నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Sunday, January 14, 2018

అహొబిలం నరసింహ స్వామి - Ahobilam Lakshmi Narasimha Swamy

 అహొబిలం మహత్యం:
ఈ పుడమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసిం హ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి.రాక్షసుడైన హిరణ్యకశ్యపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు, ఉద్భవించిన స్ధలమే ఈ అహోబిలక్షేత్రము. ఈ స్ధల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతం నందు "బ్రహ్మండపరాణం" అంతర్గతంలో 10 అధ్యాయాలు.1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడినది.
 • కృతయుగం నందు హిరణ్యకశ్యపుని సం హర అనంతరం పేట్రేగిన కోపంతో నున్న ఉగ్ర నరసిం హ స్వామిని శాంతింప చేయుటకు పరమశివుడు, నృసిం హ మంత్రరాజుమును "మంత్రరాజ పద స్తోత్రం" గా స్తుతించి నృసిం హుని శాంతింపజేసినట్లు "బ్రహ్మాడపురాణం" లో కలదు. అందుకే ఎగువ అహోబిలం నందు గర్భగుడి ప్రక్కగుహలో జ్వాలా నరసిం హ స్వామిని పరమశివుడు ఆరాధించినట్లుగా మనకు దర్శనమిస్తున్నారు.
 • "విష్ణుపురాణం" నందు శేషధర్మము 70 అధ్యాయం లో "విరుద్ధ ధర్మ ధర్మిత్వం" లో త్రేతాయుగమున శ్రీరాముల వారు దండకారణ్యమున సీతాన్వేషణకై వెళ్ళినప్పుడు అహోబొల నరసిం హస్వామిని దర్శించి 'నృసిమ్హ పంచామృత స్తోత్రం'తో ఆరాధించినట్లు పురాణం చెబుతుంది.
 • "శ్రీ మద్భాగవతము" నందు ద్వాపర యుగమున పంచపాండవులు అహోబిల నరసిం హుని పూజించునట్లు పురాణము చెబుతున్నది.
 • కలియుగం నందు "అర్భావతారము"గా వేంకటేశ్వరస్వామి, పద్మావతి దేవికి విళంబి నామ సం వైశాఖ శుద్ధదశమిలు, శుక్రవారం నాడు వివాహ సమయమున తమ వివాహనికి చేసిన ప్రసాదములను శ్రీ అహోబిల నరసిం హస్వామికి నివేదించవలసినదిగా బ్రహ్మడేవుడు పలికెను.
"శ్రీ వేంకటేశేనా వివాహ కాలే సంపూజితం సర్వవిదోప చారైహిః అనునట్లు వేంకటేశ్వర స్వామి లక్ష్మీనరసిం హ స్వామిని ప్రతిష్టించి, ప్రసాదాలను నివేదించి మహమంగళారతులు చేసినట్లు "వేంకటాచల మహత్యం" చెబుతుంది. వేంకటేశ్వరుడు దిగువ అహోబిలానికి వేంచేసి స్వామిని ప్రతిష్ఠించి వివాహం చేసుకున్నాడు కావున ఈ నాటికి శ్రీ నృసిం హ స్వామి వారి కళ్యాణోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్ధానం వారు పట్టు పీతాంబర వస్త్రములు అహోబలేశ్వరునికి ప్రతి సంవత్సరం సమర్పిస్తున్నారు.

ఈ క్షేత్రానికి ముఖ్యమైన ఆళ్వారులు కూడా వచ్చి అహోబలేశ్వరుని దర్శించినట్లు తెలియుచున్నది. గురుపరం పరాధీనలో వైష్ణవ సాంప్రదాయాన్ని అభివృద్ధి చేయుటకు రామానుజాచార్యుల వారు 11వ శతాబ్దంలో అహోబిలం వేంచేసి నరసిం హ స్వామిని దర్శించి అనుగ్రహన్ని పొందినారు. ఆ తరువాత వైష్ణవ పరంపరాధీనతోనే శ్రీ నిగమాంత దేశిక స్వామి అను పండితునకు ఉత్తర భారత దేశ యాత్ర చేసినప్పుడు అహోబిల క్షేత్రమును దర్శించునట్లు ఆధారములు కలవు.

దేవతలకు మాత్రమే ప్రవేశించడానికి సాధ్యమైన ఎగువ అహోబిల క్షేత్రాన్ని 8వ శతాబ్దంలో వైష్ణవ సన్యాసి అయిన తిరుమంగై ఆళ్వార్ దర్శించి నరసిం హ సార్వభౌముని 10 పాశురములతో కీర్తించినారు. ఈ పది పాశురములు "నా లాయిర దివ్య ప్రభంధం" నందు కలవు.
ఈ క్షేత్రానికి వివిధ సామ్రాజ్యాలకు చెందిన రాజులు దర్శించినట్లు శాసనాలు కలవు. విక్రమాదిత్య అను మహరాజు (1076-1106) పశ్చిమ తీరపు రాజులు, చాళక్యులు, కాకతీయులు, విజయనగరాదీసులు, రెడ్డిరాజులు ఈ మూల విగ్రహం ను దర్శించినట్లు ఆధారాలు కలవు. కాకతీయ వంశంలో చివరి రాజైన ప్రతాప రుద్రుడు అహోబిలం వేంచేసి ముఖ్యమైన బంగారు విగ్రహాలు మంటపాలు దేవాలయం నిర్మించినట్లు ఉత్సవల కోసం తగు నిధిని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నాయి.
ఆది శంకరాచార్యుల వారు "పరకాయ ప్రవేశం" చేసినప్పుడు తన చేతులు లేకుండా పోయినందున, ఉగ్ర నరసిం హ స్వామిని "కరావలంబ స్తోత్రము" చేయగా ఆయన చేతులు తిరిగి వచ్చినవి. ఈ స్తోత్రము "20" శ్లోకాలలో నరసిం హ స్వామిని వర్ణించాడు. ఈ సన్నివేశం అహోబిలం నందు (788-820)లో జరిగింది.
అహొబిలం నరసింహ స్వామి - Ahobilam Lakshmi Narasimha Swamy
అహోబిల నవనారసింహ వైభవం : 
అహోబిల క్షేత్రమందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ, దిగువ అహోబిల చుట్టు ప్రక్కల వెలసియున్నారు. అవి ముక్తి కాంత విలాసాలు. అహోబిల క్షేత్రం లో నవ నారసింహులకు ప్రత్యేక సన్నిధానములున్నవి. నిసర్గ రమణీయమైన నల్లమల అడవులకే సింగారమై నిలిచినారు. తొమ్మిదిమంది నరసింహ మూర్తులు అహోబిల మొదటి పీఠాధిపతి "ఆదివణ్‌ శఠగోపయతి" బోధనలతో ఆవేశాన్ని పొందిన అన్నమాచార్యులు గానం చేసిన నవనారసింహాకృతి మనకు శృతి భూషణం.
నవనారసింహ - నమో నమో
భవనాశి తీరయహో - బల నారసింహ ||నవ||
జ్వాలాహోబల, మాలోల క్రోడ,కారంజ, బార్గవహ:,
యోగానంద, చ్చత్రవట, పావన నవమూర్తయ: 
ఈ మంత్రము నవనారసింహుల మంత్రము, అన్నమయ్య తన పద కవితల యందు అహోబిల, జ్వాలా, యోగానంద కానుగమాని, (కారంజ), భార్గవ, వరాహ, నరసింహుల పేర్లు శ్లోకం లో సంప్రదిస్తున్నవి. మట్టెమళ్ళ, ప్రహ్లద, శ్రీ నారసింహులు, చత్రవట మాలోల, నృసింహులను ఉద్దేశించినవి. పావన నవ నారసింహులలో అన్నమయ్య నవరసాలను ఉగ్గడించాడు. వరుసగా రౌద్ర, వీర, కరుణ, శాంత, భీభత్స, శృంగార, అద్భుత, భయానక, సంతోషం అని తొమ్మిది రసాలుగా అభివర్ణించాడు. ఈ నవనార సింహ క్షేత్రములందలి అన్ని విగ్రహములు దేవతలు ప్రతిష్ఠించినవే అని పురాణాలు చెప్పుచున్నవి.

కరుణను ప్రహ్లాదునికి, శాంతమును సకల చరాచరసృష్టికి, శృంగారమును చెంచులక్ష్మికి ప్రసాదించినాడు. ఈ అహోబిల నారసింహుడు.
జ్వాలా నరసింహ క్షేత్రము
అహోబిల నరసింహ స్వామి
మాలోల నరసింహ స్వామి
వరాహ నరసింహస్వామి (క్రోడా)
కారంజ నరసింహస్వామి
భార్గవ నరసింహస్వామి
యోగానంద నరసింహస్వామి
చత్రవట నారసింహస్వామి
పావన నరసింహ స్వామి
జ్వాలా నరసింహ క్షేత్రము
వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీ మన్నారాయణుడు తొణకలేదు, కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరహిగా ఆవిర్భవించాడు. ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని "జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు.

అహోబిల నరసింహ స్వామి
ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా "స్వయంభు" తనకు తానే సాలగ్రామముగా, ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు. ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం. ఈ అహోబిలానికి దేవతలు స్తుచించినందున అహోబలం అని, బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు.

మాలోల నరసింహ స్వామి
వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా "మా" అనగ లక్ష్మిలోల యనగ "ప్రియుడు" అని అర్ధం. ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో ఈ ఆలయం కలదు. స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడినది. ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామ హస్తము లక్ష్మీదేవిని ఆ లింగనము చేసుకొన్నట్లుగా యున్నది. స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు, ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక.

వరాహ నరసింహస్వామి (క్రోడా)
వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి.

కారంజ నరసింహస్వామి
కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.

గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు "నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదనగా" నృసింహుడు నేనే శ్రీరాముడ నేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు. ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు. అందుకే అన్నమయ్య "పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ" అని పాడారు.

భార్గవ నరసింహస్వామి
పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. ఈ స్వామిని "భార్గోటి" అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమై శంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, అసురుని ప్రేవువులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు, ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, ప్రభావళి నందు దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది.

యోగానంద నరసింహస్వామి
యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు. యోగపట్టంతో, విలసిల్లినాడు, ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.

చత్రవట నారసింహస్వామి
పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి వారికి శప విమోచనం గావించెను. కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు.

పావన నరసింహ స్వామి
పరమపావన ప్రదేశం లో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించ గలిగే వాడని అర్ధమగుచున్నది. మరియు "భరద్వాజ" ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో యున్నది. పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు.
అహొబిలం నరసింహ స్వామి - Ahobilam Lakshmi Narasimha Swamy

పెన్నహోబిలం లక్ష్మి నరసింహస్వామి
ఆంధ్రరాష్ట్రములో గరుడాద్రి పర్వత ప్రాంతంలోని దట్టమైన అరణ్యప్రదేశం పవన నది ఒడ్డున చెంచుల కులంలో పుట్టింది ఒక అందాలరాశి. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశం అయినందున ఆమెను చెంచులక్ష్మి అని పిలిచేవారు.
 • అదే అడవిలో మరోవైపున హిరణ్యాక్షుని సంహరించడానికి నారాయణుడు నరసింహావతారం ఎత్తాడు. హిరణ్యకశివుడిని ద్వారంపై కూర్చుని తన ఒడిలో పెట్టుకుని తన పదునైన చేతిగోళ్లతో సణరించాడు నారాయణుడు. అయినా నరసింహస్వామి క్రోధావేశాలు తగ్గలేదు. ఆ అరణ్యంలో రౌద్రావతారంలో సంచరించేవాడు.
 • ఆ సమయం మహాలక్ష్మి అంశమైన చెంచులక్ష్మి ఆ చోటుకి వచ్చింది. ఆమెను చూసిన నరసింహస్వామి మైమరచిపోయాడు. తగ్గని క్రోధావేశాలు అదే క్షణంలో మాయమయ్యాయి. అడవిలో తిరిగే అటవికులు జాతిలో పుట్టినందున చెంచులక్ష్మి స్వామివారికి మాంసము, మధువులను సమర్పించి భుజించమని చెప్పింది. తనౌ వివాహం చేసుకుంటే అవన్నీ తప్పక భుజిస్తానని అన్నాడు శ్రీనరసింహస్వామి. 
 • అటవికి జాతివారు మరో జాతి వారిని ఎలా వివాహం చేసుకోగలరని ప్రశ్నించడం మొదలు పెట్టారు చెంచులు. గరుడాద్రి పర్వత శ్రేణిలో ఒక చిన్న గుహ గుండా బయటపడి ఒక కొండ ఎక్కి అక్కడే లక్ష్మీదేవిని పరిణయమాడాడు నరసింహస్వామి. 
 • ఆ కొండపైన ఇద్దరు కొలువైయ్యారు. ఉద్దాలక మహర్షి ఓసారి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారి కటాక్షమున్నట్టు తెలుసుకుని కఠిన తపస్సు చేశాడు. అయితే ఆయన శ్రీలక్ష్మి నరసింహస్వామిగా అక్కడున్నట్టు ప్రపంచానికి చాటిచెప్పలేదు. అయితే ఈ విషయం మరో సంఘటన ద్వారా తెలిసింది. 
 • ఆ కొండ క్రింది భాగాన గొల్లపల్లి అనే గ్రామము ఉంది. గొల్లలు ఎంతో ప్రశాంతంగా జీవించేవారు. ఈ గ్రామంలో గల ఒక గోవు ప్రతిదినము స్వామి వద్ద క్షీరము ఇస్తూ వుండినది. గోవు యజమాని తన గోవు పొదుగులో పాలు లేకుండట గమనించి కలత చెందాడు. శ్రీ నరసింహస్వామి ఆయనకు కలలో కనిపించింది నీ గోవు పాలను సేవించుచున్నానని తెలియజేశాడు. 
 • సంతోషపడిన గొల్లవాడు బిలప్రాంతము శోధించగా బిలముపై భాగమున శ్రీ స్వామివారి పాదముద్రిక గల శిలాఫలకము మరియు గిరి క్రింది భాగమున నైరుతి దిశన శ్రీ లక్ష్మిదేవి శిల కనిపించినదట. 
 • గొల్లపిల్ల వాసులు శ్రీవరికి శ్రీ అమ్మవార్లకు చిన్న ఆలయములు నిర్మించి పూజలు చేస్తుండేవారు. విజయనగరం సామ్రాజ్యాధీశుడైన సదాశివరాయులు వారు విజయనగరము నుండి పెనుగొండ దుర్గమునకు పయనించుచూ ఈ క్షేత్రము వద్ద మజిలీ గావించాడట. 
శ్రీ సదాశివరాయల వారికి శ్రీలక్ష్మి నరసింహస్వామి కలలో కనిపించి తన జైత్రయాత్ర దిగ్విజయమగునని ఆశీర్వదించాడట. సదాశివరాయల వారు దిగ్విజయుడై తన జైత్రయాత్ర తిరుగు ప్రయాణములో స్వామివారిని దర్శించి లక్ష్మి నరసింహస్వామి వారికి శ్రీలక్ష్మిదేవి అమ్మవారికి ఆలయాలు నిర్మించారు. పెన్నానది ఒడ్డున ఒక కొండపై స్వామివారి పాదముద్రిక క్రింది భాగమున బిలం ఉండుట వల్ల ఈ క్షేత్రం పెన్నహోబిల క్షేత్రమని పిలువబడుచున్నది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనతపురం ఉరవకొండ రహదారి పక్కన పెన్నా నదికి 3 కి.మీ దూరమున ఒక గిరిపై శ్రీ పెన్నహోబిల లక్ష్మినరసింహస్వామి ఆలయం వెలిసింది. ఒక చిన్న కొండపై ఆలయం గోపుర ద్వారం దాటి విశాలమైన బయటి ప్రాకారం.
ఎడమవైపు వున్న ఒక చిన్న సన్నిధిలో చెన్నకేశవస్వామి వెలిశాడు. బలిపీఠం తర్వాత ధ్వజస్తంభం గరుడభగవాన్‌ సన్నిధి న్వున్నాయి. ఆ తర్వాత 45 అడుగులున్న రెండు స్తంభాలు వాటిపై ఆంజనేయస్వామి నమస్కరిస్తున్నట్టున్న విగ్రహం.
రెండింటిలో ఒకటి దీపస్తంభం. ఇంకోకటి సదాశివరాయల వారి విజయానికి ప్రతీకగా విజయస్తంభం. చిన్న మండపందాటి వెళ్తే గర్భగుడిలో లక్ష్మి నరసింహస్వామి కూర్చున్నట్టున్న విగ్రహం. అందమైన విగ్రహం కరుణచూపే కళ్లు పెద్దమీసం, పై కుడిచేతిలో చక్రం ఎడమచేత శంకం కింది కుడి చెయ్యి అభయహస్తం, ఎడమచేత అమ్మవారిని పట్టుకున్నట్టున్న విగ్రహం.
అలనాడు నరసింహస్వామి లక్ష్మిదేవిని గాంధర్వ వివాహం చేసుకున్న పవిత్రమైన చోటే ఈ గర్భగుడి. ఇక్కడ స్వామివారి కుడి పాదముద్రిక కనిపిస్తుంది. దానిప్రక్కనే ఆయన అహోబిలం నుండి వచ్చిన ద్వారం కనిపిస్తుంది.

స్వామి ముందు నిలబడి మనస్పూర్తిగా ధ్యానిస్తే మనసు సేదతీరుతుంది. ఎంతో ప్రశాంతత లభిస్తుంది. స్వామివారి ఈ గుహలో వివాహం చేసుకున్నందున ఈ స్వామిని భక్తితో మొకుకున్న వారికి పెళ్లి జరుగుతుంది. అభీష్టం నెరవేరుతుంది.

వివాహం జరగాలని ప్రార్ధించడానికి ఆకు పూజ జరిపిస్తే నలబై రోజులలో ఆ కోరిక నెరవేరుతుందని స్ధానిక భక్తజన నమ్మకం. ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామి కల్యాణోత్సవము ప్రతిరోజూ జరుగుతూనే వుంటుంది.

పెళ్లి వేడుకలు సందర్భంగా అన్నదానమూ జరుగుతుంది. పెళ్లి బృందం ఉండడానికి ఆలయ కమిటి గదులను అద్దెకిస్తుంది. గిరికి క్రిందిభాగాన పుష్కరిణి వుంది. పుష్కరిణి ఆనుకుని ఎన్నో దుకాణాలు ఉన్నాయి. పక్కనున్న ఊళ్ల నుండి వచ్చేవారు ఇక్కడ వంట చేసుకుని వనబోజనాలు చేసి సంతోషంగా గడుపుతారు.

అశాశ్వతమైన ఈ జీవితంలో ప్రతిక్షణమూ ఎంతో అమూల్యమైనదని తెలుసుకుని ప్రతి మనిషి సంతోషంగా ప్రాశాంతంగా జీవిస్తే ఎంతో మంచిది. ఆ ప్రశాంతత ఈ దేవాలయంలో తప్పక లభిస్తుంది. పెన్నహోబిలానికి రండి స్వామిని దర్శించి తరించండి.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com