మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి - Mangalagiri Lakshmi Narasimha swamy

0
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి - Mangalagiri Lakshmi Narasimha swamy

మంగళ గిరి:
ఇటు విజయవాడ నుండి సిటీ బస్సులు, అటు కాకాని నుండి విజయవాడ వచ్చే బస్సులలోను మంగళగిరి రావచ్చు. మంగళగిరి ఎన్నో లక్ష్మీనరసింహస్వామి శతాబ్దాలుగా పేరొందిన పుణ్యక్షేత్రం.

ఇక్కడ ముగ్గురు నరసింహస్వాములు భక్తుల పూజలందుకుంటున్నారు. ఒకరు ఎగువ సన్నిధి పానకాల నరసింహస్వామి, రెండవ వారు దిగువ సన్నిధి లక్ష్మీనరసింహస్వామి కాగా, కొండ శిఖరాగ్రాన గండాల నరసింహస్వామి మూడవవారు. కృష్ణానదికి అతి దగ్గరలో యీ వైష్ణవక్షేత్రం నెలకొని వుంది. లక్ష్మీదేవి యీ పర్వతంపైన తపస్సు చేసినందున యీ క్షేత్రాన్ని మంగళగిరిగా పిలువబడుతున్నది. ఈ క్షేత్రంలో పానకాల నరసింహస్వామి ముఖ్య దైవం. పానకాన్ని భక్తుల నుండి స్వీకరిస్తూ పానకాలరాయుడుగా యీ దైవం పేరొందారు.

కొండకు దిగువన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ధర్మరాజు ప్రతిష్ఠించారు. విజయనగర రాజ్యంలో యీ దేవాలయం అభివృద్ధి చెందినట్లు చారిత్రకాధారాల వల్ల తెలుస్తోంది. అంబరాన్ని తాకుతున్నట్లుండే 11 అంతస్ధుల గాలిగోపురం, దక్షిణావృత శంఖం యిక్కడ ప్రత్యేకాకర్షణలు. ఎందరో కవులు యీ స్వామిపైన శతకాలు రచించగా, మరి కొందరు తమ కావ్యాలనంకితమిచ్చారు.

విజయవాడ, గుంటూరు నగరాల మధ్య జాతీయ రహదారిపై అందరికీ అందుబాటులోనున్న యీ పుణ్యక్షేత్రం దినదినభివృద్ధి చెందుతోంది. కొండపైకి మెట్ల మార్గమే కాక ఘాట్‌రోడ్ సౌకర్యం కూడా వుంది.

క్షేత్ర వైభవం:

పానకాలస్వామి కొండ
మంగళగిరిలోని కొండ ఆదియుగపు కాలం నాటి ఖోండలైట్స్‌గా పులువబడే రాతి సమూహానికి చెందినది. తూర్పు కనుమలలోని ఈ కొండ, కూర్చుని వున్న ఏనుగును పోలి ఉంది. ఈ కొండ ఎత్తు 875 అడుగులు. ఈ కొండ పైకి 480 మెట్లను కోవెలమూడి గ్రామస్తులు శ్రీ చన్నాప్రగడ బలరామదాసు నిర్మించారు. ఈ కొండపై అమ్మవారి ఆలయానికి పక్కన ఒక గుహ ఉంది.

ఇది ఆదికాలపు స్ఫుటమయ (క్రిస్టలైన్) శిలలలోనిది. ఈ గుహ కృష్ణానదీ తీరాన ఉండవల్లి వరకు ఉందనీ, పూర్వం ఈ కొండపైన తపస్సు చేసిన మునులు ఈ దారి గుండానే వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేస్తుండేవారని ప్రతీతి. ప్రస్తుతం ఈ గుహ లోపలి భాగం అంతా చీకటిమయంగా ఉండి దారి ఉన్నట్లు కనపడదు. మంగళగిరి కొండ మీద పానకాల నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ దేవుని పానకాల స్వామి అని కూడా పిలుస్తారు. కొండను తొలిచి ఈ ఆలయన్ని నిర్మించారు. పురాణాల ప్రకారం పానకాల స్వామి స్వయం వ్యక్తరూపుడు. ఈ ఆలయాన్ని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. రాత్రులు దేవతలు పూజకై వస్తారని భక్తుల నమ్మకం. పానకాల స్వామికి బెల్లం, మిరియాలు, యాలుకులు కలిపిన నీటితో పానకం తయారుచేసి భక్తులు సమర్పిస్తారు. నివేదించిన పానకంలో స్వామి వారు సగం త్రాగి మిగిలినవి భక్తులకు వదిలి వేస్తారని నమ్మకం. కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపరయుగంలో ఆవు పాలనూ నివేదనగా స్వీకరించిన స్వామి వారు కలియుగంలో పానకాన్ని సేవిస్తున్నారు. పానకం చేయటానికి అవసరమైన నీటిని కొందరు కొండ పైకి మోసి కుటుంబవృత్తిగా ఆచరించేవారు. 24 డిసెంబరు 1990న శ్రీ జగన్నాధ స్వామి రామగోపాల్ ట్రస్టు సహాయంతో కొండపైకి మంచినీటి సరఫరా ప్రారంభించారు. 2004 కృష్ణా పుష్కరాల నుండి కృష్ణా జలాలను పైకి సరఫరా చేస్తున్నారు.

ఈ గుడిలో బెల్లపు పానకం ఉన్నా చీమలు ఏవీ లోపల ఉండవు. లోపలికి పోసిన పానకం ఎక్కడకు పోతుందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. పానకాల స్వామికి నోరు మాత్రమే ఉండి, పానకం పోయు ముఖద్వారం రాతిలో 15 సెంటీమీటర్లు వెడల్పు ఉంటుంది. కోపంతో ఉన్న ఇత్తడి ముఖపు తొడుగు ఉంటుంది. ఒకవైపు చక్రం, రెండవవైపు శంఖం రాతితోనే స్వయంగా ఉన్నాయి.

లక్ష్మీ నరసింస్వామి
మంగళగిరి దిగువ క్షేత్రములో శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయుమువున్నది. దేవతలు ప్రతిష్ఠించిన మూర్తులు దైవీయాలు. ఈ దేవాలయములోని మూల విరాఠ్‌ను ద్వాపరయుగంలో పాండవుల అరణ్యవాస కాలమందు ధర్మరాజు ప్రతిష్ఠించారని చెప్తుంటారు. కాబట్టి ఈ మూర్తి దైవీయము. దేవాలయ శైలికి సంబంధించి ఈ దేవాలయం ద్రావిడ శైలికి చెందినది. ఈ దేవాలయానికి ముఖ్య ఆకర్షణ 11 అంతస్థుల గాలిగోపురం. ఈ దేవాలయ ప్రాంగణంలోని ప్రశాంత వాతావరణం భక్తులను మరింతగా ఆకర్షిస్తుంది.

ఈ గుడి విజయనగర సామ్రాజ్యకాలంలో అన్ని విధాల అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఆ కాలంలో నిర్మించిన దేవాలయపు 24 స్తంభాల ముఖమండపం ఎంతో అందమైన చెక్కడాలతో వుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసం (మార్చి/ఏప్రిల్)లో ఇక్కడ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుండి యాత్రికులు వేలాదిగా వస్తుంటారు. ఆ సందర్భంగా స్వామిని వివిధ వాహనాలపై అలంకరించి గ్రామోత్సవం జరుపుతారు. ఈ దేవాలయానికి మెట్టభూమి 251 ఎకరములు, మాగాణిభూమి 120 ఎకరములు ఉంది.

గండదీపం
కొండశిఖరాన వున్న గండాల స్వామికి రూపం లేదు. అక్కడ దీపం వెలిగించేందుకు ఏర్పాటు మత్రమే ఉంటుంది గాని ప్రత్యేక విగ్రహం వుండదు. భక్తులు తమకు గండాలు వచ్చినప్పుడు గండం నుండి గట్టెక్కించమని, గండం తీరిన తరువాత గండదీపం వెలిగిస్తామని మొక్కుకుని ఆ ప్రకారం వెలిగిస్తారు. అక్కడ వుండే భాండీలో ఆవు నెయ్యిగాని, నువ్వుల నూనెగాని పోసి, పెద్ద వత్తి పెట్టి సాయంత్రాలలో వెలిగించి వస్తారు. ఆ గండదీపం చుట్టుప్రక్కల చాలా గ్రామాల పజలకు కన్పిస్తుంటుంది.

దక్షిణావృత శంఖం
మంగళగిరి లక్ష్మీ నరసింహ దేవాలయంలో వున్న విశిష్ఠ సంపదలో దక్షిణావృత శంఖం ఒకటి. దీనిని తంజావూరు మహారాజు 20-11-1820న యీ దేవాలయానికి కానుకగా సమర్పించినట్లు చెబుతారు. దీనిలో నుండి సర్వదా, సర్వవేళలా ప్రణవనాదం(ఓంకారం) వినిపిస్తుంటుంది. బంగారు తొడుగు యీ శంఖానికి వుంది. ముక్కోటి ఏకాదశినాడు యీ శంఖంతో భక్తులకు తీర్ధమందిస్తారు.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము
ఆగమ శాస్ర విధిని శ్రీ శాంత నృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారలకు ఇక్కడ కళ్యాణం జరుపుతారు. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ ముందు రోజైన చతుర్ధశినాటి రాత్రి నరసింహస్వామి కళ్యాణం జరగడం క్షేత్ర ఆనవాయితీగా వస్తోంది. కళ్యాణానికి ముందు చెంచులు తమ ఆడపడుచు చెంచులక్ష్మిని నరసింహస్వామి వివాహం చేసుకున్న గుర్తుగా గుడి ఆవరణలో ఉత్సవం నిర్వహిస్తారు.

ఆ రాత్రి శ్రీవారు శేషవాహనంపై గ్రామోత్సవంలో పాల్గొని, 'ఎదురుకోల' ఉత్సవాన్ని నిర్వర్తిస్తారు. పట్టణ పద్మశాలీయ బహూత్తమ సంఘం వారు తమ ఆచారం ప్రకారం మధుపర్కాలు, మంగళ ద్రవ్యాలను సమర్పిస్తారు. వేలాది మంది భక్తులు యీ కళ్యాణ మహోత్సవములో పాల్గొని పారవశ్యం చెందుతారు.

రథోత్సవం - సాంస్కృతిక మహోత్సవం
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము తరువాత రోజు పూర్ణిమ. ఆరోజున మంగళగిరి తిరుణాల జరుగుతుంది. అదే రోజు దేశంలో హోళీ పండుగ కూడా జరుగుతుంది. ఈ దేవాలయానికి 11 అంతస్థుల గాలిగోపురం తరువాత చెప్పుకోదగిన నిర్మాణము "పెద్ద రథము". ఇది ఆరు చక్రాలతో ఎంతో సుందరంగా గంభీరంగా వుంటుంది. దీనిని ఎంతో బరువైన, పొడవైన త్రాడుతో ప్రజలు ఉత్సాహంగా, అలుపెరుగకుండా లాగుతారు. రథాన్ని లాగే వారికి ఉత్సాహం కలిగేలా రథంపై నుండి గంట మ్రోగిస్తూ అర్చకస్వాములు నరసింహస్తుతి చేస్తుంటారు. ఆ రథాన్ని లాగేందుకు వందలాది యువకులు పోటీ పడుతుంటారు. వేలాది భక్తులు ఆ రథం తాడుని తాకితే చాలు పుణ్యమొస్తుందని ఆరాటపడతారు. ఆ రోజున వచ్చే వేలాదిమంది కిక్కిరిసిన జనం మధ్య జరిగే రథోత్సవంలో కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొంటారు. ఈ తరతరాల సంస్కృతి ప్రతి ఏటా కొనసాగుతూ వస్తోంది.

ఈ రథ గమనాన్ని నిర్దేశించేలా రథ చక్రాలకు 'చప్టా'లను వేస్తుంటారు. 'చప్టా' లు వేసేందుకు ప్రత్యేక నిపుణతగల భక్త బృందాలున్నాయి. వారు ప్రమాదాలకు భయపడకుండా రథోత్సవంలో ఎంతో నైపుణ్యంతో, సమయస్ఫూర్తితో రథ వేగాన్ని నిరోధిస్తుంటారు. లోపలివైపు చక్రాలకు యీ బృందంలోని వారు చప్టాలు వేయటం చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కొన్ని సందర్భాల్లో వారి చేతివ్రేళ్లు రథం క్రింద నలిగిపోతుంటాయి. అయినప్పటికి వారు రెట్టింపు ఉత్సాహంతో తమ విధినిర్వహణలో ముందుకు సాగుతారు. ఈ చప్టాలు వేసే బృందం ఆ మహోత్సవంలో ఒక కీలక పాత్రను నిర్వహించే అవకాశం తమకొచ్చిందన్న గర్వంతో ఆ కార్యాన్ని నిర్వర్తిస్తారు. ఈ తిరునాళ్ళు, రధోత్సవం మంగళగిరికి ఒక సాంస్కృతిక మహోత్సవం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top