కలియుగంలో అనుకూలాంశం - Kaliyugam Anukulaamshalu

కలియుగంలో అనుకూలాంశం - Kaliyugam Anukulaamshalu
కలియుగంలో అనుకూలాంశం ఉంటుందా?
సాధారణంగా మనం ఏం చెప్తాం అంటే కలియుగం అనేటప్పటికీ పాపభూయిష్టమై ఉంటుంది. పాపము నందు మనస్సు అనురక్తం అయ్యేటట్లుగా కలిపురుషుడు చేస్తూ ఉంటాడు. పుణ్యము నందు అనురక్తము కానివ్వడు.

కాదాంశం:
పరీక్షిన్మహారాజు పరమ శక్తిమంతుడు. అపారమైన పరాక్రమం ఉన్నవాడు. కలిపురుషుడిని చూశాడు. ఎవరు ఉద్ధతితో ప్రవర్తిస్తున్నాడో ఆయనని చూశాడు. ఈ కలిపురుషుడు ఉంటే ప్రజలు పాడైపోతారు అనుకోని ఉండి ఉంటే ఆ కలి పురుషుడిని పరీక్షిత్తు వెంటనే సంహరించవచ్చు. కానీ వదిలిపెట్టేశాడు.

పరమ ధర్మాత్ముడైన పరిక్షిత్తే కలిపురుశుడికి అవకాశం ఇచ్చాడు అంటే అందులో ఏదో అనుకూలమైన అంశం ఉంది. కలియుగంలో అత్యంత అనుకూలమైన అంశం ఏది అంటే త్రికరణ శుద్ధిగా భగవత్ సంబంధమైన లేదా లోకోపకారమైన సంకల్పం చేస్తే ఈశ్వరుడు అది మీరు చేసినట్లుగా ఖాతాలో వేస్తాడు. మిగిలిన యుగాలలో అది కుదరదు.

నేను ఒక ఏడు రోజులు మౌన దీక్ష చేస్తే బాగుండు అని ఏదో నోటిమాటగా అనడం కాకుండా త్రికరణ శుద్ధిగా అలా వాంఛిస్తే నేను ఏడు రోజులు మౌనదీక్ష చేశాను అని పరమేశ్వరుడు నా ఖాతాలో వేస్తాడు. కలియుగంలో ఆనుకూల్యత కలిగిన అంశాలలో ఇది ప్రధానమైనది. త్రికరణ శుద్ధితో ఏదైనా కోరుకుంటే అది చేశారు అని ఖాతాలో వేస్తాడు. ‘కలౌ నామ సంకీర్తనః’ – కలియుగంలో మీరు ఎంత పూజ చేశారు అన్న క్లిష్టతతో కూడుకున్న విషయాల కన్నా భగవంతుని నామాన్ని ప్రేమతో సంకీర్తన చేస్తే చాలు అత్యధికమైన ఫలితాన్నిస్తాడు.

ఒక్కరూ కూర్చుని ఒక నామం చెప్పుకుంటే తప్పు కాదు. నిరుత్సాహ పరచడం లేదు, విమర్శించడం లేదు, తప్పు అని చెప్పడం లేదు దానిని. ఒక్కడినీ కూర్చుని విష్ణుసహస్రనామం చదివాను అనుకోండి ఉద్వేగం ఉండదు. అదే భజనమండలికి వెళ్ళి భజన చేస్తే మంచి ఉద్వేగం పొంది చప్పట్లు చరిచి చేతులన్నీ తిమ్మిరులెక్కి పోతాయి. ఒక గంట సేపు భజన చేసి బయటికి వస్తే మీకు తెలియకుండానే జయజయ శంకర హరహర శంకర అంటూ ఉంటారు. అంటే నీ త్రికరణములు కూడా అంటుకుంటాయ్ భజనలో. అది ఉద్వేగాన్నిస్తుంది.

మనిషిలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇంతమంది కలిసి భజన చేస్తుంటే అక్కడ ఆడుకుంటున్న పిల్లలు కూడా వచ్చి వాళ్ళు కూడా చప్పట్లు కొడుతూ ఆనందపడిపోతారు.ఎంత నిద్రాణంలోఉన్న వాడిలో కూడా ఉత్సాహాన్ని నింపుతుంది నామ సంకీర్తన. ఆనందంతో మనస్సు తన్మయావస్థను పొందుతుంది. దానివల్ల మీకు తెలియకుండానే మీ కంఠం బడలిపోతుంది. రెండవ రోజు మాట సరిగా రాదు. బొంగురు పోతుంది.

మనిషి జీవితంలో ఈశ్వర నామ సంకీర్తనలో గొంతు బడలిపోతే అంతకన్నా అదృష్టం ఏం ఉంది? 
ఈశ్వరుడు ఇచ్చిన వాక్కు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడంలో కంఠం బడలిపోతుంది. ‘చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని’- ఇంట్లో కూర్చుని విష్ణు సహస్రం అలా చదువుతారా?

పరమేశ్వరుడి దేవాలయంలో ఒక ఊరేగింపు వెళుతుంటే చుట్టూ ఉన్న పదిమందితో నామ సంకీర్తన చేయిస్తుంటే గట్టిగా చెప్పాలనే తాపత్రయం వచ్చేస్తుంది. ‘శ్రీరామ నామము పలుకని వారలు జీవించి ఉండుట నిస్సారము’ అని పాడుతూ ఉంటారు. ఇంతమంది సంతోషంగా వెళ్ళిపోతూ చప్పట్లు కొడుతూ ఆ నామ సంకీర్తనం చేయడంలో మీరు ఎవరన్నది మీకు అర్థం కాదు. నేనింత అధికారినా, నేనింత అందగాడినా, నేనింత గౌరవనీయుడినా, నేనింత ఐశ్వర్యవంతుడినా సంబంధం ఉండదు.

సంతోషపడిపోతూ భజన చేస్తూ గంతులేస్తూ ఆనందపడిపోతారు. అది ఒక్కటి చాలు కలియుగంలో తరించిపోతాం. కలౌ నామ సంకీర్తనః – అది నువ్వు ఒక్కడివీ చేయక్కరలేదు. జరిగే చోటుకు వెళ్ళి కూర్చుంటే చాలు. అందుకే కలియుగంలో భజనమండళ్ళను ప్రోత్సహించమని చెప్పారు. భగవంతుడి పాదాలు పట్టుకున్న వాడి జోలికి కలిపురుషుడు రాడు. రక్షించి తీరుతాడు. అందుకే కలియుగంలో కూడా అనుకూలమైన అంశాలు ఉంటాయా అంటే ఇంతకన్నా ఏం కావాలి? ఎప్పుడూ భగవన్నామాన్ని పలకడం అలవాటు చేసుకుంటే చాలు.

నోట్లో ఆ భగవన్నామం పలుకుతూ ఉంటే చాలు భగవంతుడి నామము భజనగా జరుగుతున్న చోట రకరకాల వాద్య పరికరాలు పట్టుకొని చిడతలు పట్టుకుని భజన చేయడం, డప్పు కొట్టడం, నామం చెప్పడం, అలా తయారైతే అది లాగేస్తుంది ఒక పెద్ద విద్యుత్ రాశి లాక్కున్నట్లు అంతమంది చేస్తుంటే మీరొక్కరూ ఈసురోమని నిలబడలేరు. వాళ్ళు చెప్తుంటే మీరూ అనేస్తారు. అది వ్యాపించేస్తుంది తొందరగా. ఆ నామం సంతోషంతో వాతావరణం అంతా నిండిపోవడం శుభ పరంపరలకు హేతువు అవుతుంది.

కలియుగంలో ఇది తేలిక పధ్ధతి కాదూ తరించడానికి. యజ్ఞం, యాగం వంటి వాటి జోలికి వెళ్ళలేక పోయినా కనీసం భగవన్నామం చెప్పు తరిస్తావ్ అన్నారు.
కలౌ నామ సంకీర్తనః, కలౌ చండీ – చండీ పరదేవతను నమ్మి చండీ హోమం చేయడం, భజన చేయడం, కీర్తనం చేయడం, ఇవన్నీ కూడా కలి పురుషుడిని నివారించగలిగిన హేతువులు. నల దమయంతుల కథ వింటే చాలు కలిపురుషుడు దగ్గరికి రాడు. ఇవన్నీ ఎంతో తేలిక మార్గాలు. కృతయుగాదులతో పోలిస్తే కలి మనకు అనుకూలంగా ఉంటాడు. అందుకే కలిపురుషుడిని పరీక్షిత్తు సంహరించలేదు. ఈ అనుకూలాంశాలతో చాలామంది వర్ధిల్లుతారు అని వదిలిపెట్టాడు.

వ్యాఖ్యానము, రచన: స్వామి.. శ్రీ చాగంటి కోటేశ్వర రావు

Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top