గోవు మరియు వృషభం యొక్క ధర్మస్వరూపం

0
the cow and Taurus
గోవుకు భారతీయ సంస్కృతిలో ఉన్నంత ప్రాధాన్యం బహుశా మరెక్కడా లేదేమో. వేదాల్లోనూ, పురాణాల్లోనూ పలుచోట్ల పలు విధాలుగా గోవు అనే పదాన్ని అనేక అర్థాల్లో వర్ణించారు. గోవు అన్న పదం కేవలం ఆవును మాత్రమే కాక ఎద్దును కూడా సూచిస్తుంది. ప్రత్యేకించి చెప్పాలంటే గోవృషభం అంటే ఎద్దు, గోధేనువు అంటే ఆవు అని చెప్పాలి. ఆవుకు పూజ చేయడం అతి సాధారణంగా చూస్తున్నా ఎద్దును గురించి కూడా పుస్తకాల్లో వర్ణన కనిపిస్తుంది. కోడె దూడను శివుడికి సమర్పించే ఆచారం పురాణాల్లోనూ, శైవ సంప్రదాయంలోని ఆగమాల్లోనూ చెప్పబడింది. అందువల్ల ఈ ఆచారం బహుశా అనాదిగా ఉండి ఉండవచ్చు. ఇటీవల కబేళాలకు మళ్లుతున్న మల్లన్న కోడెల గురించి వార్తలు వచ్చాయి. ఇదివరలో కూడా ఇలాంటి వార్తలను గమనించాం. ఈ నేపథ్యంలో ఒకసారి ఈ ఆచారానికి ఉన్న నేపథ్యాన్ని గమనిద్దాం.

స్కాందపురాణంలో గోవుల్ని శివుడికి అర్పించే విషయంపై ప్రస్తావన ఉంది. ఇక్కడ శివుడికి గోదానం చేయాలని చెప్పబడింది. గోదానం అంటే కేవలం ఆవు అనే కాక ఎద్దును కూడా ఇవ్వాలని చెప్పారు. ‘గాంపయస్వినీం’ అంటే పాలిస్తున్న ఆవును, ‘వృష సంయుతాం’ అంటే ఎద్దుతో పాటు శివుడికి అర్పిస్తే సమస్త జగత్తునూ దానం చేసినంతటి పుణ్యంతో సమానమట. ఇలా చేసినవాడు కోట్లాది సంవత్సరాలు శివుడితోపాటు భోగాలను అనుభవిస్తాడని చెప్పారు. వృషభాలతో పాటు గోవులను దానం చేసినవాడు కోటి సూర్యుల ప్రకాశంతో వెలుగుతున్న విమానాల్లో రుద్రుడితో సమానంగా తిరుగుతూ భోగాలను అనుభవిస్తాడని, గోవు శరీరంపై ఎన్ని రోమాలు ఉండే అన్ని వేల యుగాలు రుద్రలోకంలో సుఖాలనుభవిస్తాడని ఇదే పురాణంలో మిగిలినచోట్ల కూడా చెప్పారు. దేవాలయాలకు భూములున్న రోజుల్లో వాటి సేద్యానికి, అన్నదానాలు మొదలైనవాటికి గోవుల అవసరం ఉండి ఉండవచ్చు. యజ్ఞంలో అడుగడుగునా గో సంబంధమైన ఉత్పత్తులు చాలా అవసరం.

అసలు వృషభం అంటే ఏమిటి?
సంస్కృతంలో వృష అంటే వర్షించడం లేదా తడపడం అని అర్థం. వృషభం అంటే వర్షించేది. ఎద్దు తన రేతస్సును వర్షించి గో సంపదను పెంచుతుంది. గోసంపద ఆ రోజుల్లో ఒక ముఖ్యమైన సంపద. కౌరవులు విరాట నగరాన్ని రెండువైపులా ముట్టడించి గోవులను తోలుకెళ్లడం ఈ విషయాన్ని సూచిస్తుంది. వేదమంత్రాల్లో ‘చత్వారి శృంగాః’ అంటూ ప్రారంభమయ్యే అతి ప్రసిద్ధి చెందిన మంత్రం ఉంది. నాలుగు కొమ్ములు, మూడు కాళ్లు, రెండు తలలు, ఏడు చేతులు ఉన్న వృషభం మూడు తాళ్లతో కట్టివేయబడి, బిగ్గరగా రంకె వేస్తోంది అది దీని అర్థం. ఈ మంత్రానికి వ్యాకరణ శాస్త్రపరంగా, వేదాంతపరంగా, యజ్ఞపరంగా, జ్యోతిష్యపరంగానూ ఇలా అనేక అర్థాలు చెప్పారు. యజ్ఞపరమైన అర్థాన్ని చూస్తే నాలుగు వేదాలు నాలుగు కొమ్ములు. కర్మ, ఉపాసన, జ్ఞానం అనే మార్గాలు మూడు పాదాలు. మూడు తాళ్లతో కట్టబడటం అంటే సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలతో కట్టబడి ఉన్న మనందరి ప్రవృత్తి. వృషభం అంటే ధర్మం. ధర్మానికి అధిపతి శివుడు. రంకె వేయడం అంటే భగవంతుని తత్వాన్ని గొప్పగా బోధిస్తున్నాడు అని ప్రాచీనుల వ్యాఖ్య. ధర్మాన్ని ఆచరిస్తే అది మనం కోరిన కోరికల్ని వర్షిస్తుంది. చతుర్విధ పురుషార్థాల్లో (ధర్మము, అర్థము, కామము, మోక్షము) అర్థము, కామము రెండూ కూడా ధర్మానికి, మోక్షానికి మధ్యలో ఉండటం గమనించాలి. ధర్మం అనే తాటిపైనే నడుస్తూ అర్థాన్ని (సంపదను), కామాన్ని (కోరికలు) పొందాలని అర్థం. అలా చేసినప్పుడే ఆ సంపద, సుఖము మనస్సును పరిశుభ్రంగా ఉంచి నాలుగో పురుషార్థమైన సత్యాన్వేషణ గురించి ఆలోచించే శక్తినిస్తుందని అర్థం.

స్కాంద పురాణంలో శివపార్వతుల కల్యాణాన్ని వర్ణించారు. శివుడిని భర్తగా పొందడం కోసం పార్వతి తపస్సు చేస్తుంది. ఆ సమయంలో శివుడు మాయా బ్రహ్మచారి రూపంలో అక్కడకు వస్తాడు. ఆయన పార్వతితో మాట్లాడుతూ.. శివుడి గురించి తపస్సు చేడయం వృథా అని, అతను ఎద్దు వాహనంపై తిరుగుతుంటాడనీ.. ఇలా చాలా రకాలుగా నిందలు చేశాడు. పార్వతి అందుకు సమాధానంగా శివుడు పరబ్రహ్మ స్వరూపమని చెబుతుంది. శివుడి తత్వాన్ని వర్ణిస్తుంది. అందులో కూడా ‘వృషో ధర్మ ఇతి ప్రోక్తః’ అంటుంది. వృషభం అంటే ధర్మస్వరూపమని, ధర్మాన్ని శాసించేవాడు శివుడని అర్థం చెబుతుంది.

వేద మంత్రాలను దర్శించిన రుషులు తాత్విక చింతనతో కూడిన విషయయాలను ప్రతీకాత్మకంగా కవితా ధోరణిలో చెప్పారు. ఇలా ప్రతీకాత్మకంగా ఉన్న విషయాలను రుషులు మరింత విస్తారంగా కథల రూపంలో పురాణాల్లో రాశారు. తాత్వికమైన భావం పురాణంగాను, పురాణం ఆచారంగాను మారడం మనం పలుచోట్ల చూడగలం. పురాణాల్లో గోదానాన్ని గురించి వర్ణించే సమయంలో కోట్ల యుగాలపాటు శివలోకంలో ఉంటారని, రుద్రుడిలా ఉంటారని చెప్పడం కేవలం అతిశయోక్తులు మాత్రమే. వేదాలకు అర్థాన్ని చెప్పే మీమాంస శాస్త్రంలో పై విధమైన వాక్యాల్ని అర్థవాదాలు అన్నారు. ఒక పనిని ఆచరింపజేయడానికి అది ఇవ్వబోయే ఫలాన్ని అతిశయోక్తులతో చెప్పడం, చేయకూడని విషయాన్ని అతిశయోక్తులతో చెప్పి భయపెట్టడం పురాణాల విధానం. భక్తులను సన్మార్గంలో ప్రవర్తింపజేయడానికే ఇలా చెప్పారని గుర్తుంచుకోవాలి. కానీ అవన్నీ అక్షరాలా నిజం అని భావించకూడదు. ఇవన్నీ ఒకానొక అమాయక యుగంలో, అందులోనూ పామరులకు చెప్పబడినవి. ఆధునికులకు ఇలాంటివాటిని అక్షర సత్యాలుగా చెబితే మూఢనమ్మకాలనే విమర్శలు వస్తాయి. పండితులు వీటిని వివరించి చెప్పడం చాలా అవసరం. శివుడికి కోడెలను సమర్పించే ఆచారాన్ని కూడా ధర్మాచార్యులు పరిశీలించి ప్రస్తుత కాలంలో ఆచరించదగిన దాన్ని నిర్దేశిస్తే బాగుంటుంది.

డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top