చేజర్ల శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం - Chejarla Sri Kathiswara Swami Temple

Cheesala Sri Kathiswara Swami Temple
క్షిణ భారతదేశం లో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాలలో చేజర్ల కపోతేశ్వరస్వామి ఆలయం ఒకటి. గుంటూరుజిల్లా నకరికల్లు మండలంలో నరసరావుపేట కు సుమారు ముఫ్ఫై కిలోమీటర్ల దూరం లో ఉన్న చిన్నగ్రామమిది. ఇది తొలుత బౌద్ధమతానికి అనంతరకాలం లో శైవ మతానికి ఆలంబనమైన ప్రాచీన ఆలయం గా పరిశోధకులు భావిస్తున్నారు. గజపృష్టవిమానం ఈ ఆలయ ప్రాచీనత కు తొలి సాక్ష్యం కాగా ఆలయ ప్రాంగణం లోని 9 శాసనాలు ఆలయప్రాచీనత కు,ప్రాశస్త్యానికి ప్రతీకలు గా నిలుస్తున్నాయి.

ఆలయ రాజ గోపురం
బుద్ధుని జాతక కథలలోని శిబి జాతకకథ కు ఈ ఆలయానికి సంబంథం ఉందని చరిత్ర పరిశోథకుల అభిప్రాయం.తనను ఆశ్రయించిన కపోతాన్ని రక్షించడానికి తన శరీరమందలి మాంసాన్ని కోసి యిచ్చిన శిబి చక్రవర్తి త్యాగగుణాన్ని ప్రస్తావించేదే శిబి జాతకకథ.అట్టి శిబి చక్రవర్తి నూరు యజ్ఞాలు చేసి, త్రిమూర్తులను మెప్పించి, తనతో పాటు తన అనుయాయులకు లింగరూపాల్ని ప్రాప్తింపచేసి, కైలాసప్రాప్తిని పొందిన పుణ్య ప్రదేశంగా ఈ చేరుజర్ల కీర్తించబడుతోంది. ఇచ్చట లింగమూర్తి శిలా లింగము కాదని, శల్య లింగమని స్థలపురాణము.

ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం
స్థలపురాణం: షోడశచక్రవర్తులలో పేరెన్నికగన్న యాయాతి మహారాజు కుమారుడు మాంథాత. మాంథాత చక్రవర్తికి ముగ్గురు కుమారులు. వారిలో శిబి పెద్దవాడు. మేఘదంబరుడు, జీమూతవాహనుడు అతని అనుజులు. వీరి చరిత్ర తోనే చేజర్ల కపోతేశ్వర ఆలయ చరిత్ర ముడివడి ఉండటం ఆ మహానుభావులను స్మరించుకునే మహద్భాగ్యం మనకు కలిగింది.

ఆలయ గజపృష్ఠ విమానం
మాంథాత తరువాత జ్యేష్ఠపుత్రుడైన శిబి రాజ్యాథికారానికి వచ్చాడు. ప్రజా రంజకుడైన శిబి చక్రవర్తి పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో తులతూగుతున్నారు. అన్న అడుగుజాడల్లో నడుస్తూ తమ్ముళ్లు ఇద్దరు ప్రజల గౌరవాదరాలను పొందుతున్నారు. అటు వంటి సమయంలో మేఘదంబరునకు పుణ్యక్షేత్రసందర్శన చేయాలనే కుతూహలం కలగడం తో తన కోరికను అన్నగారికి విన్నవించుకొని, అనుమతి నివ్వవలసిందిగా కోరాడు. తమ్ముని కోరిక సముచితమని భావించి, దేశాటన కవసరమైన ధనాన్ని, పదిహేనువందల మంది పరి వారాన్ని ఇచ్చి పోయి రమ్మని ఆశీర్వదించాడు శిబి చక్రవర్తి. ఉత్తర దేశ యాత్రలు ముగించుకొని, దక్షిణ భారతం లో సంచరిస్తూ శ్రీశైలాది దివ్యక్షేత్రాలను సందర్శించి ,చేరుంజర్ల ప్రాంతానికి చేరుకున్నాడు.
ఈ ప్రాంత ప్రకృతి రామణీయతకు, ప్రశాంతత కు ఆకృష్ట మానసుడైన మేఘదంబరుడు కొంతకాలం ఈ ప్రాంతంలోనే ఉండాలని నిర్ణయించుకొని , తన పరివారాన్ని అందుకు ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడు. కొద్దిరోజులు పరిసరాల్లోని కొండలు, కోనల్లో సంచరిస్తూ, అక్కడ దేవరకొండ కోనలోని గుహల్లో తపస్సుచేసుకుంటున్న తాపసులను చూసి సంభాషించి మానసిక ప్రశాంతత ను పొందాడు. అనంతరం తన పర్ణశాలకు వచ్చిన మేఘదంబ రుడు తాను కూడ తపస్సుచేయాలనే సంకల్పానికి వచ్చాడు.

ఆలయప్రాంగణం లోని కొన్ని శాసనాలు
మరుసటిరోజే ఒక ప్రశాంతమైన గుహలోకి ప్రవేశించి తపస్సు ప్రారం భించాడు. కొద్దికాలం లోనే ఆప్రాంతం లోని మునులతో చెలిమి ఏర్పడింది. అనతి కాలం లోనే తపస్సిద్ధి పొందిన మేఘదంబరుడు శివైక్యాన్ని పొందాడు. ఆయన అనుచరులు, అక్కడున్న వారి సహాయం తో మరణించిన అతని భౌతికకాయానికి దహన సంస్కారాలు జరిపించారు. ఆశ్చర్యంగా ఆ చితాగ్ని మధ్యనుండి ఒక అద్భుతమైన శివలింగం ఆవిర్భవించింది. ఆనందాశ్ఛర్యాలకు లోనైన పరిసర ప్రజలు ,మునులు ఆ లింగాన్ని మేఘదంబేశ్వరలింగమని స్తుతించి, ఆతను తపస్సు చేసిన గుహలోనే ప్రతిష్టించి, పూజలు చేయసాగారు.

అదే ఈనాడు మేఘాలమల్లేశునిగా కొలువబడుతున్న లింగం. ఇది కుమారస్వామి (పుష్పగిరి) కొండకు పడమర గా 3 కి.మీ దూరం లో ఉంది.ఇప్పటికీ ఈ ప్రాంతంలో వర్షాలు లేకపోతే పరిసర గ్రామస్ధుల మేఘాలమల్లేశుని కొండకు వెళ్ళి నవధాన్యాలతో పాయసము, పులగము తయారుచేసి, కొండచట్టులపై పోసి జుర్రుతారు. వారు ఇంటికి చేరులోపల భారీవర్షము కురియుట నేటికి సత్యము గా ఈ ప్రాంతీయులు చెప్పుదురు. ఇక్కడే జీమూతవాహనుని గుహ కూడ ఉన్నది.

నంది స్థంభము
జీమూతవాహనుడు శిబిచక్రవర్తి చిన్న తమ్ముడు. మేఘదంబరుడు లింగాకృతి ని పొందగానే ఆయన వెంట వచ్చిన పరివారమంతా ఖిన్నులై, వేగం గా రాజథానికి చేరుకొని జరిగిన వృత్తాంతాన్ని అంతటిని మహారాజైన శిబిచక్రవర్తి కి విన్నవించారు.తమ్ముని మరణానికి మిక్కిలి శోకించిన శిబి చక్రవర్తి కొంతసమయానికి తేరుకొని, సోదరుడు లింగరూపాన్ని పొందడాన్ని విని ఆశ్చర్యపోయాడు. చిన్నతమ్ముడైన జీమూతవాహనుని పిలిచి చేరుంజర్ల వెళ్లి జరిగిన వృత్తాంతాన్నిసమగ్రంగా తెలుసుకొని రమ్మని పంపించాడు.

జీమూతవాహనుడు పరివారం తో బయలుదేరి వేగం గా చేరుంజర్ల చేరుకున్నాడు. అక్కడి మునివరులు చూపించగా అన్నయైన మేఘదంబరుడు తపస్సు చేసుకున్న గుహను, పూజలందుకుంటున్న మేఘదంబర లింగాన్ని చూశాడు. అన్న అదృష్ఠానికి ఎంతో మురిసిపోయాడు. కాని స్థలప్రభావమో, లేక పూర్వ జన్మపుణ్యఫలమో కాని జీమూతవాహనుని కూడ ఆ ప్రదేశం లోనే తపస్సు చేయాలనే సంకల్పం కలిగింది. తపస్సు ప్రారంభించిన అనతి కాలం లోనే జీమూతవాహనుడు సిద్ధి పొందాడు.తోటి తాపసులు పరివారము అంత్యక్రియలు నిర్వహించారు. చితాగ్ని లో నుండి అద్భుతలింగం ప్రత్యక్ష మైంది. ఆశ్చర్యపోయిన అక్కడి వారు జీమూతవాహనుడు తపస్సుచేసిన గుహలోనే ఆ లింగాన్ని ప్రతిష్ఠచేసి, పూజించసాగారు.

మరికొన్ని శాసనాలు
జీమూతవాహనుని వెంటవచ్చిన పరిజనం వెనుతిరిగి రాజథాని కి చేరుకుని సమస్త విషయాన్ని శిబి చక్రవర్తి కి విన్నవించుకున్నారు. మేరునగథీరుడైన శిబి చక్రవర్తిని అనుజుల మరణాలు ఎంతో కుంగుదీశాయి. కొంతకాలానికి మనసును కుదుట పరుచుకొని చేరుంజర్ల వెళ్లి తన తమ్ముళ్ళు లింగరూపాలను పొందిన ప్రదేశాలను దర్శించి రావాలని నిర్ణయించుకున్నాడు.
రాజ్యాన్ని మంత్రుల కప్పగించి,ఇల్లాలిని వెంట పెట్టుకొని, అపరిమిత ధనరాశులను రథాలపై పెట్టుకొని,దక్షిణదిశ గా బయలుదేరాడు.పుణ్య నదీనదాలలో స్నానం చేస్తూ, దివ్యక్షేత్రాలను దర్శిస్తూ,చేరుంజర్ల చేరుకున్నాడు. రాజదంపతుల ఆగమనాన్ని తెలుసుకున్న ఆ పరిసర గ్రామాల ప్రజలు, అచ్చటి గుహల లోని మునులు వారికి సాదర స్వాగతం పలికారు. వారందరు వెంటరాగా శిబిదంపతులు మేఘదంబరుడు, జీమూత వాహ నుడు తపస్సు చేసుకున్న గుహలు, నిత్యపూజ లందుకుంటున్న వారి లింగమూర్తులను దర్శించి ఉద్విగ్న మానసులయ్యారు.
నంది మండపం లో కొలువు తీరిన నందీశ్వరుడు

శిబి చక్రవర్తి ఆ చేరుంజర్ల పరిసర ప్రశాంత ప్రకృతికి ఆకర్షించబడి, అక్కడే కొంతకాలం ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ పరిసరాల్లో ఏవో దివ్యశక్తులున్నాయని, తనతమ్ములు లింగరూపులుగా మారిన ఈ క్షేత్రం లోనే తాను నూరు యజ్ఞాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. తొంభైతొమ్మిది యజ్ఞాలను నిర్విఘ్నం గా పూర్తిచేసి నూరవ యజ్ఞాన్ని ప్రారంభించిన శిబిచక్రవర్తిని చూసి భయపడిన దేవేంద్రుడు దిక్పాలకులతో కలసి త్రిమూర్తులను శరణువేడాడు. త్రిమూర్తులు శిబి చక్రవర్తి తపశ్శక్తిని పరీక్షించదలచారు.

శ్రీ మార్కండేశ్వర స్వామి
త్రిమూర్తులు భూలోకానికి వచ్చి విడిది చేసిన ప్రదేశమే” విప్పర్ల “ గ్రామంగా పిలవబడుతోంది.బ్రహ్మబాణంగా ,మహావిష్ణువు పావురం గా, మహేశ్వరుడు కిరాతకుడి గా రూపుదాల్చారు. త్రిమూర్తులు తమ రూపాలను మార్చుకున్న ప్రదేశం” రూపెనగుంట” గాను, త్రిమూర్తులు శిబిచక్రవర్తి ని క్రీగంట చూసిన ప్రదేశాన్ని “కండ్లకుంట” గ్రామం గాను పిలువబడుతున్నాయని పరిసరప్రాంతవాసుల కథనం. వేటనుండి తప్పించుకొని పారిపోతున్న పావురాయిని బాణం తో కొట్టాడు మాయా కిరాతుడు. కాలువిరిగిన కపోతం ప్రాణ భీతితో పరుగెత్తి శిబిచక్రవర్తి మరుగుచొచ్చింది.

శిబి మాయాకిరాతకులకు వాదోపవాదాలు జరిగాయి. శరణాగతరక్షణ రాజధర్మం కాబట్టి ఈ కపోతాన్ని రక్షిస్తాను.నీ ఆకలి తీరడానికి ఈ పావురమెత్తు మాంసాన్ని నాశరీరం నుండి కోసి నీకిస్తానని శిబి చక్రవర్తి చేసిన ప్రతిపాదనను మాయాకిరాతుడు అంగీకరించాడు.

దీపమండపము లోని దీపాలవృక్షము
రాజసేవకుడు త్రాసుని సిద్ధం చేయగా , ఒకవైపు పావురాన్ని ఉంచి , రెండవవైపు తన శరీర మాంసాన్ని చురకత్తితో కోసి ఉంచసాగాడు.రెండు తొడల కండల కన్నను పావురమే బరువుగా ఉంది. రాజాజ్ఞ మీరని ఒకసేవకుడు శిబి ఆజ్ఞ శిబి కాళ్ళు చేతులు నరికి త్రాసులో ఉంచాడు. అక్కడ చేరిన అశేష జనవాహిని ఆ దృశ్యాన్ని చూసి హహాకారాలు చేసింది. అప్పటికీ పావురమే బరువుగా ఉండటం తో మహారాజు నిర్వికారమైన చిరునవ్వుతో తన శిరస్సును ఖండించి త్రాసులో ఉంచవలసింది గా తన సేవకుని ఆజ్ఞాపించాడు. రాజసేవకుడు ప్రభువు శిరస్సు ను ఖండించి త్రాసులో ఉంచాడు. అప్పుడు కపోతం తో సమానంగా త్రాసు తూగింది. దానితో భక్తుని యెడల భగవంతుని శోధన ముగిసింది. శంఖచక్రథారియై శ్రీమహావిష్ణువు, త్రిశూలధారియై ముసిముసినవ్వులతో శంకరుడు, బాణరూపాన్నివీడి చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యారు.దేవతలు పుష్పవృష్ఠి కురిపించారు. తనకు, తన సమస్త పరివారానికి, ఋత్వికులకు కైలాసప్రాప్తిని కోరాడు శిబిచక్రవర్తి. “తథాస్తు” అని ఆశీర్వదించారు త్రిమూర్తులు.

కరచరాణాద్యవయవములు లేని శిబి మొండానికి దేవతలందరు ఆకాశగంగా జలం తో అభిషేకం చేశారు. ఆ అభిషేకజలమే “ఓంకారనది” గా, “ఓగేరు” గా చేరుంజర్ల లో ప్రవహిస్తోంది.

దశ సహస్ర లింగేశ్వరుడు
ఆంథ్ర మహాభారతం లోని అరణ్యపర్వం లో కూడ ఈ కథ కన్పిస్తోంది. ఇక్కడ పై కథ లోని త్రిమూర్తులకు బదులుగా ఇంద్రాగ్నులు శ్యేన(డేగ) కపోతాలుగా వచ్చి శిబి చక్రవర్తి త్యాగ గుణాన్ని పరీక్షించాయి. ఈ కథ లో తన శరీర భాగాలు తూకానికి చాలక పోవడం తో శిబి చక్రవర్తి తనకు తాను గా త్రాసులో కూర్చొని తన దాన శీలతను చాటాడు.

శిబి చక్రవర్తి గాథ బుద్ధుని చరిత్రకు సంబంథించిన అవధాన శతకం లో “శిబిజాతకము” అనే శీర్షికతో కన్పిస్తోంది.

కపోతేశ్వర స్వామి. : కపోతేశ్వర లింగం స్వయంభువు గా చతురస్రాకారపు వేదిక పై దర్శనమిస్తుంది. అభిషేకజలం వెలుపలికి పోవు మార్గం లేదు. ఈ లింగము గుండ్రము గా కాకుండా కరచరణములు.శిరస్సు లేని మనిషి మొండెము వలే పలకగా నుండును. ఈ లింగాకృతి చుట్టు మాంసము తీసి యిచ్చినట్లు గుంటలు ఉంటాయి. శిబి చక్రవర్తి తన భుజాలను నరికి యిచ్చినట్ల్లు గా లింగాకృతి కి కుడి యెడమల రెండు బిలాలుంటాయి. ఇందు కుడిబిలము నందు ఒక బిందె నీరు మాత్రమే పడతుంది.ఎడమబిలం లో ఎన్ని నీరు పోసినా నిండదు. ఆ ఎడమబిలాన్నినీటితో నింపే ప్రయత్నం ఒకసారి చేస్తే కొంతసేపటికి ఆ బిలం నుండిపొగ, మంటలు వచ్చాయని,అంతట అపరాథ శాంతి చేశారని చెపుతారు అంతేకాకుండా కుడిబిలం లో పోసిన నీరు మరుసటి రోజుకు పచ్చిమాంసపు వాసన వచ్చునని చెప్పుదురు. ఈ నీటిని ప్రతిరోజు కుంచెకోల తో తీయుదురట. అందువలన దీనిని శల్యలింగం గా చెపుతారు. లింగమునకు సహజ యజ్ఞోపవీతం కనిపిస్తుంది. శ్రీ స్వామివారికి ఎడమవైపు మండపం లో శ్రీ పార్వతీ దేవి కొలువు తీరిఉంది.

శ్రీ కపోతేశ్వర స్వామి
గజపృష్ఠాకారం గా ఉన్నఆలయం శిఖరం పై ఎటువంటి కలశాలు లేవు. ఆలయ నిర్మాణ శైలి షోలాపూర్ సమీపం లోని టెరి గ్రామం లో ఉన్న త్రివిక్రమాలయం వలే ఉన్నదని స్థలపురాణం లో ప్రస్తావించారు. కాని చిత్తూరు జిల్లా గుడిమల్లం లోని పరశురామేశ్వరాలయం గజపృష్ట విమాన నిర్మితమని ఇంతకుముందు మనం అందించిన విషయం ఇక్కడ గుర్తుచేసుకుందాం. (చూ. గుడిమల్లం పరశు రామేశ్వరాలయం. ప్రధాన ఆలయానికి ముందు నందిమండపం ఉంటుంది. ఈ నందీశ్వరుడు కుడికంటితో స్వామిని చూస్తున్నట్టుంటాడు. ఈ మండపానికి తూర్పుగా దీప మండపం లో దీపాలచెట్టు ఉంది. దీనిలో కార్తీక,మాఘ మాసాలలో మరియు శివరాత్రి పర్వదినం రోజున భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు.

ఉపాలయాలు.: ఈ ఆలయ ప్రాంగణం నిండా అనేక శివలింగాలు దర్శనమిస్తాయి. కొన్నింటికి చిన్నగుడి గా కప్పు ఉంటే మరికొన్ని నేలపైనే కన్పిస్తాయి. ఆలయం లోని ఒక శాసనాన్ని బట్టి ఈ ప్రాంగణం లో 4444 శివలింగాలున్నట్లుచెప్పబడుతోంది.ఆనాడు శిబి చక్రవర్తి త్రిమూర్తులను కోరుకున్నవరం లో తనతో పాటు వచ్చినవారికి, ఋత్వికులకు, అనుచరులకు కూడ లింగరూపాన్ని అనుగ్రహించమని కోరాడని వారే ఈ లింగరూపాలని చెప్పబడుతోంది. ఆలయం లో ఈశాన్యదిశ గా ఒక వేదికపై దశ సహస్రలింగం ఒకటి దర్శనమిస్తోంది. చిన్నచిన్న గుళ్ల లో ఉన్న శివలింగాలను వేరు వేరు పేర్లతో భక్తులు సేవిస్తున్నారు. వానిలో దత్తాత్రేయ,నగరేశ్వర,కోటేశ్వర, చిదంబరేశ్వర, శంభులింగేశ్వర, అగస్త్యేశ్వర, అమరేశ్వర, రామలింగేశ్వర, మాధవీఆంజనేయస్వామి మొదలైన ఆలయాలు కన్పిస్తాయి.

శ్రీ మాథవీ ఆంజనేయస్వామి
శాసనాలు. : ఈ ఆలయ ప్రాగణం లో తొమ్మిది శాసనాలున్నాయి. కపోతేశ్వరాలయాన్ని క్రీ.శ 4వ శతాబ్ధం లో చేజర్ల రాజథానిగా చేసికొని పాలించిన ఆనందగోత్రీకులు నిర్మించినట్లు చెప్పబడుతోంది.వీరి మూలపురుషుడు ఆనందమహర్షి. వీరిలో మొదటి వాడు కందరరాజు. ఇతనికి కృష్ణవేణ్ణానాథుడు, త్రికూటపతి , స్వశక్తి శాసితశాత్రవ కరివర ఘటసంకట ధాన్యకటకారస్యసప్తకోటి మొదలైన బిరుదులున్నట్లు తెలుస్తోంది.
కందరరాజు పుత్రిక అవని తలాంతవతి. ఈమె కుమారుడు సత్యభామల్లుడు. ఇ తడు ఈ ఆలయం లో ఒక సంస్కృత శాసనము వేయించెను. క్రీ.శ. 7 వశతాబ్దానికి చెందిన విషమసిద్ధి అను రాజువేయించిన దానశాసనమొకటున్నది. క్రీ.శ.600-630 నాటి మొదటి పల్లవరాజైన మహేంద్రవర్మ దానశాసనము. క్రీ.శ 1140, 1165,1247నాటి శాసనాలు, మరుమ వంశజుడైన కేతిరెడ్డి క్రీ.శ. 1163 లో వేయించిన శాసనం. అవధూత తుంగదుర్తి బుచ్చయ్య గారు వేయించిన శాసనం,రంగోజు రాముడు వేయించిన శాసనాలు ఈ ఆలయ, ప్రశస్తి, ప్రాభవాలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
ఓంకారనది.: దీనినే “ఓగేరు” గా పిలుస్తున్నారు. ఈ ఆలయం సప్త ప్రాకారనిర్మితం గా చెప్పబడు తున్నా, ఇప్పుడు రెండు ప్రాకారాలే ఉన్నాయి. మొదటి ప్రాకారానికి దక్షిణం గా ఈ”ఓగేరు” నది ప్రవహిస్తోంది. శిబి చక్రవర్తి కపోతేశ్వరుడై వెలసిన పిదప దేవతలందరు ఓంకారోచ్చారణ తో ఆకాశ గంగా జలాన్ని ఆ లింగముపై అభిషేకము చేయగా ఆ నీరంతా భూగతమై లింగము క్రిందు గా ప్రవహించి “ఓంకారనది” గా ఏర్పడినదని స్థలపురాణం. ఈ నది కపోతేశ్వరుని ఆలయము ప్రక్కనుండి ప్రవహించి,కోటప్పకొండ సమీపంగా వెళ్లి,సముద్రంలో కలుస్తోంది.

పుష్పగిరి నుండి శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయదృశ్యం
శ్రీ మాథవస్వామి ఆలయం.;-- ఇంత ప్రసిద్ధమైన శివక్షేత్రం లో కపోతేశ్వరస్వామి గర్భగుడి ఈశాన్యం గా శ్రీ మాథవస్వామి ఆలయముంది. ఈ ఆలయ ముఖమండపం లో ఆంజనేయస్వామి కొలువు తీరి ఉంటాడు. ఈయననే మాథవీ ఆంజనేయస్వామి అని భక్తులు సేవించుకుంటారు. శిబిచక్రవర్తి తల్లి పేరు మాథవీదేవి. అందువలన ఆవిడ పేరుమీద ఈ ఆలయనిర్మాణం జరిగినట్లుగా పరిశోథకులు భావిస్తున్నారు.

శ్రీ కుమారస్వామి కొండ.: దీనినే సంజీవి కొండ, పుష్పగిరి అని కూడ పిలుస్తారు.ఈ కొండ ప్రభావవంతమైనదని ప్రజల నమ్మకం. ఈ కొండ మీద దివ్యౌషథులున్నాయని చెప్పుకుంటారు. ఈ కొండమీద కొలువు తీరిన సుబ్రమణ్యేశ్వరస్వామిని సేవిస్తే చికిత్సలేని రోగాలు కూడ తగ్గుతాయని,కోరికలు తీరతాయని, నిస్సంతులు సంతానవతులౌతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

పుష్పగిరి కొండ పై కొలువుతీరిన కుమారస్వా మి
పుష్పగిరి సుందరదృశ్యం
ఉత్సవాలు: ఇచ్చట మహాశివరాత్రి గొప్ప ఉత్సవంగా చేస్తారు.తొలిఏకాదశి, దసరా, కార్తీకపూర్ణిమ,ముక్కోటి, సంక్రాంతి, సంవత్సరాదులకు శ్రీ స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.

ప్రయాణం.: గుంటూరుజిల్లా నరసరావుపేట నుండి కుంకలగుంట మీదు గా చేజర్ల కు ఆర్టీసి సర్వీసులు కలవు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top