వర్ణం - జాతి - కులం - Varna Jaathi Kulaalu

'వర్ణం', 'జాతి', 'కులం'
ఇక్కడ మనం 'వర్ణం', 'జాతి', 'కులం' అనే మాటలకు గల అర్థాలను చూడటంకూడా బాగుంటుంది.
ముందుగా ఈ పదాలకు నిఘంటువులలో ఉన్న అర్థాన్ని చూద్దాం:
'వర్ణము' అనే పదానికి శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు (ఏడవ సంపుటం, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, హైదరాబాద్‌, జనవరి 1982, పేజీ 79) అనేక ఇతర అర్థాలలోబాటు 'బ్రాహ్మణ్యాదిజాతి (చాతుర్వర్ణ్యము) అన్న అర్థాన్ని ఇచ్చారు. అంటే ఇక్కడ 'వర్ణము', 'జాతి' అనే పదాలకు అసలు వ్యత్యాసమే లేదన్నమాట. పైగా 'వర్ణ్యము' ('వర్ణము' కాదు) అనే పదంకూడా కానవస్తోంది. 'వర్ణ్యము' అనే పదం ఈ నిఘంటువులో కానరాలేదు. 

ఇదే నిఘంటువులో 'జాతి' అనే పదానికి:
1. జన్మము, పుట్టుక, 
2. వంశము, కులము, 
3. (బ్రాహ్మణాది) వర్ణము, తెగ, వర్గము అనే అర్థాలను (తృతీయ సంపుటం, పే. 381) ఇచ్చారు.

ఇక్కడ, జాతి, వర్ణము, కులము, తెగ, వర్గము అనే మాటలన్నీ సమానార్థకాలుగానే ఉన్నాయి. 

అలాగే, 'కులము' అనే పదానికి:
1. వంశము, అన్వయము,
2. సజాతీయప్రాణి సమూహము (ఉదా. విప్రకులము, పకిక్షులము), 
3. గృహము, ఇల్లు, 
4. జనపదము' అనే అర్థాలు కానవస్తున్నాయి. (ద్వితీయ సంపుటం, పే. 325). ఇలా చూస్తే, 'వర్ణము', 'వంశము', 'కులము', 'జాతి', 'తెగ', 'వర్గము' అనే పదాలే కాదు, ఆఖరికి 'గృహము', 'ఇల్లు' అనే పదాలూ ఇవే అర్థంలో కనిపిస్తున్నాయి.

(చిత్రంగా వారాలకు సైతం 'కులాలు' ఉండటం విశేషం. వారాలు 3 రకాలు. మంగళ, శుక్ర వారాలు 'కుల వారాలు', ఆది, సోమ, గురు, శని వారాలు 'అకులవారాలు', ఒక్క బుధవారం మాత్రమే 'కులాకులవారము' అని శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు (ద్వితీయ సంపుటం, పే. 326) చెప్తోంది. అలాగే, గ్రహాలలోనూ వర్ణవిభాగం ఉండటం విశేషం. 

            క్రూరా భాను తమశ్వని ధ్వజకుజా శ్శు క్రార్య సౌమ్యేందవ 
            స్సౌమ్యాస్తే పురుషాః కుజార్కగురవో రాహ్విందు శుక్రాః స్త్రయః             
            తచ్ఛేషాస్తు నపుంసకా గురు భృగూ విప్రౌ కుజా ర్కౌ నృపా
            వైశ్యౌ చంద్ర బుధౌ తదవ్య కులజో మందస్తు వర్ణేశ్వరః'

అని 'జ్యోతిశ్శాస్త్రం'లో ఉంది. అంటే, గురు శుక్ర గ్రహాలు బ్రాహ్మణ గ్రహాలు; సూర్య అంగారక గ్రహాలు క్షత్రియ గ్రహాలు; చంద్ర బుధులు వైశ్య గ్రహాలు; శని శూద్ర గ్రహం. ఇదే విషయం 'సర్వార్థ చింతామణి'లోనూ, 'బృహజ్జాతకం'లోనూ ఉంది.)

'వంశోస్వవాయస్సంతానో వర్ణాస్స్యుః  బ్రాహ్మణాదయః 
విప్ర క్షత్రియ విట్ఛూద్రః  చాతుర్వర్ణ్య మితి స్మృతమ్‌'

అని 'గురుబాల ప్రబోధిక' (పేజీ 185)లో ఉందని శ్రీ చందూరి వేంకట సుబ్రహ్మణ్యంగారు తమ 'వర్ణవ్యవస్థలో బ్రాహ్మణులు' అనే పుస్తకం (కాశ్యప స్వాధ్యాయ  కేంద్రం, సికింద్రాబాద్‌ వారి ప్రచురణ, జూలై 2007, పేజీ 19)లో వివరిస్తున్నారు.

ఇక, 'కులం' అన్నది నివాసపరంగా వచ్చిందని ఒక భావన. 'కులము' అనే పదానికి 'గృహము', 'ఇల్లు' అనే అర్థాలు ఉన్నట్లు ముందుపేజీలో వివరించటం జరిగింది. 

'జాతి' అనే పదానికి 'జాయత ఇతి జాతిః' అంటే 'ప్రాదుర్భవించునది' అని 'శబ్దరత్నాకరం'లోని అర్థం. పుట్టునది జాతి అని అర్థం. లేదా 'పుట్టుకతో వచ్చునది' అని అర్థం చెప్పుకోవాలి. పుట్టుకతో వచ్చేది జాతి అన్నమాట.  

వాల్మీకి రాసిన శ్రీమద్రామాయణంలోని యుద్ధకాండలో 131 సర్గలోని ఒక శ్లోకంలో
'బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శ్శూద్రా లోభవివర్జితాః
స్వకర్మనుప్రవర్తతే తుష్టాఃస్వైరేవ కర్మభిః'
అని ఉంది. అంటే తమతమకు విధింపబడిన కర్మవృత్తులల్లోనే ఉంటూ, ఇతర వృత్తులవారు గొప్పవారనే భావం లేకుండా 'బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు లోభములు లేనివారై, తమతమ కర్మల చేత సంతుష్టులై, తమ తమ కర్మలయందే ప్రవర్తించుచున్నారు' అని అర్థం. ఈ శ్లోకాన్ని బట్టి చూస్తే, నాలుగు వర్ణాలూ రామాయణ రచనా కాలానికే ఉన్నాయన్నది స్పష్టం.
అయితే, చరిత్ర దృక్కోణంలో చూస్తే, ఆంధ్రదేశములో వర్ణాశ్రమ పద్ధతి లేకుండెను. ఈ యుగమునుండియే (అంటే, సుమారు క్రీ.పూ. 5 లేదా 4వ శతాబ్దకాలం నుండి) తెలుగు దేశమున చాతుర్వర్ణ్య విభాగము పాదుకొనెను' అంటారు ఆచార్య శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనం గారు తమ 'ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి' గ్రంథంలో (పే.92).
'జన్మనా జాయతే శూద్రః సంస్కారా ద్ద్విజ ఉచ్చతే
వేదపాఠీ భవే ద్విప్రః బ్రహ్మజ్ఞానాత్తు బ్రాహ్మణః'
అని కూడా ఉంది. అంటే, పుట్టుకతో అందరూ శూద్రులే అయినా, తమతమ విధినిర్వహణ సంస్కారాలనుబట్టి ద్విజులుగానూ, వేదపాఠాలను చదవటం వల్ల విప్రులుగానూ, బ్రహ్మజ్ఞానం పొందటం చేత బ్రాహ్మణులు గానూ అవుతారని శంకరాచార్యులవారు వివరించారు. 

అచ్చం ఇలాంటి భావమే బౌద్ధమతంలోనూ ఉండటం విశేషం. ప్రియదస్సి థేరా (ప్రియదర్శి థేరా) అనువదించిన సుత్త నిపట 1.7వ సలసుత్త పాదం 12లో ఇలా ఉంది:
'Not by birth is one is an outcast, not by birth is one a brahman. By deed one becomes an outcast, by deed one becomes a brahman.'

శంకరాచార్యులవారు చెప్పిన దాంట్లో ద్విజులు, విప్రులు, బ్రాహ్మణులు అన్న మూడు వేర్వేరు పదాలున్నాయి. ప్రస్తుతం ఈ మూడు పదాలకూ ఒకే అర్థం ఉన్నా, ఒకప్పుడు ఈ మూడు పదాలూ భిన్నమైనవనీ, వాటి అర్థాలలో వ్యత్యాసాలు ఉండేవనేది స్పష్టం. అంటే, ఇప్పుడు సమాజంలో బ్రాహ్మణులుగా చెప్పుకుంటున్నవారు బ్రహ్మజ్ఞానాన్ని పొందటం లేదా సాధించుకోవటం అవసరమన్నదీ అర్థమవుతోంది.

ఋగ్వేదంలో సుప్రసిద్ధమైన 'పురుష సూక్తం' (10.90.12)లో 'బ్రాహ్మణోస్య ముఖమాసీత్‌' అనీ ఉంది. దాని పూర్తి పాఠం ఇది:
'బ్రాహ్మణోస్య ముఖమాసీత్‌
బాహూ రాజన్యఃకృతః
ఊరూ త న్య యద్వైశ్యః
పద్భాం శూద్రోఅజాయత '
                (ఋగ్వేద దశమ మండలం).

ఇదే, తైత్తిరియారణ్యకమ్‌ - తృతీయ ప్రశ్న - 5లో కూడా ఉంది. (సస్వర వేదమంత్రాలు, శ్రీరామకృష్ణ మఠం, మైలాపూర్‌, చెన్నై వారి ప్రచురణ, 2006, పే.484).

అంటే, సహస్ర శీర్షుడు, సహస్రాక్షుడు, సహస్రపాదుడు, సర్వవ్యాపకుడు అయిన మహాపురుషుని ముఖమే 'బ్రాహ్మణుడు' అయింది.
అంటే, బ్రాహ్మణుని జన్మ ఆ విశ్వవ్యాపకుడైన విరాట్‌పురుషుని నోటి నుంచి జరిగిందని అర్థం. 
బౌద్ధ జన సామాన్యానికి ఉద్దేశించిన బుద్ధుని బోధనల సంక్షిప్తరూపమే 'ధమ్మపదం'. ఇందులో 26 'వర్గం'లు ఉన్నాయి. 26వ వర్గం 'బ్రాహ్మణ వర్గం'.

ఈ అధ్యాయంలో గౌతమ బుద్ధుడు ఎవరిని 'బ్రాహ్మణుల'ని అనాలో  వివరంగా చెప్పారు. అది ఎలాగున్నా, బుద్ధుని కాలానికే బ్రాహ్మణులు, ఇతర వర్ణాలవారూ ఉన్నారనేది స్పష్టం చేస్తోంది. 

కోవెల్‌ అనువదించి, ఫాస్‌బౌల్‌ సంపాదకత్వంలో 1895-1913 ప్రాంతంలో లండన్‌లో ప్రచురితమైన జాతకకథల వల్లా మనకు వర్ణవ్యవస్థ గురించిన కొంత సమాచారం లభిస్తోంది.

జాతక కథలనేవి బుద్ధుని పూర్వజన్మ గాథలుగా భావిస్తారనేది తెలిసిందే! భీమసేన జాతక కథ ప్రకారం - ఆంధ్రదేశంలో వర్ణవ్యవస్థ అనాదిగానే ఉంది. ఆ జాతక కథానుసారం, బోధిసత్త్వుడు ఒక బ్రాహ్మణుడుగానే జన్మించి, తక్షశిలలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి, తర్వాత వాస్తవిక ఆచరాణాత్మక అధ్యయనం కోసం ఆంధ్రదేశానికి వచ్చాడు. ఆ సమయంలో ఒక వైశ్యుడు బోధిసత్త్వుడిని మోసగించాడు. తర్వాత కథ ఎలా ఉన్నా, ఈ కథ వల్ల రెండు అంశాలు స్పష్టం అవుతున్నాయి. 

1. విద్యాభ్యాసం కోసం బోధిసత్త్వుడు వచ్చాడు కనుక ఆయన వచ్చేనాటికే ఆంధ్రదేశంలో వేదాధ్యయనం విస్తృతంగా ఉండేది.
2. ఆయన ఒక వైశ్యుని చేతిలో మోసగింపబడటం ఎలా ఉన్నా, అప్పటికే వర్ణవ్యవస్థ కూడా బాగా కుదురుకుని ఉందన్నది స్పష్టం.

ఈ విషయాలను ఆ తర్వాత కాలంనాటి చరిత్రాంశాలు కూడా నిర్ధారిస్తున్నాయి. 

వైదికంలో సూత్రాలను రాసిన వారిలో ఒకరైన ఆపస్తంబుడి కాలానికే (సుమారు క్రీ.పూ. 5 - 3 శ.) వర్ణవ్యవస్థ ఉందని సుపస్రిద్ధ పరిశోధకులు శ్రీ బి.ఎస్‌.ఎల్‌. హనుమంత రావు (Religion in Andhra, 1957, P-47) అంటున్నారు. అలాగే, అంతక్రితం ఇతర మతాలలో ఉన్న ఆచార వ్యవహారాలను సున్నితంగా హైందవ మతంలో కలిపి, వాటిని అథర్వ(ణ) వేదంలో ప్రవేశపెట్టిందీ ఆపస్తంబుడేననీ శ్రీ హనుమంత రావు వివరిస్తున్నారు. పురాణ రచనకూడా ఆపస్తంబుని కాలం నుంచే ఆరంభం అయి ఉంటుందనీ ఆయన అభిప్రాయం.
వివాహాలు
వివాహాలు
అదెలా ఉన్నా, నేడెంతగానో అభివృద్ధి చెందిన 'సోషియాలజీ' అనే సామాజిక శాస్త్రం ప్రకారం చూసినా, సమాజంలో ఆనాటి అవసరాలను బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణాలు రూపొంది ఉంటాయి. ఇటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ ప్రాచీనకాలంలోని ఈజిప్టు, బాబిలోనియాలతోబాటు చైనాలో కూడా ఉండేదని ఒక వాదం. అయితే, వారిని పూజారులు (priests), పాలకులు (rulers), వృత్తిదారులు (artisans), బానిసలు (slaves) అనే వారని తెలుస్తోంది. అలాగే, ప్రాచీన ఇరాన్‌లో 'పిస్త్రీ' అనే నాలుగు వర్గాలు ఉండేవి. అవికూడా దాదాపు మన చాతుర్వర్ణ్యాలలాంటివేనని పరిశోధకుల అభిప్రాయం.మౌర్యుల కాలంలో మన దేశాన్ని సందర్శించిన తర్వాత మెగస్థనీస్‌ రాసిన పుస్తకం 'ఇండికా'. ఇది నాటి సింధు దేశం అయిన నేటి 'ఇండియా'ను గురించిన ఎంతో సమాచారం అందిస్తోంది. ఆయన రాసినదాని ప్రకారం, అప్పట్లో భారతదేశంలో ఏడు వర్గాలు ఉండేవి.

పరస్పర వివాహాలు, అంతర్గత వివాహాలు ఉన్న వర్గాలు
ఇవి
  • 🟐 వేదాంతులు (philosophers), 
  • 🟐 రైతులు (peasants), 
  • 🟐 పశుకాపరులు (herdsmen), 
  • 🟐 వృత్తిపనివారు మరియు 
  • 🟐 వ్యాపారులు (craftsmen and traders), 
  • 🟐 సైనికులు (soldiers), 
  • 🟐 ప్రభుత్వ ఉద్యోగులు (government officials), 
  • 🟐 రాజసలహాదారులు (councillors) అనేవే ఇవి. 
ఈ విభజన మనకు తప్పుగా కనిపించినా, మనం ఇప్పుడు చూస్తున్న జాతివర్ణాల వ్యత్యాసాలు ఆయన దృష్టికి రాలేదంటే అప్పుడు అవి లేకపోవటమే కారణం అంటారు ప్రముఖ చరిత్రకారులు శ్రీ ఏ.ఎల్‌.బాషమ్‌ తమ 'ది వండర్‌ దట్‌ వాజ్‌ ఇండియా ('The Wonder That was India, p.147) లో..

రెండు వర్గాలవారూ తమతమ పరిధులను నిర్ణయించుకునే ప్రయాసలలోనే 'వర్ణాలు' రూపొంది ఉంటాయని భావన. ఉత్తర ప్రాంతాలవారు శీతల ప్రదేశాలనుంచి రావటంతో వారు రవ్వంత శ్వేతవర్ణంలో ఉండగా, తీవ్ర ఉష్ణప్రదేశమైన దక్షిణాదివారు నల్లగా ఉండేవారు.

ఈ శరీర 'వర్ణాల' మధ్య తేడాలే మన ఇప్పటి వర్ణవ్యవస్థకు పునాదులు అయి ఉంటాయనుకోవచ్చు. ఆర్యుల వరకే చెప్పాలంటే, చిన్న పిల్లలు, సన్యాసులు, వితంతువులు తప్ప తక్కిన అందరూ ఒకే 'వర్ణాని'కి చెందినవారన్న భావనా ఉండేది. చిన్న పిల్లలు, సన్యాసులు, వితంతువులు అప్పటి ఆర్య సమాజంలో భాగస్వాములు కాకపోవటం విశేషం. ఈ శరీర 'వర్ణాల' మధ్య భేదాలే క్రమంగా వివిధ సామాజిక వర్గాలకు రూపు కల్పించి ఉంటాయన్నమాట!!

ఉపనయన సమయంలో ధరించే యజ్ఞోపవీత 'వర్ణం' ఆధారంగానే 'వర్ణం' అనే మాట ఏర్పడిందనీ, అది క్రమంగా కులాలను సూచించే పదంగా మారిందనీ అనేవారూ ఉన్నారు. బ్రాహ్మణులు తెలుపు రంగుతో తయారైన నూలు యజ్ఞోపవీతాన్ని, క్షత్రియులు ఎరుపు రంగు ఉన్ని (ఊలు) యజ్ఞోపవీతాన్ని, వైశ్యులు పసుపు రంగు లినెన్‌ (linen) యజ్ఞోపవీతాన్ని ధరించాలని ఉండేది. వారు ధరించే యజ్ఞోపవీతాన్ని బట్టి ఆనాడు కుల నిర్ధారణ జరిగేదనీ. అది క్రమంగా అదే కులానికి మరో పేరైన 'వర్ణం' అయిందనీ కొందరు అంటారు.

'కులమ్‌' అంటే నివాసం. 'ఆయా కులాలకు చెందిన వాళ్లు ఆయా నివాసాలకు చెందిన వాళ్లు అని అర్థం' అంటారు రాణి శివశంకర శర్మ, తమ 'The Last Brahmin' అనే పుస్తకం, పేజీ 192లో. 
ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం మరొకటీ ఉంది - చేసే వృత్తుల ప్రకారంగా, మన సమాజంలో వేలాది 'జాతులు' కూడా చోటు చేసుకున్నాయి. అంటే, ప్రాథమికంగా 'వర్ణాలు' వేరు, 'జాతులు' వేరు అన్నమాట. అప్పట్లో 'వర్ణం' అనే మాట 'వర్గం' (class)ను సూచించగా, 'జాతి' (caste) అనేది ఇప్పటి 'కులం' అనే అర్థాన్ని సూచించేదిగా ఉండేది. ఈ 'జాతులు' పెరుగుతూ, తరుగుతూ  ఉండటం, ఈ 'జాతుల'లో కొత్తవి కొన్ని పుడుతూ, కొన్ని కాలక్రమేణా కనుమరుగు అవుతూ వచ్చినా, యుగాల తరబడిగా వర్ణాలు మాత్రం నాలుగుగానే ఉండటమూ గమనించాలి. ఒకానొక కాలంలో జాతుల సంఖ్య 3000ను దాటిపోయినట్లూ తెలుస్తోంది. 

16వ శతాబ్దంలో పోర్చుగీసువారు మన దేశానికి వచ్చినప్పుడు, వాళ్లు మన సమాజం అనేక వర్గాలు, బృందాలుగా విడిపోయి ఉండటం గమనించి, వాటిని వారు 'castes అనటం ఆరంభించారు. పోర్చుగీస్‌ భాషలోని 'casta' అనే పదంనుంచి caste పదం ఆవిర్భవించింది. పోర్చుగీస్‌ భాషలో casta  అంటే tribe (తెగ) అని అర్థం. అయితే, cast లేదా caste అనే పదం జర్మన్‌ భాషనుంచి వచ్చిందనీ, దీనికి 'తెగ' అనే అర్థం ఉందని బ్రౌన్‌ నిఘంటువు (1987, పే. 146) చెప్తోంది.

ఏమైనా, మనదేశంలోని చాతుర్వర్ణ వ్యవస్థను ఎవరు, ఎప్పుడు సృష్టించినా, అది ఎలా రూపొందినా, అది ఒక సామాజిక అవసరాన్ని, ఒక సామాజిక బాధ్యతనూ నిర్వహించింది అన్నది వాస్తవం. పైగా, ఒక కులంలో పుట్టటం అనేది ఒక వ్యక్తి చేతిలో లేదు, అది అలా జరిగిపోతుంది. ఒక మతంలో పుట్టినవారు కొందరు, కొంతకాలానికి తమ అభిమతం మేరకు, అవసరం మేరకు మతం మార్చుకుంటున్నట్లుగా, ఇప్పుడు కులం మార్చుకునే వీలు ఉండటంలేదు. (ఒకప్పుడు ఇదీ ఉండేది. క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు కావడం ఇలాగే సంభవించింది. వేదవ్యాసుడు, శుకుడుసైతం ఇలాగే బ్రాహ్మణులు కాగలిగారు.)

అందుచేత, ఎవ్వరూ తాము ఫలానా కులంలో పుట్టామని బాధపడవలసిన పనీలేదు. బాధపడి ప్రయోజనమూ లేదు. ఆ కులంలో కొనసాగవలసిందే... ఆ కులంలో  ఉన్నందుకు వేరే కులాల వారిని తక్కువ ఎక్కువగా చూడాల్సిన పనీలేదు. పుట్టిన కులం గురించి గర్వపడటంలో తప్పు లేదు, వేరే కులాన్ని నిందిస్తే తప్పు, తక్కువగా చూస్తే తప్పు. 

బ్రాహ్మణులు సమాజంలో దైవచింతనను పెంచాలనీ, సమాజహితం కోరే పురహితులుగా ఉండాలనీ నాటి వ్యవస్థ నిర్దేశించింది. సమాజం అప్పగించిన బాధ్యతలను చాలాకాలంపాటు, బ్రాహ్మణులు సక్రమంగా నిర్వహించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అయితే, కాలక్రమేణా సంఘంలో వచ్చే మార్పులకు అనుగుణంగా బ్రాహ్మణులు సైతం తమను తాము మార్చుకునే క్రమంలో, వారు కూడా చాలా మార్పులకు లోనైన మాట వాస్తవం.

ఈ విధంగా బ్రాహ్మణులు పలు మార్పులకు లోనయ్యారు కానీ, వారు ఈ కులవ్యవస్థకు కారకులూ కారు, వారు ఈ కులవ్యవస్థను పెంచిపోషించిన వారూ కాదు. ఒక సమాజం రూపు దిద్దుకునేటప్పుడు తనకు అవసరమైన రీతిలో అది తన్ను తాను రూపొందించుకుంటున్నది వాస్తవం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు ఒక తీరైనవైతే, కుమ్మరి, మ్మరి, చాకలి (రజకులు అనేది వీరి ఆధునిక నామధేయం) వంటివి కూడా వారు చేపట్టిన ఆయా వృత్తులపరంగా ఏర్పడినవేనన్నదీ, ఇవన్నీ సమాజం రూపొందించుకున్నవే తప్ప, ఎవరో ఏర్పరిచినవి కావన్నదీ సత్యం. బహుశా కొంత కాలం తర్వాతకు, ఈ కులాలన్నీ కునుమరుగై, కొత్తగా 'సాఫ్ట్‌వేర్‌ కులం', 'హార్డ్‌వేర్‌ కులం', 'ఇంజనీర్‌ల కులం', 'పైలట్‌ల కులం', 'గుమాస్తాల కులం' వంటివీ ఏర్పడతాయేమో!! 

అసలు 'భారతదేశంలో వర్ణవ్యవస్థను నిర్మూలించాలని జరిగిన ప్రయత్నాలన్నీ అనేక కారణాల వల్ల విఫలం అయ్యాయి. బసవేశ్వరుడు, కబీర్‌, రామానంద్‌ వంటి వారు తమ అనుయాయులతో చేసిన కులనిర్మూలన యత్నాలు - చిత్రంగా మరికొన్ని కొత్త కులాల ఆవిష్కరణకు దారి తీశాయి... సిక్కులు, ముస్లిములు, సిరియన్‌ క్రిస్టియన్లు, రోమన్‌ కేథలిక్కులు... అన్నింటిలోనూ కుల విభజనలు జరిగాయి, వ్యాపించాయి' అంటూ విశ్లేషిస్తారు శ్రీ ఏ.యల్‌.బాషమ్‌. (The Wonder That was India, పేజీ 151).

అనువాదం - మూలము: వైదిక బ్రాహ్మణ's 
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top