ఎవరికివారే అంతులేని పనులతో సతమతమవుతూవున్నా పనిభారం కొంచెం ఎక్కువున్నది మాత్రం విష్ణుమూర్తికేనండీ! ఈయనకి అటు శివుడ్నుంచి, ఇటు బ్రహ్మవైపునుంచీ ఆటుపోట్లే! అంతులేకుండా సృష్టించి, వాళ్ళ ఆలనాపాలనా చూసుకొమ్మని తండ్రిమీదకు వదిలేస్తుంటాడు కొడుకు బ్రహ్మగారు; నా భార్యా, పిల్లలతో అచ్చటా, ముచ్చటాలేకుండా ఎప్పుడూ మీ ( బ్రహ్మ, ఆయన సృష్టించిన ప్రాణులు ) సంతానాన్ని లయింపచేయటమేనా నా పని? అని బావగారైన ముక్కంటి అనేకసార్లు మూడోకన్ను తెరవాల్సివస్తుందని గరళకంఠంతో గరుకుగా అన్న సందర్భాలూ లేకపోలేదూ!!

ఇంతకీ విష్ణుమూర్తిగారిపై అంత భారముంటుందా? అంటే అవుననే చెప్పాలి. ఆకాశంలో చూడటానికి ఎంచక్కావుంటుందని, ఆకాశదీపాల్లా నక్షత్రాలనీ, సూర్య,చంద్రులనీ, నవగ్రహాల్నీ సృష్టించి వదిలేసారు బ్రహ్మగారు. అవి క్రిందపడిపోకుండా, ఒకదానిని మరొకటి ఢీ కొట్టుకోకుండా, ఎప్పుడూ సమదూరంలో, సమన్వయంతో సంచరించేలాగా వాటి స్థితిగతుల్ని చూడాల్సిన బాధ్యత మరి విష్ణువుగారిదే కదండీ! ఈ గ్రహగోళాలన్నీ, పుటుక్కున మండిపోయి, జారిపోకుండా, వేరెవరిపైనా పడకుండా వుండటానికై, వాటికి కావాల్సిన సౌరశక్తిని సమకూర్చాల్సిందీ ఈయనే! ఏ గ్రహపాటునో, ఈ గ్రహగోళాల్లో ఏవైనా గ్రహాలు అతిగా స్పందించి, మండిపోయి, ప్రళయాన్ని సృష్టించే పరిస్థితి వస్తే, వాటికి తిరిగి శక్తినివ్వటానికై, వాటిని కృష్ణబిలాల్లోకి పంపి, బయటకు తీసుకువచ్చి, కొడుక్కిచ్చిన మాటను నిలబెట్టుకోవటానికై వాటిని యథాస్థితిలో నిలబెట్టాల్సిన బాధ్యత ఈయనదేకదామరి! అబ్బో ఈ మధ్యవర్తిత్వం, బరువు,బాధ్యతలను మోయటం అంత సులభం కాదండోయ్!! ఎదో పదిమందిలో ఇంత పేరొస్తుందన్న మాటేకానీ, నిమంత్రణ, నియంత్రణా కష్టమేనండీబాబూ! అందుకేగదా మనల్ని ఎవరైనా బాధ్యతలని తీసుకోండి అంటే ఒక పట్టాన ఒప్పుకోందీ!!

పాపం, ఈ విష్ణువుగారి మరికొన్ని బాధ్యతలేంటో చూద్దామా: ఇప్పుడు మీరు అలా ఆకాశంనుంచి ఇలా భూమ్మీదకు దిగండి. అన్ని గోళాలకంటేకూడా ఈ గోళం బహు సుందరంగా, ప్రకృతిరమ్యంగా వుంటుంది. బ్రహ్మగారు ఈ భూమిని, మిగిలిన గోళాలకంటే బహుగొప్పగా, మోహనంగా సృష్టించారు. అందుకేనేమో, మనుషులతోపాటుగా, దేవతలకుకూడా ఈ భూగోళం అంటే అంత మోహం. మరందుకే విష్ణువుగారికికూడా పని చాలా ఎక్కువే. బ్రహ్మగారు ఈ భూమ్మీద ప్రాణులకోసం గాలి, అగ్ని, నీరు, చెట్లు ఇలా ఎన్నెన్నో సృష్టించి ఇచ్చారు. అంతటితో ఆయన పని అయిపోయింది. ఆ తరువాతనే విష్ణువుగారి పని మొదలయింది. …….

గాలి వుంటే సరిపోయిందా? ఆ గాలి అటూ ఇటూ అందరికీ అందాలంటే వాయుదేవుడు సరిగా పని చేస్తున్నాడా లేదా అని చూడాలా? చెట్లుకూడా గాలిని అటుఇటూ వీచేటట్లుగా చూడాలా? వేడికోసం పగలు సూర్యుడూ, చల్లదనంకోసం చంద్రుడూ తూర్పు,పడమర్లన ఉదయించేటట్లూ, అస్తమించేటట్లూ చూడాలా? తాగటానికి నీరు, పండించటానికి నీరు, జలచరాలు బ్రతకటానికి నీరూ కావాలంటే వరుణదేవుడు తన పని తాను సవ్యంగా చేస్తున్నాడో లేదో చూడాలా? నారు పోసినవాడు నీరు పోయడా? అని దబాయించి అడుగుతుంటారు కొందరు తెలివైన మనుషులు. కానీ, వాస్తవంగా ఇది నిజంకాదే!? నారుబోసినవాడు బ్రహ్మ-సృష్టికర్త; కానీ, ఆయన నీరు పోయట్లేదే? మరి నీరుపోస్తున్నది విష్ణువాయే! అందుకే తనకు తప్పదుకాబట్టి, భూదేవి పంట ఫలాల్ల్ని చక్కగా ఇస్తున్నదా, లేదా? అని చూడాల్సిన బాధ్యత విష్ణువుదేకదండీ? మరి, మరికొందరు ఒంటికాలిమీద నిలబడి తపస్సుచేస్తే వారు పడిపోకుండా చూడాలీ; వారి తపస్సుకు మెచ్చి, బ్రహ్మో, శివుడో అనాలోచితంగా వరాలిచ్చి, ఆ వరాలవలన ఇతరుల ప్రాణాలమీదకు వస్తే, వారినీ, వారితోపాటు వరాలిచ్చిన ఆ దేవుళ్ళనూ రక్షించి, వారి స్థితిగతుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది మన విష్ణుమూర్తిగారే కదండీ! అష్టదిక్పాలకులను సమన్వయపరుస్తూ, అష్టకష్టాలుపడుతూ, అష్టావధానం చేస్తుంటాడీయన. అయ్యో పాపం! ఈయన స్థితి స్తిమితంగా వుండాలంటే ఈయన ఎన్ని భవసాగరాల్ని దాటాలో కదా? ఎందుకొచ్చిన తిప్పలండీ బాబూ ఇవి?

ఇక ఇప్పుడు మూడో ఆయన అయిన శివుడు దగ్గరకు వద్దాం. కాలాహాలాన్ని మ్రింగి, చల్లగా వుండటానికై నెత్తిన గంగనూ, చంద్రుడునీ, ప్రక్కన పార్వతినీ, అటుపైన మంచుకొండల్ని, వంటిపైన బూడిదనూ ఆశ్రయించినవాడు ఈయన. మీ ఆట మీరాడండీ, మీ గోల మీరు చేయండీ, ప్రాణాంతక సమయాన మాత్రమే నేను మీ సంగతి చూసుకుంటానంటూ లయ-స్థితిలో వుంటూవుంటాడు ఈయన. ఈయన లక్షణాలు చాలా విలక్షణంగా వుంటాయి. 
మీరూ ఆలకించండి: ఎవరికీ అందనంత ఎత్తైన పర్వతాలపై వుంటాడు; మంచుపర్వతాలు రాళ్ళలాగా గట్టిగావుంటాయి; అవసరం వచ్చినప్పుడు కరిగిపోతూ, అన్నింటినీ కొట్టేసుకుపోతూవుంటాయి; నెత్తిమీద గంగా అంతే – వేటినీ అంటుపెట్టుకోక, తనతోపాటుగా పారేటట్లు చూస్తుంటుంది; అన్నీ వదిలించుకుంటే మనస్సు ప్రశాంతంగా చంద్రుడి వెన్నెలలాగానే వుంటుంది కదండీ! వంటికి బూడిద రాసుకుంటాడు. అది వంటికి పట్టీపట్టనట్లుగానే వుంటుంది. ఆయనకూడా నిమిత్తమాత్రంగా, నిమిళిత నేత్రాలతో, నిశ్చలంగా వుంటాడు.

ఇంతకీ ఇదంతా మీకు చెబుతున్నది ఎవరు? ‘నేనే’ కదండీ! వాళ్ళ ముగ్గురు గురించి చెప్పానుకానీ, మరి నా సంగతేమిటి?

అమ్మానాన్నలు జన్మనిచ్చారు. నారుబోసినవాడు నీరు పోయడా? అన్నట్లు వారు పెంచి, పెద్దచేసి, అన్నం పెట్టి, చదువుచెప్పించి, ఉద్యోగం ఇప్పించి, పెళ్ళిచేసి నా ఆలనాపాలనా అంతా చూసారు. వారి స్థితి అది. ఆ తరువాత నా స్థితి ఏంటి? సంసారం, పిల్లలు; ఉద్యోగం వున్నాయి; వుండటానికి ఇల్లుంది. చాలదా? ఊహూ!! బ్రహ్మగారు మా తాతగారేకదండీ!! నాలో అంతులేని వాసనలు; కోరికలు; సంకల్పాలు. అంతులేని డబ్బు, హోదా, గౌరవం, సుఖసౌఖ్యాలు, సిరిసంపదలూ కావాలి! కడలిలో అలలు అంతులేనివే, కానీ అవి హద్దుగావున్న ఒడ్డును దాటవు!! కానీ, నా కోరికలు విశ్వాన్నే దాటాలనే సంకల్పం, ప్రయత్నం. 
పెద్దలు చెబుతుంటారు: ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకోవాలని. అయితే, ఎవరికివారు తమ స్థాయిని గుర్తెరిగి సాధనకు ఉపక్రమించాలి. నా మనస్సు దీన్ని గుర్తించాలిగదా?

అమ్మా, నాన్నలు ఇచ్చిన శక్తితో, నా స్వయం శక్తితో కలిపి నేను ఎదిగాను; సంసార జీవనాన్ని సాగిస్తూ, అందినవాటిని అనుభవిస్తూ, సుఖాల్ని పొందుతూనే వున్నాను. బాగానే వున్నదికదా? నా మనస్సు నిప్పును తొక్కిన కోతిలాంటిది. నిలకడగా వుండదు. హద్దులు మీరుతుంటుంది. నా బుద్ధి ఎప్పటికప్పుడు నా స్థితిని బేరీజువేసి తస్మాత్, జాగ్రత అని చెబుతూనే వుంటుంది. అయినా నేను వూరుకుంటానా? ఊహూ!! తెలిసీ నా అనుచితమైన, అసాధ్యమైన, అపరిమితమైన కోరికల్ని సాధించుకోవటానికీ, అనుభవించటానికీ అగ్ని పర్వతాలని అయినా దాటటానికి సాహసిస్తాను. ఫలితాల్నిమాత్రం కోరికల మత్తులో ఊహించను. భగవద్గీతలో, కృష్ణుడు, “ కర్మలను చేయటం నీవంతు; ఫలితాల్ని ఆశించకు, వాటిని నాకు వదిలివేయు ” అని చెప్పాడు. కానీ, నేనో? కర్మలనూ, చేయలేని కర్మలనూ చేస్తాను; ఫలితాలనీ ఆశిస్తాను. చివరకు ఏమవుతుందో తెలుసుకదా? తెలియదు కానీ, చివరకు తెలుస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు!! అప్పుడంటా శివ, శివా; శివ, శివా అని!!!

ఉపసంహారం: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులెవరోకారు. నా మనసు బ్రహ్మ. అపరిమితమైన సంకల్పాలూ, కోరికలూ నా సృష్టి. కోరుకున్న కోరికలు తీరి, అనుభవిస్తూ, సుఖాల్ని పొందుతూవుండేలాగా వుంచే స్థితే నాలోని విష్ణువు. ఈ విష్ణువే నాలోని బుద్ధి -ఇది నా మనస్సుయొక్క రెండవ పొర – విచక్షణాజ్నానం కలదీ, బుద్ధి చెప్పేదికూడా. 

మనస్సుయొక్క స్థితి గతి తప్పుతున్నప్పుడు తట్టిలేపేది నా బుద్ధే!! స్థిమితంగా వుండేలా ప్రయత్నించేదీ ఇదే. నాలోని మహేశ్వరుడు ‘చిత్తం’ – ఇది నా మనస్సుయొక్క మూడో పొర. అంతులేని, అసాధ్యమైన కోరికలతో నా స్థితి గతి తప్పుతున్నప్పుడు నా మనస్సు చిత్తం చేతిలో చిక్కిపోతుంది. చిత్తానికి తన, మన అనే బేధంలేదు. అది నన్ను ఉద్ధరించనూవచ్చు, లేదా, నన్ను తనలో (నాలో) లయమూ చేసుకోవచ్చు. లయ స్థితికి చేరినవాడు, మానసికంగా బతికిలేనట్లే. మానసికంగా బతికిలేనివాడు, భౌతికంగా బతికివున్నా, బతికిలేనట్లే. ఎందుకండీ నాకీ దు‘స్థితి’? కానీ, నా బుద్ధి-విచక్షణతో, నా మనసు నా మనసులోనే లయం చెందితే నా స్థితి ఉన్నతి స్థితే. నాక్కావాల్సిందీ, అందరికీ కావాల్సిందీ ఆ స్థితే.

రచన: పబ్బరాజు మాధవ రావు - Retired Asst.General Manager in Sericulture Coprn.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top