కనుమరుగవుతున్న తెలుగు వారి కళలు, సంప్రదాయాలు మరియు పండుగలు - Telugu Kalalu

కనుమరుగవుతున్న తెలుగు వారి కళలు, సంప్రదాయాలు మరియు పండుగలు - Telugu Kalalu
ఆంధ్ర మరియు తెలంగాణ ప్రజలు తమ జీవనవిధానంలో వినోదానికెప్పుడూ పెద్ద పీటనే వేసారు. కళాకారులను కళలనూ గుర్తించి, గౌరవించి పోషించుట చేతనే చాలాకాలం అజరామరంగా జీవించాయి. ఆంగ్లభాష ప్రబలి విద్యుతాధార వినోదం ప్రజలకు అందుబాటులోకి రావడంతో మెల్లమెల్లగా ఒక్కొక్క కళ కనుమరుగవుతూ ప్రస్తుతం అంతరించే స్థితికి చేరుకున్నాయి.

అలాంటి కళలు కొన్ని:

1. ముగ్గులు
ముగ్గులు , muggulu
ముగ్గులు వేస్తున్న తెలుగింటి అమ్మాయి - Muggulu 
తూర్పు తెలతెలవారుతుండగా, పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు వరిపిండితోనూ సున్నపు పిండితోనూ వేసి వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు చేకూరుస్తారు.

వేపపువ్వు, చెరుకుముక్కలు, కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు, బెల్లం, చింతపండు, అరటి పండు కలిపిన ఉగాది పచ్చడి ఎంతో శ్రద్ధతో తయారు చేస్తారు. వ్యక్తి జీవితంలో సుఖదుఃఖాలకు ప్రతీక అయిన తీపి, చేదుల వేపపువ్వు పచ్చడి ప్రసాదం తీసుకోకుండా ఉగాదినాడు ఏ పనినీ తలపెట్టకూడదని ప్రజల నమ్మకం.

2. కొమ్మునృత్యం
కొమ్మునృత్యం చేస్తున్న గిరిజన మహిళలు - Girijana Mahilalu
కొమ్మునృత్యం చేస్తున్న గిరిజన మహిళలు - Girijana Mahilalu 
కొమ్మునృత్యం గోదావరి తీర ప్రాంతాలలో నివసించే గిరిజనుల సంప్రదాయ నృత్యం. ఈ నృత్యం ప్రదర్శించే కోయలు వారి భాషలో ఈ నృత్యాన్ని పెరియకోక్ ఆట అని అని అంటారు. కోయ భాషలో పెరియకోక్ అంటే దున్నపోతు కొమ్ములు అని అర్థం.


దున్నపోతు కొమ్ములు ధరించి, దున్నలు కుమ్ముకునే రీతిలో నృత్యం చేస్తారు కాబట్టి ఈ నృత్యం కొమ్ము నృత్యం గా వ్యవహరింపబడుతున్నది. వీరు ఉపయోగించే వాద్యం "డోలు కొయ్య". చైత్రమాసంలో భూదేవి పండుగను ఘనంగా చేసుకుంటారు కోయలు. ఆ పండుగ సమయంలో పురుషులు అడవులలోకి వేటకి వెళ్ళడం పరిపాటి. వేట ముగించుకుని విజయవంతంగా ఇంటికి చేరుకున్న సందర్భంగా కోయలు దున్నపోతు కొమ్మలు, నెమలి ఈకల గుత్తిని పొదిగిన బుట్టను తలకు అలంకరించుకుని రంగు రంగుల బట్టలు వేసుకుని ఆయా సంప్రదాయ వాద్యాల్ని వాయిస్తూ చేసే నృత్యం, ఈ కొమ్ము నృత్యం.

3. జముకు
పూర్వపు రోజులలో శక్తి గ్రామ దేవతల కొలుపులు చేసేటప్పుడు బవనీలు అనబడేవారు అతి బీభత్సంగా జముకు అనే వాద్యాన్ని గుండెలదిరేలా మ్రోగించేవారు. కల్లు, సారాయి లాంటి మత్తు పదార్థాల్ని సేవించి కణకణలాడే కళ్ళతో శక్తి ముందు చిందులు తొక్కుతూ గొర్రెలను, మేకలను గావు పట్టేవారు. గావు పట్టడం అంటే బలి పశువును నోటితో మెడకొరికి చంపడం అని అర్థం. ఆ పైన నెత్తురు గ్రోలి, దాని ప్రేగులు ధరించి, దొబ్బలు నోటకరిచి, జముకులను వాయిస్తూ వీధుల వెంట తిరిగేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయం పోయింది. కాలక్రమేణా ఈ వాద్యం ఆధారంగా కాటం రాజు మొదలైన కథా గీతికల్ని ఆలపించడం, ఆ కథలు జముకుల కథలుగా ప్రసిద్ధి చెందడం జరిగింది.

4. బొమ్మలకొలువు
బొమ్మలకొలువు, Bommalakoluvuu
బొమ్మలకొలువు, Bommalakoluvuu 
ఏడాది పొడుగునా అల్మారాలలో దాగిన రంగురంగుల దేవతల బొమ్మలు, జంతువుల బొమ్మలు, దొరబొమ్మలు, దేశభక్తుల బొమ్మలు, కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి, మరి కొన్నిచోట్ల దసరాకి ప్రత్యక్షమై ధూప, దీప, నైవేద్యాలు అందుకుంటూ కొలువు తీరుతాయి.
బొమ్మల కొలువులు చిన్న పిల్లలతో పెట్టించి చుట్టుపక్కల నివసించే ఇల్లాండ్రను పిలిచి రాజూ-రాణీ, లేదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మలకు పెళ్ళి చేయడమో లేదా పేరంటం చేయడమో చేసి వచ్చిన ఇల్లాళ్ళకు వాయినమిచ్చి పంపించడం చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో.

5. ప్రభలు
 రెండు కర్రలపై నలుగురు పట్టుకొనేలా ఒక అరపను ప్రభలు - Prabhalu
 రెండు కర్రలపై నలుగురు పట్టుకొనేలా ఒక అరపను ప్రభలు - Prabhalu 
ప్రభ అనేది దేవుని ఊరేగింపుకు పల్లకీ లేనిచోట్ల ఉపయోగించే అరపలాంటి నిర్మాణము. చిన్న చిన్న దేవాలయములలో రెండు కర్రలపై నలుగురు పట్టుకొనేలా ఒక అరపను చేసి దానిపై దేవుని విగ్రహము లేదా బొమ్మను పెట్టి వెనుక దేవాలయము మాదిరి ఒక కట్టడాన్ని తేలికపాటి గడకర్రలతో రంగుల కాగితాలతో తయారుచేసి దానిపై దేవుని ఊరేగించేవారు. అది రానురానూ అంతటా వ్యాపించింది. మరొక తెలుగు సంప్రదాయం ప్రభలు. ఎంత ఎత్తు ప్రభ అయితే అంత గొప్ప. కోటప్పకొండ తిరణాలకి వందలాది రంగు రంగుల ప్రభలు శోభ చేకూర్చుతాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రభకు బహుమతిని అందచేస్తున్నారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని కోటప్ప కొండ ప్రసిద్ధమైన శైవక్షేత్రం. మహాశివరాత్రికి చాలా పెద్ద ఎత్తున తిరునాళ్లు జరుగుతాయి. లక్షలాది భక్తులు ఆనాడు అక్కడ ఉత్సవాలకు హాజరవుతారు. ముఖ్యంగా చూడవలసింది ప్రభల ప్రదర్శన. వందలాదిగా ప్రభలు ఆ ఉత్సవాలలో పాల్గొంటాయి. అవికాక ఇంకా కోలాటం, వీరంగం, హరికథలు మొదలైనవి ఉంటాయి. తల నీలాల మొక్కుబడులకు కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి. శివరాత్రికి రుద్రాభిషేకం, సహస్రనామార్చనలు జరుగుతాయి. ఇక్కడి శివుడిని కోటేశ్వరుడు, త్రికోటేశ్వరస్వామి అంటారు. ఆ పేరే తెలుగులో కోటప్ప అయింది.

6. బుట్టబొమ్మలు
బుట్టబొమ్మలు ఆంధ్ర ప్రాంతములో పెళ్ళి ఊరేగింపులలోనూ దేవుని కళ్యాణ ఉత్సవ సమయాల్లోనూ, పెద్ద పెద్ద తిరునాళ్లలోనూ, జాతర్లలోనూ వినోదము కొరకు ప్రదర్శింపబడుతూ ఉంటాయి. బుట్టబొమ్మలు ప్రజా సమూహాల మధ్య ఎత్తుగా ఉండి అందరికీ కనిపించే తీరులో అందర్నీ ఆకర్షిస్తూ ఉంటాయి. బుట్టబొమ్మలు ఎత్తుగా ఉండి నడుము భాగమునుండి క్రిందికి దిగేకొద్దీ లోపల కాళీగా మారుతూ పెద్దగా బుట్ట ఆకారంలో మారుతుంది. అందువలననే వీటిని బుట్టబొమ్మలంటారు.

బొమ్మల పై భాగమంతా బొమ్మ ఆకారంగా ఉండి లోపలి భాగం డొల్లగా ఉండి బొమ్మ యొక్క కళ్ళభాగంలోనూ, నోటి దగ్గరా రంధ్రాలుంటాయి. ఆటగాడు ఈ లోపలి భాగంలో దూరి, తలను దూర్చి నృత్యంచేస్తే కేవలం బొమ్మే అభినయించినట్లుంటుంది. బుట్ట బొమ్మలు ఎవరితోనూ మాట్లాడవు. ప్రజల మధ్య తిరుగుతూ వినోద పరుస్తాయి. బుట్టబొమ్మలలో పలురకాలు కలవు

7. బుర్ర కథ

ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈనాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళా రూపం బుర్ర కథ. యక్షగాన పుత్రికలయిన జంగం కథ, శారద కథలకు రూపాంతరమే బుర్రకథ. అది సంగీతం, నృత్యం, నాటకం -ఈ మూడింటి మేలుకలయిక. బుర్రకథలో నవరసాలూ పలుకుతాయి. ముఖ్యంగా వీర, కరుణరసాలను బాగా ఒప్పించే ప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీరగాథలను గానం చేసేందుకు ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తుంది. బుర్రకథ అనగానే నాజర్ పేరు గుర్తుకు వస్తుంది. ఆయనకు ఎందరెందరో ఏకలవ్య శిష్యులు బుర్రకథనే జీవనాధారం చేసుకొని బ్రతుకుతున్నారు. నాజర్ పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం బహుళ ప్రచారం పొందినవి.

బుర్రకథ ప్రాచీనమైన తెలుగు జానపద కళ. ముగ్గురు బృందముగా ఉండే ఈ ప్రదర్శనలో మధ్య పాత్రధారి ముఖ్య కధకుడు గానూ, మిగిలిని ఇద్దరిలో ఒకరు వంత కథకు, మరొకరు హాస్య కథకులుగానూ ఉంటారు. సాధారణంగా ఇది నిలుచుని చెప్పే కధ ఐనా, సౌలభ్యత కోసం కూర్చుని కూడా బుర్రకథ చెప్పి శ్రోతలను రంజింపజేయగలవారు కొన్ని ప్రాంతాలలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపాన దొడ్డిపట్ల గ్రామంలో కూర్చుని బుర్రకథ చెప్పే బృందాలు ఉన్నాయి.

8. తండాలనృత్యం
లంబాడీలు, సుగాలీలు, బంజారాలు అని వివిధ నామాలతో పిలువబడే ఆదిమ జాతివారు నాగరిక సమాజానికి దగ్గరగా పల్లెలలో, పట్టణాలలో నివసిస్తున్నా తమ కట్టు, బొట్టు, మాట, పాట, ఆట, ఆచార వ్యవహారాలను సంస్కృతిని వందలాది ఏళ్ళుగా నిలుపుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా లంబాడీ మహిళల రంగురంగుల దుస్తులు, రకరకాల ఆభరణాలు చూడముచ్చటగా ఉంటాయి.

వీరు తండాలుగా జీవిస్తారు. పెళ్ళిళ్ళలో, జాతరలలో, వీరి సాంప్రదాయక సామూహిక నృత్యం నేత్రపర్వంగా ఉంటుంది. అరకు అడవులలోనూ, శ్రీశైలం అడవులలోనూ మరియు భద్రాచలం అడవీ గ్రామాలలోనూ సందర్శకులకు కూడా వీరి నృత్యాలను చూసే అవకాశం ఉంది.

9. యక్షగానం
yakshaganam
యక్షగాన పరిణామ చరిత్ర అతి విచిత్రమైనది. రచనలో, ప్రదర్శనలో, తరతరాలకు మార్పు చెందుతూ వచ్చింది. మొదట యాత్రా స్థలాలు, కామందుల లోగిళ్ళు తదుపరి పల్లెపట్టుల రచ్చసావిడి, రాచదేవిడీలు యక్షగాన ప్రదర్శనల కధిస్థానములైనవి. వర్తమానంలో అప్పటికప్పుడు ఏ వూరి మొగనో, ఏ కోవెల వాకిటనో, ఏ సంపన్న గృహస్థు ఇంటి ముందటనో, తాటాతూటముగా నిర్మింపబడిన కమ్మల పందిరి కింద, కళ్ళాపి జల్లిన కటికనేలయే దాని రంగస్థలము.

పగటివేష కళాకారులకు రంగస్థలంతో పనిలేదు. పాత్రోచితము, రసోచితము, ప్రాంతీయోచితమైన వేషభాషలతో, నృత్య గానాలతో పట్టపగలు వేషాలు వేసుకుని హావ భావ నటనలు చిలికిస్తూ, రాగ, మేళ, తాళాలతో, పండిత పామరులను మెప్పించడం పగటివేష కళాకారులకు వెన్నతో పెట్టిన విద్య. వీరు ఊరూరా తిరుగుతూ ప్రదర్శించే ఈ రకాలైన ప్రక్రియలలో యక్షగానం ఒకటి.

10. తప్పెటగుళ్ళు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో యాదవ కులానికి చెందినవారు చేసే నృత్యాన్ని తప్పెటగుళ్ళు అంటారు. ఎదురు రొమ్ముపై ధరించిన రేకు తప్పెటలను వాయిస్తూ వీరు ముఖ్యంగా శ్రీకృష్ణగాథలను గానం చేస్తారు. వీరు ఎదురురొమ్ముపై తప్పెట గుళ్ళను కాళ్ళకు చేతులకు చిరు మువ్వలను దరించి అందరూ ఒకే పద్దతిలో కదులుతూ గానం చేస్తుంటారు.

11. జంగందేవరలు
తలపైన ఫణిచక్రం కలిగిన కిరీటం, నుదుట విభూతి రేఖలు, చంకలో జోలె, ఒక చేతిలో ఇత్తడి గంట, మరో చేతిలో కర్ర, జంగందేవరల ఆహార్యంగా ఉంటుంది. సంక్రాంతి రోజుల్లో బుడబుక్కలవాడు అర్థరాత్రి వచ్చి బుడబుక్కని వాయిస్తూ వెళ్ళగానే వేకువ ఝామున శంఖం ఊదుతూ, గంటను మ్రోగిస్తూ, శివుని కీర్తిస్తూ జంగం దేవర ఊరంతా కలియతిరుగుతూ, ప్రతి ఇంటి ముందు ఆగి గృహస్థులను దీవిస్తూ ముందుకు కదులుతాడు.

12. ఎడ్లపందాలు
తెలుగు పల్లెలలో ఎడ్ల బలాబలాలను పరీక్షించే బండ లాగుడు పందాలు సర్వ సామాన్యం.

13. కోడి పందాలు
గ్రామీణ ప్రాంతములో కోడిపందాలు
ఇప్పుడు జంతు హింసగా వీటిని నిషేధించారుగాని, ఒకప్పుడు సంక్రాంతి కి ఊరూరా కోడి పందాలు తప్పనిసరిగా జరిగేవి. పల్నాటి యుద్ధానికి ఒక కారణం కోడి పందెమే. ఒకప్పుడు గ్రామాలలో కోడి పందాలు అంటే కేవలం కోడిపందాలు మాత్రమే కాదు - పందాలు జరిగే ప్రాంతములో గుండాటలు, పేక మేజిక్ ప్రదర్శనలు, బొమ్మల దుకాణాలు, మిఠాయి దుకాణాలు ఇలా వివిధములతో దాదాపు తిరునాళ్ళ వాతావరణము ప్రతిబింబిస్తూ ఉండేవి. అందుచేతే పందాలంటే ఉదయంనుంచే హడావిడి మొదలయ్యేది గ్రామాలలో. పేరుకు నిషేధం విధించినా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.

14. పులివేషం
సర్కారు జిల్లాలలో దసరా పండుగకు, తెలంగాణాలో పీర్ల పండుగకు పులివేషం కడతారు. డప్పు వాద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ, పులి ఇతర జంతువులను ఎలా ఒడుపుగా వేటాడుతుందో చక్కగా ప్రదర్శిస్తారు ఈ కళాకారులు. ఈ వేషం వేయడంలో విజయవాడకు చెందిన గర్రె అప్పారావు, విజయనగరానికి చెందిన పైడి గురువులు సిద్ధహస్తులు.

విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో విజయదశమి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆఖరి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవం జరుగుతుంది. హంస ఆకారంలో తెప్పను రమణీయంగా అలంకరిస్తారు. దానిలో అమ్మవారిని ఉంచి నదిలో ఊరేగిస్తారు. ఒడ్డును చేరిన వేలాది భక్తులకు అది కన్నుల పండుగ.

15. హరిదాసులు
సంకీర్తన చేయుచూన్న హరిదాసు
ఒకచేత చిడతలు, మరొకచేత తంబురా మీటుతూ, ఇంటింటి ముంగిట ఆగి "ఏ తీరుగ నను దయ చూచెదవో.." అంటూ ఏదో కీర్తన పాడుతూ హరిలో రంగహరి అని కదిలే హరిదాసులు ధనుర్మాస రాయబారులు. చక్కని ఎర్ర రంగు పంచె కట్టుకొని, ఛాతీ మీద, భుజాలపై, నుదిటి మీద విష్ణు నామాలను పెట్టుకొని అపర నారదుల వలె అగుపించే హరిదాసులు, వారి కీర్తనలు సంక్రాంతి సమయంలో పల్లెకు కొత్త శోభను తెస్తాయి.

16. గోరింటాకు
కాళ్లకు పారాణి ఎలాగో చేతులకు గోరింటాకు అలాగ. గోరింటాకు శోభ ముందు నేటి గోళ్ల రంగులు దిగదుడుపే.

17. గుసాడీ
ఆదిలాబాదు జిల్లాలో రాజగోండులకు దీపావళి పెద్ద పండుగ. పౌర్ణమి నాడు ప్రారంభించి నరకచతుర్దశి వరకు గోండులు ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. నెమలి పింఛాలతో తయారు చేసిన పాగా, కృత్రిమమైన గడ్డాలు, మీసాలతో వేషం కట్టి, మెడలో గవ్వల హారాలు, తుంగకాయల దండలు, నడుముకు, మణికట్టుకు చిరు గంటలు, గజ్జెలు ధరించి, కంటి చుట్టూ తెల్లని రంగు పూసుకుని, చేతిలో కర్ర పట్టుకుని గుసాడీ నాట్యం చేస్తారు.

18. థింసా
థింసా నృత్యం విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలలో విశేషాదరణ పొందిన జానపద సామూహిక నృత్యాలలో ఒకటి. ఇది గిరిజనుల సంప్రదాయ నృత్యం. ఆడా, మగా వయసుతో నిమిత్తం లేకుండా అన్ని కొండ జాతులవారు ఈ జానపద నాట్య సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ నాట్యాన్ని ప్రతి పండుగ సందర్భంలోనూ, వివాహాది సందర్భాలలోనూ చేస్తుంటారు. వీరి దైనందిన జీవితానికి, ఆచార వ్యవహారాలకు ఈ నాట్యం అద్దం పడుతుంది.

19. డప్పు
పల్లెల్లో ప్రముఖమైన ప్రచార సాధనం డప్పు. అది ఏ ఉత్సవానికైనా పల్లెల్లో విశేషంగా ఉపయోగపడే వాద్యం. ఉద్రేకాన్ని, ఉత్తేజాన్ని కలిగించే డప్పు వాద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ చేసే నృత్యం డప్పు నృత్యం. ముందు మెల్లగా ప్రారంభమయ్యే ఈ నృత్యం రాను రాను పదవిన్యాసంతో పాటు వాద్యం కూడా ఉధృతమై, ఉత్తేజం కలిగిస్తుంది. ఆంధ్రదేశంలోని అన్ని పల్లె ప్రాంతాలలోను డప్పు ఉనికి మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది.

20. శరభనృత్యం
వంటినిడా విభూతి పుండ్రాలు ధరించి శరభ శరభా, హశ్శరభ శరభా అని వీరంగం వేస్తూ, చిందులు తొక్కుతూ, పొడవాటి పలుపు తాడుతో వీపులపై తాటించుకుంటూ ఖడ్గాలను చేత ధరించి వాటిని తిప్పుతూ నృత్యం చేస్తారు. మరొక పద్ధతిలో శూలాలతోనూ శూలాల చివర నూనె గుడ్డలు చుట్టి దానికి మంటలు పెట్టి వాటిని త్రిప్పుతూ నృత్యం చేస్తారు. ఇది కూడా పల్లెలలో ప్రసిద్దమైన జానపద కళ. ఇప్పటికీ ఈ నృత్యాన్ని చాలా చోట్ల వీరభధ్రస్వామి దేవాలయాలలో మరియు నిప్పుల గుండం తొక్కే సందర్బాలలోనూ చూడవచ్చు.

21. చెమ్మచెక్క
చెమ్మచెక్క - చేరడేసి మొగ్గ అంటూ ఆడే ఇలాంటి పడుచు పిల్లల్ని చూసే కవి తిలక్ నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని, అని ఉంటాడు.

22. రుంజ
రుంజ అనే ఈ చర్మ వాద్యం అతి ప్రాచీనమైనది. శైవ సంప్రదాయానికి చెందినది. ఇప్పుడు కోస్తా జిల్లాలలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్న ఈ రుంజ వాద్యాన్ని విశ్వబ్రాహ్మణులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. తరం నుంచి తరానికి ఈ వాద్యకళ కొనసాగుతూ వస్తున్నది. 32 రకాలుగా దీన్ని వాయించవచ్చునట.
సంక్రాంతి సంభరాల్లో గంగిరెద్దులు

23. గంగిరెద్దులు
ధనుర్మాసం వస్తూనే తెలుగునాట గంగిరెద్దులు ప్రత్యక్షమవుతాయి. వాటిని ఆడించడంలో ఎన్నో వింత పోకడలున్నాయి.

24. చెడుగుడు
పల్లెల్లో చెడుగుడు
ఉత్తరాదివారు కబడ్డీ అంటారు. తెలుగు వారు చెడుగుడు అంటారు. ఏ పేరుతో ఆడినా అందరికీ ఆసక్తి కలిగిస్తుంది ఈ ఆట. రెండు జట్లుగా జరిగే ఈ ఆటలో పది నుండి ఐదు వరకూ ఒకోజట్టులో సభ్యులుంటారు. కూత అనే ప్రక్రియతో అవతలి జట్టుమీదకు రెండవ జట్టు నుండి ఒకరు వెళతారు. అతడు నోటితో చేసే ఆకూత అనే శబ్ధం ఆపేలోపుగా అవతలి జట్టులో ఎవరినైనా ముట్టాలి. అవతలి జట్టు అతని కూత ఆపి పారిపోయేలోగా పట్టూకొంటే అతను బయట నిలుచోవలసి వస్తుంది.

25. బుడిగే జంగాలు
బుర్రకధలకు పూర్వ రూపమే జంగం కధ. ఈ కధను చెప్పే వారినే జంగాలని బుడిగే జంగాలని అంటారు. ఒకప్పుడు దేశభక్తి మత ప్రచారాలకు ఎంతో తోడ్పడినా ప్రస్తుతం తెరమరుగై కొందరి ఉధర పోషణార్ధం కొరకే పనికొస్తున్నాయి.

26. కనక తప్పెట్లు
డప్పుల వాయిధ్యాన్నే రాయలసీమలో కనక తప్పెట్లు అంటారు. వీటిని సాధారణంగా జాతరలకు, వివాహాలకు, చాటింపులకు ఉపయోగిస్తూ ఉంటారు. దప్పులతో గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతూ వివిద వరుసలలో లయగా వాయిస్తూ లయబద్దంగా నృత్యం చేస్తారు

27. ఘటనృత్యం
ఘటనృత్యం లేదా గరగనృత్యంగా పిలిచే ఈ ప్రక్రియలో తలపై కలిశాకారం కలిగిన ఘటాన్ని ఎత్తుకొని డప్పులశబ్ధానికి లయగా నృత్యం చేస్తారు. ఐదు లేదా మూడు సర్పాల ఘటాలతో జాతరలలో ఎక్కువగా వెరు నృత్యం చేస్తుంటారు.

28. పగటి వేషాలు

జానపదుడి వీధి ప్రదర్శన-పగటివేషాలు జానపదకళలు ఆదరణ తక్కువ కావడంచేత చాలా కళలు భిక్షుకవృత్తిగా మారిపోయాయి. బుర్రకథ, వీధినాటకం, యక్షగానం వంటి కళారూపాలు భిక్షుకవృత్తిగా మారిపోయిన దశ కనిపిస్తుంది.

అట్లాంటి కళారూపాలలో పగటివేషాలు ఒకటి. చాలా జానపద కళారూపాలు మతపరంగానో, కులపరంగానో, వాద్యాలపేరుతోనో పిలువబడితే కేవలం ప్రదర్శనాసమయాన్ని బట్టి పిలువబడేది పగటివేషాలు కళ. అనేకమైన వేషాలు ప్రదర్శింపబడడంచేత, పగటిపూటనే ప్రదర్శింపబడడంచేత ఇవి పగటివేషలయ్యాయి. పగటి వేషాలనే పైటేషాలని కూడా అంటారు. పగటి వేషాలు జానపద కళారూపాల్లో ప్రముఖమైనవి. యక్షగానం, వీధినాటకాలనుండి బ్రోకెన్ డౌన్ మిత్ అన్న వాదం ప్రకారం వీధినాటకాలే పగటివేషాలుగా మారాయని పరిశోధకుల అభిప్రాయం. ప్రదర్శించే వేళను బట్టి, సమయాన్ని బట్టి వీటికి పగటివేషాలని పేరు వచ్చింది. కేవలం పగటిపూట మాత్రమే వీటిని ప్రదర్శిస్తారు. పగటివేషాలను, సంచారిపగటివేషాలని , స్థానిక పగటివేషాలని విభజించవచ్చు. సంచారిపగటివేషాల వాళ్ళు దాదాపుగా సంచారజీవనం చేస్తూ ప్రదర్శనలిస్తుంటారు. వీళ్ళనే బహురూపులు అనికూడా అంటారు. పగటివేషాల ప్రదర్శన ఒక ఊళ్ళొ నెలల పాటు ఉంటుంది. ప్రతి రోజు ప్రదర్శించి తరువాత చివరి రోజున సంభావనలు తీసుకుంటారు. జానపద కళలూ చాలా వరకు యాచక వృత్తిగా మారిపోయాయి. అట్లా మారిన వాటిలో పగటివేషాలు ఒకటి. వచ్చిన సంభావన అందరు పంచుకుంటారు. వీరు ఆహార్యం, అలంకరణ పట్ల శ్రద్ద వహిస్తారు. సంభాషణలు, వీరు చెప్పే పద్యాలు రక్తి కట్టిస్తాయి.


ప్రాచీన కాలంలో అనేక పగటివేషాలు ప్రదర్శింపబడేవి. కాని ఇప్పుడు అన్ని వేషాలు వేయడం లేదు. కారణం జీవనంలో వచ్చిన మార్పులేనని వీరు చెబుతారు. ఒకప్పుడు బోడి బాపనమ్మ వేషం వేసేవారు. కాని ఉదయమే ఈ విధవ మోహం చూడలేమని ఈ వేషంతో మా యింటి వద్దకు రావద్దని చెప్పడం మూలాన ఈ వేషం వేయడంలేదని వీరు వివరించారు. అట్లే కులాలకు , మతాలకు చెందిన సాత్తని వేషం, బ్రాహ్మణ వేషం వంటివి వేయడంలేదు. వీరు ప్రదర్శించే వేషాలలో అర్థనారీశ్వర వేషం ప్రత్యేకమైనది. ఈ వేషం మేకప్ వేయడానికి దాదాపుగా 3 గంటల సమయం పడుతుందని, సాయంకాలం దాకా ఈ మేకప్ ఉండాలికాబట్టి ప్రత్యేకమైన రంగులు వాడతామని వీరు చెబుతారు. ఒకే వ్యక్తి స్త్రీ , పురుష వేషాలు ధరించి సంభాషణలు చెప్పడం అంటే సామాన్యం కాదు. పగటి వేషాలు చారిత్రకత జనవ్యవహారంలో ఉన్నకధలను బట్టి పగటివేషాలు రాజు కళింగ గంగుకధ, సంబెట గురవ రాజు కథ, విజయనగర రాజుల కధలు ప్రస్తావనలోకొస్తాయి. పగటి వేషలను గురించి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ప్రొ. ఎస్. గంగప్ప పరిశోధించి పగటి వేషాలు వాయసంలోను, కూచిపూడి భాగవథులు ప్రదర్శించే వేషాలను పగటి వేషాలుగా వివరించారు. పగటి వేషాలకు చారిత్రకాధారాలున్నాయి. భిక్షుకవృత్తిగా ప్రారంభమైన ఈ కళ కాలక్రమంలో ఒక సంక్లిష్ఠ రూపంగా మారింది. శాతవాహనుల పరిపాలనా కాలమ్నుండే ఈ కలారూపం ఉందని, హాలుని గాధాసప్తశతిలో దీని ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. మార్గ, దేశి, శిష్ఠ సాహిత్య లక్షణాలన్ని మూర్తీభవించిన కళ పగటివేషాలు.

పగటివేషాలు - వర్గీకరణ పగటి వేషాలు ఒకప్పుడు దాదాపుగా 64 ఉండేవని కాని ఇప్పుడు 32 వేషల్లు మాత్రమే వేస్తున్నామని నంద్యాల కళాకారులు అంటారు.
ఇతివృత్తం ఆధారంగా పగటివేషాలను ఐదు విధాలుగా విభజించవచ్చు. 
1. మతపరమైనవి: ఆదిబైరాగి వేషం, చాతాది వైష్ణవ వేషం, కొమ్ము దాసరి వేషం, హరిదాసు వేషం, ఫకీరు వేషం, సహెబుల వేషం.
2. కులపరమైనవి: బుడబుక్కల వేషం, సోమయాజులు-సోమిదేవమ్మ వేషం, బోడి బ్రాహ్మణ స్త్రీ వేషం, వీరబాహు వేషం, గొల్లబోయిడు వేషం, కోయవాళ్ళ వేషం, దేవరశెట్టి వేషం, దేవాంగుల వేషం, ఎరుకలసోది వేషం వంటివి.
3. పురాణపరమైనవి: జంగం దేవర వేషం, శక్తి లేదా శూర్పణఖ వేషం, అర్థనారీశ్వర వేషం వంటివి.
4. జంతు ప్రదర్శన పరమైనవి: గంగిరెద్దుల వేషం, పములోల్ల వేషం,
5. ఇతరములు: పిట్టలదొర వేషం, చిట్టి పంతులు వేషం, కాశికావిళ్ళ వేషం వంటివి.

పగటివేషాలు- ప్రదర్శన రీతులు పగటివేషాల్లో కొన్నింటిలో సంభాషణలకు ప్రాధాన్యత ఉంటే మరికొన్నింటిలో పద్యాలకు, అడుగులకు , వాద్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. బుడబుడకల వేషం, ఎరుకలసాని వేషం, బోడి బ్రాహ్మణ స్త్రీ వేషం వంటి వాటిలో సంభాషణలకు ప్రాముఖ్యత ఉంటుంది. పురాణ వేషల్లో హార్మోనియం, తబలా వంటి వాద్యాలతో పాటు యక్షగాన శైలిలో ప్రదర్శన ఉంటుంది. కుల సంబంధమైన పగటివేషాలు సంఘంలోని అనేక కులాల వారి జీవనవిధానాన్ని వ్యంగ్యంగా ప్రదర్శిస్తాయి. ప్రతి కులాన్ని గురించి తెలియ చేస్తూ ఆ కులాలపై సమాజం యొక్క అభిప్రాయాలను విమర్శిస్తాయి. పగటివేషాల లక్ష్యం వ్యంగ్యమే. వీరికి రంగస్థలం అంటూ లేదు. ఇంటిగడప, వీధులు, సందులు, గొందులు, అన్ని వీరి రంగస్థలాలే. ప్రదర్శన సమయాల్లో ప్రేక్షకులు, ప్రదర్శకుల మధ్య వ్యత్యాసముండదు. పగటి వేషాల్లోనే ప్రత్యేకత, ప్రావీణ్యత కలిగిన వేషం అర్థనారీశ్వర వేషం. ఒక వ్యక్తి మధ్యలో తెర కట్టుకొని ఒకవైపు నుండి పార్వతి, మరోవైపునుండి శివుడుగా అలంకరణ చేసుకొని ప్రదర్శనలిస్తాడు. తెర మార్చుకుంటున్నప్పుడు ఒక వైపు నుండి చూస్తే శివుడు మరో వైపునుండి చూస్తే పార్వతిని చూసిన అనుభూతి కలుగుతుంది. తెర మార్చుకోవడంలోనే వీరి నైపుణ్యమంతా దాగిఉంది.

29. బతుకమ్మ
తెలంగాణా ప్రాంతంలో ఆచరించే పూల పండుగ, పూబోడుల పండుగ, బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు ఎంతో ఉత్సాహంతో మహిళలు జరిపే ఈ పండుగ చివరి రోజును సద్దలు అని వ్యవహరిస్తారు. దసరాకు ఒకటి రెండు రోజుల ముందు ఈ పండుగ వస్తుంది. రంగు రంగుల పూలను ఎంతో మెళుకువతో పిరమిడ్ ఆకారంలో పేర్చి, ఆ పువ్వుల కుచ్చెన నడిబొడ్డులోగాని, శిఖరంలోగాని గౌరమ్మను అమరుస్తారు. ఈ పువ్వుల పళ్లెరాన్ని వాకిట్లో ఉంచి కొత్త దుస్తులు ధరించి స్త్రీలు, బాలికలు చేరి దీని చుట్టూ క్రమంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతారు. తర్వాత ఊరేగించి ఈ బతకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు.

గొర్రెల మందలను కాయడం ఒక వర్గం ప్రజలకు వృత్తి. గొర్రెలు పాలు ఇస్తాయి, ఉన్ని ఇస్తాయి. పైగా వ్యవసాయ భూములలో మందలను వదలి పెట్టడం వల్ల ఆ భూములకు ఎరువులు సమకూరి సారం పెరుగుతుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కాపరులు గొర్రెలను తోలుకుపోవడం తెలుగునాట తరుచుగా కనబడే చక్కని దృశ్యాలలో ఒకటి.

30. వినాయక చవితి
హిందువుల పండుగలలో అతి ముఖ్యమైనది వినాయక చవితి. దీన్ని ఔత్తరాహులు గణేశ్ చతుర్థి అంటారు. తలపెట్టిన పనులు విఘ్నరహితంగా నెరవేరాలని కోరుతూ వినాయకుడిని ఆనాడు పూజిస్తారు. అన్ని రకాల పత్రి, పువ్వులు, ఫలాలు, పూజాద్రవ్యాలు, వినాయకునికి ఇష్టమైన కుడుములు ఆనాటి పిండి వంటలలో ముఖ్యభాగం. పూజానంతరం వినాయకుని కథ చదివి అక్షింతలు నెత్తిపై చల్లుకుంటే తప్ప పండుగ పూర్తికాదు. పూజ చెయ్యకుండా ఆ రాత్రి చవితి చంద్రుడిని చూడరాదని కట్టడి.

పూర్వం మన పల్లెటూళ్ళలో ఏ ఉత్సవం జరిగినా, తిరునాళ్ళు జరిగినా బుట్ట బొమ్మలు ప్రత్యక్షమయ్యేవి. ఈ బుట్టబొమ్మలు ధరించిన కళాకారులు వాద్యాలకు అనుగుణంగా లయాన్వితంగా నాట్యం చేస్తారు. క్రమంగా ఈ కళ అంతరించి పోతున్నది.

కాళ్లకు పారాణి అచ్చమైన తెలుగు సంప్రదాయం. కాళ్లకు పారాణి పూసుకుని పావడా కుచ్చెళ్లు ఎత్తిపట్టుకుని వెండి పట్టాలు ఘల్లు ఘల్లుమంటూండగా కన్నెపిల్లలు నట్టింట నడయాడడం ఎంతో అందమైన దృశ్యం.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top