భగవంతుని మాయ - Bhagawantuni Maaya


భగవంతుని మాయ - Bhagawantuni Maaya
భగవంతుని మాయ అంటే ఏమిటి? :
భక్తునిపై మాయ ప్రభావం మాయ దైవీ శక్తి. భగవంతుని నుండే వచ్చింది. ఆయన అధీనంలో ఉంటుంది. మాయను దాటడం చాలా కష్టం. భగవంతుణ్ణి ఆశ్రయించిన వారే దాన్ని దాటగలరు.

"ఎవరైతే నన్నే శరణాగతితో వేడుకుంటారో వారిని తరింపజేస్తాను" అని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో హితవు పలికారు.
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మాేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే!! ’యా’ ’మా’ ఏదిలేదో అదే మాయ అంటారు శ్రీరామకృష్ణులు. 
నేనూ, నావారు, భార్య, భర్త, పిల్లలు అనుకోవడం మాయ. అందరూ తనవారే అనుకొని వారికి సహాయం చేయడం దయ అంటారు. వేదాంత పరిభాషలో దీన్ని అనిర్వచనీయం అంటారు. భగవంతుణ్ణి మరిపింపజేసి ఈ ప్రపంచమే సర్వస్వం అనుకొనేలా చేసేది మాయ. అరిషడ్వర్గాలైన కామ-క్రోధ-లోభ-మోహ-మదమాత్సర్యాలకు లోనై ఉండేవాడు మాయలో ఉన్నట్లే.

భగవంతుడే సత్యం, మిగతాదంతా అసత్యం అనే భావన వచ్చినప్పుడు మాయను అధిగమించవచ్చు. "ఎవరు మాయను దాటగలరు" అని రెండుసార్లు ప్రశ్నించి, "అవతార పురుషులనూ, మహాత్ములనూ సేవించినవారే మాయను దాటగలరు" అని భక్తి సూత్రాల్లో నారదమహర్షి చెప్పారు. 

’అవ్యక్తనామ్నీ పరమేశ శక్తి రనాద్యవిద్యా త్రిగుణాత్మికా పరా కార్యానుమేయా సుధియైవ మాయా యయా జగత్సర్వమిదం ప్రసూయతే’ - వివేకచూడామణి శ్లోకం 110 '...మహాద్భుతా నిర్వచనీయ రూపా’ - వివేకచూడామణి 111 దీనిపేరు అవ్యక్తం. త్రిగుణాత్మికమైనది దీని రూపం. 

అనాది అయిన అవిద్యా స్వరూపం. ఈ జగత్తు అంతా మాయవల్లే పుడుతోంది. వర్ణింప శక్యం కానిది. మహాద్భుతమైనది మాయ. ’శుద్ధాద్వయ బ్రహ్మ విబోధనాశ్యా సర్పభ్రమో రజ్జు వివేకతో యథా...’ వివేకచూడామణి 112 మునిమాపు వేళ పాము, త్రాడు అనే జ్ఞానం కలగగానే భ్రమ తొలగినట్లు అద్వితీయ శుద్ధ బ్రహ్మ జ్ఞానం కలగడంతోనే మాయ తొలగుతుంది. ఒకసారి నారదుడు ’నీ మాయను చూడాలని ఉంది’ అని శ్రీకృష్ణుణ్ణి కోరాడు. 

శ్రీకృష్ణుడు అతణ్ణి తీసుకొని ఎడారి మార్గంలో వెళుతూ దప్పికై, కొంచెం మంచినీళ్ళు కావాలని కోరాడు. నారదుడు అల్లంత దూరాన ఉన్న ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ఒంటరిగా ఉన్న కన్యను చూసి మోహించాడు. ఆమెను పెళ్ళి చేసుకొని సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకసారి వరద వచ్చింది. భార్యా, పిల్లల్ని రక్షించబోయి అందరినీ వరదలో పోగొట్టుకొన్నాడు. అప్పుడు విలపిస్తున్న నారదుణ్ణి, శ్రీకృష్ణుడు తన చేతితో స్పృశించి "నారదా! మంచినీళ్ళు ఏవీ?" అని అడిగాడు. అప్పుడు నారదుడికి స్పృహ వచ్చింది. ఇదే మాయ. క్షణంలో అంతా మరిపిస్తుంది. భగవంతుని కృపతోనే మాయను దాటవచ్చు. మాయను గురించి వివరిస్తూ  ’ఉన్న వస్తువు (బ్రహ్మ) ఒక్కటే. ద్రవ్యమో! చైతన్యమో!! వాటిని రెంటినీ విడదీసి ఆలోచించడం కష్టం. అదే మాయ. అదే అజ్ఞానం’ అన్నారు స్వామి వివేకానంద.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top