కాలేయం విధులు, రుగ్మతలు - Liver and its Diseases

0
కాలేయం విధులు, రుగ్మతలు - Liver and its Diseases
కాలేయ కంతులన్నీ కేన్సర్లేనా?
మనిషి శరీరంలో అతి పెద్ద అవయవం కాలేయం. ఛాతీ కుడివైపు కింది భాగంలో కుడి ఊపిరితిత్తి కింద ఇది అమరి ఉంటుంది. ఛాతీ కుడివైపు ఎముకల కిందుగా చేతితో నొక్కినప్పుడు ఈ అవయవాన్ని స్పృశించవచ్చు. కాలేయం ఒక పిరమిడ్‌ రూపంలో ఉంటుంది. ఇది రెండుగా చీలి ఉంటుంది. వీటిని కుడి, ఎడమ లోబ్స్‌ అని అంటారు.

సాధారణంగా శరీరంలో అన్ని అవయవాలకు ఒక రక్తనాళంనుంచి రక్త సరఫరా జరుగుతుంటుంది. దీనికి భిన్నంగా కాలేయానికి రెండు రకాలుగా రక్త సరఫరా జరుగుతుంది. మొదటి రకంలో ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని హెపాటిక్‌ ధమని అందజేస్తుంది. రెండవ రకంలో చిన్న ప్రేవులనుంచి పోషకాహారాలతో కూడిన రక్తాన్ని పోర్టల్‌ సిర అందజేస్తుంది.

కాలేయం విధులు: 
       శరీరంలో కాలేయం నిర్వర్తించే విధులు అనేకం ఉన్నాయి. కాలేయం నిర్వహించే కొన్ని ముఖ్యమైన విధులు ఈ కింది విధంగా ఉన్నాయి. 
  • చిన్న ప్రేవుల్లో జీర్ణమై శరీరంలోకి చేరిన పోషక పదార్థాలను కాలేయం నిలువ  చేస్తుంది.
  • ఏదైనా గాయం తగిలినప్పుడు జరిగే రక్తస్రావాన్ని నిలువరించేందుకు రక్తం      గడ్డ కట్టడానికి అవసరమైన పదార్థాలను కాలేయం తయారు చేస్తుంది.
  • ఆహారం శోషణం చెందేందుకు అవసరమైన పైత్య రసాన్ని చిన్న ప్రేవుల్లోకి  స్రవిస్తుంది. 
  • ఆహార పదార్థాలు, ఔషధాలు మొదలైన వాటి ద్వారా శరీరంలోకి ప్రవేశించే  విషపూరిత పదార్థాలను శరీరంనుంచి వెలుపలికి పంపిస్తుంది.
కాలేయ రుగ్మతలు 
      కాలేయం వివిధ రకాలైన కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కారణంగా కాలేయంలో పలు రకాలైన కంతులు ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ కంతుల్లో కొన్ని కేన్సర్‌ కంతులైతే, మరికొన్ని కేన్సర్‌ కాని కంతులు ఉంటాయి. కేన్సర్‌ కాని కంతులను బినైన్‌ ట్యూమర్స్‌ అంటారు. కేన్సర్‌ కంతులను మాలిగెంట్‌ ట్యూమర్స్‌ అంటారు.

బినైన్‌ ట్యూమర్స్‌ 
      బినైన్‌ ట్యూమర్స్‌ కొన్నిసార్లు సమస్యలను సృష్టించే స్థాయిలో పెరగవచ్చు. అటువంటి సందర్భాల్లో వాటిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. సాధారణంగా బినైన్‌ ట్యూమర్స్‌ పక్కనున్న కణజాలంలోకి చొచ్చుకు పోవడమనే సమస్య ఉత్పన్నం కాదు. కాలేయంలో ఏర్పడే బినైన్‌ ట్యూమర్స్‌లో అనేక రకాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

హిమాంజియోమా
         కాలేయంలో ఏర్పడే బినైన్‌ ట్యూమర్లలో అత్యంత సాధారణంగా ఏర్పడే కంతులు ఈ రకానికి చెందినవే. ఇవి రక్తనాళాలలో ఏర్పడుతాయి. ఈ రకమైన కంతుల వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు కనుక సాధారణంగా వీటికి చికిత్స అవసరం ఉండదు. అయితే కొన్ని కేసుల్లో వాటినుంచి రక్తస్రావం వెలువడవచ్చు. అటువంటి సందర్భాల్లో వాటిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది.

హెపాటిక్‌ అడినోమా 
      కాలేయానికి చెందిన ప్రధాన కణజాలం (హెపాటోసైట్స్‌)నుంచి ఈ రకమైన కంతులు ఉద్భవిస్తాయి. వీటివల్ల కూడా ఎలాంటి వ్యాధి లక్షణాలు బహిర్గతం కావు కనుక వీటికి చికిత్స అవసరం ఉండదు. కాని కొన్ని సందర్భాల్లో కడుపు నొప్పి, ఉదరకోశంలో మాంసపు ముద్ద ఏర్పడటం, రక్తం కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అటువంటి సమయంలో వీటిని తొలగించాల్సి ఉంటుంది. హెపాటిక్‌ అడినోమాకు గురయ్యే అవకాశాలు పురుషుల్లోకంటే మహిళల్లో అధికంగా ఉంటాయి. ముఖ్యంగా సంతాన నిరోధక మాత్రలు వాడుతున్న వారిలో ఇటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది. అయితే చాలా అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుంది. ఎనబాలిక్‌ స్టెరాయిడ్‌ ఔషధాలను వాడే పురుషుల్లో హెపాటిక్‌ అడినోమాలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ మందులను వాడటం ఆపేసిన తరువాత కంతులు కుంచించుకుపోవడం జరుగుతుంది.

ఎఫ్‌ఎన్‌హెచ్‌ 
      దీనిని ఫోకల్‌ నాడ్యులార్‌ హైపర్‌ప్లేజియా అంటారు. కాలేయంలోని వివిధ రకాల కణజాలాల్లో ఈ కంతులు ఏర్పడుతాయి. ఇవి బినైన్‌ ట్యూమర్లే అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో వీటిని నిజమైన కేన్సర్‌ కంతులుగా భ్రమపడే అవకాశాలుంటాయి. ఈ కంతుల వల్ల కూడా వ్యాధి లక్షణాలు ఏమైనా కనిపిస్తుంటే వాటిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. కేన్సర్‌ కంతులు కాలేయానికి సోకే వివిధ రకాలైన

కేన్సర్‌ కంతులు :

ఈ కింది విధంగా ఉంటాయి:

హెపాటో సెల్యులార్‌ కార్సినోమా 
      కాలేయానికి సోకే కేన్సర్‌ కంతులు అనేక రకాలున్నప్పటికీ, పెద్దవారిలో అత్యంత సాధారణంగా కనిపించే కేన్సర్‌ కంతులు హెపాటో సెల్యులార్‌ కార్సినోమాకు చెందినవే. ఇవి కాలేయంలోని ప్రధాన కణజాలమైన హెపాటోసైట్స్‌లో ఆరంభమవుతాయి. ప్రతి నాలుగు ప్రాథమిక కాలేయ కేన్సర్లలో మూడు ఈ రకానికి చెందినవై ఉంటాయి. ఈ కంతులు వివిధ రకాలైన పెరుగుదలలను ప్రదర్శిస్తాయి. ఈ రకానికి చెందిన కొన్ని కంతులు ఏక కంతిగా ఆరంభమై పెరుగుతాయి . వ్యాధి ముదిరిన తరువాతే అది కాలేయానికి చెందిన ఇతర భాగాల్లోకి వ్యాపిస్తుంది. మరికొన్ని కేసుల్లో ఈ కంతి కాలేయంలో పలు చోట్ల ఆరంభమవుతుంది. ఇటువంటి సందర్భాల్లో అది ఏక కంతిగా కాకుండా, బహుళ కంతుల సముదాయంగా ఆరంభమవుతుంది. కాలేయం దెబ్బ తిన్న (లివర్‌ సిరోసిస్‌) వారిలో ఈ రకమైన కంతుల సమూహం అధికంగా కనిపిస్తుంది.

కొలాంజియో కార్సినోమా 
      కాలేయానికి సోకే ప్రతి నాలుగు కేన్సర్‌ కేసుల్లోనూ కనీసం రెండు కేసులు కొలాంజియాఓ కార్సినోమా రకానికి చెందినవై ఉంటాయి. పైత్య రసాన్ని గాల్‌ బ్లాడర్‌కు తీసుకువెళ్లే సన్నటి నాళాలలో (బైల్‌ డక్ట్‌) ఈ కేన్సర్‌ కంతులు ఆరంభమవుతాయి. హెపాటో సెల్యులార్‌ కేన్సర్‌ కంతులకు చేసే మాదిరిగానే దీనికి కూడా చికిత్స చేయడం జరుగుతుంది.

యాంజియో, హిమాంజియో సార్కోమాలు 
      ఇవి అతి అరుదుగా సోకే కేన్సర్‌ కంతులు. కాలేయానికి చెందిన రక్తనాళాలకు సోకే ఈ కేన్సర్‌ కంతులు అతి త్వరగా పెరుగుతాయి. ఈ కేన్సర్‌ కంతులను గుర్తించే సమయానికే ఇవి ఇతర భాగాల్లోకి వ్యాపిస్తాయి. ఈ రకమైన కేన్సర్‌కు చికిత్స చేసినా అంతగా ఉపయోగం ఉండదు.

హెపాటోబ్లాస్టోమా 
      చిన్న పిల్లల్లో అత్యంత అరుదుగా కనిపించే కేన్సర్‌ ఇది. నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సున్న చిన్నారుల్లో ఈ వ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధికి గురైన వారిలో 70 శాతం మేరకు బాధితులకు విజయవంతంగా చికిత్స చేయవచ్చు. వీరికి శస్త్రచికిత్స, కీమోథెరపీలు ఇవ్వడం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయి. తొలిదశలోనే వీటిని గుర్తించి చికిత్స చేస్తే 90 శాతం మందికి పైగా ప్రాణాపాయంనుంచి బైటపడతారు.

సెకండరీ కేన్సర్లు 
      సాధారణంగా కాలేయానికి సోకే కేన్సర్లే కాకుండా, శరీరంలోని ఇతర భాగాలకు సోకిన కేన్సర్లు కాలేయానికి వ్యాపిస్తాయి. ఇలా ఒకభాగంలో కేన్సర్‌ ఆరంభమై, మరొక భాగానికి చేరినప్పుడు వాటిని సెకండరీస్‌ అంటారు. శరీర భాగాల్లో ఆరంభమైన కేన్సర్లను అవి ప్రారంభమైన అవయవాన్నిబట్టి వ్యవహరిస్తారు. ఉదాహరణకు ఊపిరితిత్తుల్లో కేన్సర్‌ ప్రారంభమై కాలేయానికి సోకితే దానిని కాలేయానికి సోకిన మెటాస్టాటిక్‌ లంగ్‌ కేన్సర్‌ అని వ్యవహరిస్తారు.

హెచ్చరిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top