జ్ఞాన జ్యోతిని వెలిగించే దీపావళి - Deepavali ( Diwali - The Festival of Lights )

దీపావళి - Deepavali ( Diwali - The Festival of Lights )

జ్ఞాన జ్యోతిని వెలిగించే దీపావళి
భారతీయ సంస్కృతి కి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు!

దీపావళి మూలాలు
దక్షిణాదివారికి దీపావళి మూడురోజుల ముచ్చట. ఉత్తర భారతాన అది అయిదురోజుల సందడి.
ఆశ్వయుజ బహుళ చతుర్దశి, మర్నాడు అమావాస్య, మూడోరోజు కార్తిక శుద్ధపాడ్యమి- దక్షిణ దేశాన పండుగరోజులు. వీటిలో మొదటిది నరకచతుర్దశిగాను, రెండోది దీపావళి అమావాస్యగాను, మూడోరోజును బలిపాడ్యమిగాను పాటించడం దక్షిణాదిన ఆనవాయితీగా వస్తోంది. అయితే, బలిచక్రవర్తి కథ మినహాయించి, మిగిలిన వాటికి ధర్మశాస్త్ర ప్రమాణాలు లేవు. జనసామాన్యంలో నరకాసుర సంహారగాథ, బలిచక్రవర్తి రాజ్యదానం, విక్రమార్కుడి పట్టాభిషేక ఉదంతాలు- దీపావళితో ముడివడిఉన్నాయి. కార్తిక పాడ్యమినాడు విక్రమార్కుడి పట్టాభిషేకం జరగడం, నాటి నుంచే విక్రమశకం ఆరంభం కావడంతో, ఆ కథకు కొంతలో కొంత దీపావళితో సంబంధం ఉందనుకున్నా- నరకాసుర వధకూ దీపావళికీ ఏరకంగానూ లేదు.

ఉత్తర భారతం విషయానికివస్తే - అటు చతుర్దశికి ముందు రోజు ధన త్రయోదశి, ఇటు పాడ్యమి మర్నాడు యమద్వితీయ చేరి, దీపావళి అయిదు రోజుల పండుగ అయింది. ధనత్రయోదశి, నరకచతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, యమద్వితీయ... మొత్తం అయిదు రోజులూ వరసగా పండుగలు జరుపుకొంటారు. ధనత్రయోదశినే 'ధన్‌తేరస్‌' అనీ, యమత్రయోదశి అనీ వ్యవహరిస్తారు. అలాగే యమ ద్వితీయను భ్రాతృవిదియగా పిలుస్తారు. ఉత్తరాదిన ముఖ్యంగా రామభరత సమాగమ ఉదంతం దీపావళితో ముడివడి ఉంది. రావణ సంహారానంతరం, రాముడు అయోధ్యకుచేరి, భరతుణ్ని కలిసింది దీపావళి రోజుల్లోనని వారి నమ్మకం. దాన్ని 'భరత్‌మిలాప్‌' పేరుతో జరుపుకోవడం ఉత్తరాదివారి ఆచారం.

మనవైపు నరకుడు, బలి, విక్రమార్కుడి కథలతో దీపావళికి సంబంధం కలిపే బలమైన శాస్త్ర ప్రమాణాలు లేనట్టే - రామభరత సమాగమాన్ని దీపావళికి ముడివేసే గట్టి ఆధారాలూ లేవు. గోవింద రాజీయ వ్యాఖ్య ప్రకారం- ఫాల్గుణ అమావాస్యనాడు రావణ వధ జరిగిందని వాల్మీకి రామాయణం చెబుతోంది. అయోధ్యకు తిరుగు ప్రయాణమై రాముడు, చైత్రశుద్ధ పంచమినాటికి భరద్వాజ ఆశ్రమానికి చేరాడు. అదేరోజు హనుమ అయోధ్య వెళ్లి భరతుడితో 'రేపు పుష్యనక్షత్ర పవిత్రయోగంలో నీవు రాముణ్ని దర్శించగలవు' అని చెప్పాడు. వీటిని ప్రమాణంగా తీసుకుంటే- భరత్‌మిలాప్‌ చైత్రమాసపు గాఢపరిష్వంగమే తప్ప, ఆశ్వయుజంనాటి ఆలింగనం కాదు. కనుక దీపావళితో దానికి ఎలాంటి ప్రమేయం లేదు. ఆచార వ్యవహారాలను, వ్రత గ్రంథాల వివరణను పరిశీలిస్తే మాత్రం- దీపావళికి దేశమంతటా ఎనలేని ప్రాధాన్యం కనిపిస్తుంది. దానికి ముఖ్య కారణాల్లో మొదటిది పర్వదిన సంప్రదాయం.

భారతీయుల ప్రతి శుభ సందర్భంలోనూ అభ్యంగనస్నానం, దీపారాధనం తప్పనిసరి ఆచారాలు.ముఖ్యంగా నరకచతుర్దశి, దీపావళి నాడు. చతుర్దశినాడుగాని, అమావాస్యనాడుగాని స్వాతీనక్షత్రం రావడం మరింత ప్రత్యేకం. అదిచాలా యోగదాయకం. స్వాతీనక్షత్రం కలిస్తేనే- దీపావళిగా పిలవాలని ఒక సిద్ధాంతం. స్వాతీనక్షత్రం వాయుదేవతాకం. రవిచంద్రులు స్వాతీ నక్షత్రయుతులు కావడాన్ని (ఈ ఏడాది అవుతోంది) తేజోవాయు సంయోగకాలంగా భావిస్తారు. అదే కారణంగా జలతత్వానికి ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఆ కాలంలో తుపాన్లు రావడమూ పరిపాటి. ఆ వేళ- అభ్యంగ స్నాన విశేష ఫలాన్ని మనం వూహించుకోవచ్చు. రెండోది- దీపావళి దేశ సమైకత్యకు ప్రతీక! హిందువులకు దివ్వెల పండుగ.

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి గా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు నే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగం లో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనాడు . మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు .

భూదేవి- మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ -సత్యభామ గా జన్మిస్తారు . అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుడని తెలిసుకొన్న సత్యభామ ...తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది. నరకుని మరణానికి సంతోషంతో మర్నాడు అమావాస్య చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి పండుగ జరుపుకోవడం, అదే దీపావళి పండుగగా ప్రసిద్ది చెందడం జరిగాయి.

దీపావళి అమావాస్య : ఇంకా కొన్ని సందర్బాలు
దీపావళి - Deepavali ( Diwali - The Festival of Lights )రావణసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆరోజు అమావాస్య... అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకుఅయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగనుమనం జరుపుకుంటున్నాం.

ఇక రెండవ కథగా నరకాసుర సంహారాన్ని చెప్పుకుందాం. ప్రాద్యోషపురానికి రాజు నరకాసురుడు. బ్రహ్మదేవుని నుంచిపొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురునిఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడవిరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు. ఆ పరంపర నేటికీ కొనసాగుతున్నది.

మూడవ కథగా పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మిదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మరణాన్ని దరిచేర్చని అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజు లక్ష్మిదేవి ఉద్భవించింది. సకలఅష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు.

నాలుగవ కథగా... భారతంలోని ఇతివృత్తాన్ని చెప్పుకుందాం. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులుపదమూడేళ్ళు వనవాసం, ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగాప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు.

ఇక చివరిదైన ఐదవ వృత్తాంతంగా మన రైతుల గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చేసందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడినిఅందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు.

దీపావళి - Deepavali ( Diwali - The Festival of Lights )
దేశవిదేశాల్లో- దీపావళి
దీపావళిన చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత, విశిష్టత కలదు. విశాఖదత్తుడు తన ముద్రా రాక్షస నాటకం లో దీపావళిని 'కౌముదీ మహోత్సవం'గా వర్ణించాడు. కౌముది అంటే వెన్నెల. కార్తీక మాసాన్ని కౌముదీ మాసంగా పరిగణిస్తారు. కార్తీక మాస ప్రారంభంలో దీపాల వెలుగులతో నిండి యుంటుంది కదా! అంతేకాక ఆ మాసమంతా ముత్తై దువులు దీపాలను వెలిగించి చివరగా జీవ నది ద్వారా స్వర్గానికి చేర్చటం వల్ల తమ తమ సుమంగళ్యత్వం, పాడిపంటల సమృద్ధి, సంతానాభివృద్ధి చెందుతాయని హైందవుల ప్రగాఢ విశ్వాసం.
 • ఈ దీపావళి రోజునే విక్రమార్కుడు పట్టాభిషిక్తుడయ్యాడని మరో చారిత్రక కథ ఉంది. ఈ దీపావళిని స్వర్ణ దీపావళిగా ఋగ్వేదం విశదీకరించింది. భోజమహారాజు 'సుఖరాత్రి' గా అభివర్ణించాడు. హర్ష చక్రవర్తి దీపావళిని 'దీపప్రతి పాదోత్సవం'గా వ్యవహరించాడని నైషధ్య కావ్యం చెబుతోంది.
 • సిక్కులు అమృతసర్‌లోని స్వర్ణదేవాలయాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించి ప్రార్థనలు జరుపుతారు. వారి మతగురువైన గురుహర గోవింద సాహిల్‌ మొగల్‌ చక్రవర్తుల చెరనుంచి విడుదలైన రోజు కనుక గొప్ప ఉత్సాహంగా జరుపుకుంటారు.
 • ఈ రోజు జైనులు మహావీరుని నిర్వాణదినంగా భావించి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. అంతేకాక జైన మత గ్రంథాలను పారాయణం చేస్తారని జైన హరివంశం పల్కింది.
 • ప్రత్యేకం ఈ పండుగను 'దివ్వెల పండుగ'గా రెడ్డి రాజుల కాలంలో వ్యవహరించే వారని 'సింహాస నాద్వా త్రింశక' ద్వారా తెలుస్తోంది.
 • విజయనగర రాజుల వైభవ కాలంలో అత్యంత వైభవోపేతంగా దీపావళి పర్వదినాన్ని జరుపుకొన్నట్లు చారిత్రక ఆరాధాలవల్ల తెలుస్తోంది. అంతేకాక విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు 'నిలకోలస్‌ కౌంట్‌' దీపావళిని విశదపరచాడు.
 • ఈ పండుగను 'యక్షరాత్రి' గా జరిపినట్లు వాత్సాయన కామ సూత్రాలు అనుగ్రంథం ద్వారా తెలుస్తోంది. 'జ్యోతిషరత్న మాలను' రచించిన 'శ్రీపతి' అనుమరాట కవి దీపావళిని దాని ప్రాశస్త్యాన్ని వివరించాడు.
 • జాతి కుల మత వర్గ విచక్షణలేకుండా సర్వమానవ సౌభ్రా తం వెల్లివిరిసి దశ దిశలా చాటే పండుగే దీపావళి పండుగ. భారతదేశ సంస్కృతిక ప్రతీకయని పలుదేశాల్లో చాటే ప్రతీతి కూడా కలదు.
 • వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో జరుపుతారు. మానవునిలో దాగియున్న విచారా (చీకటి)న్ని పోగొట్టి ఆనందాన్ని (వెలుగు) వికసింపచేసేది. దీపాలు వెలిగించడం సంతోషానికి సంకేతం. యావద్భారతదేశమే కాకుండా విదేశాల్లో కూడా జరుపువిశేషం.
 • గుజరాత్‌ బెంగాల్‌ రాష్ట్రాల్లో దీపావళిని రైతులు 'పశుపూజారి' దినోత్సవంగా జరుపుకుంటారు. 'ధనతేరస్‌' పేరున కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది.
 • ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో గోవర్థనగిరిని నిర్మించి పూజిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో 'భారత్‌మిలాన్‌' పేరిట దీపావళి జరుగుతుంది.
 • రాజస్థాన్‌, హిమాచల ప్రదేశ్‌ రాష్ట్రాల్లో దీపావళి విభూత దయా నిర్దేశికంగా జరుపుతారు. కుక్కలకు, కాకులకు ఆహారాన్ని తృప్తిగా పెట్టి పసుపుకుంకుమలతో పూజించుట విశేషం.
 • రాజస్థాన్‌లో 'హిడ్‌' పూజ నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని 'కాకత్సోహార్‌' అని పిలుచుట పరిపాటి.
 • 'అన్నకూట్‌' అన్న పేరుతో మధుర ప్రాంతాల్లో నిర్వహి స్తారు. పశుపక్ష్యాదులకు ఆహారాన్ని పెట్టి గౌరవిస్తారు. 'గోవర్థనగిరి' వారు నరక చతుర్దశి; దీపావళి రెండు రోజులు జరుపుతారు.
 • పశ్చిమబెంగాల్‌, ఒరిస్సాల్లో కాళీపూజలు జరుపుతారు. ఈ పూజను 'జగద్ధాత్రి' అనిపిలుస్తారు. కేరళలో బలిచక్రవర్తిని జయించిన రోజుగా పరిగణించి దీపావళిపండుగను జరుపుతారు.
 • తమిళనాడరలో చాలా ఘనంగా జరుపుతారు. ఆడపిల్లలు పుట్టింటికి వెళ్లికానుకలు తెచ్చుకొనుట సాంప్రదాయంగా భావిస్తారు.
 • మహారాష్ట్రలో దీపావళిరోజున లక్ష్మీపూజను నిర్వ హించుట పరిపాటి. మనదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా దీపావళి పండుగ జరుపుకొనుట దీపావళి ప్రాముఖ్యత విశదమౌతుంది.
 • జపాన్‌లో 'తోరనో గోష్టి' అనియు; మారిషన్‌, వియ త్నాంలో నూతన సంవత్స రంగా దీపావళిని జరుపుకొంటారు. సుమిత్రా, జావా ద్వీపాల్లోను జర్మనీలోను దీపావళిని, ఘనంగా జరుపు కొంటారు. ఇరాన్‌, ఇరాక్‌లందును మరియు ఆస్ట్రేలియాలోను, స్వీడన్‌ లోను లూసియాడే అన్న పేరుతో పండుగ జరుపుతారు.
 • నేపాల్‌ నందు 'నేపాల్‌ తీహార్‌' పేరుతో దీపాల్ని వెలగించి దీవళిని జరుపు తారు. 'గైఫాక్స్‌' అని ఆంగ్లే యులు దీపావళిని జరుపు కొనుట గొప్పవిశేషం.
 • బర్మాలో 'అంగేజుల పండుగ' అన్న పేరుతో దీపావళిని జరుపు కొంటా రు. దీన్నే 'తంగజు' అనికూడా అంటారు. చైనాలో ఈ పండుగను 'నాయి మహుబా' అన్న పేర దీపాల్ని వెలిగించి దీపావళిని జరుపుకుంటారు. 'థాయ్‌లాండ్‌లో దీపావళిని ఆనందోత్సా హాలతో జరుపుకొంటారు. వారు దీపాల్ని వెలిగించడం పవిత్ర కార్యంగా భావిస్తారు. బాణసంచాను ఘనంగా కాలుస్తారు.
 • శ్రీలంకలో దీపావళిని జాతీయ పర్వదినంగా జరుపుకొంటారు. 'ఇజ్రాయిల్‌'లో వారి స్వాతంత్ర యోధుడు 'మెకాబ్బిన్‌' స్మృత్యర్థం 'హనుక' అనే దీపోత్సవం జరుపుతారు.
 • ఇలా భారతదేశంలోనేకాక దేశవిదేశాల్లో అనాదిగా అన్ని మతాలవారు, అన్ని వర్గాలవారు ఎంతో ఉత్సాహం గా జరుపుకునే అతిముఖ్యమైన పండుగ దీపావళి పండుగ.
 • 'భిన్నత్వంలో ఏకత్వాన్ని' చాటిచెప్పేదే దీపావళిపండుగ. మనలోని అజ్ఞానాంధకారా న్ని తొలగించే ఉషస్సులను నింపుతుంది కనుక ఈ దీపావళిని మనమంతా ఆహ్వానిద్దాం.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top