అభిషేక ప్రియం శివోహం - Abhisheka Priya Shivaఅభిషేక ప్రియం శివోహం - Abhisheka Priya Shiva
అభిషేక ప్రియ శివ
శివో అభిషేక ప్రియ: (అంటే శివుడు అభిషేక ప్రియుడు). "శివుడు అభిషేక ప్రియుడు" కాసిని నీళ్ళు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు !!

"నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి
పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు
గామధేనువు వానింట గాడి పసర
మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు"

తా:- శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు 'కామధేనువు' కాడి పశువుగా పడి వుంటుందట, 'కల్పవృక్షం' అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట !!శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి !! సకలైశ్వర్యములు సమకూరతాయి !!

నిశ్చల భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి. అవి తెలుసుకోవడం వల్ల నిత్యారాధకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. ఆ సమాచారం ఇదిగో మీ కోసం.
అభిషేక ప్రియం శివోహం - Abhisheka Priya Shiva
అభిషేక ద్రవ్యాలు - ఫలితాలు:
 • ఆవు పాలతో - సర్వ సౌఖ్యాలు
 • ఆవు పెరుగు -  ఆరోగ్యం, బలం
 • ఆవు నెయ్యి - ఐశ్వర్యాభివృద్ధి
 • చెరకు రసం (పంచదార) - దుఃఖ నాశనం, ఆకర్షణ
 • తేనె - తేజో వృద్ధి
 • భస్మ జలం - మహా పాప హరణం
 • సుగంధోదకం - పుత్ర లాభం
 • పుష్పోదకం - భూలాభం
 • బిల్వ జలం - భోగ భాగ్యాలు
 • నువ్వుల నూనె -  అపమృత్యు హరణం
 • రుద్రాక్షోదకం - మహా ఐశ్వర్యం
 • సువర్ణ జలం - దరిద్ర నాశనం
 • అన్నాభిషేకం - సుఖ జీవనం
 • ద్రాక్ష రసం - సకల కార్యాభివృద్ధి
 • నారికేళ జలం - సర్వ సంపద వృద్ధి
 • ఖర్జూర రసం - శత్రు నాశనం
 • దూర్వోదకం (గరిక జలం) - ద్రవ్య ప్రాప్తి
 • ధవళొదకమ్ - శివ సాన్నిధ్యం
 • గంగోదకం - సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
 • కస్తూరీ జలం - చక్రవర్తిత్వం
 • నేరేడు పండ్ల రసం - వైరాగ్య ప్రాప్తి
 • నవరత్న జలం - ధాన్య గృహ ప్రాప్తి
 • మామిడి పండు రసం - దీర్ఘ వ్యాధి నాశనం
 • పసుపు, కుంకుమ - మంగళ ప్రదం
 • వీబూది - కోటి రెట్ల ఫలితం
విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేకప్రియుడనబడుతున్నాడు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు. ఆయన శిరస్సు పై గంగ వుంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది. జలం పంచభూతాలలోను, శివుని అష్టమూర్తులలోను ఒకటి. " అప ఏవ ససర్జాదౌ " అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాగ్నే సృష్టించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే.

మంత్రంపుష్పంలోని " యోపా మాయతనంవేద " ఇత్యాది మంత్రాలలో నీటి ప్రాముఖ్యం విశదీకరించబడివున్నది. అందుచేత శివపూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. భగవంతున్ని 16 ఉపచారాలతో పూజిస్తారు. అందులో ఇతర ఉపచారాలకంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనది.

"ప్రజపాన్ శతరుద్రీయం అభిషేకం సమాచరేత్" అన్న ప్రమాణాన్ని అనుసరించి శతరుద్రీయం పటిస్తూ అభిషేకం చేయాలి." పూజాయా అభికోహోమో హోమాత్తర్పణ ముత్తమం తర్పణాచ్చ జపః శ్రేష్టో హ్యభిహేకః పరో జపాత్ " పూజకంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపమూ, జపం కంటే అభిషేకము ఉత్తరోత్తరం, శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెపుతారు.

అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top