భధ్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి - Bhadrachalam Sri Seetha Ramachandra Swamy

0
భధ్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి - Bhadrachalam Sri Seetha Ramachandra Swamy

భధ్రాచలం:
వరంగల్లు నుండి డోర్నకల్ చేరి బండి మారి భద్రాచలం రోడ్డు స్టేషను చేరవచ్చును. అక్కడినుండి బస్సులలో భద్రాచలం చేరవచ్చును. భద్రాచలం చాలా చిన్న ఊరు. సుమారు 10 నుండి 15 వేలలోపు జనాభా. క్షేత్ర పాశస్త్యము చాల విశేషం. ఇక్కడి క్షేత్రం జాతీయ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. పావన గోదావరి వొడ్డున శ్రీ సీతారామచంద్ర స్వామి వేంచేసియున్న ఆలయము చరిత్ర ప్రసిద్ధము.

క్షేత్ర వైభవం:
మేరువుకు భద్రుడనే కొడుకున్నాడు. ఈయన ఒక పర్వతరాజు. ఇతడు గౌతమీ తీరంలోగల దండకారణ్యంలో ఘోరమైన తపస్సు చేసి శ్రీరామచంద్రుని సాక్షాత్కారాన్ని పొందాడు. శ్రీ రాములవారు వరం కోరుకొమ్మని అడిగితే కైలాసగిరి మీద శివుడలంకరించునట్లు తన శిఖరముమీద శ్రీ సీతారామలక్ష్మణ సమేతులైన రామ ప్రభువును తన శిఖరము నలంకరించి జీవులకు మోక్షసామ్రాజ్య మందించవలయునని కోరుకొన్నాడట భద్రుడు. అతని కోరిక ప్రకారం అక్కడకు సీతాలక్ష్మణ సహితులైన రామప్రభువు వేంచేసి కొలువుదీరి యున్నాడు.

ఇది సంగ్రహంగా పురాణ కధ. 
కంచర్ల గోపన్న గొప్ప రామభక్తుడు. ఆనాటి తానీషా ప్రభువు దక్కను సామ్రాజ్యాన్ని ఏలుచున్నవాడు. ఆయనకు అక్కన్న, మాదన్న యను మంత్రులున్నారు. వీరు కంచర్ల గోపన్నకు దగ్గర బంధువులు. వారి ప్రాపకంవల్ల కంచర్ల గోపన్న 1670లో పరగణాధికారము పొందాడు. 1674 వరకు శ్రీ రామాలయము నిర్మాణం చేయించినాడు. సర్కారుకు కట్టవలసిన పన్నుడబ్బును ఆలయ నిర్మాణానికి వెచ్చించినందుకు 1686 వరకు కారాగారబద్ధుడైనాడు. శ్రీ సీతారామస్వామి లక్ష్మణ సమేతుడైవచ్చి గోల్కొండకోట పట్టణంలో వున్న తానీషా ప్రభువుకు బాకీని చెల్లించి మహా భక్తుడైన శ్రీ గోపన్నను కారాగార విముక్తుని చేసినట్లుగా చెప్పుకుంటారు.
భద్రాచల ఆలయమున గోపన్నగారు చేయించిన బంగారు ఆభరణములన్ని అద్దాల బీరువాల్లో ఇప్పటికీ భద్రంగా వుంచబడినవి. వాటిని కూడా దర్శించవచ్చు.

స్వామి వారి నిత్యోత్సవాలు:
ప్రభాతసేవ, దంత ధావనోత్సవం, బాల భోగాది ఆరాధనలు, పవళింపు సేవ వరకు చూడవచ్చును. పునర్వసు నక్షత్రము గల రోజులు, ఏకాదశి, పూర్ణిమ తిధుల యందు, సంక్రమణముల యందు స్వామి వారికి అభిషేక, సహస్ర నామార్చన, గ్రామోత్సవాదులు చేయబడును.

శ్రీ రామ నవమి కళ్యాణోత్సవము:
ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవము చాలా విశేషము. జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నది. కళ్యాణోత్సవమును తిలకించటానికి లక్షల మంది యాత్రికులు వస్తారు. వసతి సౌకర్యాలు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం విశేషమైన శ్రద్ధాసక్తులతో ఏర్పాట్లు దగ్గర వుండి పర్యవేక్షిస్తారు. ఉత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మెదలయిన ప్రముఖులు, ప్రభుత్వ అధినేతలు, అధికారులు గూడ పాల్గొంటారు. ఇక్కడ జరిగే కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఆలిండియా రేడియో; టి.వి.ల్లో ప్రసారం చేయబడతాయి.
ఈ దేవాలయము ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణంలో, గోదావరి నది ఒడ్డున వున్నది.

రామాలయ ప్రశస్తి:
పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడుకి తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధముగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అని పేరు స్థిర పడింది. దీనినే రామాలయం అని కుడా అంటారు.

గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను 6 లక్షల రూపాయలు సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి - చేయించాడు. ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్ధించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది. దేవాలయమందు సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.

భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచినాడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.

దేవాలయ ప్రత్యేకతలు:
శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కాని భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా కుడి చేతిలో బాణంను ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంఖును ఎడమచేతిలో చక్రంను ధరించి ఉంటుంది. ఇతర దేవాలయములలో సీతమ్మవారు రాముని ప్రక్కన నిల్చుని ఉంటుంది. కాని ఈ దేవాలయములో స్వామి ఎడమ తొడపై ఆసీనయై ఉంటుంది. మిగిలిన దేవాలయాలలో ఇరువురకూ రెండు పీఠాలు ఉంటాయి ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది. అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు కాని ఇక్కడ మాత్రం ఎడమపైపున ఉంటాడు.

నిత్యపూజలు, ఉత్సవాలు,,, కళ్యాణం:
ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణం. ఇది దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ది చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవు తుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ఈ దేవాలయమునకు ప్రతి సంవత్సరం పంపడం జరుగుతున్నది.
ఇక్కడికి దగ్గరలో వున్న ఇతర పర్యాటక ప్రదేశాలు:

పర్ణశాల:
ఇది భద్రాచలంనుండి 35 కి.మీ. దూరంలో ఉన్నది. సీతారామలక్ష్మణులు తమ వనవాసంసమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు. వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర, శిల్ప రూపాలలో ప్రదర్శింపబడుతున్నాయి. ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడిరూపంలో వచ్చిన మారీచుని బొమ్మ. పర్ణశాలకు సమీపంలో ఉన్న సీతమ్మవాగువద్ద సీత ఆరవేసిన చీర గుర్తులనీ, ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్ళనీ కొన్ని చిహ్నాలను చూపిస్తారు. నదికి ఆవలివైపుని రావణుని రథపు జాడలని కొన్ని గుర్తులను చూపిస్తారు. జటాయుపాక (యేటపాక) ఇది భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతాపహరణం సమయంలో జటాయువు రావణుని ఎదుర్కొని, సీతను రక్షించే యత్నంలో తన ప్రాణాలను ఇచ్చిన స్థలంగా దీనిని చెబుతారు. జటాయువుయొక్క ఒక రెక్క ఇక్కడికి 55 కి.మీ. దూరంలో ఉన్న వి.ఆర్.పురం మండలంలో పడిందట.

పాపికొండలు:
పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక కొండల శ్రేణి. ఇవి ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఆనుకొని ఉన్నాయి. సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. పాపికొండల అడవుల్లో వివిధ రకాల జంతువులు, పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉన్నది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణంకు మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top