రామకృష్ణ పరమహంస జయంతి - Ramakrishna Paramahamsa jayanthi

రామకృష్ణ పరమహంస జయంతి - Ramakrishna jayanthi
రామకృష్ణ పరమహంస జయంతి
మానవసేవే మాధవసేవ వంటి దివ్య బోధనల ద్వారా విశ్వ మానవాళిని జాగృతపరచిన మహనీయుడు రామకృష్ణ పరమహంస, భూమిపై నడయాడింది.

కేవలం అర్ధశతాబ్ది కాలంపాటే అయినా ఆచంద్రార్కం నిలిచిపోయే అంశాల్ని విశ్వానికి బోధించాడు. మనుషులంతా ఒక్కటేనని చాటిచెప్పాడు. ఉపనయన సంస్కార సమయంలో తొలి బిక్షను శూద్ర యువతి నుంచి స్వీకరించి తాను అందరిలాంటివాట్ణి కాదని నిరూపించాడు.

క్షుదీరాం, చంద్రమణిదేవి దంపతులకు ఫిబ్రవరి 18న పశ్చిమబెంగాల్లోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు. తల్లితండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. దక్షిణేశ్వర్లోని కాళీమాత ఆలయంలో సోదరుడు రాంకుమార్ పూజారిగా ఉండేవాడు. వంశపరంపరగా వస్తోన్న అర్చకత్వం స్వీకరించేందుకు గదాధరుడు ఆసక్తి చూపలేదు. కానీ రాంకుమార్ హఠాన్మరణంతో కుటుంబ పోషణార్ధం పూజారి బాధ్యతలు స్వీకరించక తప్పలేదు. అదే ఆయన జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది.

సర్వం అమ్మవారిగా, నిరంతరం అమ్మవారి సేవకునిగా జీవించారాయన. ఆయన దృష్టిలో కాళి ఒక దేవతకాదు. సజీవమూర్తి, ఆ తల్లి ఆయన ముందు నృత్యం చేసేది. ఆయన చేతులతో అన్నం తినేది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేదని ప్రతీతి. ఆయన చైతన్యం ఎంత స్పష్టమైనదంటే గదాధరుడు ఏ రూపం కోరుకుంటే ఆ రూపం ఆయన కళ్లముందు సాక్షాత్కారించేది.

ఒక మనిషి పొందాల్సిన అసలైన దివ్యానుభూతి అది ఆయన శరీరం, మనస్సు భావోద్వేగాలు తన్మయత్వంతో తడిసిపోతున్నా, అస్థిత్వం మాత్రం ఈ అనుభూతినే కోరుకునేది. ఈ పరమానందం ఒక బంధనమే అని ఆయనకు అనిపిస్తుండేది. ఒకరోజు గదాధరుడు హుగ్లీ నదీ తీరాన కూర్చుని ఉండగా, తోతాపూరి అనే గొప్ప యోగి ఆ మార్గంలో వెళ్తున్నాడు. అతన్ని చూడగానే జ్ఞానోదయం పొందే అర్హతకల వ్యక్తిగా తోతాపూరి గమనించాడు. గదాధరునికి అసలైన అద్వైత జ్ఞానాన్ని ఉపదేశించాడు.

అప్పటివరకు ఆయనొక ప్రేమికుడు, భక్తుడు. ఆయనే సృష్టించుకున్న మాతృదేవి పుత్రుడు మాత్రమే. ఇప్పుడు రామకృష్ణుడు అయ్యాడు తోతాపూరి వెలిగించిన జ్ఞానజ్యోతితో వాస్తవమైన పరమహంసగా రూపొందాడు.

రామకృష్ణుని సాధనా జీవితం బోధలు అందరికి సుపరిచితాలే. ముఖ్యంగా రామకృష్ణుడు తన కథామృతం ద్వారా ఆధ్యాత్మిక సూక్ష్మాలను పామరులకు కూడా అర్థమయ్యేలా తెలియచేశారు. ఇందులోని ప్రతీ కధా సమకాలీన అంశాలను సృశిస్తుంది. ఆయన బోధనలు శిష్యుడైన వివేకానందుని ద్వారా దేశం ఎల్లలు దాటి పోయాయి పాశ్చాత్య దేశాలవారు సైతం రామకృష్ణుని బోధనలకు ఆకర్షితులై హిందూధర్మంపై అనురక్తిని పెంచుకున్నారు. సృష్టిసర్వం ఒక్కటే.

ప్రాణులందరిలో దైవం ఉన్నాడు. భగవంతుడు ఒక్కడే. అన్ని మతాల సారాంశం ఒక్కటే. ఒక గమ్యాన్ని చేరేందుకు ఎన్నో దారులు ఉన్నట్లు, భగవంతుణ్ణి చేరేందుకు ఎన్నో మార్గాలున్నాయి. అవే మతాలు. మానవుణ్ణి పట్టి ఫీడిస్తున్న అరిషడ్వర్గాలు వీడితేనే దైవాన్ని చేరడం సులభమవుతుందన్న రామకృష్ణుని బోధనలు అద్వితీయం. నేటితరానికి అనుసరణీయం. ఆచరణీయం

__జాగృతి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top