మాఘస్నానం, మాఘమాస స్నానం - Maghamasa Snanam, Divine Maghamasa Bathing

0
మాఘస్నానం, మాఘమాస స్నానం - Maghamasa Snanam, Divine Maghamasa Bathing
స్నానము :
మనము ప్రతిరోజూ చేసే స్నానము శరీర శుభ్రతకోసము చేస్తాము. కొందరు వేడినీరు స్నానము చేస్తారు. తల శుభ్రతకోసము ప్రతిరోజూ తలస్నానము చేసేవారూ ఉన్నారు. విధిగా వారానికి ఒకసారైనా తలస్నానము చేయాలి. స్నానానికి మంచినీరే వాడాలి. పూర్వము నదులన్నీ తాము పుట్ట్టిన ప్రాంతము నుండి కొండలు , అడవులు దాటి రావడము వలన నీరు స్వచ్చము గాను వనమూలికల మయమై ఔషధ గుణాలు కలిగిఉండేవి. ఎటువంటి మలినాలూ , రసాయనాలు , మురికినీరు కలిసేవికావు . అలా ప్రవహించే నదినీటిలో స్నానము చేస్తే ఆరోగ్యము గా ఉండేవారు. కానీ ప్రపంచమంతా పారిశ్రామికమైన తరువాత , జనాభా విపరీతముగా పెరగడము వలన , నదీప్రాంతాలలో పరిశ్రములు  నెలకొల్పడమువలన , బహిరంగ ప్రదేశాలలో మల మూత్రాలు విసర్జించడము మూలంగా నదీజలాలు పూర్తిగా కలుషితమైపోయినవి . పూర్వము పుణ్యము వస్తుందనే నెపముతో నదీస్నానాలను , చలినీటి స్నానాలను ,నీటీప్రవాహ స్నానాలను ప్రోత్సహించేవారు. అదే ఆచారము ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇది ఎంతమాత్రము ఆరోగ్యప్రదమైనది కాదు. పుణ్యము మాట ఏమోగాని ఇప్పుడు నదీస్నానాలు, కోనేరు స్నానాలు , పుష్క్రరస్నానాలు ఏమాత్రము ఆరోగ్యకరమైనవి కావు . కాలము తో పాటు ఎన్నోమార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇదీ అంతే ... ప్రతిదాన్నీ శా్స్త్రీయ పరముగా ఆలోచించాలి . మరి మనపురాణలు ఏమి చెప్పాయో చూడండి.

యాగాల్లో అశ్వమేధం, వ్రతాల్లో సత్యనారాయణస్వామి వ్రతం, ధర్మాల్లో అహింస ఎంత గొప్పవో స్నానాల్లో మాఘస్నానం అంతగొప్పది. అలాంటి మాఘస్నానాన్ని ప్రవాహజలంలో చేస్తేనే అధికఫలితం. అలా మాఘస్నానాలు ఎక్కువగా జరిగే సాగరసంగమ ప్రదేశం కృష్ణాజిల్లాలోని హంసలదీవి. జపం, తపం, దానం, వ్రతం మొదలైనవాటితో కూడా ఆ భగవంతుణ్ణి సంతృప్తిపరచలేమేమోగానీ... మాఘమాసంలో కేవలం స్నానం వల్లనే ఆయన
ప్రసన్నుడై భక్తులను సకలపాపాలనుంచీ విముక్తుణ్ణి చేస్తాడని పద్మపురాణం ఉత్తరఖండంలోని మాఘమాస మహత్యం చెబుతోంది. కార్తీకమాసం దీపప్రజ్వలనకు ప్రత్యేకమైతే... మాఘం స్నానాలకు ప్రత్యేకం. నారద పురాణాన్ని అనుసరించి... దేవతలు తమ శక్తులనూ తేజస్సులనూ మాఘమాసంలో జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘస్నానం చాలా మంచిది. ఈ మాసంలో వస్త్రాలూ గొడుగులూ నువ్వులూ దానంచేస్తే విశేషఫలం లభిస్తుంది.

మాఘస్నానం, మాఘమాస స్నానం - Maghamasa Snanam, Divine Maghamasa Bathing
సూర్యోదయానికి ముందే...
పౌర్ణమినాడు చంద్రుడు మఘ(మఖ) నక్షత్రంతో ఉండే మాసం మాఘమాసం. మాఘమాస మహత్యం బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందుచేసే స్నానాలు ఆరోగ్యదాయకం. సూర్యుడు భూమికి దగ్గరగా వచ్చే కాలమిది. ఈ సమయంలో సూర్యోదయ వేళల్లో సూర్యకిరణాలు ప్రత్యేక కోణాల్లో భూమిపై పడతాయి. అందువల్ల సాధారణ సూర్యకిరణాలకంటే వీటి సాంద్రతలో చాలా తేడా ఉంటుంది. ఈ కిరణాలు నీటిపై పడటం వల్ల ఆ నీరు చాలా శక్తిమంతమవుతుందట. అందుకే, జనవరి 20 నుంచి మార్చి 30 వరకూ సూర్యోదయానికి ముందుచేసే స్నానాలు చాలామంచివని చెబుతారు.

మాఘమాసం సూర్యసంబంధమైన అర్చనామాసం. ఈ నెలలో ఆదివారం చాలా పవిత్రమైనది. ఈ రోజున తలస్నానం చేసి, సూర్యభగవానుడికి నమస్కరించాలి. ఆదిత్యహృదయం, సూర్యాష్టకం వంటివి చదవాలి. మాఘంలో సూర్యోదయానికి ముందు నక్షత్రాలున్నప్పుడు చేసే స్నానమే అత్యుత్తమమైనది. సూర్యోదయం తరవాత చేసే స్నానం నిష్ఫలమైనది. మాఘమాసమంతా నదీస్నానం చేయలేనివాళ్లు కనీసం మూడురోజులైనా
చేయాలట. ఈనెలలో అమావాస్యనాడు ప్రయాగలో స్నానంచేస్తే సమస్త పాపాల నుంచీ విముక్తి లభిస్తుందని మహాభారతంలోని అనుశాసనిక పర్వం చెబుతోంది.

సనాతనధర్మంలో స్నానానికి ఎంతో విశిష్టస్థానం ఉంది. మనం రోజూ చేసే స్నానం దేహాన్ని శుద్ధిచేసి, మనలోని ప్రకోపాన్ని తగ్గించి, ప్రశాంతతను చేకూరుస్తుంది. ఈ స్నానాలు నిత్య, నైమిత్తిక, కామ్య, క్రియాంశ, అభ్యంగన, క్రియా అని ఆరు రకాలు. ఇందులో వైశాఖ, కార్తీక, మాఘమాసాల్లో ప్రత్యేక ఫలితాలను కోరి చేసే స్నానాలనూ; యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాలనూ కామ్యస్నానాలుగా చెబుతారు. ఇలాంటి స్నానం ప్రవాహజలాల్లో... ముఖ్యంగా
సాగరసంగమ ప్రదేశాల్లోనూ చేస్తే ఇంకా మంచిదట.

కృష్ణా సాగరసంగమం
పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వర్‌లో పుట్టిన కృష్ణానది... మహారాష్ట్ర, కర్ణాటకల మీదుగా మనరాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కృష్ణా జిల్లాలోని పులిగడ్డ వద్ద రెండు పాయలుగా చీలిపోతుంది. కుడిపాయ నాగాయలంక వైపు, ఎడమపాయ కోడూరు మండలం హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. కృష్ణానది సముద్రంలో కలిసే ఈ ప్రాంతాన్నే సాగరసంగమం అంటారు. ఇక్కడి ప్రధాన ఆలయం వేణుగోపాలస్వామి గుడి. దీన్ని 1250 ప్రాంతంలో కాకతీయ గణపతిదేవుడు అభివృద్ధి చేశాడని చరిత్ర. గంగానది మనుషుల పాపాలతో కల్మషమైపోయి పాపభారాన్ని మోయలేక తన బాధను విష్ణుమూర్తితో మొరపెట్టుకుందట. 'పాపానికి చిహ్నంగా నలుపు రంగును ధరించి కాకిగా మారి నదుల్లో మునుగుతూ వెళ్లు... ఎక్కడైతే నీ నలుపు రంగు పోయి తెల్లగా మారతావో అప్పటితో నీ పాపాలు పోతాయి' అని చెప్పాడట శ్రీహరి. అలా గంగానది కాకిలా మారి పుణ్యనదుల్లో స్నానాలుచేస్తూ రాగా... హంసలదీవిలోని సాగరసంగమంలో స్నానం చేయగానే నలుపురంగుపోయి తెల్లగా హంసలా మారిపోయిందట. అలా ఈప్రాంతానికి హంసలదీవి అనే పేరు వచ్చిందట. ఇంత పవిత్రమైన ఈ ప్రాంతంలో దేవతలే శ్రీహరికి ఆలయాన్ని నిర్మించాలనుకున్నారట. దీనికోసం రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చారట దేవతలు. ఆలయం పూర్తయి, ముందున్న రాజగోపురాన్ని నిర్మిస్తుండగా సూర్యోదయం అయిపోయిందట. ఇంతలో కొందరు దేవతలు వెళ్లిపోగా... మరికొందరిని మనుషులు చూడటంతో వాళ్లు శిలలైపోయారట. ఆలయ పరిసరాల్లో కనిపించే శిల్పాలు ఆ దేవతలవే అని చెబుతారు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top