స్మార్ట్ ఫోన్లతో పెరుగుతున్న సామాజిక రుగ్మతలు ! - Growing social disorders with smart phones

0
స్మార్ట్ ఫోన్లతో పెరుగుతున్న సామాజిక రుగ్మతలు ! - Growing social disorders with smart phones

స్మార్ట్ ఫోన్ల సమాజం
కాళ్ళు చేతులు, కళ్ళు చెవులు లేనివారున్నారు. సెల్ లేనివారు అరుదు. అది అమ్మనాన్నల, భార్యాభర్తల, సంతాన‌ స్థానాలను ఆక్రమించి భ్రష్టు పట్టించింది. మానవ శరీర బాహ్య భాగమైంది. చివరికి మనిషే మొబైల్ లో దూరాడు.     
స్మార్ట్ ఫోన్లలో సామాజిక మాధ్యమాలు: కంప్యూటర్ సౌకర్యాలుగల మొబైల్ ఫోన్ ను స్మార్ట్ ఫోన్ అంటారు. అది బహుళ ప్రయోజన నిస్తంత్రీ హస్త యంత్రం. నేటి విద్యార్థులు, యువత గంటకు 10 సార్లు సెల్ ఫోన్ చూస్తారని పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాపితంగా యువకులు సామాజిక మాధ్యమాలకు బానిసలు. స్మార్ట్ ఫోన్లతో సమాచార సామర్థ్యం, నైపుణ్యత పెరుగుతాయి. అరబ్ వసంత విప్లవం, నిర్భయ నిరసనలు, ప్రజాసంఘాల‌ ఆందోళనా కార్యక్రమాలలో సామాజిక మాధ్యమాలు ప్రధాన పాత్ర పోషించాయి. మాధ్యమాల ప్రభావాల అధ్యయనం, విశ్లేష‌ణల అమెరికన్ సంస్థ 'కామ్స్కోర్' 2017 నివేదికలో, పెద్దలు సగం మొబైల్ వీక్షణ‌ సమయాన్ని మొబైల్ యాప్స్ లో గడుపుతున్నారని పరిశోధనా నిర్దేశకుడు డేవిడ్ గిన్స్బర్గ్, శాస్త్రజ్ఞుడు మొయిర బర్క్ సూత్రీకరించారు. ఫేస్ బుక్ లో ప్రయోజనంలేని వాదసంవాదాలు, చర్చలు వ్యసనంగా మారాయి. రాత్రంతా ఈ రాచకార్యాలు కొనసాగుతాయి. సమయ సదుపయోగ జ్ఞానముండదు. ఈ వ్యసనం ఓపియం, హెరాయిన్ల కంటే ఎక్కువ మత్తుల్లో ముంచుతుంది. భ్రమల్లోపడి నిస్సార అంశాలపై అనుత్పాదక ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. మానవీయత మాయమవుతోంది. పిల్లలు కళ్ళ‌ ముందే చెడిపోతున్నారు. అసాంఘిక, అశ్లీల‌ మాధ్యమ సాధనాలను, అంతర్జాలాన్ని ఆవిష్కరించి జనాల మీదికి వదిలిన శాస్త్రజ్ఞులకు మానవత్వ, సమాజ వినాశనాలు పట్టవు. ధనసంపాదనే వీరి లక్ష్యం.   

స్మార్ట్ ఫోన్ల ప్రభావం:
మొబైల్ ఫోన్ల అతివినియోగంతో అలసట, తలనొప్పి, నిద్రలేమి, మతిమరుపు, చెవుల గింగుర్లు, నడుము, కీళ్ళ నొప్పులు వస్తాయి.
స్మార్ట్ ఫోన్లతో ఉద్యోగ, వ్యక్తిగత జీవితాలు కలగాపులగమయ్యాయి. ప్రైవేట్ కంపెనీలలో ఈ జీవితాల విభజన రేఖ ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాలలో వ్యక్తిగత జీవితాలు ఉద్యోగసమయాలలో కొనసాగుతాయి. పనివేళల్లో, సమావేశసమయాల్లో విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు ఫోన్లలో లీనమవుతున్నారు. ఉద్యోగుల సంభాషణ ముగిసేటప్పటికి ముందున్న కంప్యూటర్ ఆగిపోతుంది. మరలా వేళ్ళ గుర్తులేసి ఆన్ చెయ్యాలి. ఈ సహస్రాబ్ది తరం మనస్తత్వం బతకడానికి పనిచేయడం కాకుండా పనిచేయడానికి బతకడంగా మారింది. స్మార్ట్ ఫోన్లు ఉద్యోగులను తికమక పెట్టి పరధ్యానంలో ముంచి ఉత్పాదకతను తగ్గిస్తున్నాయని, అవి లేనప్పుడు ఉత్పాదకత 26% పెరిగిందని అమెరికా కాస్పర్స్కి ప్రయోగశాల రుజువుచేసింది. ఉత్తమ సేవలందించి సంస్థల ప్రతిష్ట నిలపడానికి స్మార్ట్ ఫోన్ వినియోగ విధానాన్ని అమలుచేయాలి. ఉద్యోగసమయాల్లో స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని నియంత్రించాలి.

మాధ్యమాలతో మానవ ప్రవర్తన:
 • సామాజిక మాధ్యమాలతో సమస్యాత్మక ప్రవర్తన, స్పందనాప్రతిస్పందనలు, అతి కాలయాపన‌ సామాజిక మాధ్యమాల వ్యసనం. 
 • సామాజిక మాధ్యమాలకూ రెండు పార్శ్వాలున్నాయి. 
 • కాలయాపన, పరధ్యానం, తప్పుడు అంచనాలు, అవాస్తవ ఆకాంక్షలు, సామాజిక ముసుగు, అణచివేత ఒకవైపు. 
 • ప్రపంచ అనుసంధానంతో జ్ఞానసముపార్జన, వ్యాపారాభివృద్ధి, నూతన సంబంధాలతో వ్యక్తిగత ప్రగతి, సమాజాభివృద్ధి అవకాశాలు మరోవైపు. 
 • కంప్యూటర్ల పని ఇప్పుడు స్మార్ట్ ఫోన్లతో సాధ్యం. 
 • ఫోన్ చూడకపోతే ఏదో కోల్పోతామన్న భయంతో దానికి బందీలై విధులను, ఉద్యోగాలను అశ్రద్ధచేస్తున్నారు. 
 • భార్యాబిడ్డలతో గడపరు. 
 • దాంపత్య జీవితానికీ దూరమవుతున్నారు. 
 • మనుషుల మనస్తత్వం, ప్రవర్తన, విద్య, సమాచార నైపుణ్యతలు, సామాజిక సంబంధాలు, అనుభవాలు దిగజారాయి. 
 • సామాజిక మార్పిడి సిద్దాంతం మందగించింది. 
 • సామాజిక అభిజ్ఞ సిద్దాంతం పతనమైంది. 
 • వృత్తి ప్రాధాన్యతలు మారాయి.
ఇలా పరస్పర ప్రభావాలకు గురయి కల్పితాలలో ఊహలలో కూరుకుపోయారు. ఇతరులు మనకంటే పరిపూర్ణ‌ జీవితాలు గడుపుతున్నారన్న భ్రమలో మెరుగైన జీవితాల వేటలో విలువైన సమయం వృధా అవుతున్నది. చాలామంది సామాజిక మాధ్యమాలలో ఇరుక్కొని ధన మాన ప్రాణాలు కోల్పోయారు. నిజానికి ప్రపంచంలో ఎవరి జీవితమూ సంపూర్ణం కాదు. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క జీవనశైలిలో ఉంటుంది. మాధ్యమాలలో పొగడ్తలను చూసి తీవ్ర మోహాన్ని పెంచుకుంటారు. ఎవరో ఆదర్శంగా ఉన్నారని భ్రమించి అనుకరించి జీవితాలను కోల్పోతారు. పరులతో పోలిక పోటీలతో ఆతురత వత్తిడి మానసికాందోళన పెరుగుతాయి. మానసిక, ఆర్థిక, సామాజిక ఆరోగ్యాలు చెడి ఆత్మవిచ్ఛిత్తికి, ఆత్మహత్యలకు దారితీస్తుంది. ఫేస్ బుక్ లో లైకులు మన సామర్థ్యానికి కొలబద్ద కాదు. మా నాన్న చనిపోయాడన్న సమాచారాన్ని వందలమంది లైక్ చేశారు. దినచర్యను మార్చుకొని అవకాశాలను వినియోగించుకుంటూ ప్రణాళికాబద్దంగా పనిచేస్తూ పొదుపుగా ఖర్చుపెడుతూ మరింత కష్టపడటమే కలల సాకారానికి మార్గం. సామాజిక మాధ్యమాలు అహంకార సాధనాలు కారాదు. అందిన సమాచారాన్ని విశ్లేషించి సరైందని నిర్ధారించుకొని ఇతరులతో పంచుకొని సామూహిక, సామాజిక ప్రగతికి దోహద‌ పడాలి. పరుల ప్రాపకాన్ని పొందాలి. వైవిధ్యంగా ప్రవర్తించి ఎదిగినవారి జీవితాలను అధ్యయనం చేయాలి. సొంత ప్రతిమను నిర్మించుకోవాలి. సౌకర్యం చావుకు అసౌకర్యం సృజనాత్మకతకు దారితీస్తాయని ఫ్రెంచ్ రచయిత, కళాకారుడు జీన్ కాక్టో అన్నారు.       

పరిష్కారం: ఫ్రాంస్ పాఠశాలల్లో విద్యార్థులకు మాధ్యమ‌ పరికరాలను నిషేధించారు. మన దేశంలో కొన్ని పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లో విద్యార్థినులకు మాత్రమే మొబైల్ ఫోన్లను నిషేధించారు. బహుళ‌ ప్రయోజన పరికర వినియోగాన్ని పెద్దలకు కొనసాగిస్తూ పిల్లలకు నిషేధించడం సమంజసమా? సాంకేతికత దురుపయోగాన్ని అరికట్టాలి కాని ఫోన్లను నిషేధించి ప్రయోజనం లేదు. హింస, అసభ్య దృశ్యాలు, అసత్య‌ ప్రచార ప్రకటనలకు భయాందోళనలు చెందినా పిల్లలకు నేర్చుకునే అవకాశాలు, క్రియాశీలత మెరుగుపడతాయని తల్లిదండ్రుల ఆశ. 16 ఏళ్ళ లోపు పిల్లలకు తల్లిదండ్రుల అనుమతితో సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉండాలి.
8 ఏళ్ళ పిల్లలు యు ట్యూబ్ లో, వీడియో ఆటలలో మునుగుతున్నారు. పేదల పిల్లలే ఈ వ్యర్థవ్యాపకంలో నిష్ప్రయోజనంగా సమయాన్ని కోల్పోతున్నారని సర్వేలలో తేలింది. 
రెక్కాడితే గాని డొక్కాడని శ్రమజీవులకు పిల్లలపై శ్రద్ధ పెట్టగల సమయముండదు. ఈ వ్యసనం కొత్త‌ మత్తుకు రహదారి అని పేదలకు తెలియదు. అందువలన ప్రయోజనాలను పొందుతూనే పరధ్యానాలను నివారించే మాయజాలాన్ని కనుగొనాలి. స్మార్ట్ ఫోన్లలో మన సమయాన్ని హరిస్తున్న అనవసర వెబ్ సైట్లను నిషేధించవచ్చు. లేదా పరిమితం చేయవచ్చు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్, ఫైర్ వాల్స్, కంటెంట్ ఫిల్టర్స్, బ్లాకింగ్ టూల్స్ ఉపయోగించి అనవసర, అపాయకర సమాచారాలను అరికట్టవచ్చు. అభ్యంతర అంతర్జాల అంశాలను మొబైల్ ఫోన్ల నుండి తొలగించవచ్చు. వీక్షణ సమయాన్ని పరిమితం చేసే యాప్ లను స్థాపించవచ్చు. అపాయకర యాప్ లు తెరుచుకోకుండా, అవసరమైన యాప్ లు మాత్రమే తెరుచుకునేటట్లు తాళాలు ఏర్పాటు చేయవచ్చు. నిర్దిష్ట సమయాలలోనే స్మార్ట్ ఫోన్లు పనిచేసేటట్లు చేయవచ్చు. మిగతా వేళల్లో కేవలం ఫోన్ పనిచేస్తుంది. మనసు నిషేధాల వైపు లాగుతుంది. ఇది పిల్లల విషయంలో మరింత తీవ్రతరం. ఈ రోజు కాకపోతే రేపు పిల్లలు ఫోన్లను వాడవలసినవారే. అనంతరీతుల్లో ప్రయోజనాలనందించే ఫోన్లను వారికి దూరం చేయరాదు. వాటి దురుపయోగాన్ని నివారించాలి. మొబైల్ ఫోన్లను సులభంగా సర్దవచ్చు. మెదళ్ళ‌ను దిద్ద‌లేము. అందుకే మానవోన్నతికి అనుగుణంగా పరికరాలను నియంత్రించాలి. అవరమైన యాప్ లనే ఆవిష్కరించాలి. మొబైల్ అడిగినప్పుడల్లా కాకుండా అవసరమొచ్చినప్పుడే ఫోన్ చూడాలి. సాంకేతికత, సమస్యలను పరిష్కరించాలి. కొత్త సమస్యలను సృష్టించరాదు. జీవితాలను సుఖమయం చేయాలి. సంక్లిష్టం చేయరాదు. మానవత్వాన్ని పెంచాలి. తుంచరాదు. ప్రజలను దగ్గరచేయాలి. దూరం చేయరాదు. మానవత్వీకరించాలి. దానవత్వీకరించరాదు.
సెల్ ఫోన్ రేడియేషన్ క్యాన్సర్ కారకమన‌డం అపోహ. కొన్నిఆరోగ్య సమస్యలు రావచ్చు. రేడియేషన్ ప్రభావం తగ్గించడానికి ఇయర్ ఫోన్లు వాడాలి. సిగ్నల్ బాగా ఉన్నప్పుడే ఫోన్ ఉపయోగించాలి. సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువ విద్యుత్తు ఖర్చయి రేడియేషన్ పెరుగుతుంది. మొబైల్ ను గంటల తరబడి వాడరాదు. ఎక్కువసేపు మాట్లాడడానికి లాండ్ లైన్ వినియోగించాలి. వాహనాలు నడిపేటప్పుడు, విద్యుత్తు పరికరాల పరిసరాలలో మొబైల్ వాడరాదు. చిన్న పిల్లలు మొబైల్ వాడకపోవడమే మంచిది.
స్మార్ట్ ఫోన్ సామాజిక మార్పుకు సాధనం: ప్రస్తుతం మతవాదులు, మూఢవిశ్వాసకులు, అసత్య, అశాస్త్రీయ, పాలక వర్గాలు ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలుచుకోడానికి, రాజకీయ లబ్ధికి సామాజిక మాధ్యమాలను దురుపయోగం చేస్తున్నారు. హేతువాదులు, ప్రగతి కాముకులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు, ప్రత్యామ్నాయ పక్షాలు స్మార్ట్ ఫోన్లను విరివిగా ఉపయోగించాలి. ప్రజాప్రయోజనం సామాజిక మాధ్యమాల ధ్యేయం కావాలి. విజ్ఞానశాస్త్ర ఉపయోగంలో నిర్మాణ వినాశనాలకు మానవ ప్రవర్తనే మూలం. స్మార్ట్ ఫోన్లతో జీవితాలను నిర్మించుకుంటారో, నాశనం చేసుకుంటారో అంతా మనుషుల చేతుల్లోనే ఉంది.

______నవ తెలంగాణ

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top