ఉపవాసములో ఆరోగ్య నియమాలు - Upavaasam Aarogyamసరైన పద్థతిలో ఉపవాసం చేస్తే అనేక ప్రయోజనాలు దక్కుతాయి
అటు శరీరాన్ని.. ఇటు ఆత్మనూ పరిశుద్ధం చేసే విశేష ప్రక్రియే ఉపవాసం. ఉపవాసం అంటే పరమాత్మధ్యాసలో ఉండడంతప్ప బలవంతాన అన్న పానీయాలకు దూరంగా గడపడం కాదు.

వివిధ రకాల ఉపవాసాలతో మహిళలు కాలం గడిపేస్తుంటారు. కొన్నిసార్లు ఉపవాసం మంచిదే. అయితే మంచినీళ్ళు కూడా తీసుకోకుండా కడుపుమాడ్చుకుని చేసే ఉపవాసం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉపవాస సమయంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అంటున్నారు వైద్యులు.

ఉపవాసము పాటించకూడనివారు:
ఆరోగ్యం సహకరిస్తేతప్ప ఉపవాసం చేయకూడదు. అనారోగ్యంగా ఉన్నవారు ఉపవాసం చేయడం వల్ల లేనిపోని సమస్యలను కొనితెచ్చుకునే ప్రమాదం కూడా ఉంది. కొందరు అదేపనిగా వారంలో మూడునాలుగు రోజులు ఉపవాసాలు చేస్తారు. నెలకు ఒకసారి ఉపవాసం చేయడంవల్ల ప్రయోజనం పొందినా అదేపనిగా చేసే ఉపవాసాలవల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. డయాబెటిస్‌ పేషెంట్స్‌ (మధుమేహ వ్యాధిగ్రస్తులు) , గర్భవతులు, ఏవైనా మందులు వాడేవారు ఉపవాసాలు చేయకూడదు. ఉపవాసం సరిగ్గా చేయకపోతే శరీరంలోని కొవ్వు అంటే కండరాలు ఎక్కువగా కరిగిపోతాయి. అందుకే మహిళలు స్ర్టెస్‌పీరియడ్‌ గడిచిన వారం తర్వాత మాత్రమే ఉపవాసం చేయాలి. ఆ సమయంలో ఉపవాసాలు చేయడంవల్ల శక్తి క్షీణించి త్వరగా అలిసిపోయే ప్రమాదం ఉంది.

ఉపవాస ప్రయోజనాలు:
సరైన పద్థతిలో ఉపవాసం చేస్తే అనేక ప్రయోజనాలు దక్కుతాయి. ఉపవాసం వల్ల శరీరంలోని విషతుల్యాలు బైటకుపోతాయి. క్లెన్సింగ్‌ జరుగుతుంది. శరీరానికి శక్తి అందుతుంది. శరీర విధుల నిర్వహణలో సమతుల్యత వస్తుంది. రోగనిరోధక వ్యవస్థ మరింత శక్తిమంతం అవుతుంది. రక్తపీడనం త్వరగా తగ్గిపోతుంది. అయితే ఇది హైబీపీ ఉన్నవారికి మంచిదే అయినా లోబీపీ బాధితులకు మాత్రం సమస్యలు తేవచ్చు.

ఉపవాసంవల్ల జీర్ణవ్యవస్థకు తగిన విశ్రాంతి దొరికి దాని పనితీరు మెరుగుపడుతుంది. ఇంద్రియాలను, మనసును అదుపులో పెట్టుకోవచ్చు. అదనపు కేలరీల బెడద లేనందున ఊబకాయం వంటి సమస్యలు త్వరగా రావు.

జాగ్రత్తలు:
సాధ్యమైనంత వరకూ ఉపవాస సమయంలో పనిభారం లేకుండా చూసుకోవడం మంచిది. చాలామంది మహిళలు తినాలనే ధ్యాసనుంచి దృష్టి మరల్చుకునేందుకు ఇంటి పనుల్లో నిమగ్నమవుతారు. అలా కాకుండా కొంచెం కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. మంద్రమైన సంగీతం వింటూ ఉండాలి. ధ్యానం చేయడం మంచిది.

ఉపవాసం చేసిన మర్నాడు ఆకలిగా ఉందని అతిగా తినేయకూడదు. ముందుగా ద్రవాహారం తీసుకోవాలి. ఆ తర్వాత ఘనాహారం తీసుకుంటే మంచిది. ఎక్కువ మసాలాలు కాకుండా తేలికపాటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అన్నం కూరలతో పాటు, సగ్గుబియ్యం జావ, పండ్లముక్కలు తినాలి.

కఠినంగా చేయకూడదు:
శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పోషకాలు అవసరమవుతాయి. ఇవన్నీ కొవ్వులో నిల్వ ఉండవు. వీటిని ఆహారంలో తీసుకోకపోతే శరీరానికి ఏవిధంగానూ అందవు. రక్తంలో ఎమినోయాసిడ్స్‌ లేకపోయినట్లయితే జీవక్రియ ప్రభావం కండరాలపై పడుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసాలు చేస్తుంటే హార్మోన్లు ప్రభావితం అవుతాయి.

అసలు ఏమీ తీసుకోకుండా చేసే కఠిన ఉపవాసాలవల్ల తలనొప్పి, డీహైడ్రేషన వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. జుట్టు పల్చబడిపోతుంది. ఆహారాల లోపాలకు సంబంధించిన ఇతర సమస్యలు తలెత్తుతాయి. అందుకే కఠినంగా, చాదస్తంగా కాకుండా పోషకాహారం లభించే డ్రైఫ్రూట్స్‌, పండ్లు, తగినంత నీరు తీసుకుంటూ, పండ్లరసాలను తాగుతూ ఉపవాసం పాటించాలి.

రచన: పి.వీ.జె పవన్ కుమార్ 

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top