వేయి స్థంబాల ఆలయం - Veyi stambala aalayam, Thousand pillars temple

0
వేయి స్థంబాల ఆలయం - Veyi stambala aalayam, Thousand pillars temple

వేయి స్థంబాల గుడి..... వరంగల్లు:
11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల గుడి వరంగల్ నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున కలదు. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలొ నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగుబంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అధ్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమైయున్న నందీశ్వని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యణ మంటపానికి మరియు ప్రధానాలయాలకు మధ్యన ఠీవీగా దర్శనమిస్తుంది.

ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పూవులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు. ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏక పీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడినికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వార పాలకులుగా ఉన్నట్లుగా నిలచిన గజ శిల్పాలను దాటి సభామంటపంలోనికి వెళ్ళిన పిదప విఘ్నేశ్వరున్ని అర్చించి భక్తులు రుద్రేశ్వరున్ని దర్శిస్తారు. ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం మరియు ప్రధానాలయాన్ని కలిపి మొత్తం వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయి స్తంభాల దేవాలయమనే పేరు ప్రసిద్ధి. నీటి పాయపై ఇసుకతో నిర్మించిన పుణాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది.
ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి, నాగ ప్రతిమలు కొలువైనవి. ఆనాటి రహస్య సైనిక కార్య కలాపాలకొరకై ఓరుగల్లు కోట మరియు ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా మరియు రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేయడం జరిగినది.
మాఘ, శ్రావణ మరియు కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వెస్తే రాలనంతగా భక్త జన సందోహం రుద్రేశ్వరున్ని దర్షిస్తారు. మహన్యాస పుర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్యపూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని మిగిలిస్తుందనడం నిస్సంశయం.
ఇంతటి ప్రశస్థి కల ఈ ఆలయానికి దూరప్రాంతాల వారు ఖాజీపేట లేక వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకున్న పిదప బస్సు లేక ఆటోల గుండా 5 కి.మీ. దూరంలో నున్న హనుమకొండ నగరానికి చేరుకొని ఆలయ వేళల్లో రుద్రేశ్వర స్వామిని దర్శించవచ్చు. (ప్రస్తుతం ఈ ఆలయంలోని శిల్పకళాశోభితమైన స్థంభాలన్ని విడదీసి పునర్ నిర్మాణముకొరకు ప్రక్కన బెట్టారు) వరంగల్లు నుంచి షుమారు 7కిలో మీటర్లుంటుంది.


అక్కడి వేయి స్తంభాల మంటపం, ఆలయం అధ్బుత శిల్పసంపదతో నిర్మించబడ్డాయి. ఇది 1162లో పాలించిన రుద్రదేవుని కాలంనాటిది. ఇది చాళుక్య శిల్ప సంపదను సంతరించుకున్న స్తంభాలమీద, దర్వాజాల మీద చూడ చక్కని శిల్పాలున్నాయి. ఆనాటి ఆహరవిహారాదులను కళ్ళకు కట్టినట్లు కనిపించే జానపదుల బొమ్మలు, తరులతాగుల్మాదులు స్తంభాల కలంకారములుగా శోభిల్లాయి. పువ్వురేకుల మడతల్లోనించి సన్ననితీగ, లేక దారంకూడా దూర్చి తీయవచ్చు. ఈ ఆలయంలో నంది నల్లరాతిలో సొంపుగ చెక్కబడింది. మెడ పట్టెడలు వగయిరాలు బహుసున్నితంగా చెక్కబడ్డాయి. శిల్పములు ఒక ఎత్తయితే రెండోవంక ఆలయం గర్భ గుడిలోకి డబల్ వాల్ సిస్టములో ఎయిర్ కండిషండ్ చేయబడినట్లు చల్లటిగాలి మాత్రము తగినంత మేరకు వచ్చునట్లు ఏర్పాటు చేయబడింది. ఇదే ఆనాటి నిర్మాణ కౌశల్యానికి మచ్చుతునక.

వరంగల్లు చేరటానికి హైదరాబాదునుండి వారానికి మూడుమార్లు వాయుదూత్ విమానమార్గముంది. రైలు మీదయితే కాకతీయ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజూ వుంది. 4గం.ల ప్రయాణం. విజయవాడ నుండి అయితే కాజీపేట దగ్గిర దిగి కొద్ది కి.మీ. దూరంలో వరంగల్లును చూడవచ్చు. హైదరాబాదు, నిజామాబాదుల నుండి మంచి బస్సు సౌకర్యం కూడా వుంది.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top