సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - Simhachalam Lakshminarasimha swamy

0
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి  - Simhachalam Lakshminarasimha swamy

సింహాచలం:
విశాఖకు ఉత్తరంగా సుమారు 20కి.మీ, దూరంలో సముద్రమట్టానికి 243 మీటర్ల ఎత్తులో సమున్నతంగా ఒక కొండమీద వెలసిన లక్ష్మీనరసింహస్వామి శ్రీమహావిష్ణువు యొక్క అవతారమైన వరాహ నృసింహస్వామి క్షేత్రం. ఈ ప్రాంతంవారికి ఈ స్వామి అంటే ఎంతో గురి. విశాఖజిల్లాలోని వారంతా ఈ స్వామిని భక్తితో, ఆప్యాయంగా సింహాద్రి అప్పన్నగా పిలుచుకుంటూ ఈ స్వామిపేరే ఎక్కడచూచినా పెట్టుకుంటూ వుంటారు. ఇక్కడి సుప్రసిద్దుల నుండి పూరిపాకల్లో వుండేవారు సైతం ఈ స్వామి వారి పేరులేకుండా వుండరు. కొండమీద గంగ, గోదావరి, కూర్మ, మాధవ, ఆకాశధారలను హనుమద్ధ్వారము వరకూ చూడవచ్చు. సింహాద్రి అప్పన్న దేవాలయం 11వ శతాబ్ధపుకాలం నాటిది అంటున్నా ఆలయం ఇంకా పురాతనకాలానికి చెందినదిగా భావించబడుతుంది. హిరణ్య కశిపుని వధానంతరం భక్తశ్రేష్టుడైన ప్రహ్లాదునిచేత ప్రతిష్టితమైనదిగా చెప్పుకుంటారు. స్వామి ఉగ్రత్వమును శాంతింప జేయటానికి విగ్రహానికి ప్రతి నిత్యమూ చందనపు పూత పూస్తుంటారుట.

స్వామికి వైశాఖ శుద్ధ తదియనాడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంవత్సరమంతా చందనంతో మెత్తి వేయబడి వున్న స్వామి నిజరూప దర్శనం ఆనాడే జరుగుతుంది. దీన్నే గంధవలుపు ఉత్సవం అని కూడా అంటారు. స్వామిని ఈ రోజున దర్శించటానికి లక్షలాది యాత్రికులు వస్తారు. కొన్ని వ్యాధులు సైతం నయంకాగలవని ఒక గట్టి నమ్మకం. ఆ రోజున స్వామివారి దివ్యానుభూతి భక్తులకు వెచ్చగా స్పృశ్యమవుతుందట. చాళుక్యరీతి శిల్ప వైభవం ఆలయమంతా కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. శ్రీ కృష్ణదేవరాయలు సైతం ఈ క్షేత్రాన్ని దర్శించి పునీతుడై, సంతుష్టాతరంగంతో కొన్ని గ్రామాలు స్వామివారి భోగముల నిమిత్తం భక్తితో సమర్పించారట, మరెన్నో సువర్ణాభరణాలు భక్తిమేర చేయించారట. చైత్రమాసంలో రధోత్సవాదులు జరుగుతాయి. విశాఖ నుండి నేరుగా కొండమీదికి బస్సులున్నాయి. వుండటానికి కొండమీద చందన రెస్టు హౌస్, A.P.T.T.D.C. వారి తాలూకు, దేవస్ధానం కాటేజీలు, జిల్లా పరిషత్తువారి గెస్టుహొం మొదలైనవి ఉన్నాయి. ప్రకృతి రమణీయంగా కన్నులు పండుగగా కనబడుతూంది. స్వామి దర్శనార్ధం ప్రతిరోజూ భక్తులు యాత్రికులు కోకొల్లలు వస్తూనే వుంటారు. ఎప్పుడూ జనసందోహంతోటి కిటకిటలాడుతూంటుంది.

సింహాచలము విశాఖపట్టణములో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖమైన హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రము ఎత్తైన సింహగిరి పర్వతంపై ఉన్నది. మొన్నటిదాక ఈ క్షేత్రము విశాఖ శివార్లలో వుండగా ప్రస్తుతం నగర విస్తీర్ణం పెరిగి నందున ఈ ఆలయంకూడ నగరంలో భాగమై పోయింది.

ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్రా లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ద తదియ నాడు (మే నెలలో) వస్తుంది.

సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్ధం వరకు కనిపిస్తున్నది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తి గా వెలశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి కూడా కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేక పోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు 'విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ ఈ స్థంభంలో ఉన్నాడా? చూపించు' మని స్థంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించాడు.

స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన[యాదవుడు] పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి భూమిలో కప్పబడి ఉన్న నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి ప్రతీరోజు చందనం తో పూత పూస్తుంటారు. నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్ర లో (ఆసనంలో) సింహము తల కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.
సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా, పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యమును ప్రసాదిస్తే, పడమర ముఖద్వారము విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలి గోపురము మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 30 మెట్లు ఉంటాయి.

కప్ప స్తంభం
దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారములో కప్ప స్తంభం ఉన్నది. ఈ స్తంభం
సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్టితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు (కప్పం:పన్ను) చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది. సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార లు. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగములో సహజ సిద్ధమైన నీటి సెలయేరు ఉన్నది. స్వామి కల్యాణము తరువాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉన్నది.
సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవ వాక. ఆడివివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉన్నది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉన్నది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్ధాల మధ్య ఈ ప్రాంతం భైరవపురం గా ప్రాముఖ్యత పొందినది.
గిరి ప్రదక్షిణ: ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి, కాలి నడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి, కొండపైన స్వామిని దర్శించడం. ఆషాడ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమి ని సింహాద్రి అప్పన్న ఉత్సవం గా చేస్తారు. కొండ దిగువన వున్న తొలి పావంచా దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. 32 కి.మీ వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు, మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు , ఆలయంలోనే ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసే రోజున భక్తులకు ఆ గిరి ప్రదక్షిణం జరిగే బాటలో వున్న గ్రామాల వారు, స్వచ్చంద సంస్థల వారు భక్తులకు, నీరు, మజ్జిగ, పులిహార పొట్లాలు అందించి భక్తులకు సేవ చేస్తారు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top