ముక్తినాథ దేవాలయము-నేపాల్ - Muktinath Temple Nepal

0
శ్రీమహావిష్ణువుకు మరో రూపమే సాలగ్రామం. హిమాలయ సానువుల్లో గండకీనదిలో ఈ సాలగ్రామాలు లభ్యం అవుతుంటాయి. వాటిని తెచ్చుకుని భక్తితో పూజలు చేయడం మన సంప్రదాయం. సాలగ్రామ మూర్తిగా నిత్యం పూజలందుకునే మహావిష్ణువు స్వయంగా వెలసిన క్షేత్రం సాలగ్రామ క్షేత్రం. దీనికే ముక్తినాథ్ అనే ఇంకోపేరు ఉంది. ఈ క్షేత్రం నేపాల్ దేశంలో ఉంది.

ముక్తినాథ్ ఈ దేవాలయ దర్శనముతో కష్టములు/బాధలు అన్నీ తొలగిపోతాయని నమ్మకము. (ముక్తి=నిర్వాణము,నాథ్=దేవుడు). ముక్తినాథ్ యొక్క ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రము నేపాల్ లో ముస్తంగ్ జిల్లాలో, జామ్సం కు 18 కిలోమీటర్లలలో తూర్పు, దక్షిణదిశగా, దాదాపు 3,749మీటర్ల ఎత్తులో నెలకొని ఉంది. ముఖ్య దేవాలయము వరహా ఆకారములో ఉన్న వైష్ణవ ఆలయము. గోడల్లోంచి 108 పుణ్యతీర్థ జలధారలు వస్తుంటాయి. ఈ దేవాలయము ఎత్తైన కొండపైన నెలకొని ఉంది, అందువలన వాతావరణము అనుకూలముగా ఉన్నప్పుడు మాత్రమే దర్శనీయముగా ఉంటుంది. ఖాట్మండు నుంచి ముక్తినాథ్ కు వెళ్ళడానికి రెండు మార్గములు ఉన్నాయి. ఒకటి, విమానములో ఖాట్మండు లో బయలుదేరి, పోఖరా గుండా జామ్సం చేరి, అక్కడి నుంచి కాగ్బెని ద్వారా ఏడు నుండి ఎనిమిది గంటల నడక ద్వారా చేరుకోవచ్చు. లేదంటే, పోఖరా నుంచి మొత్తము నడిచి వెళ్లడము, ఇది ఏడు నుంచి ఎనిమిది రోజులు పడుతుంది. నాలుగు ధామముల యాత్ర పూర్తి చేసిన తరువాత ఈ యాత్ర చేయవలెనని నమ్ముతారు. ఈ దేవాలయ పవిత్రతను హిందువులు,బౌద్దమతస్థులు కూడా విశ్వసిస్తారు. దగ్గరలో ఉన్న జ్వాలామాత మందిరములో భూగర్భంలోని సహజ వాయువుల వలన నిత్యమూ వెలుగుతున్న ఒక జ్యోతి ఉంది. అన్నపూర్ణ ప్రాంతములో, జామ్సమ్ ఒక మంచి కూడలి. ఇక్కడ ప్రపంచస్థాయి వసతి సౌకర్యాలు కలవు, వీటి ద్వారా ఎవరైనా ఈ ప్రకృతి సౌందర్యమును చక్కగా ఆస్వాదించవచ్చు.

వేసవి కాలంలో ఈ ఆలయం చూడడానికి అనుమతిస్తారు. ఈ సీజన్‌లో రోజుకు 300 మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ క్షేత్రంలో నాలుగు చేతులున్న నారాయణుని ప్రతిమ ఉంది. ఇక్కడ స్వామికి నాలుగు చేతులున్నా ఆయుధాలు ధరించినట్టు లేకపోవడం విశేషం. ఇది నారాయణుని స్వయంవ్యక్త ప్రదేశం. అందుకే దీనికి అంత ప్రాధాన్యత ఉంది. శ్రీ వైష్ణవులు ఎంతో భక్తితో సేవించుకునే 108 దివ్య క్షేత్రాల్లో ఇది ఒకటి . ఆలయంలో ముక్తినాథ్ (నారాయణుడు) స్వామి, శ్రీదేవి, లక్ష్మీదేవి, గరుడాళ్వార్, రామానుజుల వారి పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు సాలగ్రామాలు కూడా ఉన్నాయి. అక్కడ వారి సంప్రదాయంలో స్వామికి హారతి ఇచ్చే అవకాశం లేదు. నేతితో దీపం పెట్టడం వరకు అనుమతిస్తారు.

ఈ క్షేత్రంలో స్వామి విగ్రహమూర్తిని కాకుండా సాలగ్రామ శిలను పూజించడం శ్రేష్ఠం అంటారు. గుడి బైట రామకోటి స్తంభం కన్పించింది. దానికి కూడా ప్రదక్షణ చేసి కాస్సేపు కూర్చుంటారు . అక్కడున్న సాధువుల మాటల ప్రకారం ఈ ముక్తినాథ్ ఆలయానికి అతి చేరువలో అంటే నాలుగైదు కిలోమీటర్ల దూరంలో గండకీ నది ఉద్భవించిన స్థలం ఉంది. సాయంత్రం అయితే కొండ దిగడం కష్టమని అంటారు . కొండ ఎక్కేటప్పుడు ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు. కాని దిగుతున్నప్పుడు మాత్రం ఆక్సిజన్ అందక కొంతమంది ఇబ్బంది పడతారు. ఆగి ఆగి కిందకు దిగుతూ దారిలో శ్రీవారి ప్రతిరూపాలైన సాలగ్రామాలు, వింజామరలు కొనుగోలు చేసి, బయల్దేరిన శ్యాంసన్ ప్రాంతానికి చేరుకుంటారు . ఆ సాయత్రం వేళ కొండలపై పడుతున్న ఎండ ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది .

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top